ఎన్నికల వేళ... తారస్థాయికి ఎల్లో ఫీవర్

23 Mar, 2014 00:04 IST|Sakshi
ఎన్నికల వేళ... తారస్థాయికి ఎల్లో ఫీవర్

ఏడాది కిందటి కథనమే మళ్లీ వండివార్చిన ‘ఈనాడు’

 రొటీన్‌గా జరిగిన లీజు బదలాయింపునకు క్విడ్ ప్రో కో రంగు

 ఈ లీజుకు దరఖాస్తు చేసింది చంద్రబాబు హయాంలోనే

 బాబు హయాంలో భారీ ఎత్తున లీజు బదలాయింపులు

 అవన్నీ విస్మరించి జగన్ జనాదరణ టార్గెట్‌గా కథనాలు

 దాల్మియా పెట్టుబడికి అతితక్కువ కాలంలో రూ. 55 కోట్ల లాభం

 క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా?

 ఆది నుంచీ సీబీఐతో కుమ్మక్కయి విషం గక్కుతున్న రామోజీ

 

 ఎన్నికల వేళ. ఎల్లో ఫీవర్ తారస్థాయికి చేరుతోంది. విషపు రాతలు విజృంభిస్తున్నాయి. జన క్షేత్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేని శక్తులన్నీ ఏకమవుతున్నాయి. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జనాదరణను లక్ష్యంగా చేసుకుని... ఎల్లో వంటకాలు సిద్ధమవుతున్నాయి. ‘‘టన్నులు కాదు... సొమ్ములే’’ అంటూ శనివారం ‘ఈనాడు’ వండివార్చిన కథనమూ ఆ కోవలోనిదే. నిజానికి ఈ కథనం ‘‘టన్నులంటే రూ.కోట్లు’’ అంటూ సరిగ్గా ఏడాది కిందట పని గట్టుకుని రాసిందే. మళ్లీ అదే కథనాన్ని... సీబీఐ అదనపు వివరాలు సమర్పించిందనే సాకు చూపిస్తూ... యథాతథంగా మరోమారు అచ్చేశారు రామోజీ...

 

 నిజమే!! తన ‘ఈనాడు’ పత్రికలో ఓ విభాగమైన ‘న్యూస్‌టుడే’... అదే ఈనాడు కాంపౌండ్లో తాను పెట్టిన ‘న్యూస్‌టుడే’... తన వందిమాగధులే డెరైక్టర్లుగా కొనసాగుతున్న న్యూస్‌టుడే... ఎక్కడుందో కూడా తనకు తెలీదని, ఆ డెరైక్టర్లెవరో కూడా గుర్తులేదని కోర్టులో ప్రమాణం చేసి మరీ చెప్పిన చరిత్ర రామోజీది. అలాంటి రామోజీకి అంతా తనలానే ఉంటారని అనిపించటంలో తప్పేమీ లేదు.

గతేడాది ఏప్రిల్ 14న ఈనాడు ప్రచురించిన కథనం

శనివారం నాటి ఈనాడులో ప్రచురించిన నాటి కథనానికి నకలు

 

 లీజు బదలాయిస్తే ముడుపులు వస్తాయా?

 

 అసలు దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి సీబీఐ వేసిన ఈ ఛార్జిషీటు, దానికి అనుబంధంగా సాగిందని చెబుతున్న దర్యాప్తు... అన్నీ తిరిగింది ఒకే అంశం చుట్టూ. అది... కడప జిల్లా మైలవరం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల పరిధిలో దాల్మియా సిమెంట్స్‌కు 407 హెక్టార్లలో ఉన్న సున్నపురాయి గనుల లీజుల్ని వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోని ప్రభుత్వం వేరొకరి నుంచి బదలాయించిందని. అందుకు ప్రతిఫలంగానే భారతి సిమెంట్స్‌లో దాల్మియా సంస్థ పెట్టుబడులు పెట్టిందని!!  అన్నిటికన్నా చిత్రమేంటంటే ఈ లీజుకు దరఖాస్తు చేయటం, దాన్ని పరిగణనలోకి తీసుకోవటం... అంతా జరిగింది వైఎస్ హయాంలో కాదు. సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 1997లో. కానీ ఎల్లో మీడియా రాతల నుంచి, ఎల్లో పార్టీల ఆరోపణల నుంచి, సీబీఐ చార్జిషీట్ల దాకా ఎక్కడా ఈ విషయం కనపడదు. జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు, ‘సాక్షి’ దీన్ని ఆధారాలతో సహా ప్రచురించినా వారికి పట్టదు.

 

 ఇదీ జరిగింది...

 

 వైఎస్సార్ కడప జిల్లా ఏమంత అభివృద్ధి చెందినది కాదన్నది ఆంధ్రప్రదేశ్‌లో గడప గడపకూ తెలుసు. వ్యవసాయం గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. వర్షాలూ తక్కువే. ఒక్క కడప అనే కాదు. రాయలసీమంతా ఇదే పరిస్థితి. అలాంటిచోట సున్నపురాయి గనుల్ని లీజు పద్ధతిన మైనింగ్ చేయటానికి అనుమతివ్వాలని 1997లో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబే. తరవాత ఈ భూముల లీజు కోసం ఎలాంటి దరఖాస్తూ రాలేదు. పోటీ లేకుండా ఒకే దరఖాస్తుదారు ఉన్నట్టన్నమాట. పెపైచ్చు జయా మినరల్స్ అడిగిన భూమి ప్రైవేటు భూమే తప్ప ప్రభుత్వ భూమి కాదు. పూర్తిగా రైతుల చేతుల్లోనే ఉంది. వర్షాభావంతో నిండిన ప్రాంతం కనుక రైతులు కూడా మంచి ధర వస్తే విక్రయానికి వెనకాడే పరిస్థితి ఉండదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... పోటీదారులెవరూ లేకపోవటంతో 2008లో 1005 ఎకరాల సున్నపురాయి గనుల్ని లీజు పద్ధతిపై చట్టబద్ధంగా కేటాయించింది. తరవాత ఫ్యాక్టరీ పెట్టడానికి జయా మినర ల్స్ వాళ్లే ఈశ్వర్ సిమెంట్స్ సంస్థను ఏర్పాటు చేశారు. రుణాలు రావాలంటే కంపెనీ పేరిట గనులుండాలి కనుక లీజును ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయించాలని దరఖాస్తు చేసుకోవటం... ప్రభుత్వం రొటీన్‌గా బదలాయించటం అన్నీ జరిగిపోయాయి. లీజు పొందిన ఈశ్వర్ సిమెంట్స్... ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో అందుకు ముందుకొచ్చిన దాల్మియాకు లీజును బదలాయించాలని కోరటం... రెండు సంస్థలు పరస్పర ఆమోదం తెలియజేయటంతో ప్రభుత్వం అనుమతించటం జరిగింది. నిజానికి ఏటా వంద వరకూ మైనింగ్ లీజుల బదలాయింపులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతుంటాయి. మరి ఈ ఒక్క బదలాయింపునే పట్టుకుని, దాల్మియా సిమెంట్స్ పెట్టిన పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కోలుగా, ముడుపులుగా చూపిస్తూ రాద్ధాంతం చేస్తున్నారంటే లోగుట్టు తెలియటం లేదూ!!. అసలు దాల్మియా సిమెంట్స్‌కు మేలు చేయాలనుకుంటే వైఎస్ నేరుగా చంద్రబాబు మాదిరిగా ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ లీజునే ఇచ్చేవారుగా!! అపుడు ఎల్ అండ్ టీ మాదిరిగా దాల్మియాకు కూడా ఎకరా రూ. 4వేలకే వచ్చేదిగా? ప్రైవేటు భూముల్లో ఉన్న లీజును ఎందుకు బదలాయిస్తారు? అయినా సున్నపురాయి గనులు సిమెంట్ కంపెనీలకు కాక దేనికి పనికొస్తాయి? ఎప్పటికైనా సున్నపురాయి గనుల్ని సిమెంట్ కంపెనీలకు ఇవ్వాల్సిందేగా? ఏ కంపెనీ ముందు దరఖాస్తు చేసుకుంటే దానికే ఇస్తారుగా? దీన్ని ఇంతవరకూ తీసుకొచ్చారంటే అర్థం కావటం లేదా?

 

 చంద్రబాబు బదలాయింపులివీ...

 

 వైఎస్సార్ హయాంలో ఒక లీజు బదలాయించినందుకే దాల్మియా సంస్థ క్విడ్ ప్రో కో పెట్టుబడులు పెట్టిందని ఎల్లో మీడియా శివాలెత్తుతోంది. మరి చంద్రబాబు హయాంలో జరిగిందేంటి?

      నల్లగొండ జిల్లాలో రాశి సిమెంట్స్‌కు చెందిన 1800 ఎకరాల సున్నపురాయి గనుల లీజును చంద్రబాబు ఇండియా సిమెంట్స్‌కు బదలాయించారు.

      అదే జిల్లాలో ప్రియా సిమెంట్స్‌కు కేటాయించిన వేయి ఎకరాల సున్నపురాయి గనుల లీజును రెయిన్ ఇండస్ట్రీస్‌కు బదలాయిస్తూ బాబు ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చింది.

      నల్లగొండ జిల్లాకు చెందిన సెజ్ సిమెంట్ నుంచి 300 ఎకరాల సున్నపురాయి గనుల లీజును అంజనీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్‌కు బదిలీ చేస్తూ బాబు ఉత్తర్వులిచ్చారు.

      గుంటూరు జిల్లాలో పార్థసారథి సిమెంట్స్‌కు చెందిన 500 ఎకరాల సున్నపురాయి గనుల లీజును శ్రీ చక్ర సిమెంట్స్‌కు బాబు సర్కారు బదలాయించింది.

 ఇవి జస్ట్ మచ్చుకు మాత్రమే. ఇక బాబు లీజు కేటాయింపులు చూస్తే బుర్రతిరిగిపోతుంది.

 గుంటూరు జిల్లాలో అంబుజా సిమెంట్స్‌కు 1999లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా  2,500 ఎకరాల సున్నపురాయి గనుల లీజులిచ్చింది. ఇదే జిల్లాలో 2003లో పరాశక్తి సిమెంట్స్‌కు 300 ఎకరాల సున్నపురాయి గనులను లీజుకిచ్చింది. ఇంతెందుకు!! ఒక్క కర్నూలు జిల్లాలోనే చంద్రబాబు ఏకంగా 8,112 ఎకరాల మైనింగ్ లీజులిచ్చారంటే ఏమనుకోవాలి? ఎల్లో మీడియా, దానితో జతకలిసిన దర్యాప్తు సంస్థల థియరీ ప్రకారం ఎన్ని వేల కోట్లు చేతులు మారి ఉండాలి? చంద్రబాబు జేబులోకి ఎన్ని లక్షల కోట్లు వచ్చి ఉండాలి?

 

 దీన్ని క్విడ్ ప్రో కో అంటారా?

 

 భారతి సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెడితే... దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చెప్పాలి గానీ పదేపదే క్విడ్ ప్రో కో అంటూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నవారికి ఏమైనా ఇంగితజ్ఞానం ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే దాల్మియా సంస్థ భారతి సిమెంట్‌లో దశలవారీగా 95 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. ఈ 95 కోట్లకు గాను తమ చేతికొచ్చిన వాటాను దాల్మియా ఆ తరవాత ఫ్రాన్స్‌కు చెందిన వికా కంపెనీకి విక్రయించేసింది. దాంతో ఆ కంపెనీకి ఏకంగా 150 కోట్ల పైచిలుకు సొమ్ము చేతికొచ్చింది. అంటే అతితక్కువ కాలంలో రూ.55 కోట్ల లాభం వచ్చినట్లు. మరి ముడుపులకు లాభాలొస్తాయా? లాభాలొచ్చినా కూడా అవి ‘క్విడ్ ప్రో కో’ పెట్టుబడులే అంటూ సాగుతున్న దర్యాప్తును, దాన్ని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను ఏమనుకోవాలి? ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదనా రామోజీ ఉద్దేశం? 40 ఏళ్లుగా తానేం చెప్పినా చెల్లిపోతోందన్న తెంపరితనమా?

 

 దాల్మియా ఎందుకు పెట్టిందంటే...

 

 దాల్మియా సంస్థ చాన్నాళ్లుగా సిమెంట్ రంగంలో ఉంది. భారతి సిమెంట్‌కు దగ్గర్లోనే తన ఫ్యాక్టరీ కూడా ఉండటంతో దీన్లో కూడా వాటా తీసుకుంటే వారికి కలిసొస్తుందనే  అంశం ఎవ్వరూ కాదనలేనిదే. ఎందుకంటే భవిష్యత్తులో కనుక భారతి సిమెంట్ విక్రయానికి వస్తే వాటాదారుగా తనకు ప్రయోజనం ఉంటుందని, తానే తీసుకుంటే ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం ఉంటుందని వారు భావించి ఉండవచ్చనేది ఈజీగా అర్థమయ్యే అంశం. ఒకే ప్రాంతంలో ఉన్న కంపెనీల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి సహజంగా ఏ పెద్ద వ్యాపార సంస్థయినా ఇలానే ఆలోచిస్తుంది.

 

 సీబీఐ ఆది నుంచీ అదే తీరు...

 

 వరస చార్జిషీట్లు వేయటంతో పాటు ప్రపంచంలో ఏ కేసులోనూ ఎవ్వరూ వేయలేనన్ని చిత్రమైన ఫీట్లు సీబీఐ ఈ కేసులో వేసిందనేది కాదనలేని సత్యం. దీన్లో భాగంగానే దర్యాప్తును ముందుగానే ఓ వర్గంలోని మీడియాకు తెలియజేస్తూ... లీకులిస్తూ... వారు వేసిన కథనాలనే చార్జిషీట్లలో చేరుస్తూ సాగించిన దర్యాప్తు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తాజా కథనం కూడా అలాంటిదే. ఏడాది కిందట వేసిన ఛార్జిషీటుకు సంబంధించి, దాన్లోని విషయాలపై సీబీఐ అధికారి ఒకరు దర్యాప్తు చేశారని, నిజాల్ని నిగ్గు తేల్చారని పేర్కొంటూ ‘ఈనాడు’ కథనం వండేసింది. నిజానికి సీబీఐ ఆ పత్రాల్ని శుక్రవారమే కోర్టుకు సమర్పించింది. కోర్టు వాటినింకా పరిగణనలోకి తీసుకోలేదు కూడా. అయినా ఈనాడు చేతికవి రావటం, అచ్చువేసేయటం చూస్తుంటే... ఆ బంధం ఎంత బలంగా కొనసాగుతోందో కనిపించటం లేదూ!!!

మరిన్ని వార్తలు