ఫారో మార్కు ప్రజాస్వామ్యం

7 Feb, 2014 00:54 IST|Sakshi
ఫారో మార్కు ప్రజాస్వామ్యం

ఈజిప్ట్ సైనిక నియంత అల్ సిసీ అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నారు. ప్రత్యర్థులే లేని ఆ ఎన్నికల్లో  ఆయన గెలుపు తథ్యం. ప్రజాస్వామ్య పరివర్తనకు నాంది పలుకుతానంటున్న సిసీ భావప్రకటనా స్వేచ్ఛపై పంజా విసిరారు.
 
 ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య తేడా ఎంత? దుస్తులు మార్చుకున్నంత. ఈజిప్టు ‘దుస్తులు’ మార్చుకోబోతోంది. సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అబ్దెల్ అల్ ఫతా అల్ సిసీ ఏప్రిల్‌లో పౌర దుస్తులు ధరించడంతో ఈజిప్టు ప్రజాస్వామ్య దేశంగా మారిపోతుంది. సంశయజీవులు మయన్మార్ నిన్నగాక మొన్న దుస్తులు మార్చి ప్రజాస్వామ్య పరివర్తనను సాధించిన వైనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరి. నాటకీయత లేని రాజకీయాలు రక్తి కట్టవు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ప్రజాభీష్టాన్ని తిరస్కరించజాలను’ అని సిసీ బుధవారం కువైట్ పత్రిక ‘అల్ సియాసా’తో అన్నారు. అలా అయన అన్నా, దాని అర్థం ఆ పత్రిక ప్రచారం చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పినట్టు కాదని ఆయన ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనరని చెప్పలేదు. ఏప్రిల్ మధ్యలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో సిసీ పోటీ చేయాలని అత్యున్నత సైనిక మండలి గత నెల 27న తీర్మానించింది. దాన్ని ఆయన శిరసావహించక తప్పదు. మండలి అధిపతి ఆయనే. రాజకీయ ప్రవేశానికి మొదటి అర్హత... అన్నది అనలేదంటూ పాత్రికేయులను అబ ద్దాలకోర్లుగా రుజువు చేయడం. సిసీ ఆ అర్హతను సాధించారు.
 
 గత నెల 19న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో సిసీ మార్కు రాజ్యాంగం 98.1 శాతం ఓట్లతో ఆమోదం పొందింది. మూడు కోట్లకు పైబడిన ఓటర్లలో 38.6 శాతమే ఓటింగ్‌లో పాల్గొన్నారనేది, 60 శాతం ఓటర్లయిన 18-40ల మధ్య వయస్కులు పోలింగ్ బూత్‌ల మొహం చూడలేదనేది వాస్తవమే. అంత మాత్రాన అది ‘ప్రజామోదం’ కాకపోదు. ఆ రాజ్యాంగం ప్రకారం సిసీ సైనిక మండలి అధ్యక్ష పదవిని, రక్షణమంత్రి పదవిని వదులుకోకుండానే సింహాసనం ఎక్కేయవచ్చు. ప్రజాస్వామ్యం దుస్తులు మార్చడం అయిన చోట ఎన్నికలు తప్పనిసరి తద్ధినం కాక మరేమవుతాయి? ఇదంతా ఒక ప్రహసనమని నిషిద్ధ ‘ఉగ్రవాద సంస్థ’ ముస్లిం బ్రదర్ హుడ్ హేళన చేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాకుండా పోదు. బ్రదర్‌హుడ్ నేత, మాజీ అధ్యక్షుడు, తాజా ‘ఉగ్రవాది’ మొహ్మద్ ముర్సీ 2012లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 33 శాతం ఓటర్లే పాల్గొన్నారు. వారిలో 64 శాతం మాత్రమే ఆయన రాజ్యాంగానికి అవునన్నారు! అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడు విప్లవం మొదట్లోనే హోస్నీ ముబారక్ పాలనను ‘అరబ్బు తరహా ప్రజాస్వామ్యం’గా అభివర్ణించారు. సరిగ్గా మూడేళ్లకు ఈజిప్ట్ అక్కడికే చేరిందంటే అది ఆయన చాణక్యమే.
 
 నాటి విప్లవంలో ప్రజాస్వామ్య యువత, వామపక్ష ట్రేడ్‌యూనియన్లతో భుజం కలిపి సాగిన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను వారి నుంచి వేరు చేసినది అమెరికాయే. అధికారం ఆశజూపి లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన పార్లమెంటు ఎన్నికల్లో ముర్సీ పాల్గొనేలా చేశారు. సైనిక మండలికి అధికారాలను కట్టబెట్టి అమెరికా నాడు మొహ్మద్ హుస్సేన్ తంత్వానీకి పగ్గాలను అప్పగించింది. నామమాత్రపు అధికారాలే ఉన్న ముర్సీ తంత్వానీని తొలగించి, ఏరికోరి (2012) సిసీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఓటర్లలో మూడింట ఒక వంతు మద్దతే ఉన్న బ్రదర్‌హుడ్‌కు రాజకీయ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించారు. సిసీనే నమ్ముకున్నారు. ‘బ్రదర్‌హుడ్ ఫీల్డ్ మార్షల్’ సిసీ... ముర్సీనే కటకటాల పాలుచేసి, బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 20 వేల మందిని నిర్బంధించారు.
 
 అమెరికా మిత్రభేదం ఫలించింది. ఇతర పక్షాలేవీ మాట్లాడలేదు. పైగా నాడు సిసీని ‘హీరో’గా భావించాయి. నాటి లౌకికవాద హీరో ఇప్పుడు ‘ఉగ్రవాద వ్యతిరేక హీరో’గా రూపాంతరం చెందారు. అల్ సియాసాతో మాట్లాడుతూ ఆయన... గల్ఫ్ సహకార మండలి ఉగ్రవాదాన్ని (బ్లాక్ టై) నిర్మూలించడానికి సహకరించాలని కోరారు.
 ఆయన అడగకుండానే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల కోట్ల నిధులను కుమ్మరించాయి. ‘ఉగ్రవాదం’పై పోరుకు ముందు షరతు ఎప్పుడూ ‘పంచమాంగ దళమే’... అంటే పత్రికలే. సిసీ అధికారంలోకి వచ్చినవెంటనే తమకు తామే కళ్లూ, చెవులు, నోళ్లు మూసేసుకోవడం స్థానిక పత్రికలు అలవరుచుకున్నాయి. ‘అల్‌జజీరా’కు ఆ ఇంగితం లేకపోయింది.
 
 ఫలితం అనుభవిస్తోంది. నలుగురు విదేశీయులు సహా 20 మంది పాత్రికేయులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘అన్సర్ అల్ మక్దిన్’ అనే అల్‌కాయిదా అనుబంధ సంస్థ గత పదిహేను రోజుల్లోనే కైరోలో కారుబాంబు పేలుడుకు, సినాయ్‌లో ఒక సైనిక హెలికాప్టర్ కూల్చివేతకు, ఒక పోలీస్ జనరల్ హత్యకు పాల్పడింది. ఆ సంస్థకు సౌదీ మద్దతున్నది కాబట్టి అది ఉగ్రవాద సంస్థ కాదు, దానిది ఉగ్రవాదం కాదు. అభినవ ఫారో ప్రజాస్వామ్యంతో పీనుగుల పిరమిడ్లను నిర్మించనున్నారు.
 - పి. గౌతమ్

మరిన్ని వార్తలు