ఓ కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా?

4 Jun, 2015 08:27 IST|Sakshi
ఓ కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా?

ఒక్కటి మాత్రం తెలుసు. లార్కా వంటి పది మంది ధైర్యశాలురు- జీవితంలో మనం ఎంత రాజీపడి సరిపెట్టుకుంటున్నామో హెచ్చరిస్తుంటారు.
 
ఈ దేశంలో బోలెడంత అవినీతి ఉంది. అధికార దుర్విని యోగం ఉంది. అంతకుమిం చి తనేంచేసినా చెల్లిపోతుంద నే అహంకారం నాయకత్వంలో ఉంది. ఇదంతా ఈ దేశాని కి పట్టిన చీడ. కాని మరీ ప్రమాదకరమైనది ప్రజల అలసత్వం. ‘‘మనకెందుకులే!’’ అనే మనస్తత్వం. ‘‘వాళ్లేం చేసినా చెల్లిపోతుంది. అధికారం వారి చేతుల్లో ఉంది’’ అనుకునే, అనే నిస్త్రాణ. ఇది లేని కారణానికే ఈ జాతి ఒకరిని మహాత్ముడన్నది. మరొకరిని లోకమాన్యుడన్నది. ఒక విలువకు కట్టుబడే నియతి అది.
 
 రెండు ఉదాహరణలు. మొన్న పాట్నా జయప్రకాష్ నారాయణ్ విమానాశ్రయం నిష్ర్కమణ ద్వారం దగ్గర ఇరవయ్యో పడిలో ఉన్న పారిశ్రామిక రక్షణశాఖ కాని స్టేబుల్ నిలబడి ఉంది. ఈ అమ్మాయి జార్ఖండ్‌కి చెందిన హవల్దార్ శశి లార్కా. ఆ రోజు ఢిల్లీ నుంచి వస్తున్న బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం చెప్పడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ తన వందిమాగధులతో నిష్ర్కమణ ద్వారం గుండా హడావుడిగా వెళ్లబోయాడు. లార్కా ఆయన్ని ఆపింది. ఇది బయటికి వెళ్లే మార్గమని చెప్పింది. కాస్సేపు మాటా మాటా పెరిగింది. ఒక కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా? లార్కా తన సీనియర్లతో మాట్లాడింది. ఏమయినా మంత్రిగారిని, పరివారాన్ని విడిచిపెట్టలేదు. తెలివైన మంత్రి వెనక్కు వెళ్లి - ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లాడు. ఇంతే కథ.
 
మరొక కథ. 1959లో నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున ఢిల్లీ యూత్ ఫెస్టివల్‌కి వెళ్లాను. 39 విశ్వ విద్యాలయాలు పాల్గొన్నాయి. టలక్టొరా గార్డెన్స్‌లో ఉత్సవాలు. ఉత్సవాలను ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. ప్రవేశ ద్వారం దగ్గర ఎన్‌సీసీ కేడెట్‌లు నిలబడి, పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ఆవరణలోకి వదిలేవారు. ఒక సాయంకాలం అప్పటి విద్యామంత్రి, నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు గారొచ్చారు. కారుని ఆపి యథాప్రకారంగా పాస్ అడిగాడు ఎన్‌సీసీ కుర్రాడు. రావుగారికి తిక్కరేగింది. ‘‘నేనెవరో తెలీదా?’’ అని కేకలేశారు. కుర్రాడు అటెన్షన్ లోకి వచ్చి సెల్యూట్ చేశాడు. ‘‘తెలుసు సార్. కాని పాస్ లేనిదే వదలకూడదని నాకిచ్చిన ఆర్డర్’’ అన్నాడు. ఇది సున్నితమైన సమస్య.
 
 మాలాంటి కుర్రాళ్లంతా చేరిపోయి వినోదాన్ని చూస్తున్నాం. ఎన్‌సీసీ కమాండర్ - మరేదో యూనివర్సిటీ ప్రొఫెసర్ - పరిగెత్తుకు వచ్చాడు. రావుగారికి పాస్ లేదు. నిజమే. కాని ఆయన్ని వెళ్లని వ్వాలా వద్దా? కమాండర్‌కి చెమటలు పట్టాయి. ‘‘మీరిచ్చిన ఆర్డరే నేను పాటిస్తున్నాను. వారిని లోనికి వదలాలంటే మీ ఆర్డర్‌ని ఉపసంహరించుకోండి సార్! లేకపోతే నేను తప్పుకుంటాను. మీరు తప్పుచేయండి’’ అన్నాడు కుర్రాడు. కమాండర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎదురుగా రావుగారి కారు. చుట్టూ స్టూడెంట్లు. ఎటూ పాలుపోలేదు. చివరికి రావుగారే అగ్గిమీద గుగ్గిలమయి - ‘‘నేను పండిట్జీతో మాట్లాడుతాను’’ అని కారు వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. ఆ సాయంకాలం కుర్రాళ్లందరూ ఆ కేడెట్‌ని పెద్ద వీరుడిలాగ గార్డెన్ అంతా ఊరేగించారు.
 
 ఒక సిద్ధాంతానికి కట్టుబడి నడవడానికి బోలెడంత చిత్తశుద్ధి కావాలి. రాం కృపాల్ యాదవ్ తన అధికా రాన్ని ఉపయోగించి ఎదురు తిరగాలనుకుంటే అల్లర యేది. తరువాత లార్కా కథ దుర్గాశక్తి నాగ్‌పాల్ కథ అయేదా, భేమ్కా కథ అయేదా అన్నది వేరే విషయం. ఉద్యోగాన్ని మాత్రమే కాపాడుకునేవాడు నీతికి తిలో దకాలిస్తాడు. నీతిని కాపాడేవాడు అవకాశవాదానికి తిలోదకాలిస్తాడు. వి.కె.ఆర్.వి.రావు గారూ అక్కడే నిలవ దలిస్తే గొడవ జరిగేది. కాని రెండు సందర్భాలలోనూ 20 ఏళ్ల లార్కా, ఆనాటి కేడెట్ చేసిన పని సబబైనది. వారు విధికి కట్టుబడి చేసినది.
 
 బస్సులో 85 పైసలు టిక్కెట్టిచ్చి 15 పైసలు మిగుల్చుకునే బస్సు కండక్టరుని ఎంతమంది నిలదీస్తున్నారు? గ్యాస్ సిలెండర్ ఇచ్చే కుర్రాడు 630 రూపాయలు పుచ్చు కుంటాడు. 4 రూపాయలు వాపసు ఇవ్వడు. నిజాయితీకి, కర్తవ్య నిర్వహణకి చిన్నా పెద్దా లేదు. ఈనాటి లార్కా సంఘటన చదివినప్పుడు 55 సంవ త్సరాల కిందటి కుర్రాడి నిజాయితీ, దాని విజయం గుర్తుకొచ్చింది.

ఇప్పుడా కుర్రాడూ నా వయస్సు వాడే అయివుం టాడు. ఏ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాడో? పేరేమిటో? ఇప్పుడేం చేస్తు న్నాడో? 20 ఏళ్ల వయస్సులో నిలదొక్కు కున్న నిజాయితీ, ధైర్యం జీవితంలో అతన్ని ఏ మార్గం లో నడిపించిందో! ఒక్కటి మాత్రం తెలుసు. లార్కా వంటి పది మంది ధైర్యశాలురు- జీవితంలో మనం ఎంత రాజీపడి సరిపెట్టుకుంటున్నామో హెచ్చరిస్తుంటారు.
 - గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు