నాడూ నేడూ మనకు అదే దిక్కు

3 May, 2016 01:50 IST|Sakshi
నాడూ నేడూ మనకు అదే దిక్కు

ఇచ్చిన హామీలను అమలుపర్చడానికి వీలులేని పునర్విభజన చట్టాన్ని నమ్ముకున్న రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు రెండు రాష్ట్రాల ప్రజలనూ సమస్యల్లో ముంచి.... అందుకు కారణం నీవంటే నీవని  పొట్టేళ్లలా కుమ్ముకుంటున్నారు! అందుకే సమస్యల పరిష్కారం కోసం తలలు వాచిపోయిన వాళ్లు ‘371-డి’ అధికరణను వాడుకోవాల్సిన విచిత్ర స్థితి ఎదురైనట్టుంది. ఆ రాజ్యాంగ అధికరణనూ, ప్రజలనూ పూర్తిగా విస్మరించిన నాయకులు రాజ్యాంగంలో ‘కంతలు’ వెతకడం వల్లనే తెలుగు జాతికి నేడు ఇన్ని ఇబ్బందులు!
 
 చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాడట ఓ తెలివిమాలిన ‘ప్రబుద్ధుడు’. తాజాగా మన తెలుగు జాతి, పాలకులూ సరిగ్గా ఆ కోవ కిందకే చేరారు. శషభిషల మధ్య, నాయకుల స్వార్థ ప్రయోజనాల మధ్య తెలుగుజాతిని విడగొట్టాలని చిచ్చుబెడు తుండగా- పూర్వాంధ్ర మొక్కట్లు చెదిరిపోకుండా  నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో విశిష్ట సవరణను ప్రవేశపెట్టడం ద్వారా కల్పించిన ప్రత్యేక నిబంధన ఆర్టికల్ ‘371-డి’! ఉద్యోగ సద్యోగాలకు, విద్యా వ్యాపకాలకు, తెలుగు వారి ఉనికికీ మనికికీ సంబంధించి ఏ సమస్యలు ఉత్పన్నమైనా ఈ రాజ్యాంగ అధికరణ ద్వారానే సుఖంగా పరిష్కరించుకు నేందుకు ఈ అనుల్లంఘనీయమైన అధికరణ వచ్చింది. దానిలో ఎలాంటి మార్పు తేవాలన్నా అందుకు మూడింట రెండొంతుల రాష్ట్రాలు సమ్మతిస్తేనే ఆ అధికరణను సవరించడం సాధ్యమవు తుంది. పరస్పరం స్వార్థపర రాజకీయాల ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మొత్తం ఈ అధికరణ మీదనే దండెత్తి రెండు ప్రాం తాలలోనూ చిచ్చు రగిల్చి, జాతిని చీల్చారు. ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి.
 
 ‘హోదా’ మిథ్య.. 371-డినే దిక్కు

 ఈ పొదుగులాటలో అటూ ఇటూ కొంత మంది ఉద్యోగ వర్గాలు, అధికారులు, కొందరు ప్రజాపతినిధులు ‘వేలు విడిచిన’ ఆ రాజ్యాంగ అధికరణ  ‘371-డి’లోనే ఇప్పుడు సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుం టున్నారు. అంటే, ఆ అధికరణే ‘‘ప్రత్యేక ప్రతిపత్తి’’. అంతేగానీ వేరే ‘‘స్పెషల్ స్టేటస్’’ అంటూ లేదు, ఉండదు! నిన్నటి యూపీఏ ప్రభుత్వంగానీ, నేటి ఎన్డీఏ పాలనా రథంగానీ ఈ అధికరణాన్ని ముట్టలేదు. ఎటు తిరిగీ గత కాంగ్రెస్ ప్రభుత్వ పతన దశలోనే ‘గుంట కాడి నక్కలా’ అధికారానికి రావడం కోసం  బీజేపీ ఎదురుతెన్నులు చూస్తూ ఉన్న ఘడియలలోనే తెలుగుజాతి అడకత్తెరలో పోకచెక్కలా చిక్కుకుపోయింది.

తెలుగువారిని చీల్చడం ద్వారా రెండు ప్రాంతాలలోనూ లేదా కనీసం ఒక ప్రాంతంలోనైనా ‘ఆబోరు’ దక్కించుకుని ఏలికలుగా కొనసాగవచ్చని కాంగ్రెస్ ‘దింపుడు కల్లెం’ ఆశను కనబరిచింది, ఇటు బీజేపీ కూడా అదే ఆబతో ఒక ప్రాంతంలో గాకపోయినా మరొక తెలుగు ప్రాంతంలోనైనా తెలుగుదేశంతో కలసి అధికారంలోకి రావాలని తాపత్రయం చూపింది. తనంత తానుగా మరోమారు అధికారంలోకి రాలేని చంద్రబాబు నాయుడు మితవాద రాజకీయాలకు, అతివాద హిందుత్వకు అంకితమైన బీజేపీ కూటమితో చేతులు కలిపారు. ఈ రెండు పక్షాలూ కాంగ్రెస్‌తో చేతులు కలిపి జరిగిన కుట్ర ఫలితమే విభజన! ఈ కుట్రకు పుట్టిన పెక్కు సమస్యల వల్లనే మరోసారి 371-డి అధికరణను ఆశ్రయించవలసి వస్తోంది.
 
 దాని గురించి కనీసం అధికారుల్లోనూ, ప్రజా ప్రతినిధుల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకని? రెండు ప్రభుత్వాలు ప్రజా జీవితాన్ని కకావికలు చేస్తున్న వివిధ వర్గాల ప్రజలందరి సమస్యల పరిష్కారానికి దూరమయ్యాయి. అయినా పాలకుల హామీల పర్వం కొనసాగుతూనే ఉంది, రైతాంగ రుణాల తీరుమానం ఒక చాట భారతంగా మారింది! అటూ ఇటూ కూడా పాత పాలకుల మాదిరే కొత్త పాలకులు కూడా అమలుకురాని శంకుస్థాపనలు చేస్తున్నారు. రానున్న ‘2019’ జ్ఞాపకమొచ్చి నప్పుడల్లా పదే పదే ‘పునరంకితం’ అవుతుండటం మాత్రం వాస్తవం!
 
 అటూ ఇటూ పాలకులకు హైకోర్టు అక్షింతలు
 మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ను దేశవాళీ స్థానిక వృత్తిదారుల పరం చేయకుండా   ప్రజా వ్యతిరేక విదేశీ బహుళ జాతి గుత్త కంపెనీల పెట్టు బడులతో ‘మేడ్ ఇన్ ఇండియా’గా చూపాలని చూస్తున్నారు. అదే బాటలో తెలుగు పాలకులు కూడా రాజధానుల నిర్మాణం కోసం విదేశీ గుత్త కంపెనీల పైనే ఆధారపడుతున్నారు. సరిగ్గా ఈ దశలోనే ఉద్యోగ వర్గాలు, వారి నాయ కులు కొందరు విభజనానంతరం పోటెత్తిన పెక్కు సమస్యలకు పరిష్కారాన్ని 371-డి అధికరణలో వెతుక్కునే స్థితి వచ్చింది. రాజధానిగా అమరావతికి రూపురేఖలు దిద్దాలనుకునే ముఖ్యమంత్రి ఏ దేశంలో స్థిరపడ్డారోనని జనాలు తలలు బాదుకుంటున్నారు.  
 
 ఈలోగా ఆయన సహచర గణం, రియల్ ఎస్టేట్ రాజకీయాలలో భాగంగా ఆ ప్రాంతపు రైతాంగం నుంచి భూములు బలవం తంగా గుంజుకునే ప్రక్రియను ప్రారంభించి, సమస్యను కోర్టుల దాకా దేకించే పద్ధతిని కనిపెట్టారు! సమస్యల పరిష్కారంలోని విపరీతమైన లొసుగులను ఎత్తిచూపుతూ ఉమ్మడి హైకోర్టు ఉభయ ప్రభుత్వాలనూ కనీసం చెరి నాలుగు సందర్భాలలోనూ హెచ్చరికలూ, తీర్పులతో మందలించాల్సి వచ్చింది. ఇచ్చిన హామీలను అమలుపర్చడానికి వీలులేని రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని నమ్ముకున్న రెండు తెలుగు రాష్ట్రాల పాలకులూ రెండు రాష్ట్రాల ప్రజలనూ సమస్యల్లో ముంచి... అందుకు కారణం నీవంటే నీవని  అని పొట్టేళ్లలా కుమ్ముకుంటున్నారు! అందుకే సమస్యల పరిష్కారం కోసం తలలు వాచిపోయిన వాళ్లు 371-డి అధికరణను వాడుకోవాల్సిన విచిత్ర స్థితి ఎదురైనట్టుంది.

ఆ రాజ్యాంగ అధికరణనూ, ప్రజలనూ పూర్తిగా విస్మరించిన నాయకులు రాజ్యాంగంలో ‘కంతలు’ వెతకడం వల్లనే తెలుగు జాతికి నేడు ఇన్ని ఇబ్బందులు! ఏమైతేనేం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలకు బలై నది మొత్తం తెలుగుజాతి! ‘ప్రత్యేక హోదా’ను రెండు ప్రాంతాలూ కోరుతు న్నందున అది సాధ్యపడే వ్యవహారం కాదనీ, బుందేల్‌ఖండ్ లాంటి మారుమూల పర్వత ప్రాంతాలకు, లేదా కొన్ని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం తప్ప ఇతర ప్రాంతాలకు ‘ప్రత్యేక ప్రతిపత్తి’ (స్పెషల్ స్టేటస్) సాధ్యపడదని వారికి తెలుసు! అయినా ఆ నినాదంతోనే విభజనానంతరం కూడా డ్రామాలు ఆడుతున్నారు. అందుకే విభజన వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి  పూను కోవాల్సిన అధికారులు ఎటూ పాలుపోకుండా ఉన్నారు.
 
 తెలుగు జాతికి వరం
 ఇంతకూ అటూ ఇటూ పాలకులు తలపెట్టిన ఏకైక ‘ప్రజా సంక్షేమ పథకం’ మంత్రుల జీతాలను ఆకాశాన్ని అంటేలా పెంచుకోవటం! ఈ అవస్థల నుంచి పూర్వాంధ్రప్రదేశ్‌కు రక్షణ గా, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా, రాజ్యాంగ ప్రత్యేక సవరణ ద్వారా (నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌లకు మాత్రమే ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిలాంటి) అధికరణ ప్రతిపత్తిని మొత్తం తెలుగుజాతికి 371-డి కల్పించింది. ఉద్యోగ సద్యోగాల్లో సివిల్, పోలీస్ సర్వీసు లలో, విద్యారంగంలో, డెరైక్ట్ రిక్రూట్‌మెంట్స్‌లో, యూనివర్సిటీ లలో వివక్షత లేకుండా వివిధ ప్రాంతాలకు  సమానావకాశాలను కల్పించడం కోసమే తెలుగుజాతి 371-డి ప్రత్యేక ప్రతిపత్తి పొందిన నాల్గవ రాష్ట్రంగా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) అవతరిం చింది. ఒక్క సుప్రీం కోర్టుకు తప్ప అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అధికారాలను హైకోర్టు సైతం ప్రశ్నించడానికి వీలు లేదని ఈ ప్రత్యేక హోదా శాసించింది.
 
 అలాగే రాజ్యాంగం మౌలిక చట్రానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా 371-డి అధికరణను కట్టడి చేసింది. అందుకే ఈ ప్రత్యేక ప్రతిపత్తిని చెక్కు చెదర్చాలంటే- రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌కు చెందిన 368వ అధికరణను ఆశ్రయించడం అనివార్యమని శాసనం. పైగా, రాజ్యాంగంలోని ఏ ఇతర భాగంగానీ లేదా అంశంగానీ, రాష్ట్రపతి జారీ చేసే ఏ ఉత్తర్వుగానీ 371-డి అధికరణకు లోబడే ఉండాలి (వి. జగన్నాథరావు వర్సస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: సుప్రీంకోర్టు: 2001/2002)  బహుశా పునర్విభజన చట్టంవల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నందుననే విభజన బిల్లుపైన, చట్టంపైన, డజన్లకొద్దీ రిట్‌లను సుప్రీం కోర్టు స్వీకరించాల్సి వచ్చింది.
 
 చట్టం ప్రకారం యూపీఏ పాలకులు ఒక ప్రాంత రాజధాని నిర్మాణానికి భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ముఖం చాటుచేసుకొనగా, అవే చెప్పులు తొడుక్కున్న బీజేపీ పాలకులు తెలుగు ప్రజలను ఏరుదాటేదాకా... అన్నట్టు చేశారు. ‘ప్రత్యేక ప్రతిపత్తీ’ లేదు, ‘ప్రత్యేక ప్యాకేజీ’ లేదు. ఒక పాలకుడు ‘ప్రజలే బాసులు’ అంటాడు, మరో పాలకుడి దృష్టిలో ప్రజలే బానిసలు! గొంతెత్తి గద్దించకుండా ప్రజలు ‘బాసులు’ కాలేరు.

ఈ తతంగాన్ని ప్రజలు క్రమంగా గమనిస్తున్నకొద్దీ ఉభయ ప్రాంతాల పాలకులు కాళ్లు కాల్చుకున్న పిల్లుల్లా పరస్పరం ‘ఆకర్ష్’ పథకం ద్వారా ఎప్పుడేమి పుట్టి మునుగుతుందోనని అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షం నుంచి దొంగ సంపాదనల ఆధారంగా, ఫిరాయింపులకు తలుపులు తెరిచారు. ఈ హైడ్రామాలో కొస మెరుపు - అదే ఆకర్ష్ దుప్పట్లో సాగిన ‘ఓటుకు కోట్లు’ డ్రామాలో పట్టుబడి దొరికిపోవడం. దొంగెవరో, దొర ఎవరో నిర్ధారణ కాకముందే ఎన్నికల సంఘం ఉనికినే ప్రశ్నించి తప్పించుకున్నారు!        
     abkprasad2006@yahoo.co.in
-  ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

మరిన్ని వార్తలు