‘అభద్రత’తోనే అబద్ధాల మేడలు

2 Jul, 2015 00:04 IST|Sakshi
‘అభద్రత’తోనే అబద్ధాల మేడలు

కొత్తగా సెక్షన్ 8ని అమలు చేయాల్సిన పని లేదు. పునర్వ్యవస్థీకరణ చట్టంతోపాటూ అదీ అమల్లోనే ఉంది. గవర్నర్ ఆ సెక్షన్‌ని ఉపయోగించే ఏ సమస్యా లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రాజధానిలో భవనాల కేటాయింపును పూర్తి చేశారు. ఇక ప్రజల భద్రత, శాంతిభద్రతలు, ఆస్తుల రక్షణ. వాటికి విఘాతమే కలుగలేదు కాబట్టి గవర్నర్ జోక్యం అవసరమే కాలేదు. అందుకే సెక్షన్ 8పై ఇప్పుడు సాగుతున్న రభసంతా ‘ఓటుకు కోట్లు’ గండం గట్టెక్కడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి విసిరిన రాయే కావాలి.

 ‘‘మహారాష్ట్రీయులు తమ పట్ల వివక్ష పాటిస్తారేమోనన్న భ యం గుజరాతీ యులలో బాగా నాటుకుపోయింది. కానీ మన రాజ్యాంగం ప్రకారం వివక్ష  సాధ్యం కాదు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల జాబితా ఉంది. వాటికి భంగం కలిగినప్పుడు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో రిట్ పిటిషన్ల ద్వారా రక్షణ పొందవచ్చును. వివక్షతో కూడిన ప్రతి అన్యాయానికీ రాజ్యాంగం రక్షణలను కల్పించింది. అటువంటప్పుడు గుజరాతీలకు ఆ భయం ఎందుకు?’’ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 1955లో మహారాష్ట్ర, గుజరాత్ విభజన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఆ సమయంలో గుజరాతీయులు బొంబాయిని మహారాష్ట్రకు రాజధానిగా ఉంచాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. ఆనాటి గుజరాతీల భయాలు నిరాధారమైనవని చరిత్ర రుజువు చేసింది. మహారాష్ట్రలోగానీ, బొంబాయిలోగానీ గుజరాతీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. అయితే నేడు కొందరు అబద్ధాలను పదే పదే వల్లించడం ద్వారా సత్యాలుగా చలామణి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

 ‘అభద్రత’ ఎవరికి?
 సెక్షన్ 8 పేరిట ఇప్పుడు సాగుతున్న రభసంతా ఆ ప్రయత్నంలో భాగమే. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లు ఏర్పడ్డాయి. అది జరిగీ ఒక ఏడాది గడిచింది. ఏపీ నుంచి వచ్చిన లక్షలాది మంది తెలంగాణలోనే స్థిరపడిపోయారు. హైదరాబాద్‌లోనే కాదు, మారు మూల అటవీ ప్రాంతాల్లో సైతం వారు ఎలాంటి అభద్రతా, వివక్షా లేకుండా జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర భేదం లేకుండా ఒకే అపార్ట్ మెంట్‌లో, బస్తీలో, గ్రామంలో సోదరుల్లా కలసిమెలసి ఉంటున్నారు. ఈ సం వత్సర కాలంగా ఎలాంటి ఘర్షణలూ జరగనే లేదు. బొంబాయి గత అను భవమూ, హైదరాబాద్‌లోని నేటి శాంతియుత సహజీవనమూ కూడా భారత రాజ్యాంగం విశిష్టతకూ, భారత ప్రజల మధ్య ఉన్న సహోదర భావానికీ అద్దం పడుతున్నాయి. మన రాజ్యాంగం ప్రకారం దేశ పౌరులెవరైనా, ఏ భాష, మతానికి చెందినవారైనా ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యాపార, వాణిజ్యాలు కొనసాగించవచ్చు.
 గత ఏడాది కాలంగా చర్చకు రాని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపైనా, అందులోని సెక్షన్ 8 పైనా ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. రేవంత్‌రెడ్డిపై ఏసీబీ కేసు తదుపరి, అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయంపై బలమైన ఆధారాలు బయటపడిన తర్వాత ఈ చర్చ మొద లైంది, జోరందుకుంది.

ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను సైతం కొందరు మంత్రులు అసభ్య పదజాలంతో విమర్శించారు. సెక్షన్ 8 అమలు చేయాలని, లేనట్లయితే ఇక్కడ సమాంతర పాలన నడుపుతామని హెచ్చరిం చారు.  2014 జూన్ 2 నుంచి పునర్వ్యవస్థీకరణ చట్టం, అందులోని సెక్షన్ 8 అమల్లోనే ఉన్నాయి. కొత్తగా సెక్షన్ 8ని అమలు చేయాల్సిన అవసరం లేదు.  కాబట్టే సెక్షన్ 8పై సాగుతున్న రభస వెనుక వేరేదో ఉద్దేశముందని భావిం చాల్సి వస్తోంది. తక్షణమే ముంచుకొచ్చిన ఏసీబీ కేసు ముప్పు నుంచి బయట పడడానికీ, దానిని పక్కదోవ పట్టించి, ప్రజల దృష్టి మరల్చడానికీ ఈ రాయి విసిరి ఉండాలి. రాజకీయ నాయకుల పథకాలు, ప్రణాళికలు ఏమైనప్పటికీ పౌరులమైన మనం విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంది.

 ‘ఎనిమిది’ ఏం చెబుతోంది?  
 సెక్షన్ 8లో నాలుగు క్లాజులున్నాయి. అందులో మొదటిది, అపాయింటెడ్ తేదీ నుంచి, అంటే జూన్, 2, 2014 నుంచి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో జీవన భద్రత, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యతను కలిగి ఉంటారు. రెండవది, ప్రత్యేకించి శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ప్రముఖ స్థలాల రక్షణ, వాటి నిర్వహణలపైనా, రెండు ప్రభుత్వాల పరిపాలనావసరాల కోసం భవనాల కేటాయింపుపైనా ప్రత్యే కంగా ఆయన తన దృష్టిని కేంద్రీకరించాలి. మూడవది, గవర్నర్ తన విధు లను నిర్వర్తించేటప్పుడు... ముందుగా తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండ లిని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఆ క్రమంలో ఏమైనా సమస్యలు తలెత్తితే గవర్నర్‌దే అంతిమ నిర్ణయం. నాల్గవది కేంద్రప్రభుత్వం నియమిం చిన ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సహాయ సహకారాలు అందించాలి.
 ఇదీ సెక్షన్ 8 సారాంశం. గవర్నర్‌కి ఉమ్మడి రాజధానిలో ఉన్నది ప్రత్యేక బాధ్యత మాత్రమే తప్ప, అధికారం కాదు. అది కూడా తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాతనే ఆయన తగు చర్యలు తీసుకో వాలి. ఎందుకంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తెలంగాణలో అంత ర్భాగం. ఇదే విషయాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 3 స్పష్టం చేస్తు న్నది. అంతేకాదు, గవర్నర్ ఇప్పటికే సెక్షన్ 8 లోని కొన్ని అంశాలకు సంబం ధించి చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు భవనాల కేటాయింపులను ఏ సమస్యా లేకుండా పూర్తి చేశారు. ఇక ప్రజల జీవన భద్రత, శాంతి భద్రతలు, ఆస్తుల రక్షణ. వాటికి అసలు ఎక్కడా విఘాతమే కలుగలేదు కాబట్టి గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు.

 గవర్నర్ జోక్యం ఎప్పుడు?
 మన దేశంలో నేరాలను పరిశోధించి నిర్ధారించే న్యాయ వ్యవస్థలున్నాయి. నేరం రుజువైతే శిక్షలు విధించే చట్టాలున్నాయి. ఎవరైనా హత్య చేస్తే, లేదా చేశారని భావిస్తే భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 302 సెక్షన్ కింద ఆ వ్యక్తిని అదు పులోకి తీసుకొని విచారిస్తారు. అంత మాత్రాన ఐపీసీ అనేది ఉంది కాబట్టి నేరం జరిగినా, జరగకపోయినా ప్రతి చోటా 302 సెక్షన్‌ను అమలు చేయాలనడం ఎలా ఉంటుందో, ఎలా అవివేకమవుతుందో అలాగే సెక్షన్ 8ని అమలు చేయాలని అడగడమైనా, పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు చేయాల నడమైనా కూడా. ఒకవేళ శాంతిభద్రతలకు భంగం కలిగి, ప్రజల ధన, మాన, ప్రాణాలకు హాని కలిగితే, తెలంగాణ ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే.... అప్పుడు గవర్నర్ జోక్యం అవసరమవుతుంది. సెక్షన్ 8 లేకున్నా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్‌కు ఆ బాధ్యత, అధి కారం ఉన్నాయి. 

పరిస్థితి మరీ విషమిస్తే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని సైతం గవర్నర్ కేంద్రాన్ని కోరవచ్చు. అంతేకానీ ప్రశాం తంగా కలసిమెలసి జీవనం సాగిస్తున్న వారిని రెచ్చగొట్టాలని కొందరు ఇలా కోరడాన్ని ఎవ్వరూ హర్షించరు. సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా, ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రజల సమస్య మాత్రమే కాదు. ఉమ్మడి రాజధాని పరిధిలో నివసిస్తున్న ప్రతిపౌరుని రక్షణా గవర్నర్ ప్రత్యేక బాధ్యతే అవు తుంది. అయితే హత్యలు, దొమ్మీలు చేసి, అవినీతికి పాల్పడి.... నేను ఫలానా ప్రాంతపు మనిషిని కనుక నన్ను ఏమీ అనవద్దు. ఏమైనా అంటే సెక్షన్ 8ని అమలు చేయమంటానంటే కుదరదు. అంతే కాదు, సాధారణ పౌరుని నుంచి  ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి వరకు ఎవరైనా నేరం చేశారని భావిస్తే చర్యలు సమానంగానే ఉంటాయి. మన దేశంలో రాష్ట్రపతి, గవర్నర్‌ల విషయంలో మాత్రమే  ఆరోపణలు వచ్చినా, పదవిలో ఉండగా చర్యలు తీసుకోవడానికి లేదు. మిగతా వారెవరూ దీనికి మినహాయింపు కాదు.  
 
‘ఆరు’కు ఎగనామం పెట్టి...

 సెక్షన్ 8ని అమలు చేయాలని వాదిస్తున్న మంత్రులు, నాయకులు, అదే పున ర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 6ను గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. ఏపీకి నూతన రాజధాని నిర్మాణం కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను విధిగా అమలు చేయాలని సెక్షన్ 6 స్పష్టం చేసింది. పాలకులు ఆ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు. రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే ప్రాంతం ఎంపిక తగదని ఆ కమిటీ... ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతాన్ని సిఫారసు చేసింది. పైగా రాజధాని కోసం వెయ్యి ఎకరాలు చాలునని, అంతా ఒకే చోట కేంద్రీకరించకుండా, వికేంద్రీకరణ విధానంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరగాలని అది సిఫారసు చేసింది. ఆ సిఫారసులను  తిరస్కరించి, ఏపీ పాలకులు తమ రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చటి పొలా లను కాంక్రీట్ అరణ్యంగా మార్చడానికి నిర్ణయించారు. సెక్షన్ 8 అమలంటూ గగ్గోలు చేస్తున్నవారికి అప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టం గుర్తుకు రాలేదు.
 
( వ్యాసకర్త : మల్లేపల్లి లక్ష్మయ్య... సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213    

రాచరికాల  పాలనలో సైతం ప్రజల ప్రయోజనాల కోసం రాజ్యాలను వదులుకున్నవారున్నారు. కుటుంబాలను, బిడ్డలను, కొడుకులను త్యాగం చేసిన వారున్నారు. కానీ అధికారం కోసం, పదవుల కోసం ప్రజలను పావు లుగా వాడుకొనే పాలకులను ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఓటుకు కోట్లు’ కేసు గండం నుంచి గట్టెక్కడానికి ఆంధ్ర - తెలంగాణ సెంటిమెంట్‌ను, పునర్వ్యవస్థీకరణ చట్టం అమలును వాడుకోవాలనుకుంటున్నారు. అందరం వివేకంతో ఆలోచించి ఈ విషయంలో సత్యాసత్యాలను నిర్ధారించుకోవాల్సిన సమయమిది.

>
మరిన్ని వార్తలు