రైతు బలిదానం

24 Apr, 2015 00:10 IST|Sakshi

దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా సాగుతున్న రైతుల నెత్తుటి తర్పణలు పాలకుల పాషాణ హృదయాలను కరిగించలేకపోతున్నాయని భావించాడేమో...దేశ రాజధాని నగరంలో వేలాదిమంది సాక్షిగా, చానెళ్ల కెమెరాల ముందు రాజస్థాన్‌కు చెందిన యువ రైతు గజేంద్ర సింగ్ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించి ఆత్మహత్యలను నివారించలేని అశక్తతలో పడిపోయిన పార్లమెంటుకు కూతవేటు దూరంలో రాజేంద్రసింగ్ ప్రాణార్పణ చేశాడు.
 
 మన పాలకుల చేతగానితనాన్ని ప్రపంచం ముందుచాటాడు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిర్వహించిన రైతు ర్యాలీలో చోటుచేసుకున్న ఈ విషాదం నివారించడానికి సాధ్యంకానిదేమీ కాదు. అతను మరణం అంచులవైపు కదులుతుంటే ఒక్కరంటే ఒక్కరు ముందుకురికి రక్షించే ప్రయత్నం చేయలేదు. రైతు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా జనంలోనైనా కాస్త ఆదుర్దా వ్యక్తమైంది. కిందకు రావాలని బతిమాలడం కనబడింది.
 
 కానీ, అక్కడున్న పోలీసు సిబ్బందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు కదల్లేదు. ప్రేక్షకపాత్ర వహించారు. అయిదారువేలమంది జనం ఉన్న సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరులు, వారందరి అంగరక్షకులు, ర్యాలీ కోసమని మోహరించిన పోలీసులు... ఇంతమంది ఉండగా ఎవరూ చొరవ ప్రదర్శించలేక పోయారు. ర్యాలీలో నాయకుల ప్రసంగాలు ఆగలేదు. ఈ సంగతి నాయకుల కంట పడలేదనడానికి లేదు. స్వయంగా కేజ్రీవాలే గజేంద్ర సింగ్‌ను వేదికపైనుంచి గమనించినట్టు వీడియో దృశ్యాలు, ఫొటోలు చెబుతున్నాయి.
 
 అంతమంది ముందు ఒక రైతు ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించిన ఆ విషాద సమయంలో సభను ఆపాలన్న స్పృహ కూడా ఆప్ నేతలకు కొరవడింది. రైతు మరణించగానే మాత్రం నాయకులందరూ సిగ్గువిడిచి వీధినపడి ‘మీరంటే మీరు కారణమ’ని పరస్పరం నిందించుకుంటున్నారు. మొన్నటివరకూ పౌర సమాజ ప్రతినిధులుగా ఉండి ఎన్నో సమస్యలను వెలికితీసిన ఆప్ నేతలు తాము సైతం ఎంత బండబారిపోయారో నిరూపించుకున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా బాధ్యతారహితమైన ప్రకటనలు చేసి తమను తాము పలచన చేసుకున్నారు.
 
 ఆదినుంచీ నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యవసాయరంగం ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభమయ్యాక మరింతగా కుంగిపోవడం మొదలైంది. ఆ సంస్కరణల ఫలాలు కనబడటం ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయరంగంలో సంక్షోభం విస్తరించడం మొదలైంది. 1995 నుంచి 2014 వరకూ 3,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో వెల్లడించిన గణాంకాలే ఈ సంగతిని తెలియజెబుతున్నాయి.
 
 ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో ఒక్క విదర్భ ప్రాంతంలోనే వేయిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇంతే సంఖ్యలో అన్నదాతలు ప్రాణార్పణ చేశారని మానవహక్కుల నివేదిక చెబుతున్నది. నిరుడు డిసెంబర్‌లో విదర్భ ప్రాంతంలో ఒక రైతు తన పంటపొలంలో చితి పేర్చుకుని నిప్పంటించుకుని తనువు చాలించాడు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఏ స్థాయిలో ఆదుకుంటున్నాయో గణాంకాలే వెల్లడిస్తాయి.
 
 2013 జీడీపీలో వ్యవసాయరంగం వాటా 13.7 శాతం ఉంది. ఇదే కాలంలో పరిశ్రమల వాటా 21.5 శాతం. 54 శాతం వ్యవసాయ క్షేత్రాలు పూర్తిగా వర్షాధారంగా ఉన్న పరిస్థితుల్లో...దాదాపు 80 శాతంమంది చిన్న, సన్నకారు రైతులుగా ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించడమంటే మాటలు కాదు. వ్యవసాయం ద్వారా రైతులకు లభించే ఆదాయం అరకొరే. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుంటే రైతు కుటుంబానికి నెలకు సగటున వచ్చే ఆదాయం రూ. 6,000 మించడం లేదు.
 
 కానీ దేశ జనాభాలో 49 శాతంమందికి వ్యవసాయరంగమే ఉపాధి కల్పిస్తోంది. పారిశ్రామికరంగంద్వారా ఉపాధి పొందుతున్నవారి శాతం 20మాత్రమే! కానీ పారిశ్రామికరంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాల్లో పదోవంతైనా వ్యవసాయరంగానికి దక్కడం లేదు. ప్రైవేటు రంగంపై ఎక్కడలేని మోజూ ప్రదర్శిస్తున్న పాలకులు వ్యవసాయం కూడా ప్రైవేటు రంగమేననీ, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నదనీ మరిచిపోతున్నారు. మన పంట భూముల్లో 54 శాతం పూర్తిగా వర్షాధారమైనవి. 71 శాతం మంది రైతాంగం ఈ వర్షాధార భూముల్లోనే సేద్యం చేయాల్సివస్తున్నది. ఇంత చేసినా చివరకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పండిన పంటంతా ధ్వంసమవుతున్నది.
 
 ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుకూ, వ్యవసాయ సంక్షోభానికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి అధికార గణం నానాపాట్లూ పడుతోంది. అకాలవర్షాలవల్ల పంట ధ్వంసమైన కారణంగా అప్పులపాలయ్యానని, ముగ్గురు పిల్లల్ని పోషించుకోవడమెలాగో తెలియక సతమతమవుతున్నానని గజేంద్రసింగ్ లేఖరాస్తే...అతను సాగుచేస్తున్న ప్రాంతంలో నష్టం పెద్దగా లేదని చెప్పడానికి రాజస్థాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిజానికి రైతులు తమ కర్తవ్యంగా భావించి వ్యవసాయం చేస్తారు తప్ప లాభనష్టాల లెక్కలు వేసుకోరు. వారలా లెక్కలేసుకుంటే జనాభాలో అధిక సంఖ్యాకులు పస్తులతో గడపాల్సివచ్చేది.
 
 ప్రకృతి వైపరీత్యాలవల్ల కుంగిపోతున్న రైతులను పాలకులు ఆదుకోకపోగా పగబట్టినట్టు వ్యవ హరిస్తున్నారు. విత్తనాలు మొదలుకొని అన్నిటి ధరలూ ఆకాశాన్నంటు తుండగా వ్యవసాయ దిగుబడులకు ప్రకటించే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అరకొరగా ఉండటం రైతాంగం మనసు కష్టపెడుతోంది. ఇవి చాలవన్నట్టు ఈ ఏడాదినుంచి ఆహారధాన్యాల సేకరణకు కూడా కేంద్రం పరిమితులు విధించింది. ఇలాంటి పోకడలే వ్యవసాయ రంగ సంక్షోభాన్ని మరింతగా పెంచుతున్నాయి. రైతులను మృత్యుకుహరంలోకి నెడుతున్నాయి. గజేంద్రసింగ్ మరణంతోనైనా పాలకులు మేల్కొనాలి. ప్రతిష్టకు పోకుండా తమ ప్రమాదకర విధానాలను సవరించుకోవాలి. అలా చేసినప్పుడే దేశవ్యాప్తంగా నిత్యమూ సాగుతున్న రైతుల బలిదానాలు ఆగుతాయి.

>
మరిన్ని వార్తలు