సంపదే ఆ దేశానికి శాపం

24 Dec, 2013 00:46 IST|Sakshi
సంపదే ఆ దేశానికి శాపం

ఆఫ్రికా ఖండంలో ఎప్పడు ఏం జరిగినా అది దానికి కీడుగానే పరిణమించాలని ‘రాసిపెట్టి’ ఉంది. అందుకే దక్షిణ సూడాన్ నేడు నెత్తురోడుతుంది. కాబట్టే ఆఫ్రికాలోనే అతి సుదీర్ఘమైన యాభయ్యేళ్ల అంతర్యుద్ధం తదుపరి 2011లో ఆవిర్భవించిన దక్షిణ సూడాన్ ముచ్చటగా మూడేళ్లయినా కాకముందే అంతర్యుద్ధం అంచులకు చేరింది. పుట్టిన నాడే అది తన ‘కాళ్ల మీద లేచి నిలబడలేని దేశం. కాలు కదిపి అడుగు వేయలేని దేశం’ అని విజ్ఞులు అన్నారు. అరైవె కి పైగా జాతుల తెగలతో కూడిన  ప్రజలు ఉత్తర సూడాన్ పాలకుల వివక్షకు, అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా ‘సూడాన్ ప్రజా విముక్తి ఉద్యమం’ (ఎస్‌పీఎల్‌ఎమ్)గా ఐక్యమయ్యారు. వారిని ఒక జాతిగా ఐక్యం చేయాల్సిన దేశాధ్యక్షుడు సల్వా కిర్ ఆ బాధ్యతను స్వీకరించలేదు. న్యూర్ తెగకు చెందిన మచార్ అనుకూల సైనికాధికారులు ఆయనతో చేయి కలిపారు. డింకా తెగకు చెందిన సల్వా కీర్‌ను గద్దె దించేవరకు పోరాటం సాగుతుందని మచార్ సైతం హెచ్చరించారు.

అమెరికా వంటి సంపన్న దేశాలు అక్కడి చమురు కోసం అంతర్యుద్ధంలో... పశువులనే అమూల్య సంపదగా ఎంచి బతికే పశుపాలక తెగల చేతులకు అత్యాధునిక మారణాయుధాలను అందించారే గానీ దక్షిణ సూడాన్ మనుగడకు, ప్రజాస్వామ్యానికి పూచీ పడలేదు. అందుకే ఇంచుమించు కోటి జనాభాలో 90 శాతంగా ఉండే డింకా, న్యూర్ తెగల వారు ఒకరి నొకరు తెగ నరక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ మారణ హోమంలో సమిధలవుతున్న అమాయక పౌరులను శరణార్థి శిబిరాలకు తర లించే కృషిలో సైతం ప్రపంచ పెద్దల పత్తా లేదు. ఇరాక్, అఫ్ఘాన్‌ల వంటి యుద్ధాలకు లక్షల సైన్యాన్ని తరలించిన శక్తివంతులు తమ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిం చడంలో తలమునకలవుతున్నారు. ప్రాణాలు తీయడమే ఎరిగిన వారికి ప్రాణాలర్పించైనా ప్రాణాలను నిలపడం తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి ‘అల్పమైన’ బాధ్యతలను నెరవేర్చడానికి మనలాంటి బడుగు దేశాల సైనికులున్నారు. ఇద్దరు జవాన్లను పోగొట్టుకున్న భారత శాంతి దళాలు తెగువ చూపకపోతే కొన్ని వేల నిండు ప్రాణాలు బలై పోయేవని ఐరాస పేర్కొంది.  ఇంతవరకు కనీసం వెయ్యి మంది పౌరులు ఈ మారణకాండలో హతమై ఉంటారని, అంతర్గత నిర్వాసితుల సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అది భావిస్తోంది.

సల్వాకిర్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా ఉన్న ఈయక్ మచార్ సైనిక కుట్రకు పాల్పడటంతో డిసెంబర్ 15 నుంచి దేశ జనాభాలో 90 శాతంగా ఉన్న రెండు ప్రధాన తె గలైన డింకా, న్యూర్ తెగల మధ్య అల్లర్లు చెలరేగాయని అధికారిక కథనం. అయితే ఈ అశాంతి, అస్థిరతలకు సల్వా కిర్ జూలైలో నాంది పలికారు. మచార్‌తో పాటూ ప్రభుత్వం లోని అందర్నీ పదవుల నుంచి తొలగించారు. ఫిబ్రవరిలో వంద మందికిపైగా సైనిక అధికారులను తొలగించే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణ సూడాన్ ఐక్యతకు పునాది తెగల ఐక్యతే. దాన్ని పటిష్టం చేయగలిగితే అత్యంత వెనుకబడిన దేశం అభివృద్ధి చెందడానికి కావలసిన సకల వనరులు  ఉన్నాయి.  దేశం పొడవునా పారే నైలు నదీ జలా లతో పచ్చగా ఉండే దక్షిణ సూడాన్‌లో పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, క్రోమియమ్, జింక్, టంగస్టిన్, మైకా, వెండి, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ సంపదలున్నాయి. దేశంలోని చమురు నిక్షేపాలపై చైనాకు అది సూడాన్‌లో భాగంగా ఉన్నప్పటి నుంచి ఆధిపత్యం ఉంది. అధికారం కోసం కుమ్ములాడుతున్న పక్షాలు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే దేశం జాతి మారణహోమంలోకి, మరో సుదీర్ఘ అంతర్యుద్ధంలోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది.

 అమెరికా దాని మిత్ర దేశాలు, చైనా ప్రస్తుతం అక్కడి ఖనిజ సంపదలను చక్కబెట్టే పనిలో ఉన్నాయి. దక్షిణ సూడాన్ చమురును రవాణా చేసే పైపు లైన్ల వ్యవస్థ ఉత్తరాన ఉన్న సూడాన్‌లోనే ఉంది. ‘అబేయీ’ అనే కీలకమైన చమురు పట్టణం విషయంలో ఆ రెండు దేశాల మధ్య వివాదం, ఘర్షణలు రగులుతున్నాయి. దీంతో ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం మరిన్ని అత్యాధునిక ఆయుధాలను, సాయుధ సంపత్తిని సమకూర్చుకుంది. చైనా దానికి సరికొత్త ఆయుధ సరఫరాదారు. అందుకే  పశు పోషక తెగల మధ్య పశు సంపదకోసం, పచ్చిక మైదానాల కోసం జరిగే సర్వసాధారణమైన సంఘర్షణలు శైశవ ప్రాయంలోని దేశాన్ని కుక్కలు చింపిన విస్తర్ని చేసే ముప్పు దిశకు దిగజారుతున్నాయి. ఒకప్పుడు బ్రిటన్ వలస పాలకులు సూడాన్‌ను మత ప్రాతిపదికపై దక్షిణ, ఉత్తర ప్రాంతాలుగా విభజించి, మతాల  చిచ్చును రగిల్చి పాలించారు.  చివరికి సూడాన్ రెండు ముక్కలు కావడానికి కారణమయ్యారు. నేటి అశాంతికి ప్రపంచ శక్తుల తెర వెనుక రాజకీయాలు కూడా తోడైతే పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.  -పిళ్లా వెంకటేశ్వరరావు
 

>
మరిన్ని వార్తలు