ఇంక పండగే మిగిలింది!

10 Oct, 2015 01:35 IST|Sakshi
ఇంక పండగే మిగిలింది!

 అక్షర తూణీరం
 ఎన్నో మహానగరాలు, అద్భుతమైన కోటలు కట్టిన ఘన చరిత్ర గల దేశం మనది. ఇప్పుడు వేల ఎకరాలని బంగారు పళ్లెంలో పెట్టి సింగపూర్‌కో, జపాన్‌కో అప్పగించి, కట్టిపెట్టండని ప్రాధేయపడుతున్నాం. ఇల్లు అలకగానే పండగ అయిందా?’ -ఏనాడు పుట్టిం దోగాని, నిజంగా గొప్ప సామెత. ఇవ్వాళ్టికీ నిత్యనూత నంగా చలామణీ అవుతోంది. నిన్నమొన్న అమరావతి శంకు స్థాపన కోసం బుల్డోజర్లతో పంటభూముల్ని చదును చేస్తుంటే నాకీ సామెత గుర్తొస్తూనే ఉంది. పత్రికలలో ఏర్పాట్లమెంట్స్ తాలూకు వార్తలు చదువుతుంటే, నాటి రాజసూయం ఏర్పాట్లను తలపిస్తున్నాయి.

బడ్జెట్ సమర్పణకి కూడా చేయనంత కసరత్తు ఆహ్వానాల రూపకల్పనకు చేస్తున్నారు. అమరావతి మహానగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆహ్వానాలే కాదు, సన్మానాలు కూడా ముడతాయట. పట్టుచీరెలు, పట్టు ధోవతులు, పసుపు కుంకుమలు వెండిపళ్లెంలో పెట్టి భూములందించిన రైతులకు సమర్పిస్తారట. వెండిపళ్లెం అచ్చంగా ఇస్తారో లేదో తెలియదు గానీ పట్టువస్త్రాలు మాత్రం గ్యారంటీ. ‘‘అబ్బా! అయితే వేల చీరెలూ, వేల ధోవతులు సీయమ్ పెట్టే సారెకు కావాలే’’ అని ఒక రైతు ఆశ్చర్యపోయాడు. ‘‘పదేళ్లపైగా ఆప్కోలో గుట్టలు గా పడున్నాయి. ఈ దెబ్బతో ఓల్డ్ స్టాక్సన్నీ వదిలి, గోడౌ న్‌లు ఖాళీ అవుతాయ్’’ అన్నాడు పేపర్ నాలెడ్జ్ ఉన్న మరో రైతు. పాత సరుకుని వదిలించడంలో మా చంద్ర బాబు అసాధ్యుడని పెద్దాయన తెగ మురిసిపోయాడు. ‘‘ఏంటో... ఓల్డ్‌స్టాక్ అంటే కొంపదీసి ఈయన ఆ అర్థంలో వాడాడా...’’ అని ఒకరిద్దరు సందేహించారు.

 అరవై ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ వచ్చింది. తర్వాత కాలవలు తవ్వడానికి వందలాది మైళ్ల పొడు గునా కాలవలు తవ్వారు. అందులో చాలా భాగం రైతుల భూములే. ఇష్టంగా, ఐచ్ఛికంగా రైతులు ఇచ్చారు. కాలవలు నేల మీద పారకపోతే ఆకాశంలో పారతాయా అనుకున్నారు. నష్ట పరిహారాలు కూడా గొప్పగా ఏమీ ఇవ్వలేదు. సాగరం వస్తుంది, కరువు తీరిపోతుంది, సన్నబియ్యం తింటామంటూ ఆ రోజుల్లో ‘‘నందికొండ పాటలు’’ జానపదుల నోళ్లలో నానాయి. అప్పుడు కూడా వేలాది ఎకరాలు రైతులు వదులుకు న్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వాలు వాళ్లని పట్టుపీతాంబ రాలతో సన్మానించలేదు. మమ్మల్ని నమ్మి మాకిచ్చారని పదే పదే కృతజ్ఞతలు గుమ్మరించలేదు. ఉభయులూ పౌరధర్మం గానే భావించారు.

 ఇప్పుడీ మహోత్సవానికి ఎన్ని వందల కోట్లు కైంకర్యం చేయనున్నారో తెలియదు. ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. కరువు కాలంలో ఇదంతా అవసరమా అనిపిస్తుంది కొందరికి. కానీ అవసరమే. ఎక్కడా నీటి చుక్క లేదు. పారుతున్న పంట కాలవ లేదు. వీటిని పక్కన పెట్టి, అమరావతి వైభవంలో ప్రజలు మునిగి తేలాలన్నది ఏలినవారి లక్ష్యం. ఎన్నో మహానగరాలు, అద్భుతమైన కోటలు కట్టిన ఘనచరిత్రగల దేశం మనది.

ఇప్పుడు వేల ఎకరాలని బంగారు పళ్లెంలో పెట్టి సింగపూర్‌కో, జపాన్‌కో అప్పగించి, కట్టిపెట్టండని ప్రాధేయపడుతున్నాం. తెరవెనుక బాగోతం సామాన్యు లకు అర్థంకాదు. అంతుపట్టదు. నిజానికి సేకరించిన ఎకరాలే క్యాపిటల్‌కి క్యాపిటల్. మన దగ్గర శంకుస్థాప నకి కొట్టాల్సిన కొబ్బరికాయకు కూడా నిధులు లేవు. అయిదు వేల ఎకరాలు అసలు తేనెపట్టు. చుట్టూ పాతిక వేల ఎకరాలూ పురుగుల తుట్టె. వాళ్లేం చేస్తారంటే, అక్క డ చేరి ఆ ఎకరాల్లో అనేక ఆకర్షణలు పెట్టి, అక్కడి భూమిని అంగుళాల లెక్కన అమ్ముకుని సొమ్ము చేసు కుంటారు. ఓల్డ్‌స్టాక్స్‌ని వదిలించుకోవడంలో అందరూ సమర్థులే.

 

 

 

 

(వ్యాసకర్త శ్రీ రమణ ప్రముఖ కథకుడు)

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు