తొలి తెలుగు సినీ కవి

19 Jun, 2016 23:20 IST|Sakshi
తొలి తెలుగు సినీ కవి

- నేడు కేశవదాసు 140వ జయంతి

‘కనకతార’ నాటకాన్ని అనేక సమాజాలు ప్రదర్శించడమేగాక, 1936లో సరస్వతీ టాకీస్ వారు వెండితెర కెక్కించడం ఆ నాటక ప్రాచుర్యాన్ని తెలియజేస్తుంది.

 

జనన మరణాల దృష్ట్యా యిది కేశవదాసును గుర్తు చేసుకోవలసిన వారం. చందాల కేశవదాసు పేరు ఈ తరానికి తెలియదు. ఆయన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’(1932) చిత్రానికి పాటలు రాసిన కవి అని కానీ, ఈనాటికీ వినిపిస్తున్న ‘బలే మంచి చౌకబేరము...’ ప్రసిద్ధ చలనచిత్ర గీతం ఆయన రాసిందే అని కానీ, పద్య నాటకాలకు విశేషాదరణ వున్న కాలంలో విస్తృతంగా ప్రదర్శింపబడిన ‘కనకతార’ నాటకకర్త ఆయనే అని కానీ చాలామందికి తెలియదు. ఆ మాటకొస్తే ‘తెలుగు సినిమా పాట చరిత్ర’ పరిశోధన గ్రంథంలో ఈ వ్యాసకర్త ప్రకటించే వరకు చందాలకు మొట్ట మొదటి సినీ కవిగా ముద్ర పడలేదు. ఆ తర్వాత వచ్చిన కొన్ని వ్యాసాల్లో కూడా అశ్రద్ధ కారణంగా అవాస్తవాలూ, పొరపాట్లూ చోటు చేసుకొన్నాయి. ఆ నిజానిజాలను వివరిస్తూ ఈ నివాళి!
 

 ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన కేశవదాసు చదువు అంతంత మాత్రమే అయినా, వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. శతకాలు, దండకాలు, మేలుకొలుపులు, జోలపాటలు, దేశభక్తి గీతాలు మొదలైన ప్రక్రియల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకొని పద్యకవిగా, అష్టావధానిగా, నాటక రచయితగా, హరికథా భాగవతారుగా రాణించారు. హరికథలు చెప్పడమే గాక స్వయంగా ‘నాగదాసు చరిత్ర’, ‘విరాట పర్వము’ మొదలైన కథలను రచించారు. నాటకరంగం మీద మక్కువతో ‘కనకతార’, ‘బలిబంధనము’ నాటకాలను రచించి ప్రదర్శింపచేశారు. ‘కనకతార’ జానపద ధోరణిలో రాజ్యాధికారం కోసం సాగిన వీరరసప్రధానమైన నాటకం కాగా, ‘బలిబంధనము’ భాగవతంలోని వామన చరిత్ర ఆధారంగా రాసిన నాటకం. కనకతార ‘టైటిల్’ నాయికా నాయకులకు సంబంధించినది కాకుండా తార, కనకసేనుడు అనే అక్కాతమ్ముళ్లకు సంబంధించినది కావడం విశేషం.

 ‘కనకతార’ నాటకాన్ని అనేక సమాజాలు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించడమేగాక, 1936లో సరస్వతీ టాకీస్ వారు హెచ్.వి.బాబు దర్శకత్వంలో దానిని వెండితెర కెక్కించడం ఆ నాటక ప్రాచుర్యాన్ని తెలియజేస్తుంది. కనకతార సినిమాలో దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ ప్రధాన పాత్రధారులు. ‘కనకతార’ చిత్రం ద్వారా సీనియర్ సముద్రాల సినీ రచయితగా పరిచయమయ్యారు. 1955లో ‘కనకతార’ కొత్త తారాగణంతో మరోసారి సినిమాగా వచ్చింది.
 

 నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు రాసిన ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్నే శ్రీకృష్ణావారు హెచ్.యం.రెడ్డి దర్శకత్వంలో చలనచిత్రంగా రూపొందించారు. సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా చాలావరకు ఆ నాటకాన్ని ప్రదర్శించిన సురభి నాట్యమండలి సభ్యులే! రామకృష్ణమాచార్యులు ‘చిత్ర నళీయం’తో ప్రారంభించిన పద్ధతి ప్రకారం ముందుగా ప్రహ్లాద వచన నాటకాన్ని రచించి దానికి అనుబంధంగా 40 పాటలను సమకూర్చి పద్యాలను మాత్రం పోతన భాగవతం నుండి యథాతథంగా తీసుకొన్నారు. అయితే ధర్మవరం వారి తర్వాత ఆ నాటకం సురభి వారి చేతుల్లోకి వచ్చి ప్రదర్శనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులకు లోనైంది. ఆ దశలో సురభి వారి కోరిక మేరకు కేశవదాసు రచించిన 3 పాటలు ఆ నాటకంలో చేరాయి. ఇవే తర్వాత సినిమాలోకీ వెళ్లాయి.

అవి-

 1.లీలావతి పాత్రధారిణి సురభి కమలాబాయిపై చిత్రీకరించిన-

 పరితాప భారంబు భరియింపతరమా

 కటకటా విధినెట్లు గడువంగ జాలుదు...

 

 2.నారాయణ నామస్మరణం చేస్తూ తండ్రికి కోపం తెప్పిస్తున్న తనయుని లీలావతి మందలించే సందర్భంలో-

 తనయా ఇటులన్ బలుక తగదు...

 

 3.హిరణ్యకశిపుడు తన భార్యను ఇంద్రుడు చెరపట్టాడనే వార్త తెలిసి క్రోధంతో మండిపడే సన్నివేశంలో-

 భీకరంబగు నా ప్రతాపంబునకు

 భీతి లేక యిటు చేసెదవా...

 

 వీటిలో మొదటి పాటను కొందరు తొలితెలుగు సినిమా పాటగా పేర్కొనడం సరికాదు. తొలి తెలుగు చలనచిత్ర గీతం రామకృష్ణమాచార్య రాయగా సినిమాలో మొదటిపాటగా చిత్రీకరించిన- వింతాయెన్, వినన్ సంతస మాయెనుగా... అంటూ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూనే మరణించాడని భ్రమించి ఆ ఆనందంలో దేవేంద్రుని ముందు రంభ పాడిన నృత్యగీతమే!

 ఎటొచ్చీ సినిమా తీసే సమయానికి ధర్మవరం వారు బ్రతికి లేరు గనుక, చందాల వారు సినిమా కోసం రాసినా, అంతకు ముందు సురభి వారికోసం రాసినా సజీవుడైన ఆయనను సంప్రదించి దర్శకుడు పై మూడు పాటలను వినియోగించుకోవడం వల్ల- చందాల కేశవదాసును తొలి సినీకవిగా నిర్ధారించడం జరిగింది!


ఆ రోజుల్లో వృత్తి నాటక సమాజాల కోరికమీద ఇతర కవులు రాసిన ప్రసిద్ధ నాటకాలకు దైతా గోపాలం, పాపట్ల కాంతయ్య, చందాల కేశవదాసు మొదలైన వారు కొన్ని పాటలను రాసేవారు. ఆ క్రమంలో ప్రహ్లాద తర్వాత ముత్తరాజు సుబ్బారావు రచించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకానికి కూడా కేశవదాసు 3 పాటలను సమకూర్చారు. అవి-

 1. బలేమంచి చౌకబేరము...

 2.మునివరా, తుదకిట్లు ననున్‌మోసగింతువా?

 3. కొట్టూ కొట్టండీ కొట్టండీ బుఱ్ఱపగల...

అనేవి. ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాన్ని నిర్మించిన మూడు సంస్థలూ (కాళీ ఫిలింస్-1935), రాజరాజేశ్వరీ ఫిలింస్-1955), సురేష్ మువీస్-1966) ఈ పాటల్ని విడిచిపెట్టలేకపోయాయి. వీటిలో ‘బలేమంచి చౌకబేరము’ అత్యంత ప్రజాదరణను పొందింది. కేశవదాసు పూర్తిగా రచన అందించిన మొదటి చిత్రం ఆరోరా ఫిల్మ్ కార్పొరేషన్ వారి ‘సతీ అనసూయ’ (1935). దాసరి కోటిరత్నం ప్రధాన పాత్ర ధరించిన ఈ చిత్రంలో దాసుగారు 24 పాటలనూ, 14 పద్యాలనూ రాశారు. కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించిన రాధా ఫిలిం కంబైన్‌‌స వారి ‘లంకా దహనం’ (1936) చిత్రానికి కూడా చందాల వారే మాటలూ పాటలూ రాశారట కాని ఆ ప్రింటు యిప్పుడు అలభ్యం!


 ‘కనకతార’ కథ దాసుగారిదే అయినా సినిమా రచయితగా సముద్రాల రాఘవాచార్యుల వారు నియోగింపబడగా నాటకంలోని మూడు పాటల్నీ, రెండు పద్యాలను మాత్రమే సినిమాలో వినియోగించారు. ‘ఏ పాప మెరుగని పాపలకీ చావు...’, ‘దప్పిచే నాలుక తడిపోడిలేక..’ అనే రెండు పద్యాలు ఆనాడు జనం నోళ్లలో నానినవి కాగా- మాండలిక పదజాలంతో రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకొన్నాయి. చందాల కేశవదాసు బహుముఖ ప్రజ్ఞను తెలుసుకోవడానికి పై సమాచారం చాలు! ఆయన యెత్తు పెంచడానికి ఆయన రాయని పాటలనూ, చిత్రరచనలనూ ఆ అమరజీవికి ఆపాదించవలసిన అవసరం లేదు!


- పైడిపాల

 9989106162

 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు