విభజన కాదు... ముందు జలసాధన!

4 Aug, 2013 01:38 IST|Sakshi
విభజన కాదు... ముందు జలసాధన!

రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిర్మించి విద్యుత్ సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు,   ప్రత్యేకించి రాజధాని సమస్యను పరిష్కరించి ఆ తరువాత విభజన ప్రక్రియ చేపట్టి ఉంటే బాగుండేది. అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఓట్లు-సీట్ల రాజకీయంలో భాగంగా తీసుకున్న నిర్ణయం ఇది. జలయజ్ఞంలోని ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమేమీ కాదు.స్వల్పకాలంలో అనితరసాధ్యంగా పెక్కు ప్రాజెక్టులను పూర్తి చేసి జలయజ్ఞం సాధ్యమేనని వైఎస్ రుజువు చేశారు. వైఎస్‌కు సాధ్యమైన పని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడంలేదు? చిత్తశుద్ధి, అన్నదాతపై అనురాగం ఉంటే అసాధ్యమనేది ఏదీ ఉండదని వైఎస్ తన ఆచరణతో మనకు చూపించారు.

రోగమెరిగి చికిత్స చేయడం వైద్యుల పని. రోగాన్ని గుర్తించి కూడా వైద్యుడే రోగిని చంపడం ఎంతటి దారుణమో, నేడు రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతు న్న తంతు కూడా అంతే దారు ణంగా ఉంది. సాగునీటి వనరుల కేటాయింపుల్లో అసమానతలు, పంపిణీలో అవకతవకలు, సేద్యపు నీటి రంగంలో వివిధ ప్రాంతాల్లో కనబరచిన నిర్లక్ష్యం వలన ప్రాంతీయ ఉద్యమాలు బలపడ్డాయనేది తెలిసిందే. రెండు మహానదులు మన రాష్ట్రంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. దాదాపు 5 వేల టీఎంసీల నీరు మనకు వివిధ నదుల ద్వారా లభ్యమవుతున్నది. మేజర్, మీడియం, మైనర్ నీటి పారుదల పథకాలు నేటికీ రాష్ట్రంలో 2,500 టీఎంసీల జలాలను వినియోగించుకుంటున్నాయి. గోదావరి నదిలో మన రాష్ట్రానికి కేటాయించిన 700 టీఎంసీల నికర జలా లను నేటికీ మనం పరిపూర్ణంగా వినియోగించుకోలేకపోతున్నాం. వేల టీఎంసీల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా ఏటేటా సముద్రంలో వృథాగా కలిసిపోవడం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తెలంగాణ, రాయల సీమ, ఉత్తరకోస్తాలో గణనీయంగా ఉన్న మెట్ట ప్రాంతాల రైతులు కేవలం వరుణుడి కరుణపై ఆధారపడి సేద్యం చేయవలసి రావడం పాలకుల నిర్లక్ష్యం ఫలితమే.
 
 అంతే కాదు! దిగువ పరీవాహక ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్, ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టల నుంచి న్యాయబద్ధంగా కేటాయించిన నీటిని పొందడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం, ఇంకా ఎగువన అనేక ఎత్తిపోతల పథకాల పుణ్యమా అని మన రాష్ట్రానికి నీరు రావడంలో అనేక అవాంతరాలు ఎదురతువున్నాయి. మరోవైపు ఆలమట్టి డ్యామ్ నిర్మాణం ద్వారా నీటి విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. కృష్ణా డెల్టాలో గత రెండేళ్లుగా వరినాట్లు వేయడంలో విపరీతమైన జాప్యం, కృష్ణా డెల్టా రైతులను, ఎగువన సాగర్ రైతులను వెంటాడుతూనే ఉంది. ఆలమట్టి ఆనకట్ట ఎత్తు మరో ఐదు మీటర్లు పెంచాలని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రకటించడం, రాష్ట్ర సేద్యపునీటి రంగానికి ఎదురుకానున్న గడ్డు కాలాన్ని సూచిస్తున్నది. మరోవైపు తుంగభద్ర ఎగువన ఎగువ తుంగ ప్రాజెక్టుకు మరో 10 ఎత్తిపోతల పథకాలకు దాదాపు 20 టీఎంసీల జలాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఫలితంగా కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి, కొప్పల్  జిల్లా రైతులు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా, రాయచూర్ కెనాల్ ద్వారా తుంగభద్ర జలాలు పొందలేని పరిస్థితి నెలకొ న్నది.
 
 అందుకు ప్రత్యామ్నాయంగా తుంగభద్ర ఎగువన ఐదు సమాంతర జలాశయాలను నిర్మించాలని మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సమావేశమై ఇటీవల తాజా నిర్ణయం తీసుకున్నారు.  గదగ్ ఎగువన మూడు రిజర్వాయర్లు నిర్మిస్తే దిగువన మహబూబ్‌నగర్, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర నీరు అందే అవకాశం ఉండదు. అప్పుడు తుంగభద్ర ఎగువకాలువ, తుంగభద్ర దిగువకాలువ, కేసీ కెనాల్, రాజోలుబండ పరీవాహక ప్రాంతాలకు చెందిన రైతాంగం ప్రయోజనాలకు కలిగే దుష్పలితాలు చెప్పనలవి కావు. ఆలమట్టి ఆనకట్ట ఎత్తును నిజంగానే పెంచితే నల్ల గొండ, ఖమ్మం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాలకు ఎంతటి కీడు జరుగుతుందో ఊహిస్తేనే భయమేస్తుంది. ఈ పరిణామాలను నివారించడానికే వైఎస్ 83 సేద్యపునీటి ప్రాజెక్టులతో ‘జలయజ్ఞం’ పథకాన్ని చేపట్టారు.
 
 నేడు రాయల తెలంగాణ పేర బహుళ ప్రచారం చేసి రాయలసీమ అస్తిత్వాన్ని ఛిద్రం చేయాలని చూసిన వారు ఒక అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో గత 60 ఏళ్లలో సాగునీటి రంగానికి విశేష కృషి చేసిన నాయకులు ఒకరు నీలం సంజీవరెడ్డి, మరొకరు వైఎస్ రాజశేఖరరెడ్డి. నేడు రాష్ట్రంలోని దాదాపు 70 శాతం ప్రాజెక్టులు వారి చలువే. కరువు జిల్లాలైన అనంతపురం, కడప నుంచి ఎదిగివచ్చిన నాయకులు కావడం వల్లే వారు ఈ పని చేయగలి గారు. సమగ్ర రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీలు సంయుక్తంగా కలిసి పోరాడాల్సిన సమయమిది. వైఎస్ చేపట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంలో మన రాజకీయపార్టీల వైఫల్యం తక్కువేమీ కాదు. కమ్యూనిస్టు నాయకుడు ఈశ్వరరె డ్డి పేరిట ప్రారంభించిన గండికోట ప్రాజెక్టు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని వర్షాధారిత ప్రాంతాలలో ఆయన చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు, మరో కమ్యూనిస్టు నాయకుడు పూలసుబ్బయ్య పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టులను సాకారం చేయడానికి సీపీఐ జరిపిన పోరాటాలంటూ ఏమీలేవు. వైఎస్ మరణంతో ఆ ప్రాజెక్టుల పనులు కుంటుపడిపోయాయి. అదే వరుసలో గోదావరిలో ఏడు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని వైఎస్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
 
 ఇందులో ఉత్తరాంధ్ర సుజల-స్రవంతితోపాటు పోల వరం, దుమ్మగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, కం తాలపల్లి ప్రాజెక్టు, ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ తీసుకున్న శ్రద్ధ అసమానమైనది. రైతన్న హితవు కోరి ఈ ప్రాజెక్టులను వైఎస్ రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టుల ఫలితాలు దాదాపు 60 శాతం మించి తెలంగాణ ప్రాంతాల ప్రయోజనాలను నెరవేర్చేవే. జలయజ్ఞంలోని పులిచింతల మొదలుకొని అనేక ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన మూలనబడ్డాయి.
 
 ఈ ప్రాజెక్టులు ఆచరణ రూపం తీసుకోవడానికి వైఎస్ మర ణం తరువాత ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళనలు చేపట్టిన దాఖలాలు లేవు. తెలంగాణ కోసమే చేపట్టిన ప్రాజెక్టుల సాధనకు టీఆర్‌ఎస్ నాయ కత్వం ఏనాడూ ప్రయత్నించిన పాపానపోలేదు. 33 మంది కాంగ్రెస్ ఎంపీల మద్దతు పొందిన కేంద్ర ప్రభుత్వం కూడా నీటి వనరుల సద్వినియోగానికి చిత్తశుద్ధితో ఏనాడూ ప్రయత్నించలేదు. తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలే కాక మనకు సహజసిద్ధంగా లభించే జలవనరుల వినియోగం సైతం గత నాలుగేళ్లుగా క్షమార్హం కాని నిర్లక్ష్యానికి గురయ్యాయి. ‘విభజన’ అంచున నిలిచి ఉన్న వర్తమాన సన్నివేశంలో ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీటి ప్రాజెక్టులు సాధించుకోలేని దుస్థితిలో ఈ రోజున తెలుగు వారున్నారు. మరోవైపు కృష్ణానదిలో మన వాటా కింద 1,000 టీఎంపీల నీటిని ఎలా పొందాలనే అంశంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌తో శక్తిమంతమైన గొంతుకతో సమరశీల పోరాటం జరపాల్సిన ఆవశ్యకత మనముందున్నది.
 
 వైఎస్ అకాల మరణం, ప్రాజెక్టులు సాధించుకోవాల్సిన మన బాధ్యతను నిరంతరాయంగా గుర్తు చేస్తు న్నది. చేస్తూనే ఉంటుంది. కృష్ణా, తుంగభద్రల దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణాబ్యారేజ్ ఆయకట్టు రైతులు... తెలంగాణవారు కావచ్చు, రాయలసీమవారు కావచ్చు, కోస్తాంధ్రవారు కావచ్చు, వారెవరైనా జలసా దనకు ఇప్పు డు ఐక్యత ఒక్కటే మిగిలి ఉన్న ఏకైక మార్గం.
 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల సాకారా నికిగాను ఏకాభిప్రాయ సాధనకు, అంతిమంగా తెలుగు ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా ‘విభజన’ రేఖలపై కేంద్రం దృష్టి సారించడం ఏ విధంగా సమంజసమో అంతుపట్టదు. బండి వెనుక ఎద్దులు కట్టి బండిని తోలిన చందంగా నేడు అనాలోచితంగా విభజన ప్రక్రియకు తెరలేపారు. విభజన ఫలితంగా ఏర్పడబోయే దుష్ర్పభావాలను బేరీజు వేయడంలో యూపీఏ సర్కార్ ఘోరంగా విఫలమైంది.


 రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిర్మించి విద్యుత్ సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు,  ప్రత్యేకించి రాజధాని సమస్యను పరిష్కరించి ఆ తరువాత విభజన ప్రక్రియ చేపట్టి ఉంటే బాగుండేది. అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఓట్లు-సీట్ల రాజకీయంలో భాగంగా తీసుకున్న నిర్ణయం ఇది. జలయజ్ఞంలోని ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమేమీ కాదు. హిమాలయాలను కరిగించడం లేదా బంగాళాఖాతం నీటిని అరేబియా సముద్రంలోకి తరలించడం వంటి కఠినమైన సమస్యేమీ కాదు అది.
 
 రూ.60 వేల కోట్లు ఐదేళ్లలో వెచ్చించి, స్వల్ప కాలంలో అనితరసాధ్యంగా పెక్కు ప్రాజెక్టులను పూర్తి చేసి జలయజ్ఞం సాధ్యమేనని వైఎస్ రుజువు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే, నాలుగేళ్ల వ్యవధిలో జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని రాష్ట్ర రైతాంగానికి వాగ్దానం చేశారు. జలయజ్ఞం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలైతే కోస్తాలో 88 శాతం, తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 32 శాతం సాగునీటి అవసరాలు తీరేవి. వైఎస్‌కు సాధ్యమైన పని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడం లేదు? చిత్తశుద్ధి, అన్నదాతపై అనురాగం ఉంటే అసాధ్యమనేది ఏదీ ఉండదని వైఎస్ తన ఆచరణతో మనకు చూపించారు. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. అప్పుడే రాష్ర్ట రైతాంగానికి సాగునీటి కొరత నుంచి విముక్తి!    

ఇమామ్

ఎడిటర్,'కదలిక'
 

మరిన్ని వార్తలు