సాహితీ దురంధరుడు రామచంద్ర

12 Oct, 2015 01:15 IST|Sakshi

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన స్వాతంత్య్ర సమర యోధుడాయన. 1947కి పూర్వం నలభైయేండ్ల తన స్వీయ అనుభవాలను తెలుపుతూ రాసిన ‘హంపీ నుండి హరప్పాదాకా’ అనే గ్రంథం పేరు వినగానే సాహితీ ప్రియులకు గుర్తుకు వచ్చే తెలుగు భాషా సేవకుడు డా. తిరుమల రామచంద్ర. 1913 జూన్ 13న అనంతపురం జిల్లాలో జాన కమ్మ, శేషాచార్యులకు జన్మించారు తిరుమల రామచంద్ర. గాంధీజీ పిలుపు మేరకు స్వాత్యంత్య్రోద్యమంలో పాల్గొని ఎన్నోసార్లు జైలు శిక్షను అనుభవించాడు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం అయిదో అంతస్తులో ఉన్న బొమ్మలకు త్రివర్ణ పతాకం కట్టి ఎగరవేసి జైలుపాలయ్యారు. తిరుపతిలో మొదటి సత్యాగ్రహిగా సంవత్సర కాలంపాటు జైలుకెళ్లి తిరిగి కమ్యూనిస్టుగా బయటకు వచ్చారు. తర్వాత ఆయన నడక తెలుగు సాహిత్యంవైపు మళ్లింది.
 
  తెలుగు భాషతోపాటు సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఆంగ్లభాషలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదిం చారు. తెలుగు ప్రాకృత భాషల మధ్య పదాలలో ఉండే సమన్వయాన్ని వివరిస్తూ గాధాసప్తశతిలో తెలుగుపదాలు, ప్రాకృత వాజ్మయంలో రామకథ వంటి రచనల ద్వారా తెలుగువారికి ప్రాకృత మాధుర్యాన్ని రుచి చూపారు. తెలుగులో ఎన్నో ఆత్మకథలు, స్వీయ చరిత్రలు వచ్చినప్పటికీ, తన స్వీయ అనుభవాలను తెలుపుతూ రాసిన ‘హంపీ నుండి హరప్పాదాకా’ అనే గ్రంథం ఎంతో విలక్షణమైంది. నవలకన్నా వేగంగా, ఆసక్తిభరితంగా సాగే స్వీయ చరిత్రాత్మక కథనం ఇది.
 
 మనిషి జీవితంలో లిపి పుట్టుక, దాని ప్రాధాన్యత, పరిణామాల ను గురించి తెలుపుతూ ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు’ పేరుతో గ్రంథస్తం చేశారు. తెలుగు భాషా నుడికారాన్ని, పదబంధాలను గూర్చి వివరిస్తూ నుడి-నానుడి పేరుతో వ్యాస సంకలనం చేశారు.  వివిధ పత్రికల్లో వచ్చిన స్వీయరచనల సంకలనం ‘బృహదారణ్యకం’, భారతి పత్రికలో రాసిన రచనలు కలిపి ‘సాహితీ సుగతుని స్వగతం’ వంటి వ్యాస సంకలా న్ని ప్రచురించారు. మహా మేధావుల జీవితాల్లోని వెలుగు- చీకట్లను తెలుపుతూ మరుపురాని మనిషి వంటి శీర్షికలతో ఆయన నిర్వహించిన ఇంటర్వ్యూలు నేటికీ తెలుగు సాహిత్యంలో ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉన్నాయి. కొన్ని వందలకు పైగా పుస్తకాలకు పీఠికలు, వేల పుస్తకాలకు సమీక్షలు రాశారు. స్వాతంత్య్రానికి, సాహి త్యానికి యావజ్జీవితాన్ని అర్పించిన, తిరుమల రామచంద్ర 1997 అక్టోబర్ 12న పరమపదించారు.
 -    (నేడు తిరుమల రామచంద్ర 21వ వర్థంతి)
 సి. శివారెడ్డి, సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప

మరిన్ని వార్తలు