వాక్ స్వాతంత్య్రానికి ‘చంద్ర’గ్రహణం

30 Sep, 2014 23:31 IST|Sakshi
వాక్ స్వాతంత్య్రానికి ‘చంద్ర’గ్రహణం

మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదన్నారు. సరిగ్గా వారానికి హక్కుల గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదని  తిరుపతి సభను అడ్డుకున్నారు. రాజ్యహింస, నిర్బంధం గత పాలనకన్నా అధికంగా ఉండబోతున్నాయనడానికి ఇదొక నిదర్శనం.
 
పరస్పరం మాటల కత్తులు దూసుకునే రెండు రాష్ట్రాల చంద్రు లిద్దరూ కలిసి ప్రత్యామ్నాయ గొంతును నొక్కేశారు. ప్రత్యా మ్నాయ రాజకీయ వేదిక తలపెట్టిన సభను అడ్డుకొని హైదరా బాద్ నడిబొడ్డున భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. రెండు రాష్ట్రాల్లోనూ అర్ధరాత్రి, తెల్లవారు జామున ప్రయాణిస్తు న్న వారిని దారి కాచి అడ్డుకొని సభా సమ యం అయిపోయేదాకా నిర్బంధించారు. హైదరాబాద్ సభ ప్రత్యామ్నాయ రాజకీ యాలుగా ముందుకొచ్చిన నక్సలైట్ రాజకీ యాల గురించి మాట్లాడాలనుకుంది. మావోయిస్టు ఎజెండా అమలుచేస్తానన్న కేసీఆర్ అది మావోయిస్టుల సభ అని చెప్పి బలప్రయోగంతో అడ్డుకున్నాడు. మావోయిస్టు ఎజెండా అమ లుచేస్తానన్న ముఖ్యమంత్రి ఆ ఎజెండా ఏమిటో చర్చించే సభను జరగనివ్వాల్సింది కదా అన్న వాళ్లకు సమాధానంగా.. మేము అమలు చేస్తున్నది మావోయిస్టు ఎజెండానే, సభను మాత్రం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఆడ్డుకోవాల్సివచ్చిం దని ఒక తెలంగాణ మంత్రి గడుసుగా జవాబిచ్చారు. పోరాడి సాధించిన స్వయం పాలనలో ఉద్యమ విలువలూ, ఫెడరల్ స్ఫూర్తి తొందరగానే మారిపోయాయి. స్పీడ్ యుగం కదా, మార్పులూ వేగవంతమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆశించేది పెద్దగా ఏమీ ఉండదు.

సరిగ్గా వారానికి హక్కుల గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదని పోలీసులు తిరుపతి సభను అడ్డుకున్నారు. తిరుపతి సభ మాట్లాడాలనుకున్నది ప్రత్యామ్నాయ రాజకీయాల గురిం చి కాదు. రాజ్యాంగం గురించి. ఆ రాజ్యాంగం ద్వారా భారత ప్రజలు తమకు తాము దఖలు పరచుకున్న హక్కుల గురించి. నిర్దిష్టంగా ఇప్పటి పరిస్థితిలో రాజ్యాంగ విరుద్ధమైన ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి మాట్లాడాలనుకున్నది. అది గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసులను చంపటం అన్యాయం అనబోయింది. ప్రజాసంఘాలు, మేధావులు కలిసి ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతి రేక కమిటీగా ఏర్పడి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో బీడీ శర్మ, బొజ్జా తారకం, చుక్కా రామయ్య, ఘంటా చక్రపాణి, ఊసా వంటి భిన్న రాజకీయ విశ్వాసాలున్న మేధావులు పాల్గొ న్నారు. వీరంతా భారత ప్రభుత్వం సొంత ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తున్నారు.

తిరుపతి సభలోనూ పౌర హక్కుల సంఘంతోపాటు ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు డా॥విజయ్ కుమార్ వంటి వాళ్లు వక్తలుగా ఉన్నారు. అయినా అది మావోయిస్టుల సభ అని, వాళ్లకు మీరు హాలు ఎట్లిస్తారని పోలీసులు సభా వేదిక కోసం హాలు అద్దెకిచ్చిన వారిపై కేకలేశారు. నిజానికి హైదరాబాద్ సభ భగ్నం చేసిన తర్వాత కూడా సభ జరుగుతుందా లేదా అని ఏ మాత్రం సంశయం లేకుండా ముందు అనుకున్న తేదీకే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవడానికి కారణం ఇది ఏ రాజ కీయాల గురించీ మాట్లాడాలనుకున్న సభ కాకపోవడమే. అదే విషయం పోలీసులతో చెబితే అంతా ఒకటేలెండి, మాకు పై నుండి ఆదేశాలున్నాయి అన్నారట.

ప్రశ్నలంటే చంద్రబాబుకు గిట్టవు. ప్రశ్నించే వారిపై తోడే ళ్లను, పులులను ఉసిగొలిపే చరిత్ర ఆయనది. సభకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసుల తదుపరి దౌర్జన్యం తిరుపతి ప్రజా సంఘాల వాళ్లకు తెలుసు గనక సభను రద్దు చేసుకుంటున్న ట్లుగా ప్రకటించారు. నాతో సహా బయటి ప్రాంతాల నుంచి వచ్చే వక్తలకు ప్రయాణం మానుకొమ్మని చెప్పారు. అయినా అనంతపురంలో ప్రొఫెసర్ శేషయ్యను, విజయ్, హరినాథ్‌లను గృహనిర్బంధం చేశారు. తిరుపతి సభ గురించే తెలియని విర సం కవి అరసవెల్లి కృష్ణను ముందురోజు సాయంకాలం నుండే నిర్బంధించారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారని అడిగిన పౌర హక్కుల సంఘం ఆంజనేయులుని ఇంటికెళ్లి అరెస్టు చేశా రు. బాబు హయాంలో రాజ్యహింస, నిర్బంధం గత పాలన కన్నా అధికంగా ఉండబోతున్నాయని నిరూపణ అయింది.

ఎవరైనా తిరుపతి సభను భగ్నం చేయడం వెనక అలిపిరి తీర్పును కలిపి చూడవచ్చు. అయితే సరిగ్గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో హక్కులను హరించే   సంఘటనలు జరుగుతున్నప్పుడే ఆదివారం వడోదరలో మతకలహాలు మొదలయ్యాయి. కానీ మీడియాను మేనేజ్ చేయవచ్చుననుకున్నారేమో.. అక్కడ ఇంట ర్నెట్ కనెక్షన్లు నిలిపివేశారు. ఇద్దరిదీ ఒకే సంస్కృతి. ఒకే సామ్రా జ్యవాద మార్కెట్ చక్రాలపై నడుస్తున్న ప్రభుత్వాలు భిన్న రాజ కీయాభిప్రాయాల్ని సహించే పరిస్థితి ఉండదు. జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యానికి హెచ్చరికల వంటివి. భిన్న రాజకీయ విశ్వాసాలున్న వారు, దేశంలో భిన్నత్వాన్ని పరిరక్షిం చడానికి, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఐక్యం కావాల్సిన సమయం ముంచుకొచ్చింది.

 (వ్యాసకర్త విరసం నాయకురాలు)  -   వరలక్ష్మి
 
 

మరిన్ని వార్తలు