జనంపై గ్యాస్ ‘బండ’!

2 Jan, 2014 23:47 IST|Sakshi

దేనికైనా సమయమూ, సందర్భమూ ఉండాలంటారు. యూపీఏ ప్రభుత్వానికి ఆ ఔచిత్యం కూడా లోపించింది. గత ఏడాది ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అలసి సొలసి... కనీసం భవిష్యత్తు అయినా బాగుండాలని అందరూ ఆకాంక్షించే నూతన సంవత్సరాగమన వేళ వంటగ్యాస్ ధరను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్యుడి పేరు చెప్పుకుని అధికారంలోకొచ్చిన కేంద్ర సర్కారు సబ్సిడీ సిలెండరు, సబ్సిడీయేతర సిలెండరు అంటూ రెండు రకాలను సృష్టించి వాటికి చెరో రకం ధరనూ అమల్లోకి తెచ్చి...వాటిని క్రమబద్ధంగా పెంచుతూ జన జీవితాలతో ఆటలాడుకోవడం మొదలుపెట్టి చాన్నాళ్లయింది. నొప్పి తెలియకుండా చావబాదడానికి ఎంచుకున్న ఈ మార్గంలో సామాన్య వినియోగదారులు దేని ధర ఎంత పెరిగిందో, తమ జేబులు ఇకపై ఏమేరకు ఖాళీ కాబోతున్నాయో తెలుసుకోలేక అయోమయంలో పడతారని... తీరా గ్యాస్ బండ ఇంటికొచ్చి తలుపు తట్టేవేళకు అంతా అర్ధమై చ చ్చినట్టు చెల్లిస్తారని ఏలినవారి అంచనా. ఇప్పుడు సబ్సిడీయేతర సిలిండరు ధర ఒకేసారి రూ. 215 మేర పెరిగింది. అంటే, ఇంతవరకూ రూ. 1,112.50 ఉన్న సిలెండరును ఇకపై రూ. 1,327.50 పెట్టి కొనుక్కోవాలన్న మాట! సబ్సిడీ సిలిండరు ధరను రూ. 10 పెంచారు. గత జూన్ వరకూ సబ్సిడీ సిలిండర్లపై పరిమితి ఉండేది కాదు గనుక సబ్సిడీయేతర సిలిండరు ధర ఎంత పెరిగినా ఎవరికీ పట్టేది కాదు. అటు తర్వాత నగదు బదిలీ పథకాన్ని అమల్లోకి తెచ్చి సబ్సిడీ సిలిండర్లను ఏడాది కాలంలో తొమ్మిది మాత్రమే ఇస్తామని ప్రకటించాక ‘గ్యాస్ మంట’ అందరినీ తాకడం మొదలైంది. పదో సిలిండరుతో మొదలై ఇక ఏడాదికాలంలో ఎన్నయితే అన్నీ దాదాపు మూడురెట్ల ధర చెల్లించి కొనాల్సిందేనని చెప్పడంవల్ల మధ్యతరగతి, పేదవర్గాల ప్రజలు అల్లల్లాడుతున్నారు.
 
 వాస్తవానికి పదో సిలిండరునుంచి మాత్రమే సబ్సిడీయేతర ధర వర్తిస్తుందని చెప్పడం అర్ధ సత్యం మాత్రమే. ఎంపికచేసిన కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డున్న వారికే నగదు బదిలీ పథకం వర్తింపజేస్తామని, సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఆధార్ కార్డు కోసం వివరాలు అందించినా ఆ కార్డులు రానివారున్నారు. అలాగే, అసలు నమోదే చేయించుకోలేనివారున్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించలేని అశక్తతలో ఉన్నవారున్నారు. ఆధార్ కార్డు లేని ఎల్‌పీజీ కనెక్షన్లను బోగస్ అని నిర్ధారించడానికి, సబ్సిడీ ఎగ్గొట్టడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 28.29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లుండగా అందులో 9.03 లక్షల మందికి సబ్సిడీ వర్తించడంలేదు. ఇలాంటివారంతా ఏ క్యాటగిరీలతో సంబంధం లేకుండా ఇప్పుడు అధిక మొత్తం చెల్లించి సిలిండర్లు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక ఆధార్ కార్డు ఉన్నా పదో సిలిండరును అత్యధిక ధర చెల్లించి తీసుకోవడం చాలామందికి కష్టమవుతున్నది. ఒక్కసారి అంత మొత్తం ఇవ్వడం అరకొర వేతనాలపైనా, జీతాలపైనా ఆధారపడే కుటుంబాలకు ఎంత కష్టమో పాలకులకు అర్ధం కావడం లేదు.
 
  నెలకు సంపాదించే మొత్తంలో దాదాపు 20 శాతం ఒక్క సిలిండరుకే ఖర్చయిపోతుంటే ఆ కుటుంబాలు ఇక ఏం వండుకోవాలి? ఏం తినాలి? పోనీ, ఏదోవిధంగా అంత సొమ్ము చెల్లించి సిలిండరు సుకుంటున్నవారికి వెనువెంటనే ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ కావడంలేదు. తీసుకున్న ఎన్నో నెలలకు డబ్బులు వస్తున్నవారు కొందరైతే, ఎంతకాలమైనా రానివారు కూడా ఉంటున్నారు. అసలు సిలిండరు తీసుకోనివారికి సైతం ‘మీ ఖాతాలోకి సబ్సిడీ సొమ్ము బదిలీ అయింద’ంటూ ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. ఇది సరిగాలేదని అర్ధమై ఆధార్ గడువును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్నది. ఇంత నాసిరకంగా, ఇంత అస్తవ్యస్థంగా అమలవుతున్న నగదు బదిలీ పథకాన్ని చూపించి, చిత్తమొచ్చినట్టు ధరలు పెంచుకుంటూ పోవడం ఆశ్చర్యకలిగిస్తుంది. వాణిజ్యావసరాల కోసం వినియోగించే సిలిండరు ధర రూ. 1882.50 ఒక్కసారిగా రూ. 2,268కి పెరిగింది. ఈ భారం కూడా అంతిమంగా సాధారణ ప్రజానీకంపైనే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.  
 
  దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. మన రాష్ట్రంలో ఈ సంఖ్య కోటి 60 లక్షలుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 55 శాతం కుటుంబాలు ఏడాదికి తొమ్మిది సిలిండర్లను మించి వినియోగిస్తాయని నిపుణుల అంచనా. ఇలా చూస్తే  ప్రజలపై ఎన్నివందల కోట్ల అదనపు భారం పడిందో అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం నిర్ణీత కాలవ్యవధిలో ప్రజలపై మోపే భారంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్ రూపంలో అదనంగా వడ్డిస్తోంది. ఇదంతా సామాన్యులకు తడిసిమోపెడవుతున్నది. సామాన్యులెదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా భారం పడిన సందర్భంలో తానే కాపుగాశారు. కేంద్రం సిలిండర్ ధరను రూ. 50 పెంచినప్పుడు ఆ పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరిస్తుందని ప్రకటించిన పెద్ద మనసు ఆయనది. ఆ పెంపును రూ. 25కు తగ్గించాక కూడా ఆయన దాన్ని కొనసాగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆ సబ్సిడీని ఎత్తేయడమే కాదు...అదనంగా వ్యాట్ భారం మోపింది. వంటగ్యాస్, ఇతర పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచే ప్రక్రియలో పారదర్శకతకు కాస్తయినా చోటివ్వాలని పాలకులకు తోచడంలేదు. చమురు సంస్థలను ముందుకు తోసి సాగిస్తున్న ఈ తతంగంలో పైకి కనబడని కంతలు చాలా ఉన్నాయి. సుంకాల పేరుమీదా, పన్నులపేరుమీదా అటు కేంద్రమూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలూ నిలువుదోపిడీ చేస్తూ... కేవలం సబ్సిడీల కారణంగానే చమురు కంపెనీలకు నష్టం వచ్చిపడిపోతున్నట్టు నాటకాలాడుతున్నాయి. ఇలాంటి కపటనాటకాలకు ప్రభుత్వాలు ఇక స్వస్తి చెప్పి పెంచిన భారాన్ని వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రజాగ్రహాన్ని అవి చవిచూడక తప్పదు.
 

మరిన్ని వార్తలు