గిడుగు నిజంగా పిడుగే!

28 Aug, 2015 00:33 IST|Sakshi
గిడుగు నిజంగా పిడుగే!

జీవితమంటే చాలా మందికి ఆరాటం. చాలా కొద్ది మందికే పోరాటం! ఆ పోరాటం కూడా బతుకుదె రువు కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో కానే కాదు - పుట్టి పెరిగిన సమాజానికి ఏ మేలు ఎలా చేయాల న్నదే ఆ పోరాటం వెనుక ఆరాటం! ఆయన ఆరాట మంతా ఆంధ్ర ప్రజల కోసం, వాళ్ల భాష ఎలా ఉం డాలన్న ఆలోచనతో వాడుక భాషకు పట్టం కట్టడం కోసమే! అందుకే జీవితాంతం గిడుగు పిడుగులా విజృంభించాడు.

1863, ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో శ్రీము ఖలింగ క్షేత్రానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న పర్వ తాలపేట గ్రామంలో వీరరాజు, వెంకాయమ్మ దంప తులకు జన్మించారు గిడుగు వేంకటరామమూర్తి. విజయనగరం మహారాజా కళాశాలలో లోయర్ ఫోర్త్‌లో చేరారు. లోయర్ ఫోర్త్, అప్పర్ ఫిఫ్త్ మెట్రి క్యులేషన్ వరకు అక్కడే చదివారు. తండ్రి చనిపోవ డంతో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణుడు కాగానే సంపా దన కోసం ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. పెళ్లయి ఉద్యోగం చేస్తున్నా, కష్టపడి ప్రైవేటుగా చదివి, ఇం టర్ పాసయ్యారు. తర్వాత 1890లో గిడుగు బీఏ చరిత్ర విభాగంలో మొత్తం యూనివర్సిటీలో రెండో రాంక్‌తో పాసై ఉపాధ్యాయుడు కాస్తా లెక్చరయ్యా రు. పర్లాకిమిడి రాజా వారి పాఠశాల కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేసుకుని లెక్చ రర్ అయ్యారు. జీవన పర్యంతం ఆయ న మూఢనమ్మకాలను, దురాచారాల్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. ఎవరూ వెళ్లకపోతే హరిజన పాఠశాలలకు స్వ యంగా పాఠాలు చెప్పేవారు. గిరిజన సాహిత్యాన్ని మొదటిసారిగా సేకరిం చిన ఘనత గిడుగుదే. సవరలకు నిఘంటువులను, మాన్యువల్‌ని రాశారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిడుగు మొట్టమొదటి భాషా శాస్త్రవేత్త. మొదట్లో వ్యావహారిక భాషావా దాన్ని గురజాడ, ఏట్స్, శ్రీనివాసయ్యంగార్ లాంటి వాళ్లతో కలసి చేశారు. గురజాడ మరణించిన తర్వా త దాదాపు పాతికేళ్లు ఒంటరి పోరాటం చేశారు. ఆ రోజుల్లో ఆయన కుమారుడు సీతాపతే ఆయనకి అం డగా నిలిచాడు. వ్యావహారిక భాషలోనే గ్రంథ రచ న, బోధనా భాషగా కూడా వ్యావహారిక భాషే ఉం డాలని ఉద్యమ రీతిలో ఆయన సాగిపోతున్నప్పుడు రాజమండ్రిలో ఓ సభలో గ్రాంథికవాదు లు బాగా గొడవచేశారట. ‘‘మీరెంతగా గోల చేసినా నాకు వినిపించదు. నేను చెప్పదలచుకున్నది చెప్పకమానను’’ అన్నారట కరాఖండిగా. తొలినుంచీ పర్లాకిమిడి రాజాతో సత్సంబంధాలు న్న గిడుగు- పర్లాకిమిడితోబాటు మరో వంద గ్రామాల్ని కొత్తగా ఏర్పడే ఒడిశా రాష్ట్రంలో కలపాలని ప్రయత్నిస్తున్న రాజా చర్యలను వ్యతిరేకించారు.

దీంతో  గిడుగు ఆయనకు శత్రువ య్యారు. గిడుగును రాజా నానా విధాలా హింసించ సాగాడు. అయినా గిడుగు పట్టువిడవలేదు. న్యాయ పరంగా కూడా రాజాతో పోరాడాడు. ఆఖరికి పర్లా కిమిడి ఒడిశాలో కలవకుండా కాపాడలేకపోయాడు. మహేంద్ర తనయ నదికి ఇవతలున్న గ్రామాలు కొన్నింటిని మాత్రం కొత్త రాష్ట్రంలో కలవకుండా కాపాడగలిగాడు. అంతకుముందు కంబైన్డ్ మద్రాస్ స్టేట్‌లో రెండో పౌరులుగా ఉన్న ఆంధ్రులు, మళ్లీ ఒడిశాలో కలసి ద్వితీయస్థాయి పౌరులుగానే ఉం డాలా? అన్నది ఆయన బాధ. పర్లాకిమిడి ఒడిశాలో కలిసే రోజు ఉదయమే ఆయన నదిలో తర్పణాలు విడిచి ‘పర రాష్ట్రంలో ఉన్న ఆ ప్రాంతానికి మళ్లీ రానని’’ రాజమండ్రి వచ్చేశారు.

గిడుగు అక్కడ నుంచే వ్యావహారిక భాషా వా దాన్ని ప్రచారం చేయసాగారు. ఒంట్లో బాగుండక పోవడంతో చెన్నై తీసుకువెళ్లారు పిల్లలు. అక్కడే ఆయన క్యాన్సర్‌తో 1940 జనవరి 22వ తేదీన మద్రాస్‌లో కుమారుడు సీతాపతి గారింట్లో కన్ను మూశారు. సవరలకు గిడుగు చేసిన సేవల్ని ప్రభు త్వం గుర్తించి కైజర్-ఇ-హింద్ బంగారు పతకంతో సత్కరించింది. 1919లో రావు సాహెబ్ బిరుదు నిచ్చి గౌరవించింది. ఇటీవల ఆయన సాహిత్య సర్వ స్వ ప్రచురణ జరిగింది. సవర డిక్షనరీలు, మాన్యు వల్ సంపుటి రావాలి. లేకపోతే అవి జీర్ణమై కాలగ ర్భంలో కలసిపోయే ప్రమాదముంది. మెమోరియల్ స్టాంప్‌ని ప్రభుత్వం తేవాలి. అప్పుడే ఆయనకు పూర్తి నివాళులర్పించినట్టు!
(ఆగస్టు 29న గిడుగు రామమూర్తి 152వ జయంతి సందర్భంగా)
డా॥వేదగిరి రాంబాబు, రచయిత
మొబైల్: 93913 43916.

మరిన్ని వార్తలు