ఆఫ్రికా ‘సూపర్’ విషాదం

18 Apr, 2014 00:27 IST|Sakshi
ఆఫ్రికా ‘సూపర్’ విషాదం

 నైజీరియాలో జరిగిన బాలికల కిడ్నాప్ ఘటన పెచ్చరిల్లుతున్న తీవ్రవాద హింసాకాండకు మచ్చుతునక. అధ్యక్షుడు గుడ్‌లక్ ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతూ, గణాంకాల గారడీతో నైజీరియా ఆఫ్రికాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని ప్రకటించింది.
 
 చీకటి ఖండం ఆఫ్రికాలో హఠాత్తుగా మరో దేశం ‘సూపర్ పవర్’గా ఆవిర్భవించిందని అంతర్జాతీయ మీడియా గత సోమవారం కోడై కూసింది. ఆదివారం రాత్రి కళ్లు మూసి, తెల్లారి తెరిచేసరికి  నైజీరియా ఆఫ్రికాలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. ఇలాంటి ‘అద్భుత ఆర్థిక వృద్ధి’ కథనంతో పాటూ రొటీన్ దిక్కుమాలిన చావుల గొడవెం దుకు అనిపించడం సహజమే. సోమవారం నాడే (ఏప్రిల్ 14) రాజధాని అబూజాలో జరిగిన బాంబు దాడిలో 71 మంది మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రం బోర్నోలో 126 మంది బాలికల కిడ్నాప్ సంచలనంతో పాటూ ఆ బాంబు దాడి కూడా వెలుగు చూసిందనేది వేరే సంగతి. కిడ్నాపైన బాలికలను సైన్యం విడిపించిందని గురువారం మీడియా బ్రేకింగ్ న్యూస్ లిచ్చింది. విడుదలైన బాలికల ఫోటోలు, వీడియోలు లేవు,  కిడ్నాపర్ల చెర వీడిన పిల్లలు విలపిస్తున్న తల్లుల దగ్గరికి చేరింది లేదు. పాఠశాల ప్రిన్సిపాల్ సైతం బాలికల విడుదల వార్తను ధృవీకరించ లేదు. అబూజా బాంబు దాడికి, బోర్నో బాలికల కిడ్నాప్‌కు పాల్పడినది ఇస్లామిక్ తీవ్ర వాద సంస్థ ‘బోకో హరామ్’ అని భావిస్తున్నారు.
 
  నైజీరియా రాత్రికి రాత్రే ప్రపంచంలోని 26వ అతి పెద్ద ఆర్థిక వ్యవ స్థగా ఆవిర్భవించి. దక్షిణ ఆఫ్రికాను వెనక్కునెట్టి  ఆఫ్రికాలో ప్రథమ స్థానాన్ని సంపాదించడం ‘అద్భుతమే.’  భారత్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్  దేశాలు ఇలాంటి ఘనతతోనే ప్రాంతీయ ‘సూపర్ పవర్’లుగా వెలుగుతున్నాయి. నైజీ రియా కూడా ‘సూపర్ పవర్’ అయినట్టే. అలా అని 2009 నుంచి తీవ్రవాద హింసాకాండతో, మత విద్వేషాలతో అట్టుడుకుతున్న ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో నెత్తురుటే రులు పారడం ఆగిపోతుందా? ప్రపంచ చమురు ఉత్పత్తిలో 12వ స్థానంలో, చమురు ఎగుమతిలో 8వ స్థానంలో ఉన్న ఈ ‘చమురు సంపన్న దేశం’ పేదరికంలో కూడా ఘనమైన స్థానంలోనే ఉంది. 17 కోట్ల జనాభాలో 10 కోట్ల మంది పేదలని ప్రపంచ బ్యాంకు అంచనా. ఇక మానవాభివృద్ధి సూచికలో దానిది 153వ స్థానం! నైజీరియా ఇలా ‘ఆఫ్రికా సూపర్ పవర్’ అయినంత మాత్రన ప్రజా జీవితాల్లో అద్భుతాలేవీ ఆశించవద్దని ఆర్థిక మంత్రి ఎన్‌గోజీ ఒకొన్జో  సెలవిచ్చారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి పేదరి కానికి సంబంధం లేదు. దేశం సంపన్నవంతమైతే ప్రజలు సంపన్నులైపోరు. ఇంతకూ నైజీరియా రాత్రికి రాత్రే ప్రపం చంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో 30వ స్థానం నుంచి 26వ స్థానానికి ఎలా చేరింది?  మన ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు మాంటెక్‌సింగ్ ఆ  కనికట్టు విద్యతోనే మన పేదరికాన్ని మటుమాయం చేసి చూపారు. నైజీరియాలో కూడా అలాగే జీడీపీని లెక్కగట్టే ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చేసి... 2013 జీడీపీని రె ట్టింపు (51,000 కోట్ల డాలర్లు) చేసేశారు. ఈ తిప్పలన్నీ ఎందుకు? వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు! అవినీతికి మారుపేరైన అధ్యక్షుడు గుడ్‌లక్ జొనాథన్ 2019 వరకు అధికారం చెలాయించాలి, అంతర్జాతీయ చమురు, గనుల కంపెనీలు, విదేశీ బాంకులు నిరాటంకంగా నైజీరియా సహజ సంపదలు కొల్లగొట్టే అవకాశాలు తెరిచి ఉండాలంటే ‘అద్భుతాలు’ ప్రదర్శించక తప్పదు. ఇక ఆబూజా బాంబు దాడి, ఆడపిల్లల కిడ్నాప్‌ల వంటి ఘటనలంటారా? అలాం టివి పట్టించుకోనవసరం లేదు. అల్‌కాయిదాతో సంబంధా లున్నాయని భావిస్తున్న బోకోహరామ్‌ను తుదముట్టించేశా మని 2013 మొదట్లోనే గుడ్‌లక్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక దళాలను ఉపసంహరించారు కూడా.
 
 నైజీరియా బహుజాతులకు నిలయం. 510 భాషలు  సజీవంగా ఉన్నాయి. నేటి జనాభాలో 50 శాతం ముస్లింలు, 47 శాతం క్రైస్తవులని సీఐఏ అంచనా. ఖనిజ సంపదలున్నా దేశం పేదరికంలో మగ్గుతూనే ఉంది. అభివృద్ధిలో వెనుక బడిపోయిన ఉత్తరాది తెగలలో పేదరికం, నిరుద్యోగం, నిర్లక్ష్యాల కారణంగా తీవ్రంగా అసంతృప్తి పెరిగింది. అదే బోకోహరామ్ పుట్టి పెరగడానికి తోడ్పడింది. ఒకప్పటి యుద్ధ ప్రభువులంతా సైనికాధికారులై సైనిక కాంట్రాక్టుల ముడుపుల నార్జించి సంపదలతో తులతూగుతుంటే సాధారణ సైనికులు దరిద్రంలో మగ్గే పరిస్థితి. దీంతో సైన్యం బోకోహరామ్‌తో పోరాటానికే కాదు, సైనిక నేతల రక్షణకు సైతం శ్రద్ధ చూపడం లేదు. ఇదే పరిస్థితి ముదిరితే  ‘ఆఫ్రికా సూపర్ పవర్ ’ రెండు ముక్కలయ్యే ప్రమాదం లేకపోలేదు.    
 
 పిళ్లా వెంకటేశ్వరరావు
 

మరిన్ని వార్తలు