'బాస రసాబాస’

5 Feb, 2015 00:59 IST|Sakshi
'బాస రసాబాస’

 ‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఆరోజుల్లోనే తమ పిల్లలకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు.
 
 దాదాపు యాభై సంవత్స రాల కిందట నవ్య సాహితీ సమితి వ్యవస్థాపకులు, ప్రము ఖ కవి తల్లావఝుల శివశం కరస్వామిని ఒకే ఒక్కసారి అనకాపల్లిలో కలిశాను. నన్ను పరిచయం చేయగానే ఆయన ‘‘మీ పేరులోనే వ్యాకరణ దోషం ఉందేమిటి? ‘మారుతీ రావు’ అంటారెందుకని?’’ అన్నారు. నేను నవ్వి ‘‘అభి మానులు నా పేరును అలా సాగదీశారు’’ అన్నాను - కేవలం చమత్కారానికే. ‘మారుతీరావు’ తప్పు. ‘మారు తిరావు’ అని ఉండాలి.
 
 ఏ తరానికాతరం భాష తగలడిపోతోందనుకోవ డం రివాజు. తగలడిపోవడమూ రివాజే. అప్పుడెప్పుడో విశ్వనాథ సత్యనారాయణగారు ‘‘నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును దలనవధరించి...’’ అని వాపోతూ ‘ఏమి మిగిలినదీనాటికిట్లు పొంగులొలయు వర్షానదీగభీరోదకముల దైన్య గర్భ చారిత్రముల్ దక్క!’ (ఆంధ్రప్రశస్తి) అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మరో మహాకవి కాళోజీ ‘‘అన్య భాషలు నేర్చి ఆంధ్రం బు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’’ అని హూంకరించారు.
 
 ఈ మధ్య లోక్‌నాయక్ ఫౌండేషన్ సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రసంగిస్తూ, ‘‘ఏ రోజు దినపత్రిక తీసినా 50 శాతం సంకరభాష కనిపి స్తుంద’’న్నారు.
 
 రాష్ట్రాలు విడిపోయి ‘‘ప్రాంతీయ భాష మా హక్కు, దాన్ని మెరుగు పరచి ప్రామాణిక వ్యాకరణాన్ని ఏర్పరచాలి’’ అని ఈ మధ్య గొంతులు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ భాషా సౌందర్యం ఆ భాష పలుకుబడిలో దశాబ్దాలు ప్రజల నోళ్లలో నలిగి నలిగి సంతరించుకు న్నది. గండశిల సాలగ్రామమయినప్పటి సౌందర్యమది. మిత్రుడు కోట, తనికెళ్ల భరణి తెలంగాణ మాండలికం మాట్లాడితే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. రావిశాస్త్రి, పతంజలి కథలు ఉత్తరాంధ్ర భాషలో బలాన్నీ, జవాన్నీ పుణికి పుచ్చుకున్నాయి. కృష్ణాజిల్లా భాష సౌందర్యాన్ని గుర్తుపట్టాలంటే - నా మట్టుకు 50 సంవత్సరాల కిం దటి మాధవపెద్ది గోఖలే ‘మూగజీవాలు’ చదవాల్సిందే. భాష పరిణామానికీ, నిగ్గు తేలిన నిసర్గ సౌందర్యానికీ ఇవి ఉదాహరణలు. మళ్లీ దీనికి వ్యాకరణమేమిటి? ప్రామాణిక భాషకు వ్యాకరణం కాని, వ్యావహారిక భాషకు కాదుగదా!
 
 ఈ ప్రశ్న వెంటే మనసులో మెరిసే మెరుపు ఒక టుంది. లిపిలేని ఒక గిరిజన సవర భాషకు 1931లోనే రూపాన్నీ, వ్యాకరణాన్నీ సృష్టించి; సమగ్రమైన నిఘం టువును రూపొందించిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తిగారిని ఎలా మరిచిపోగలం? అయితే పలుకు బడిలో నలిగి రూపు దిద్దుకున్న సౌందర్యానికీ, అజ్ఞా నంతో మిడి మిడి జ్ఞానంతో గబ్బు పట్టించే ప్రయ త్నానికీ చాలా తేడా ఉంది. విశ్వనాథ వారు, కాళోజీ, చలమేశ్వర్ గారు వాపోయినదదే.
 
 భాష సంకరానికి ప్రథమ తాంబూలం- టీవీ చానళ్లు. ఇప్పుడిప్పుడే టీవీ ధర్మమా అని సినీమా రెండో స్థానానికి వెళ్లింది. ‘పెల్లి’, ‘మల్లి’, ‘వెల్లారు’ ‘చేసారు’- ఇలాంటివన్నీ కోకొల్లలు. ఇక - బాధ్యతగల చానళ్లలోనే ‘తెలుగేతర’, ‘తెప్పోత్సవం’, ‘హృదయనొప్పి’, ‘అశ్రు తాంజలి’ వంటి బూతుమాటలు సమృద్ధిగానే వినిపి స్తున్నాయి. ‘అశ్రువు’ అంటే కన్నీరు. ‘అశ్రుత’ అంటే ‘విననిది’ అని అర్థం. బొత్తిగా అర్థం లేని మాట. ‘తెలి యకపోవడం’ లోపం. ‘తెలుసుకొనే’ ప్రయత్నం చేయ కపోవడం -నేరం.
 
 1913లో - అంటే వంద సంవత్సరాల క్రిందట ఒక ప్రక్రియ - ‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పాను గంటి లక్ష్మీనరసింహారావుగారు ఆరోజుల్లోనే తమ పిల్ల లకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు.
 
 ఈరోజుల్లో ‘‘మా వాడికి తెలుగుభాష రాద’’ని చెప్పుకోవడం ఫ్యాషన్. మనకీ రాకపోవడం అభివృద్ధి. ఒక్క తెలుగు పద్యమయినా చదవలేక పోవడం - దురదృష్టమని కూడా అనుకోని దశలో మనం ఉన్నాం. తెలుగు కథ, వ్యాసం, నాటకం పనికిరాని వ్యాసంగమని ‘‘కూడూ గుడ్డా పెట్టవని’’ సాధించే తరంలో ప్రతిఘట నను తట్టుకుని నేను తెలుగు రచయితనయ్యాను. ఇవాళ బోలెడన్ని చానల్స్, పత్రికలు, వ్యాసంగాలు ఉన్న నేపథ్యంలో భాషకి మరింత ఉపకారం జరగాలి. ఇవాళ భాష చాలామందికి ఉపాధిని ఇస్తోంది. కాని భాషకి ఉపకారం జరుగుతోందా?
 
 తెలుగు వాక్యం ఎలా మాట్లాడాలో తెలియని వారికి మైకులు అంది, తెలుగులో ప్రాథమికమయిన అవగాహన కూడా లేనివారికి పత్రికల్లో స్థానం లభించి, తెలుగు మాట్లాడడం కూడా రాని షోకిల్లా ఆడపిల్లలు - కేవలం మొహాల కారణంగా మనకి అపభ్రంశాన్ని అను నిత్యం డ్రాయింగ్ రూముల్లోకి పంచుతున్న నేపథ్యం లో- తెలిసి తెలిసి జరిగే ఈ అరాచకాన్ని ఎవరు ఆపు తారు? ఈ పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?
 
 జీవన కాలమ్: గొల్లపూడి మారుతీరావు
 

మరిన్ని వార్తలు