ఆట బాబోయ్!

24 Mar, 2016 04:17 IST|Sakshi
ఆట బాబోయ్!

జీవన కాలమ్
 
మొన్నంటే మొన్న కలకత్తా ఈడెన్‌గార్డెన్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఆట చాలా విషయాలను నేర్పింది. శనివారం ఉదయం నుంచీ అన్ని చానెళ్లు రకరకాల ఊహాగానాలనూ, ఇంటర్వ్యూలనూ ప్రసారం చేస్తున్నాయి. అందరి దృష్టీ ఆట మీదే ఉంది. అయితే చాలా కారణాలతో ఈ ఆటలో పాకిస్తాన్ విజయం సాధించడానికి ఎన్నో రకాల సూచనలు మొదటినుంచీ కనిపిస్తున్నాయి.

 

ఈ ప్రపంచ కప్పులోనే మొన్న బంగ్లాదేశ్‌తో ఆడుతూ పాకిస్తాన్ అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం ఒక కారణం. కాగా- ఈడెన్‌గార్డెన్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా - పాకిస్తాన్‌ని ఎదిరించి గెలవలేదు. ఎప్పుడూ పాకిస్తాన్ ఓడిపోలేదు. కనుక, ఏ విధంగా చూసినా అన్ని శకునాలూ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. టీవీ సెట్ల ముందు కూర్చున్న కోట్లాదిమంది మనస్సుల్లో ఈ నిజాలు కదలకపోవు. మొన్నటి కలకత్తాలో రెండు జట్లనూ క్రికెట్ యంత్రాంగం, ప్రభుత్వం పలకరించిన తీరు అమోఘం. ప్రపంచ కప్పు ఫైనల్స్ ఆటకు జరిపిన ఉత్సవాన్ని తలపించింది. అయితే ఎప్పుడు ఈ రెండు జట్లు తలపడినా ఇంత ముమ్మరాన్ని చూస్తూనే ఉన్నాం.

కానీ నేను గమనించిన, చాలామంది గుర్తించని ముఖ్యమైన ‘తేడా’ ఈ రెండు దేశాల ఆటల్లో పాకిస్తాన్‌ది ఆవేశం. ఇండియాది కేవలం ఆనందం. గెలవాలనే ఆశ రెండు దేశాలకీ, రెండు పక్షాలకీ ఉన్నా- ఆ ప్రయత్నంలో అతి ప్రముఖమైన తేడా ఉంది. ఉదాహ రణలు బోలెడు (రెండోసారి ఆట హైలైట్స్ చూశాక చెప్తున్నాను). ఉమర్ అఖ్మల్ బ్యాట్‌కి బంతి తగిలి ధోనీ కేచ్ పట్టుకున్నాక, ఔట్ అయ్యాక జడేజా, ధోనీ పిచ్ మధ్యకు వచ్చి పలకరించు కున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరి ముఖాలలో స్పష్టమైన ఆనందం తొణికిసలాడింది. ఏ విధమైన ఆవేశమూ ఆ ఆనందానికి లేదు. పాకిస్తాన్ ఆటలో మహమ్మద్ సమీ బంతికి శిఖర్ ధావన్ ఔట్ అయి నప్పుడు సమీ ముఖాన్ని చూడాలి.

‘పిచ్చికూనల్లారా! మీకిదే తగిన శాస్తి - ఇంకా ముందుంది ముసళ్ల పండుగ’ అన్న ఆవేశం స్పష్టంగా కనిపించింది. ‘మీ రోగం కుదిరిందా!’ అన్న ఎకసెక్కం మిగతా ఆటగాళ్ల విసుర్లలో కనిపించింది. 45 పరుగుల తర్వాత మాలిక్ బంతికి కోహ్లి ఫోర్ కొట్టాక - పిచ్ మధ్యకి వచ్చి ధోనీ, కోహ్లి ఆనందించిన దృశ్యం ఆటగాళ్ల ఆరోగ్యకరమైన స్పందనకు నిదర్శనం. పడిపోయే ప్రతీ వికెట్ దగ్గరా అఫ్రీది వీరావేశం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇదే రెండు జట్ల దృక్పథాలలో పెద్ద తేడా.

ఇదే ఎప్పుడూ ఇండియా విజయం సాధించడానికీ, పాకిస్తాన్ ఎప్పుడూ ఓడిపోవడానికీ ముఖ్యమైన కారణం. ఇండియా ‘ఆట’ని ఆడి ఆనందిస్తోంది. పాకిస్తాన్ విజయం కోసం ‘కసి’ని పెంచుకుంటోంది. ఇండియాలో ప్రేక్షకులు ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. షార్జాలో క్రికెట్ ఆట గుర్తుంటే-పాకిస్తాన్ ఓడుతున్నప్పుడల్లా ఆట విజ యానికి దేవుడినీ, మతాన్నీ ప్రేక్షకులు అప్పటికప్పుడే గేలరీలో ఆశ్రయించడం ఇందుకు పెద్ద నిదర్శనం.

ఆటలోనే కాదు, ఏ ప్రయత్నంలో అయినా నిజమైన, నికార్సయిన ‘ప్రయత్నం’ ఆ కృషికి బలాన్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ‘వినియోగించుకోవాల’నే లక్ష్యం దాన్ని బలహీనం చేస్తుంది. ప్రతీసారీ ఇండియాకు క్రికెట్ మరొక ఆట. పాకిస్తాన్‌ని గెలవాలన్న పట్టుదల. అంతవరకే. కానీ పాకిస్తాన్‌కి అది యుద్ధం. తమ సత్తా చాటాలన్న ఆవేశం.
An unfettered happiness at an achievement makes it rewarding. A motive cripples it, kill it, even makes it lopsided.

నాకు పాకిస్తాన్ ఆటగాళ్ల మీద అపారమైన గౌరవం. అలనాటి ఇమ్రాన్‌ఖాన్, అబ్దుల్‌ఖాదిర్, జహీర్ అబ్బాస్ లాంటి ఆటగాళ్లంటే నాకు పిచ్చి. వారి మనస్సులోకి దూరి ఏమనుకుంటున్నారో చెప్పలేం కాని- వారు క్రికెట్ పరపతినీ, ప్రతిష్టనీ పెంచారు. మొన్న ‘‘ఇండియాలో మాకు మాతృదేశం కంటే ఆదరణ లభిస్తోంది’’ అన్న అఫ్రీది మీద ఒకాయన కేసు పెట్టడం, జావీద్ మియన్దాద్ వంటి ఆటగాడు విరుచుకుపడడం ఇందుకు దురదృష్టకరమైన నిదర్శనాలు. అఫ్రీదిని కెప్టెన్‌గా తొలగిస్తారన్న వార్తలు అప్పుడే వస్తున్నాయి.

ఆ మధ్య మోదీగారు అకస్మాత్తుగా పాకిస్తాన్ వెళ్లి శాంతియుతమైన సుహృద్భావం కోసం అక్కడి నాయకత్వంతో చేతులు కలపడం ద్వారా మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నంలో కేవలం రాజకీయ కోణాన్ని మాత్రమే చూసిన మన నాయకులు - ప్రస్తుతం మహమ్మద్ సమీ ధోరణిలో స్పందిస్తున్నారని నాకు అనిపిస్తుంది.
 
- గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు