కాలం తీపి గురుతులు

27 Apr, 2017 00:43 IST|Sakshi
కాలం తీపి గురుతులు

జీవన కాలమ్‌
ఎన్ని విజయాలు సాధించినా కాళ్లని నేల మీదే నిలుపుకున్న వ్యక్తి. ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌కి సబబైన కిరీటం. సినీమాని ‘అభిరుచి, సంస్కారం, సంస్కృతి, ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం’ పొలిమేరల్లో నిలిపిన చాంపియన్‌.

ఎన్ని సంవత్సరాలు! 53 గడిచిపోయాయి. అప్పుడే నేను ఆంధ్రప్రభ వదిలి హైదరాబాదు రేడియోకి వచ్చాను. దశాబ్దాలుగా ఉన్న మద్రాసు వదిలి సగం మనసుతో కె. విశ్వనాథ్‌ హైదరాబాదు వచ్చారు అన్నపూర్ణా సంస్థ కోసం. ఇద్దరికీ కిరాణా దుకాణం– నారాయణగూడాలో శంకరయ్యది. ఆయన శ్రీమతి జయలక్ష్మిగారు, మా ఆవిడా కలిసేవారు. నేను అప్పుడప్పుడు మా ఆవిడకి తోక.

మద్రాసులో 34 భగీరథ అమ్మాళ్‌ వీధి అన్నపూర్ణా ఆఫీసు. ‘డాక్టర్‌ చక్రవర్తి’కి నేనూ, దుక్కిపాటి గారూ హాలు పక్క గదిలో కథా చర్చలు జరుపుతుండగా హాలులో ఎస్‌. రాజేశ్వరరావుగారితో సంగీతం కంపోజింగ్‌ చేయిస్తున్నారు విశ్వనాథ్‌. ఉన్నట్టుండి మా గది లోకి వచ్చారు–రాజేశ్వరరావుగారు: ‘‘విశ్వంగారికి సంగీ తం మీద మంచి పట్టు ఉందండి!’’ అని వెళ్లిపోయారు. ఎక్కడికి? సరాసరి ఆఫీసు నుంచి ఇంటికి. అది రాజేశ్వరరావుగారి అలక. విశ్వంగారూ కంగారు పడిపోయారు. కానీ ఆయన మాట ఎంత నిజం! తెలుగు సినిమాలో సంగీతానికి ‘రుచి’నీ, ‘శుచి’నీ మప్పి పదికాలాల పాటు ప్రాణం పోసిన దర్శకులు విశ్వనాథ్‌.

‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాలో మొదటి సీనుని– ఆత్రేయకి బదులు నేను రాసిన మొదటి సీనుని–ఫెయిర్‌ కాపీ రాసుకున్న వ్యక్తి విశ్వనాథ్‌. నేను రాసిన మొదటి సీనుని (ఆత్మగౌరవం) మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిం చిన వ్యక్తి విశ్వనాథ్‌. ఆయనా నేనూ కలసి నటించిన మొదటి సీనుని మళ్లీ నేనే రాశాను (శుభసంకల్పం). మొదటిసారిగా కెమెరామాన్‌ పి.సి. శ్రీరామ్‌ గారింట్లో మేమిద్దరం నమూనా సీను నటించాం.

‘చెల్లెలి కాపురం’ చర్చల్లో నాకు జర్దా కిళ్లీ సరదాగా మప్పిన ఘనత విశ్వనాథ్‌గారిది. సీను ‘రంజు’గా వచ్చిం దంటే స్వయంగా కిళ్లీ చుట్టి ఇచ్చేవారు సంబరంతో. 18 సంవత్సరాలు అది ఇద్దరి పీకలకీ చుట్టుకుంది. ఒకరోజు మేమిద్దరం యునైటెడ్‌ కాలనీ బజార్లో రాత్రి జర్దా కోసం తిరిగాం! తర్వాత ఇద్దరం బయటపడ్డాం.

చక్కని భోజన ప్రియత్వం ఇద్దరికీ ఉంది. ‘శుభ సంకల్పం’ నిర్మాత ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం. వారిం ట్లోనే చర్చలు. ప్రతిరోజూ ముందు తినబోయే పలహారాన్ని చర్చించేవాళ్లం. వంటావిడ కాంతమ్మగారు రుచిగా పంపించేవారు– పెసర పుణుకులు, చల్ల చిత్తాలు, పెసరట్టు, రవ్వదోశె– ఇవే ముందు నిర్ణయం కావాలి. తర్వాతే కథా చర్చ. ‘రుచి’ కారణంగా చర్చలు మరికొన్నాళ్లు కొనసాగిన గుర్తు.

విజయనగరంలో ‘శుభ సంకల్పం’ షూటింగు. రోజూ హోటల్‌ నుంచి బయలుదేరి నన్ను దారిలో కారెక్కించుకునేవారు. విజయనగరం దారిలో – అప్పుడే తోటల్నుంచి వచ్చే కూరల బుట్టలు దింపించి– బీరకాయలు, వంకాయలు, బెండకాయలు కొని– జొన్నవలస లొకేషన్‌లో వంటవాడికిచ్చి చేయించుకునేవాళ్లం.

ఆయన దర్శకత్వంలో నేను నటించిన మొదటి చిత్రం–‘స్వాతిముత్యం’. నేను బిజీగా ఉన్న రోజులు. ఆరోజు ఆయన షూటింగుకి ఆలస్యంగా వచ్చి– ‘‘నాతో నడువు మారుతీరావ్‌’’ అంటూ కుడికాలు ఎత్తి ఎత్తి వేయడం మప్పారు పాత్రకి. ఆ చిన్న పాత్రకి అది మేనరిజం. రజతోత్సవ సభలో రాజ్‌కపూర్‌ ఆ కుంటిని గుర్తు చేసుకున్నారు–ఆ కుంటి నాదేనని భావిస్తూ. పాత్ర మీద ప్రత్యేకమైన angularityని పట్టుకోవడంలో విశ్వనాథ్‌కి విశ్వనాథే సాటి. ‘శంకరాభరణం’లో సంగీతం మేస్టారు, ‘సాగరసంగమం’లో డ్యాన్స్‌ మేస్టారు, ‘స్వాతిముత్యం’ లో నా పాత్ర అందుకు ఉదాహరణలు.

‘శుభలేఖ’ రాస్తూండగా అనుకోకుండా నటుడినయ్యాను. పాలకొల్లులో పగలు ‘ఇంట్లో రామయ్య–వీధి లో కృష్ణయ్య’ షూటింగు. రాత్రి సంభాషణల రచన. విశాఖపట్నానికి ‘శుభలేఖ’ స్క్రిప్ట్‌ చిరంజీవితోనే పంపా ను. బహుశా ఆయనకి ఎక్కువ సినిమాలు రాసింది నేనేనేమో (ఆత్మ గౌరవం, చెల్లెలి కాపురం, ఓ సీత కథ, మాంగల్యానికి మరోముడి, ప్రేమబంధం, శుభలేఖ, శుభ సంకల్పం)! ఇద్దరం కలసి మొట్టమొదటి నంది అవార్డుని పుచ్చుకున్నాం. ఆయన నటుడయ్యాక ఒక గొప్ప దర్శకుడిని తెలుగు సినీమా ఏ కాస్తో నష్టపోయిందనిపిస్తుంది. ముందు ముందు ఎన్ని సాగరసంగమాలు, స్వాతిముత్యాలు వచ్చేవో. ఖాకీ దుస్తులతో మొదటి షాట్‌ దర్శకత్వం వహించడం నుంచి, చేతికర్ర వరకూ ఆయన ప్రయాణాన్ని గమనించినవాడిని. ఏ కొన్ని అడుగులో కలసి వేసినవాడిని. విశ్వనాథ్‌ తపస్వి. కళకి పామర రంజకత్వాన్ని మప్పిన దర్శకుడు.

ఎన్ని విజయాలు సాధించినా కాళ్లని నేల మీదే నిలుపుకున్న వ్యక్తి. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌గారికి సబబైన కిరీటం. సినీమాని ‘అభిరుచి, సంస్కారం, సంస్కృతి– ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం’ పొలిమేరల్లో నిలిపిన చాంపియన్‌. జాతీయ స్థాయిలో ‘కీర్తి’ నిలిచినా జీవితాన్ని, జీవనాన్ని సడలించని మధ్య తరగతి అగ్రహారీకుడు కె. విశ్వనాథ్‌.



గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు