ఒక అమెరికా భక్తుడి ఉవాచ

29 Jun, 2017 00:49 IST|Sakshi
ఒక అమెరికా భక్తుడి ఉవాచ

జీవన కాలమ్‌

ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్‌ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను.

నేను బీజేపీ కార్యకర్తని కాను. ఈ దేశంలో అందరిలాంటి పౌరుడిని. తమిళనాడులో కస్టమ్స్‌ శాఖ అత్యధిక ఉన్నత న్యాయస్థానం (ట్రిబ్యునల్‌)కు న్యాయాధికారిగా పనిచేసి రిటైరైన 86 సంవత్సరాల ప్రముఖ రచయిత నాకు ఒక అమెరికా భక్తుడి (జాసన్‌. కె.) వ్యాసాన్ని పంపారు. నలుగురూ చదివితే బాగుంటుందనిపించింది. కాలమ్‌ పరిమితి దృష్ట్యా సంక్షిప్తంగా చెబుతాను:

అమెరికా ఇస్తున్న నిధులతో పనిచేసే ప్రాజెక్టుల కోసం భారతదేశం నలుమూలలా తిరుగుతూ ఉంటాను. పేదల్నీ, నిరుపేదల్నీ కలుస్తూంటాను. భారతదేశంలో ఉన్న కొన్ని అపప్ర«థల్ని తొలగించాలన్నదే నా ప్రయత్నం. అమెరికా మిత్రులు, కొందరయినా భారతీయులు దీన్ని చదువుతారని ఆశిస్తాను.

మీకు నచ్చినా, నచ్చకపోయినా భారతదేశంలో గ్రామీణ రంగం మోదీగారి వెనుక ఉంది. వాళ్లని మీరు భక్తులన్నా, అనుచరులన్నా వాళ్లకి వెంట్రుక ఊడదు (ఇంతకన్న ముతక మాట అన్నాడు). మొట్టమొదటిసారిగా మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణమూలేని పార్టీ నాయకుడు వారికి దక్కాడు. అనూహ్యమైన కుంభకోణాలతో మురిగిన దేశం ఒక ప్రధాని మూగతనాన్ని వేళాకోళం చేసే స్థాయికి చేరుకొన్న నేపథ్యంలో ఇది గొప్ప, వాంఛనీయమైన పరిణామం.

ముస్లింలు మోదీని ద్వేషించటం లేదు. చదువుకున్న హిందూ మేధావులు ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు అతి మెళకువగా, శ్రద్ధగా ప్రజాభిప్రాయాన్ని వంకర తోవ పట్టించడానికి చేసిన కృషిని ఆయన గంగలో కలిపాడు కనుక. సరదాగా టీ సేవిస్తూ పత్రికల్లో రాజకీయాలను చర్చించే ‘బాతాఖానీ’మేధావుల నడ్డి మీద ఆయన ఒక తాపు తన్నాడు కనుక.

నాకనిపిస్తుంది చాలామంది భారతీయులు మోదీని వ్యతిరేకించడాన్ని ఒక స్టేటస్‌ సింబల్‌గా భావిస్తూ, తద్వారా తాము మేధావులం, మతాతీత శక్తులమని నిరూపించుకోజూస్తున్నారని. వారికి అదొక ఫేషన్‌. ఒక్క ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రి– కేజ్రీవాల్‌. ఆయన మోదీ విద్యార్హతల్ని ప్రశ్నిం చారు. విశ్వవిద్యాలయం సాధికారికంగా సమర్థించే సరికి పూర్తిగా జారిపోయాడు. ఇది అతి నీచమైన ‘spit and run-' రాజకీయం. ఇలా కక్కగా కక్కగా ఏదో మురికి ఆయనకు అంటుకోక మానదని కొందరి ఆశ.

ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక స్థాయిగల దేశం 86 శాతం కరెన్సీని ఉపసంహరించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్థిక శాస్త్రాన్ని చదువుకున్నవాడిగా ఇది సరైన పని అని నేను అనుకోవడం లేదు. కానీ దేశం తలవొంచినట్టు తోస్తోంది. అయితే ‘అవినీతి’ చరిత్రలేని మోదీ చేపట్టిన ఈ చర్య చెల్లుబాటు కావడం ద్వారా ఆయన నిజాయితీపట్ల విశ్వాసం ప్రజల్లో మరింత పెరిగింది.
అమెరికాలో ట్రంపుని పదవిలో కూర్చోపెట్టిన మమ్మల్ని చూసి భారతదేశంలో మేధావులు నవ్వుకోవచ్చు. అయినా సాహసం చేసి ఒక మాటంటాను. ఈయనకి మరో చాన్సు ఇవ్వండి. ఆయన సరైన కృషి చేస్తున్నాడు. అందుకు ఆయనకి దమ్ము, వెన్నుబలం ఉన్నాయి. ఒక్క కాశీలో ఆయన జరిపిన బహిరంగ ఊరేగింపు చాలు– అందుకు నిదర్శనంగా ఉదహరించడానికి. కెన్నెడీ హత్య ఇంకా మా మనస్సుల్లో పచ్చిగా ఉంది. ఒక్క పిచ్చివాడి చేతిలో తుపాకీ చాలు, మీ దేశాన్ని అవ్యవస్థలో పడేసేది.

ఆయన్ని వెనకేసుకొచ్చేవారిని వెక్కిరించే షోకుని విడిచిపెట్టండి. అలా చేయడం సరదాగా ఉండొచ్చుకానీ– అందువల్ల మీకే నష్టం. దేశంలో ఎక్కువమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించేవారితో మీరు ఏకీభవిస్తున్నకొద్దీ వారి అనుచరుల సంకల్పబలం పెరుగుతుంది. ఆయనతో ఏకీభవించని ప్రత్యర్థి ఎవరయినా– సహేతుకంగా ఆలోచించగా నేను చూడలేదు. కాగా ఆయన్ని విమర్శించిన చాలామంది తమ మనస్సులు మార్చుకోవడం నేనెరుగుదును.

దురదృష్టం. భారతీయ సైన్యం చేసిన దాడులనీ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. మాకు ట్రంపు ఉన్నాడు. అమెరికాని సమర్థించే ఆయన ఏ చర్యనయినా బొత్తిగా చదువురాని అమెరికన్‌ కూడా సమర్థించాడు. మీ సైన్యం చర్యలనే మీరు ఖండించే స్థితికి వస్తే– మీలో ఏదో సీరియస్‌ లోపం ఉన్నట్టే లెక్క. నక్షత్రాల జాతీయ పతాకం అమెరికాకు తలమానికం. కానీ మీ త్రివర్ణ పతాకం మీకు అలా కాకపోవడం దురదృష్టకరం.

మీకిది వింతగా కనిపించవచ్చుకానీ నేను మీ దేశాన్ని, మీ ప్రజలని ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్‌ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. రాహుల్‌ గాంధీ అనే ఆ శాల్తీని కాక ఈయన్ని మళ్లీ ఎన్నుకోడానికి మరో ఎన్నిక మీకు అవసరమనిపిస్తే మిమ్మల్ని ఆ దేవుడే రక్షించుగాక!

 గొల్లపూడి మారుతీరావు
 

మరిన్ని వార్తలు