చెల్లుచీటీ కాదు.. మందుచీటీ కావాలి

17 Dec, 2013 23:23 IST|Sakshi
చెల్లుచీటీ కాదు.. మందుచీటీ కావాలి

 ప్రభుత్వ వేతనం కంటె రెండు మూడు రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే వైద్యులు సైతం ప్రభుత్వ సేవలలో అవకాశం వస్తే సంతోషించేవారు. ఇందులో 80 శాతం స్వస్థలాలలో సేవకు మొగ్గు చూపేవారు.
 
 నగరాలూ గ్రామాల మధ్య పెరుగుతున్న అగాధం ప్రమాదకర కోణాలను తాకుతోంది. విద్య విషయంలో పెరిగిన అగాధమే వైద్యం లోనూ కనిపిస్తోంది. 2011 గణాంకాల ప్రకా రం దేశ జనాభా 121 కోట్లు. ఇందులో 83.3 కోట్లు (68 శాతం) గ్రామీణులు. శాస్త్ర పరిజ్ఞా నం ఎంతో విస్తరించినా జీవించే హక్కుకు సంబంధించి వీరికి వ్యవస్థ భరోసా ఇవ్వడం లేదు. వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోవడమంటే, జీవించే హక్కుకు వారిని దూరం చేయడమే.
 
 ‘సమానత్వం, వ్యాధి నిరోధకత, ఆరోగ్యవంతమైన జీవన విధానం అనే సూత్రాల ఆధారంగా ఆరోగ్య సేవలను వ్యవస్థీకరించుకోండి! డబ్బు చెల్లించినా, చెల్లించలేకపోయి నా అందరికీ ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేసే ప్రభుత్వాని ఏర్పాటు చేసుకోండి. గ్రామాలూ, పట్టణాల అవసరాలను బేరీజు వేసుకుని జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కార్యకర్తలను తయారు చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టండి’ - ఇది ‘ఒకతరం అంతరాలు చెరిపివేద్దాం’ అన్న నివేదికలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇచ్చిన పిలుపు. కానీ మన ప్రభుత్వాలు ప్రజావసరాలకు అనుగుణంగా వైద్య విధానాన్ని రూపొం దించడం కంటె, వైద్యం వ్యాపారంగా మారి పోవడానికి వీలైన పరిస్థితులను కల్పిస్తున్నా యి. గ్రామాలకు అత్యద్భుతమైన సేవలు అందించే నమూనా దేశంలో ఉంది. భోర్ (1946), ముదిలియార్ (1962), కర్తార్‌సింగ్(1973), శ్రీవాస్తవ్ (1975) కమిటీలు, జాతీ య ఆరోగ్య  ప్రణాళిక (1983), జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (2005)ల సుదీర్ఘ మేధామథనంతో ఆవిర్భవించిన నమూనా అది. దీని ప్రకారం 3 నుంచి 5 వేలు జనాభాకు ఉప కేంద్రం, 20 నుంచి 30 వేల జనా భా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ), 80 వేల నుంచి లక్ష జనాభాకు సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.
 
  జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రకారం ప్రతి వేయి మందికి ఒక ఆశా కార్యకర్తను  నియమించాలి. ఉప కేంద్రానికి ఇద్దరు మహి ళా ఆరోగ్య కార్యకర్తలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్త ఉంటారు. పీహెచ్‌సీకి ఒకరు లేదా ఇద్దరు వైద్యాధికారులు, 40 మంది వరకు పారా మెడికల్, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. గ్రామీణ వైద్య సేవలకు వైద్యాధికారి నాయకుడు. అది ధ్వంసమైనా, విజయవంతమైనా ఆయనతోనే. ఆశా కార్యకర్త కూడా కీలకమే. ఈ నమూనా శక్తిమంతమైనది. చాలా దేశాలు ఈర్ష్యపడే నమూనా. అయినా కునారిల్లి పోయిందంటే, అది మన లోపమే.
 
 1968 ప్రాంతంలో ప్రతి వైద్య విద్యార్థి ఆలోచన దాదాపు ఒక్కటే. పట్టా తీసుకున్న తరువాత ఎన్నేళ్లకి ప్రభుత్వ డాక్టరుగా ఉద్యో గం వస్తుంది! ప్రభుత్వ వేతనం కంటె రెండు మూడురెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే వైద్యు లు సయితం ప్రభుత్వ సేవలలో అవకాశం వస్తే సంతోషించేవారు. ఇందులో 80 శాతం స్వస్థలాలలో సేవకు మొగ్గు చూపేవారు. పీజీ లో అవకాశం వచ్చిన వారు, బంగారు పతకాలు పొందిన వారు కూడా ఎంబీబీఎస్ పట్టాతోనే సేవలు చేయడానికి ఇష్టపడేవారు.
 
 కానీ ఇప్పుడు సిబ్బంది లేక పీహెచ్‌సీలు కునారిల్లిపోయాయి. 2011 గణాంకాల ప్రకా రం దేశంలో 1,48, 124 ఉపకేంద్రాలు, 23, 887 పీహెచ్‌సీలు, 4,809 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 8 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అయితే 35,762 ఉప కేంద్రాలు, 7,048 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2766 సామాజిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉంది. ఇంకా 30,051 మంది వైద్యులు కావాలి. ప్రస్తుతం దేశంలో ఏటా 45 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు. ఒక్క ఏడాదిలో బయటకు వచ్చిన వైద్యులలో 70 శాతంతో ఈ అవసరాలు తీరతాయి. మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నవారు 7 లక్షల మంది. అయితే 83.3 కోట్ల గ్రామీణ జనాభాకు కావలసింది 31 వేలు మాత్రమే. ఇది గమనించాలి. వీటిని అధిగమించడం నేటి అవసరం. ప్రభుత్వం ప్రతి వైద్య విద్యార్థి ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాలలో పని చేయాలన్న నిబంధన పెడుతోంది. ఇది సమ స్యకు పరిష్కారం కాబోదు. ఏటా ఒక కొత్త డాక్టరును గ్రామీణులు చూడాలా? ఇది ఇద్దరికీ ఇష్టం కాని విషయమే. 1980 తరువాత ఏ వైద్య విద్యార్థి ఇక్కడ సేవ చేయడానికి ఇష్టపడటం లేదు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల కొరత తీర్చడానికి బీయస్సీ (సామాజిక ఆరోగ్యం) గురించి ఆలోచిస్తున్నారు. పార్లమెంటరీ సలహా సంఘం సిఫారసుకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమిది. వైద్యరంగ సమస్యలు డాక్టర్లూ, పాలకులూ ఆదర్శం పునాదిగా ఆలోచిస్తేనే పరిష్కారమవుతాయి.
 డాక్టర్ ఆరవీటి రామయోగయ్య

మరిన్ని వార్తలు