వాస్తవాన్ని మరిపిస్తున్న భ్రమలు

16 Sep, 2017 01:04 IST|Sakshi
వాస్తవాన్ని మరిపిస్తున్న భ్రమలు

జాతిహితం
ప్రాజెక్టును ఏ స్థాయిలో నిర్మించాలనే విషయంలో ప్రభుత్వ పథక నిర్ణేతలు వేస్తున్న అడ్డుపుల్లల కారణంగా దేశ రాజధానితో సహా పలుచోట్ల ప్రారంభించిన భారీ రోడ్డు, తదితర నిర్మాణాలు గత పదేళ్లుగా పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్లీ  అధిక వ్యయంతో నిర్మించక తప్పని పరిస్థితి.

పరిమితి, వేగంపై మనకున్న భయం అనేది సామూహిక రోగ భ్రమను తలపిస్తుంది. ఇలాంటి స్థితిలోనే మనం ఆధునిక వైద్యం గురించి భయపడుతూ రుచికరమైన, తీపికలిగిన, పనిచేయని గుళికలను వేసుకోవడం వైపు కొట్టుకుపోతుంటాం.

సాపేక్షికంగా ఆధునిక వైద్యమైన హోమియోపతిని జర్మనీలో శామ్యూల్‌ హానెమన్‌ 1976లో కనిపెట్టారు లేదా ఊహించారు. ఆనాటినుంచి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతించారు, ప్రశ్నించారు, పరిశోధించారు, తిరస్కరించారు కూడా. ఎలాంటి శాస్త్రీయ పునాదిని ఏర్పర్చకపోవడంతో ఇప్పుడు ఈ వైద్యవిధానాన్ని నకిలీ విజ్ఞానశాస్త్రంగా తోసిపుచ్చారు. హోమియోపతి కలిగించే ప్రభావం ఏదైనా ఉంది అంటే అది ఉత్తుత్తిమాత్ర ప్రభావం (ప్లాసెబో ఎఫెక్ట్‌) మాత్రమే. అంటే ఖాళీ మాత్రలు తీసుకున్న రోగి మానసికంగా తాను మెరుగ్గా ఉన్నట్లు భావిస్తాడు లేదా వ్యాధి సహజంగానే తగ్గిందని భావిస్తాడు. ఇది అర్థం పర్థం లేని వ్యవహారంగా రుజువైనప్పటికీ, హోమియోపై నమ్మకమున్న రోగభ్రమ కలవారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేరకు హోమియోపతి ఔషధాలను కొంటూనే ఉన్నారు.

ఈనాటికీ ఈ వైద్యవిధానం ప్రధానస్రవంతి ప్రజల ఆదరణ పొందుతున్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే. దేశంలోని ప్రతి నగరం సరే తనదైన హోమియోపతి వైద్యులను కలిగి ఉంటోంది. వీరిలో ‘డాక్టర్‌ బెనర్జీ’ అనే పేరు బహుళ ప్రాచుర్యం పొందింది. హోమియోపతి అనే వేలంవెర్రి వ్యామోహం అది పుట్టిన జర్మనీ దేశంలో దాదాపుగా అంతరించిపోయింది. కానీ దానికి ఎంతో దూరంలో ఉన్న భారత్‌లో అది వృద్ధి చెందుతుండటమే కాకుండా గణనీయ సంఖ్యలో కేంద్రప్రభుత్వ నిధులను కూడా పొందుతోంది. కేంద్రమంత్రివర్గంలో ఒకటైన ఆయుష్‌ అనే ఇంగ్లిష్‌ పదంలోని హెచ్‌ అక్షరం హోమియోపతిని సూచి స్తుంది. (ఆయుర్వేదం, యోగ–నాచురోవతి, యునాని, సిద్ధా, హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్‌ అంటున్నారు).

ఆరోగ్య సమస్య ఉందని మీరు ప్రస్తావించే ప్రతి వ్యక్తీ ఒక ఔత్సాహిక హోమియోపతి అభిమాని అయి ఉంటారు. అది పుట్టిపురిగిన పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు దాన్ని అర్థం పర్థంలేని వైద్యంగా కొట్టిపడేయవచ్చు కానీ, హోమియోపతికి భారత్‌ ఇప్పుడు నిలయంగా మారింది. చివరకు దీనిని దేశీయ వైద్య వ్యవస్థల్లో ఒకటిగా అధికారికంగా ప్రకటించారు కూడా. హోమియోపతి గురించి జోక్‌ చేసినా మన దేశంలో ప్రమాదమే. ఈ కథనంలోని మూడో పేరా చదివిన పాఠకులు ఇప్పటికే నిరసనలు, బూతులతో నన్ను సత్కరిస్తుంటారు కాబోలు.
భారతీయులు హోమియోపతిని ఆరాధించడం, విశ్వసించడమే కాకుండా దాన్ని పూర్తిగా సమర్థిస్తూ, దాసోహమవడానికి కారణం ఉంది. బహుశా అది రోగ భ్రమ లేదా రోగ భయం ఉన్నవారి కోసం రూపొంది ఉండవచ్చు. రోజు వారీ జీవితంలో చిన్న ఆరోగ్య సమస్య, లేదా సందేహం ఏర్పడినా సరే చాలామంది తియ్యటి, స్పిరిట్‌ వాసన వేసే హోమియో గుళికలను వేసుకుంటుం టారు. ఈ గుళికల వల్ల ఏ ప్రభావమూ లేదని మీరు భావించడానికి చాలా కాలం అంటే నెలలు కూడా పట్టవచ్చు. కానీ ఈ క్రమంలో మీకు మెరుగైందని, స్వస్థత చేకూరిందని మీరు నమ్ముతారు కూడా. ముఖ్యంగా హోమియో గుళికల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

ఆధునిక వైద్యం అందిస్తున్న ఔషధాలు కలిగించే దుష్ప్రభావాలు, మన ఆరోగ్య వ్యవస్థకు అది కలిగించే నష్టం గురించి మనం బాగా భయపడుతుంటాం. ఇక శస్త్రచికిత్స అంటే ఎవ్వరినైనా వణికిస్తుంది. ఇలాంటప్పుడు పరిపాలన, మరీ ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లోనూ చొచ్చుకుని వస్తున్న హోమియో మానసిక స్థితి కల దేశంగా భారత్‌ను మనం గుర్తించవచ్చా?

మీరు ఎలాంటి పరిమాణంలోని ప్రాజెక్టునైనా సరే ప్రస్తావించారనుకోండి.. భౌతికపరంగా, ఆర్థికపరంగా ఉత్పాతం జరగబోతోందని చిత్రిస్తూ లక్షలాది మంది మీపైకి విరుచుకుపడిపోతారు. భారత, జపాన్‌ ప్రధానులు నరేంద్రమోదీ, షింజో అబేలు అహ్మదాబాద్‌–ముంబై బుల్లెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా చాలావరకు ఇలాంటి స్పందనలే వచ్చాయి. వీటిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింగ్వి స్పందన కీలకమైంది. షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ నాటి భారత్‌ను ఆర్థికంగా కుప్పకూల్చివేసిందని, కరువులు, ఆకలి చావులకు కారణమైందని అభిషేక్‌ చెప్పారు. ఇక మన దేశంలో బుల్లెట్‌ రైలు కూడా పరుగెడుతుంది కానీ తర్వాత ఏం జరుగుతుందనేది మీరు ఊహించుకోవలసిందే అన్నారాయన.

ఇలాంటి వ్యాఖ్యలు చాలానే వచ్చాయి. వీటన్నింటిలో వ్యక్తమైన ఉమ్మడి అభిప్రాయం ఏదంటే, భారత్‌ ఇంత ఖర్చు భరిస్తుందా? ఇది స్వావలంబనను కలిగిస్తుందా, ఆర్థికపరంగా ఇది అర్థవంతమైనదేనా అనేదే. దేశంలో ఇప్పటికీ 17 వేల కాపలా లేని క్రాసింగులు ఉంటూండగా, రైళ్లు నిత్యం పట్టాలు తప్పుతుం డగా బుల్లెట్‌ రైలు వంటి భారీ నిర్మాణాన్ని దేశం తట్టుకోలేదన్నది వీరి భావం. అదే సమయంలో 1971 నుంచి మన దేశ రైళ్ల గరిష్ట వేగం పెద్దగా మారలేదని కూడా వీరే ఆరోపిస్తుంటారు. ఇలా విమర్శిస్తున్నవారిలో చాలామంది రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటుంటారని మర్చిపోవద్దు.

బుల్లెట్‌ రైలు కోసం తీసుకుంటున్న లక్ష కోట్ల రూపాయల అప్పును అతి తక్కువ వడ్డీకే జపాన్‌ అందిస్తూ 50 ఏళ్ల వ్యవధిలో అప్పు తీర్చే వెసులుబాటు కల్పించిప్పటికీ దేశంలోని కోట్లాది సామాన్య ప్రయాణికులకు అది చేసే మేలు ఏదీ లేదు. పైగా బుల్లెట్‌ రైలు నైతికంగా అవరోధంగా నిలుస్తుందని విమర్శకులు చెబుతున్నారు. అయితే దేశంలో ఏ ప్రాజెక్టుకోసం పథకాలు రచించినా ఇదే బాగోతం నడుస్తుంటుంది. భారీ డ్యాములు, నదుల అనుసంధానం వంటి ఆలోచనలను మనం వదులుకుంటున్నాం. 1995–99 కాలంలో మహారాష్ట్ర యువ రవాణా మంత్రిగా ఉండిన నితిన్‌ గడ్కరీ ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణంకోసం పూనుకున్నప్పుడు అది పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుందని, సాంకేతి కంగా అసాధ్యం అని, ఆర్థికంగా చెల్లదని విమర్శించారు. కానీ ఎక్స్‌ప్రెస్‌ రహదారులు లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించుకోండి మరి. దేశవ్యాప్తంగా భారీ రహదారుల కోసం బీవోటీ ఎక్స్‌ప్రెస్‌ వే ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.  

నగరాల్లోని విమానాశ్రయాల ప్రైవేటీకరణపై చర్చను గమనించండి. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ జరిగితే తమ యూనియన్లకు స్థానం ఉండదనే కారణంతో వామపక్షాలు ఎన్ని విమర్శలు చేశాయో అందరికీ తెలుసు. అలాగే నగరాల్లో అవసరానికి మించి భవనాలు కడుతున్నారని కూడా విమర్శించేవారు. కానీ ఈరోజు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు జనాభాతో కిక్కిరిసిపోయాయి. మన మహానగరాలు ఇప్పుడు విస్తరణకోసం పాట్లుపడుతున్నాయి. ఈ వృద్ధి వికాసం లేకుండా మన విమానయాన పరిశ్రమ ఇంత స్థాయికి ఎదిగి ఉండేది కాదు.

స్వల్ప స్థాయి సంస్కరణలను కోరుకునేవారు లేదా హోమియోపతిపై నమ్మకం ఉన్నవారు ఇక్కడే గెలుపొందుతున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలే. దశాబ్దకాలంగా ఇలాంటి ఊగిసలాటల కారణంగానే కొత్త ప్రాజెక్టులు, పథకాలు విశ్లేషణా పక్షవాతానికి గురైనాయి. ప్రాజెక్టును ఏ స్థాయిలో నిర్మించాలనే విషయంలో ప్రభుత్వ పథక నిర్ణేతలు వేస్తున్న అడ్డుపుల్లల కారణంగా దేశరాజధానితో సహా పలుచోట్ల ప్రారంభించిన భారీ రోడ్డు, తదితర నిర్మాణాలు గత పదేళ్లుగా పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు వీటినే మళ్లీ  అధిక వ్యయంతో నిర్మించక తప్పని పరిస్థితి.

కాబట్టి హోమియోపతి మార్గంలో ప్లాన్‌ చేయడం నిజంగానే ప్రమాదరహితమైంది కానీ ఈ వైద్యం రోగాన్ని మరింత ఘోరంగా మారుస్తుంది. బుల్లెట్‌ ట్రైన్‌లో ఉన్న మంచి అంశం ఏమిటంటే, మొత్తం ప్రాజెక్టును, డబ్బును జపానీయులే నియంత్రిస్తారు. మోదీ ప్రభుత్వం పట్ల, భారీ ప్రాజెక్టులపై దానికి ఉన్న అనురక్తి పట్ల మీకు ఎన్ని డొంకతిరుగుడు వ్యవహారాలు ఉన్నా సరే.. పని పరిధి, వేగానికి సంబంధించి సాంక్రమిక భారతీయ భీతి మోదీ ప్రభుత్వానికి ఉందని మీరు ఆరోపించలేరు. హోమియోపతితో సహా ప్రత్యామ్నాయ వైద్యచికిత్సా వ్యవస్థల పట్ల తన నిబద్ధతను మోదీ పెంచుకున్నట్లయితే అది వేరే విషయం.

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
శేఖర్‌ గుప్తా
twitter@shekargupta

 

మరిన్ని వార్తలు