అంకుల్‌శామ్‌కు ‘ఆధార’మా?

18 Mar, 2014 04:55 IST|Sakshi
అంకుల్‌శామ్‌కు ‘ఆధార’మా?

ప్రజలకు అందవలసిన సేవలకు, ఒనగూర్చవలసిన ప్రయోజనాలకూ ఆధార్ కార్డును ముడిపెట్టరాదని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది! పర్యవసానంగా వంటగ్యాస్‌తో ఆధార్ లింకును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఆ కార్డుతో ఉండే ఇతరేతర ప్రమాదాలు తొలగలేదు.
 
 ‘‘జాత్యహంకారం మూర్తీభవించిన దక్షిణాఫ్రికాలో నేను ఉన్నప్పుడు నేటాల్ రాష్ట్రంలోని భారతీయులు అనుభవించిన బాధలలో ఒకటి - చట్టప్రకారం శ్వేత ప్రభుత్వ అధికారులు అడిగినప్పుడు విధిగా వేలిముద్రలు ఇవ్వటం! నేటాల్‌లో కూలీనాలీ చేసుకుని బతికే భారతీయులు శ్వేత ప్రభుత్వమిచ్చే పాస్‌లపైననే పనిపాట్లలోకి దిగాలి. కానీ వీరు స్వేచ్ఛాజీవులు కారు. నేనక్కడ ఉండగా వేలి ముద్రల గురించి రాసిన ఓ పుస్తకం చదివాను. నేరగాళ్ల నుంచి మాత్రమే ఈ వేలిముద్రలు తీసుకోవాలని చట్టం చెబుతోంది’’.
  - మహాత్మాగాంధీ: ‘‘ఆఫ్రికాలో జాత్యహంకారం’’ (1906-1914)

 గాంధీజీ ప్రస్తావించిన సందర్భం దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష శ్వేత ప్రభుత్వ కాలం నాటిది. స్వతంత్ర భారత ‘నల్ల’ పాలకులు కూడా ‘తెల్ల’ వాడి చట్టాలే ఆదర్శంగా అలాంటి వివక్షను అనుసరించగలరని ఊహించగలమా?! కానీ మన దేశంలో ఏదైనా సాధ్యమే. అందుకు ఉదాహరణ ‘ఆధార్’ కార్డు! ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు సేవలందించాలంటే సవాలక్ష మార్గాలున్నాయి, పథకాలున్నాయి, కొన్ని విధానాలూ ఉన్నాయి.
 
 ఇన్ని అవకాశాలు ఉండగా ‘ఆధార్’ పథకమంటూ ఓ గూఢచర్య వ్యవస్థను చాపకింద నీరులా ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమిటి? వంటగ్యాస్ సరఫరాకూ, ఆధార్‌కూ ఇప్పటిదాకా ఉన్న లింక్‌ను తెగ్గొడుతూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఆస్పత్రులలో సేవలు, ఆహార భద్రత, వివాహాల రిజిస్ట్రేషన్లు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతనాతాలు... ఏ సర్వీసులూ, సబ్సిడీలూ కావాలన్నా ‘ఆధార్’ కార్డు తప్పదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వంటగ్యాస్‌తో ఆధార్ లంకెను తాత్కాలికంగా పాలకులు లేకుండా చేసినా భవిష్యత్తులో ఇంకా సమస్యలు ఉండనే ఉన్నాయి.   
 
 ఆధార్ మూలాలు ఎక్కడ?
 ఇంతకూ ఈ వ్యవస్థకు మూలాలు ఎక్కడున్నాయి? ప్రపంచ బ్యాంకులో, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికన్ సామ్రాజ్య వ్యవస్థ, దాని గూఢచారి వ్యవస్థల్లో ఆ మూలాలున్నాయి! ఫలానా వాడు ఉగ్రవాది లేదా టైస్టు అయి ఉంటాడని అమెరికా ఎవడిని పేర్కొంటే ‘అవును, వాడు వాడే’నని అమెరికా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న ఇండియా లాంటి వర్ధమాన దేశాలు తలలూపి తీరాల్సిందే! ‘ట్విన్ టవర్స్’పై జరిగిన దాడి తరువాత ‘అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రారంభించిన పోరుతో చేతులు కలపడానికి సంకోచించే దేశాలూ అధినేతలూ అమెరికాకు వ్యతిరేకులుగా, టైజానికి అనుకూలురుగా ముద్రపడతారు’ అని మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ బెదిరించాడు.
 
 అది మొదలు అన్ని రకాల అమెరికా గూఢచారి సంస్థలూ తమ కార్యకలాపాలని వర్ధమాన దేశాలకు విస్తరించాయి. అమెరికా తమ దేశ రక్షణ పేరిట, మన దేశాల రక్షణ బడ్జెట్లను పెంచుకోమంటున్నాయి.  నిన్నగాక మొన్ననే అమెరికా సైనిక రక్షణ వ్యవస్థకు చెందిన ఒక కీలకమైన అధికారి స్నోడెన్ బయట పెట్టేవరకూ అమెరికా ‘జాతీయ భద్రతా సంస్థ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ)’ నిర్వాకమూ బయటపడలేదు. ఇండియా సహా అనేక ఆసియా దేశాలలో ఇంటర్నెట్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వగైరా ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా నాయకుల, వివిధ రకాలసంస్థల, వ్యక్తుల మధ్యా సాగుతున్న సంభాషణలను ఆ ఏజెన్సీ నమోదు చేస్తున్నది. ఆ నమూనాలో భాగంగానే, అమెరికా గూఢచర్యంలో అంతర్భాగంగానే ‘ఆధార్’లో కూడా అమెరికా ‘వేగు’ల వ్యవస్థ ప్రవేశించింది!
 
 పన్నెండంకెల మోసం
 ‘ఇన్ఫోసిస్’ మాజీ అధికారి నందన్ నిలేకనీ ఆధ్వర్యంలో దేశ పౌరులందరి వేలిముద్రలు, పౌరుల కనుపాపల వెనక దాగి ఉన్న ఉగ్రవాద ఛాయలనూ పసికట్టడం కోసం కేంద్రం ‘ఐరిస్’ ప్రయోగాలు ప్రారంభించింది. సంతకాలు సహా వ్యక్తిపరమైన పూర్తి సమాచార సేకరణకు ప్రత్యేక సంస్థనే 2010లో నెలకొల్పారు! అదే ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (యూఐడీఏఈ). ఆ తర్వాత వచ్చిన ఆలోచనే ‘ఆధార్’ కార్డు. ‘ఆధార్’కార్డుదారులకు 12 అంకెల నంబరు ఇవ్వాలని నిర్ణయించారు.
 
 ఈ ‘ఆధార్’ స్కీమును ఉత్తి నోటిమాటగా మాత్రమే ముందు ఐచ్ఛికమైన  పథకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించజూసింది. క్రమంగా ‘ఆధార్’ పథకాన్ని పౌరుడు విధిగా తలదాల్చి తీరాలని ఆదేశించింది. ఈలోగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి (రిటైర్డ్) మొదటిసారిగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దానిపైన సుప్రీం (24.9.2013) ప్రజలకు అందవలసిన సేవలకూ, ఒనగూర్చవలసిన ప్రయోజనాలకూ ఆధార్ కార్డును ముడి పెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది! రేషన్ షాపులలో రేషన్ కార్డుల మీద ఆహార పదార్థాలు అందించవలసిన చోట ‘ఆధార్’ ఎందుకని ప్రశ్నించింది. ‘ఆధార్’ వ్యవస్థకు పార్లమెంటు అనుమతి లేదు. కేవలం ప్రభుత్వస్థాయిలో జరిగిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు తప్ప మరొకటి కాదు కనుక ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు అన్న పుట్టస్వామి వాదనతో సుప్రీం అంగీకరించింది. పైగా వ్యక్తిగత సమాచారాన్ని గూఢంగా సేకరించడం వ్యక్తి జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ‘21వ అధికరణ’ను ఈ ఆధార్ వ్యవస్థ ఉల్లంఘిస్తోంది.
 
 అన్నిటా అమెరికా హస్తమే!
 ఒకవైపున అమెరికా ‘జాతీయ భద్రతా వ్యవస్థ’ భారత రాజకీయాల్లో, రోదసీ కార్యక్రమాల్లో, అణుశక్తి వినియోగ ప్రయోగాల్లో తలదూర్చుతున్నది. ఈ దశలో - ‘థాట్ వర్క్స్’(ప్రపంచవ్యాపిత సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్ సంస్థ)అధ్యక్షుడు, వ్యవస్థాపకుడైన నావెల్లీ రాయ్ సంఘం చేసిన హెచ్చరికను విస్మరించరాదు. ప్రపంచపు ‘వెబ్’ ఆధారంగా నడుస్తున్న అనంత సమాచారాన్ని అనుక్షణం మానిటర్ చేస్తున్న అమెరికా దురాలోచన గురించిన హెచ్చరిక ఇది: నెవెల్లీ మాటల్లోనే ‘ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ‘చిప్’తో, లేదా వ్యక్తుల వేలిముద్రల ఆధారంగాగానీ కొత్త ‘ఐ’ ఫోన్ సిస్టంనే బద్దలుకొట్టి తీసిన సమాచారాన్ని సరాసరి అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ)కు బట్వాడా చేయొచ్చు’. అంతేగాదు, అంతర్జాతీయ ఇంటర్నెట్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, ఫేస్‌బుక్, పాల్‌టాక్, ఏడీఎల్, స్కైప్, యూట్యూబ్, యాపిల్ వగైరా కంపెనీలు అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థకు చెందిన ‘ప్రిజమ్’ గూఢచారి కార్యక్రమాలలో యథేచ్ఛగా పాల్గొంటున్నాయనీ, ఈ ఇంటర్నెట్ కంపెనీల ‘సర్వర్ల’ నుంచి సరాసరి వ్యక్తిగత సంబంధమైన సమాచారాన్నంతటినీ సేకరించుకుంటుందనీ మరచిపోరాదు!
 
 ఈ అంశాలు గమనించవద్దా?
 ఇందులో భాగంగా దేశంపైకి ముంచుకొచ్చిందే ‘ఆధార్’ వ్యవస్థ! గతంలో వ్యవస్థలకు పునాది వ్యవస్థనే, ‘ఆధార్’ను పోలిన వ్యవస్థనే 1785లోనే సామాజిక శాస్త్రవేత్త జెర్మీ బెంతామ్ ఖైదీలకు తెలియకుండా జైలులోని వారి పనుల్ని గమనించగల ఓ పారదర్శక చిట్కాను (‘పానోప్టికాన్’ గూఢచర్య వ్యవస్థ) వార్డెన్‌ల కోసం రూపొందించాడట! అలాంటిదే ‘ఆరవీలియన్ బయోమెట్రిక్ వ్యవస్థను 1933లోనే నాజీ పాలకులు జర్మనీలో ప్రవేశపెట్టారు. ఆధార్ కార్డు లాంటి ‘హోలెరిత్ డి-11’ కార్డు వ్యవస్థను అమలు జరిపారు! అలాగే ఆధార్‌లో నిక్షిప్తమై ఉన్న పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశీ, స్వదేశీ గూఢచారి సంస్థలు యథేచ్ఛగా దుర్వినియోగమూ చేయవచ్చు!    
- (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)

మరిన్ని వార్తలు