సమూహమే మతమైపోతే...

4 Aug, 2017 01:08 IST|Sakshi
సమూహమే మతమైపోతే...

సందర్భం
ఏం చేసినా గుంపులో కొట్టుకుపోతుంది కనుకనే గుంపుకి తెగింపు ఎక్కువ. తాము చేసిన ఏ చర్యకీ సొంత బాధ్యత ఉండదన్న ధీమా. సమూహం కూడా ప్రశ్నించ వీలులేని ఒక మతంగా స్థిరపడుతున్నపుడు దానిని తప్పక ప్రశ్నించడానికి పూనుకోవాలి.

‘మనిషికో రుచి అంటే మాటలా! ఎక్కువమందికి ఏది నచ్చితే మిగతావాళ్లూ అదే తినాలి.’ ఇళ్లలో వండి వడ్డించేవారు తరచుగా అనేమాట ఇది. ఒక మనిషి ఇష్టాయిష్టాలని అందరి ప్రయోజనంలోనుంచి చూడట మనేది ఒక విలువగా కుటుంబం నుంచే మొదలవుతుంది. అక్కడ నుంచి అది విస్తరించని చోటు లేదు. వ్యక్తులుగా సాధించలేని అనేక విషయాలను మనుషులు గుమిగూడి సాధించారు. మానవ చరిత్ర పొడవునా ఈ విజయాలకు అత్యున్నత గౌరవం ఉంది. సమస్యలు ఎదురైనపుడు అందరొక్కటై చేసిన తిరుగుబాట్లు, విప్లవాలు, తోవ తెలియని చోట్ల చేయి చేయి కలిపి సాగించిన అన్వేషణలు, అనేక ఆలోచనలను కలిపి కుట్టి నిర్మించిన ఆవిష్కరణలు ఒకటా రెండా.. వేలఏళ్లుగా నాగరికతా ప్రస్థానంలో సమూహానిదే పై చేయి.

అమెరికన్‌ రిపబ్లిక్‌ పతనమై కార్మికోద్యమం బలపడుతుందన్న ఆశతో కాల్పనిక నగరాలను వాస్తవిక పునాది మీద అల్లిన నవల ‘ఉక్కుపాదం’. తిరుగుబాటు చివరి దశలో–చింకిపాతలతో ముళ్ళవలే రేగిన జుత్తుతో లోతుకుపోయిన పొట్టలతో పగిలి కాయలు కట్టిన కాళ్ళూచేతులతో నడిచే అస్థి పంజరాలని నింపుకున్న ఒక బీదరికపు అల.. వీధుల్ని ముంచెత్తివేస్తూ రావడాన్ని జాక్‌ లండన్‌ ఎలా వర్ణించాడు! తమ కోసమే జీవితాలను త్యాగం చేసిన విప్లవ నాయకులను తోసుకుంటూ తమ కాళ్ళకింద పడినవారిని కసబిస తొక్కుకుంటూ ప్రాణభీతితో పరుగులు తీసినవారి నిస్సహాయ సమయాలను చదివినపుడు, పీడితుల్ని మానవీయంగా ఉండనివ్వని ఆ స్థితి పట్ల క్రోధం ఎంత ఉన్నా వారందరినీ గుండెలకి హత్తుకున్నాం.

అయితే సమూహానికి ఎల్లప్పుడూ పీడిత ముఖమే ఉండదని చరిత్ర చెప్పింది. వర్తమానమూ చెపుతోంది. ఆధిపత్య కులపు స్త్రీలని ప్రేమించిన పాపానికి పునాది కులాల పురుషులని చిత్రవధ చేసి మరీ ప్రాణాలు తీసేది, సినీనాయికలో, డ్యాన్సర్లో నలుగురిలోకీ వచ్చినపుడు వారిని చాటుగా తడిమీ పామీ గిచ్చీ సంతోషపడేది, తమ ఆహా రపు అలవాట్లని కొనసాగించేవారి పెడరెక్కలు విరిచికట్టి వారి నోట మట్టి గొట్టేది, తక్కువ బట్టలు కట్టుకున్న స్త్రీకి బుద్ధి చెప్పడానికి, బట్టలన్నీ ఒలిచి నగ్నంగా ఊరేగిస్తూ సంస్కృతిని పరిరక్షించేది, ఈ సమూహపు మరో ముఖమే.

సమూహపు అసలుముఖంపై నీలినీడలు కమ్ముకుని మరోముఖం భయపెడుతున్న దుర్మార్గపు రోజులివి. మూక విజ్ఞత ఏకరూపంలో ఉండదు. అనేక స్వభావాల మనుషుల వలన అడ్డుకట్ట లేని ప్రవాహంలా విశృంఖలంగా పారుతుంటుంది. ఆయా వ్యక్తుల విజ్ఞతని ప్రయోజనకరంగా మలిచి వారందరినీ ఏక తాటిమీదకి తెచ్చే బలమైన కామన్‌ అంశం ఏదో ఉండాలి. అందరి దృష్టి దాని వైపు మళ్ళించి ముందుకు నడిపే శక్తులు బలంగా ఉండాలి. అటువంటి ఉదాత్తత ఏమీ లేని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఆధిపత్యాన్ని స్థాపించుకోవడానికి, తమకి భిన్నంగా కనిపించేదాన్ని తమకి నచ్చనిదాన్ని అణిచి వేయడానికి ఒక ఎజెండా నిర్మించుకునే సమూహాలు ఉంటాయి. ఈ ఎజెండాకి సహకరించడానికి వాలుకు కొట్టుకుపోయే మనుషులు, మాబ్‌ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు సిద్ధంగా ఉంటారు. కడుపునిండా తిని కట్టుగుంజకి ఆనుకుని బద్ధకంగా నెమరువేసుకునే ఆవులా, మిగతా సమాజం ఈ ఆటని చూసీచూడనట్లు ఓరకంటితో వీక్షిస్తూ ఉంటుంది. సమూహం ఎప్పుడూ వైబ్రంట్‌గానే ఉంటుంది. మంచికి మంచి చేయడానికీ చెడుకి మంచి చేయడానికి కూడా.

ఏం చేసినా గుంపులో కొట్టుకుపోతుంది కనుకనే గుంపుకి తెగింపు ఎక్కువ. తాము చేసిన ఏ చర్యకీ సొంత బాధ్యత ఉండదన్న ధీమా. బాధ్యత పడాల్సి వచ్చినా తప్పుని నలుగురితో కలిసి పంచుకుంటామన్న ధైర్యం. రక్షణ వ్యవస్థల అలసత్వం, అవసరమైతే ఈ శక్తులకి కొమ్ము కాయడం లాంటి వాటి వల్ల స్త్రీలూ, దళితులు, మైనార్టీ మతాలవారు సమాజంలో స్వేచ్ఛగా ఇప్పటికీ సంచరించలేని స్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పుండు మీద కారం జల్లుతూ మతవాద శక్తులు వేగంగా ఏకీకృతం కావడం కొత్తబెదురుని సృష్టిస్తోంది. ఈ స్థితిని అదుపు చేసి సమూహాలకి బాధ్యత గుర్తుచేసే పనిని ఎవరు స్వీకరించాలి?

తరగతి గదులు పిల్లలందరినీ కలిపి గుచ్చిన పూలమాలల్లాంటివి. వారు వ్యక్తులుగా వికాసం చెందుతూనే సమూహజీవులుగా ఎట్లా మెలగాలో ఉపాధ్యాయులు తాము తెలుసుకుని పిల్లలకి చెప్పాలి. ఇళ్ళు, ప్రయాణాలు, వినోద స్థలాలు, సంతలు, తిరునాళ్ళు, మాల్స్, సభలు సమావేశ మందిరాలు, ఎక్కడెక్కడ మనుషులు కూడుతారో అక్కడల్లా ఎవరి ప్రవర్తనకి వారు బాధ్యత పడాల్సిందేనని, సొంత విజ్ఞత ఉండాల్సిందేనని మనసు పదేపదే గుర్తు చేసేలా శిక్షణ సాగాలి. సమూహం కూడా చివరికి ప్రశ్నించ వీలులేని ఒక మతంగా స్థిరపడుతున్నపుడు దానిని తప్పక ప్రశ్నించడానికి పూనుకోవాలి. మెజారిటీ ఓటరు దేవుళ్ళ సమూహం నిర్ణయించిన నాయకులను నెత్తిన పెట్టుకోలేక నిరంతర ప్రతిపక్షంగా మారడం ఒక తిరుగుబాటు. అనేక ప్రేక్షక మహాశయుల అభిరుచి మేరకి తీసే వ్యాపార సినిమాలను చూడలేక, పుంజీడుమంది కూడా లేని స్లో మూవీ హాల్లో చప్పట్లు కొట్టడం ఒక సూటిప్రశ్న. ఎక్కువమంది పాఠకదేవుళ్ళ మెచ్చుకోళ్ళకి రోసి, నచ్చిన అక్షరాన్ని గుండెనుంచి పెకలించడమొక ఖలేజా. సంస్కృతీ పరిరక్షకులు. దేశభక్తులు, గుంపులో గోవిందమ్మలూ గోవిందయ్యలూ పాడే సామూహిక గీతాల ప్రకంపనలకు చెవులు మూసుకుని మైనారిటీ స్వరాన్ని అట్టడుగు నుంచి తెరవడం ఒక బాధ్యత. మన బాధ్యత.

వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ)
ఈ–మెయిల్‌ : malleswari.kn2008@gmail.com
డా. కేఎన్‌. మల్లీశ్వరి

మరిన్ని వార్తలు