ఎందుకా కవిత్వం ఏడవనా?

25 Jan, 2016 03:46 IST|Sakshi
ఎందుకా కవిత్వం ఏడవనా?

పుస్తకం లోంచి...

 

మహాకవులు ఎవరయినా తీసుకోండి ఎవరయితే ప్రజల్ని ప్రభావితుల్ని చేశారో నాగరికతల్ని సంస్కృతుల్ని సృష్టించారో అలాంటి కవులు అందరూ వాళ్ళ కవిత్వాన్ని వర్తమాన భాషలోనే రాశారు. వాళ్ళు కవిత్వం కవిత్వం కోసం రాయలేదు, స్వకీర్తి కోసం రాయలేదు, మనుషుల్ని మార్చాలని రాశారు. అది ఒక మహత్తరమైన ద్రష్టృత్వం.కనకనే వాళ్ళ మాటకు మనిషిని మార్చే శక్తి వచ్చింది. ఆ శక్తి ఉన్న మాటే కవిత్వం అనిపించుకుంది అనిపించుకుంటుంది. లేకపోతే ఎందుకా కవిత్వం ఏడవనా? తుపాకి చూపించి ఈ పని చెయ్ అన్న ధర్మశాస్త్రం మనిషిచేత బలాత్కారంగా పని చేయిస్తుంది.

 

కానీ శక్తివంతమైన మాట మనిషిలో ఉన్న నిజపదార్థాన్నే మార్చి వేస్తుంది, తద్వారా ఒక ఐచ్ఛిక ఆంతరిక పరిణామాన్ని తెస్తుంది. తుపాకిశక్తికీ మాటశక్తికీ ఉన్న తేడాయిది. మనుపు ఆపస్తంబుడు చూపించిన తుపాకులు ఈనాడు లేవు మనిషి వాటి బెదురుతో నడవడానికి, కానీ వాల్మీకి మాట ఈనాటికీ ఉంది. మనిషిని నడుపుతూనే ఉంది. అరే పిచ్చోడా! తుపాకి ఎవడైనా పట్టుకుంటాడు; కలం ఎవడైనా పట్టుకునేది కాదు. ఈ రోజు భారతదేశంలో మనుషులు ఒక సామాజిక జీవనం చేస్తున్నారంటే అరణ్యక జంతుజీవనం చెయ్యడం లేదంటే ఈ దేశానికి అది రామాయణ మహాభారతాలు పెట్టిన భిక్షే.

 

అన్య ఆధునిక విలువల చేత రామాయణం ప్రతిపాదించిన కొన్ని విలువల తీరాలు నేడు కోసుకుపోతుంటే పోవచ్చుగాక కాల ప్రవాహ వేగంచేత, దాన్ని ప్రతిఘటించవలసిన అవసరం లేదు. ఏ యుగపు ప్రజలు ఆ యుగం కోసం వాళ్ళ విలువల్నీ వాళ్ళ ప్రపంచాన్నీ వాళ్ళు నూతనంగా సృష్టించుకుంటారు. అది కాలధర్మం. ‘‘ప్రాప్తకాల ముపాస్యతాం’’ అన్నాడు వాల్మీకే- కాని ప్రస్తుత విషయమేమిటంటే ఆ మహాకవులు కొన్ని విలువల్ని ప్రతిపాదించి ఆ విశాల వలలో ప్రజానీకాన్ని పట్టి ఉంచారు గనక గానీ, లేకపోతే ఈ ప్రజలు ఏ క్షణంలోనో మళ్ళీ జాంతవ స్థితికి జారిపడేవారే.

-  గుంటూరు శేషేంద్ర శర్మ

 (‘కవిసేన మేనిఫెస్టో’ నుంచి...)

మరిన్ని వార్తలు