హరినామ సంకీర్తనం

27 Dec, 2014 04:54 IST|Sakshi
హరినామ సంకీర్తనం

‘‘మాసానాం మార్గశీర్షోస్మి’’ అనే గీతా సూక్తి మార్గ శీర్ష మాసాన్ని వైష్ణవ మాసంగా పేర్కొంటున్నది. ఈ మాసంలో హరి నామాన్ని నోరారా పలికితే సకల శుభాలు కలుగుతాయని గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో పలుమార్లు పేర్కొన్నది. పోతన ‘‘శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’’ అంటూ భగవన్నామాన్ని పలుకని నాలుక నాలు కే కాదని, నోరు నొవ్వంగ భగవన్నామాన్ని పలకాలని ఉపదేశించాడు. కలియుగంలో హరినామస్మరణాన్ని మించినది లేదని ‘‘కలౌనామ సంకీర్తనమ్’’ వంటి సూక్తులు ప్రబోధిస్తున్నాయి. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల, ద్వాపర యుగంలో అర్చనల వల్ల ఎటువంటి మహోన్నత ఫలితాలు కలిగినవో, అట్టి మహా ఫలితాలు ఈ కలియుగంలో కేశవుని కీర్తించుట వల్ల కలుగుతాయని ‘‘ధ్యాయన్ కృతే, యజన్యజ్ఞై స్ర్తేతాయామ్‌
 ద్వాపరే ర్చయన్ యథాప్నోతి తదాస్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్‌॥


 అనే విష్ణుపురాణ శ్లోకం (వి.6-2-17) ద్వారా తెలియుచున్నది. భగవన్నామ సంకీర్తనకు కఠోర నియమాలేవీ ఉండవు. త్రికరణశుద్ధిగా చేస్తే చాలు. సమయ సందర్భాలు కూడా నామ సంకీర్తనకు వర్తించవని పెద్దల మాట. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపాలన్నీ నీటిలో ఉప్పు కరిగినట్లు కరిగిపోతాయని
 ‘‘జ్ఞానతో జ్ఞానతోవా పి వాసుదేవస్య కీర్తనాత్‌
 కిల్బిషం విలయం యాతి తోయేన లవణం యథా॥’’
 అనే శ్లోకం ఉద్బోధిస్తున్నది. నీరు అగ్నిని చల్లార్చు నట్లు, సూర్యకాంతి చీకటిని పోగొట్టునట్లు కలి మాలిన్య మును, పాపరాశినంతటిని భక్తితో చేసే హరినామ సంకీర్తనమొక్కటియే నశింపజేయునని
 ‘‘శమాయాలం జలం వహ్నేస్తమసో భాస్కరోదయః
 శాన్తిః కలౌ హ్యఘౌఘస్య నామ సంకీర్తనం హరేః॥
 అనే శ్లోకము మనకు ఉద్బోధిస్తున్నది.
 వేల గంగా స్నానములు, కోటి పుష్కర స్నానముల వల్ల తొలగని పాపములు కూడా హరినామస్మరణ వల్ల నశిస్తాయని, తపస్సు ద్వారా, కర్మానుష్ఠానము ద్వారా చేయు ప్రాయశ్చిత్తములకంటెను శ్రీకృష్ణ నామస్మర ణమే సర్వశ్రేష్ఠమైనదని మన ప్రాచీన వాఙ్మయంలో ఉంది. ఏకాగ్రచిత్తులై మధుసూదనుని స్మరించువారు పుట్టుక, చావు, ముసలితనము అనే మొసళ్లతో కూడిన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటగలుగుతారని, అందుకు వేరొక సులభోపాయమేదీ లేదని
 ‘‘ఏకమేకాగ్రచిత్తస్సన్ సంస్మరన్మధుసూదనమ్‌
 జన్మమృత్యుజరాగ్రాహం సంసారాబ్ధిం తరిష్యతి॥
 ‘‘నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే’’
 వంటి ప్రమాణములు మనకు ఉద్బోధిస్తున్నాయి.
 శ్రీ రామచంద్రస్వామి కన్న శ్రీరామ నామ మహి మయే గొప్పదని భావించే మనము నోరారా భగవన్నా మాన్ని పాడి సకల శుభాలను సొంతం చేసుకుందాం.
- సముద్రాల శఠగోపాచార్యులు

మరిన్ని వార్తలు