ఉల్లిపాయ... మహా మాయ...

27 Oct, 2013 00:15 IST|Sakshi
ఉల్లిపాయ... మహా మాయ...

ఢిల్లీలో 1998లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కారణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే.  ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం.
 
 ‘టైర్లు కొంటే ఉల్లిపాయలు ఉచితం!’ ఇది కొద్దిరోజుల క్రితం జార్ఖండ్‌లో ఒక దుకాణం ముందు కనిపించిన రాత.  ఇలాంటి ఎరల వివరాలు ఇంకొద్ది రోజులలో బంగారం దుకా ణాల ముందు వెలిసినా ఆశ్చర్యపోవక్కర లేదు. ఉల్లినీ, టొమేటోనీ  బ్యాంకు లాకర్లలో పెట్టి ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు వినూత్న నిర సన తెలియచేశారు. ముందు ముందు టీవీ లూ మోటారుబైక్‌లూ లేదా నగలూ - వీటిని కాదు దొంగలు ఎత్తుకువెళ్లేది, ఉల్లిపాయలనే, అని కాన్పూరు ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్య అక్కడ చాలా ప్రాచుర్యం పొందింది.
 
 ఉల్లి సంక్షోభం, ధరలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇది దేశానికి కొత్తకాదు. పొరలు ఒలిచిన కొద్దీ ఉల్లిఘాటు పెరిగినట్టు, సంక్షోభం తరువాత సంక్షోభం తీవ్రమౌతోంది. కానీ తాజా ఉల్లి సంక్షోభానికి ప్రత్యేకత ఉంది. ఇది సామా న్యుల చేతకంటె రాజకీయ పార్టీలనీ, ముఖ్యం గా కొందరు ముఖ్యమంత్రుల చేత ధారాపా తంగా కంటనీరు పెట్టిస్తున్నది. రెండురోజుల క్రితం రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కిలో వంద రూపాయలకు ఎగబాకిం ది. ముంబై, పాట్నా, చండీఘడ్‌లలో కూడా అంతే పలుకుతోంది. ఈ ఘాటుతో మొదట వణికిపోయిన రాజకీయ నేత ఢిల్లీ ముఖ్య మంత్రి షీలాదీక్షిత్. ప్రతికూల సర్వేలతో కుం గిపోయి ఉన్న కాంగ్రెస్ అడ్డూ అదుపూ లేకుం డా పెరుగుతున్న ఉల్లి ధరతో అక్షరాలా వణికి పోతోంది. అత్యవసరంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌తో సమావేశమైన షీలా దీక్షిత్ చర్యలు తీసుకోవాల్సిందని వేడుకున్నా రు.
 
 కోడ్ అమలులో ఉన్నందున, చౌక ధరలో ప్రజలకు ఉల్లి అందించడానికి అనుమతి ఇవ్వ వలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాలని కూడా షీలా భావిస్తున్నారని వార్తలు వచ్చా యి. అంటే  ఆహారంలో ప్రధాన దినుసుగా ఉండే ఉల్లి లేక దేశంలో అత్యధిక కుటుం బాలు బాధ పడుతున్నందుకు నేతలు కదల డంలేదు. డిసెంబర్ 4న జరిగే ఎన్నికలలో పార్టీకి ఉల్లి పా(మా)యతో జరగబోయే చేటు గురించి కలవరపడుతున్నారు. ఢిల్లీలో 1998 లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కార ణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. దేశంలో మూడింట రెండొంతుల మందికి బియ్యం, గోధుమ ఇవ్వడానికి ఉద్దే శించిన ఈ చట్టం ఉల్లి ఘాటును మాత్రం తట్టుకోలేదు. ప్రపంచ చరిత్రలోనే విస్తృత మైన ఆహార రాయితీ పథకంగా పేరు తెచ్చు కున్న భారత ఆహార భద్రత చట్టం, ఉల్లి సంక్షోభాల చరిత్ర ముందు తెల్లమొహం వేయవలసివచ్చింది.
 
 ఈనెలలో ఒక్క మూడో వారంలో ఉల్లి టోకు ధరలు 36 శాతం పెరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ లెక్క ప్రకారం జూన్, 2012 నుంచి ఇప్పటిదాకా ఉల్లి ధర 114 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్/మే మాసాలలో టోకు మార్కెట్‌లో కిలో రూ.8కి అమ్మకాలు జరిగితే, బయట కిలో రూ.20 వంతున అమ్మారు. ఇంతలో ఎంత మార్పు! కాబట్టి ఇది కృత్రిమ సంక్షోభమంటూ వినిపిస్తున్న వాదన తోసిపుచ్చలేనిది. మన రాష్ట్రంలో కూ డా వంద దిశగా ఉల్లి ధర పరుగులు తీస్తోంది. నిరుడు అకాల వర్షాలతో దిగుబడి 20 శాతం తగ్గిన మాట నిజమే అయినా, ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగాయి. దేశంలో ఎనిమి దిన్నర లక్షల హెక్టార్లలో పదిహేను నుంచి పదిహేడు మిలియన్ టన్నుల ఉల్లి పండిస్తు న్నారు. ఇందులో 80 శాతం మహారాష్ట్ర, కర్ణాటకలదే.
 
 శరద్ పవార్ సొంత రాష్ట్రంలోనే నాసిక్ పరిధిలో దిగుబడి తగ్గింది. అయినా కొన్నేళ్ల నుంచి ఉల్లి ఎగుమతుల మీద ఉన్న నిషేధాన్ని కేంద్ర వ్యవసాయమంత్రి ఎత్తేశారు. ఇలాంటి నిషేధాలు విధిస్తే నమ్మకమైన ఉత్పత్తిదారుగా భారత్ మీద ప్రపంచ దేశాలకు నమ్మకం పోతుందని ఆయన వాదన. మన ఉల్లి ప్రధా నంగా బంగ్లాదేశ్‌కు వె ళుతుంది. ఇందులో ఎక్కువ అనధికారిక ఎగుమతులేనని చెబు తారు. అరబ్ దేశాలకీ, శ్రీలంక, హాంకాంగ్, మలేసియా వంటి చోటికి మన ఉల్లి ఎగుమతి అవుతోంది. ఉల్లి ఎగుమతులు ఆపేస్తే దాని ప్రభావం ఇతర ఉత్పత్తుల మీద కూడా పడు తుందని పవార్ చేస్తున్న వాదన ఎలా ఉన్నా  దేశంలో సామాన్యుడి మాటేమిటి? ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలలో వస్తున్న ఈ మార్పులకు కారణం రహస్యం కాదు.
 
  దేశంలో జరుగుతున్న కూరలు, పళ్ల ఉత్పత్తిలో నలభై శాతం మార్కెట్‌కు రాకుండానే ధ్వం సం అవుతున్నాయని రిజర్వు బ్యాంకు ఒక సర్వేలో పేర్కొంది. ఇప్పుడు భారత్ ఉల్లి దిగుమతి చేసుకోవాలని, లేదంటే రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ మరింత కుంగిపోవడం ఖాయమని ఢిల్లీ ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా రు. ఇరుగు పొరుగు లేదా ఉల్లి ఎగుమతి చేసే చైనా, ఈజిప్ట్ దేశాలలో కూడా పరిస్థితి ఆశా జనకంగా లేదు. అయితే వర్షాలు పడితే సమస్య తీరిపోతుంది. ఇది తాత్కాలికం- ఇదీ  పవార్ జవాబు. అంటే ఉల్లి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది.  
 
 ఉల్లిపాయలు అందక సామాన్య జనం రుచీపచీ లేని భోజనం చేస్తూ గడుపుతు న్నారు. కానీ ఎన్నికలలో వీరంతా ప్రభుత్వాల చేత చేదుగుళికలు మింగిస్తారు. ఆ భయం రాజకీయ నాయకులలో ఎక్కువగానే కనిపి స్తోంది. ఉల్లి ఇప్పుడు వంటింట్లో చిన్న దిను సు కాదు.  ప్రభుత్వాలను మార్చే కింగ్‌మేకర్ స్థానాన్ని ఆక్రమించింది. తస్మాత్ జాగ్రత్త.
 - డా॥గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు