ప్రపంచానికి సున్నా నేర్పింది మనమే!

20 Dec, 2014 01:08 IST|Sakshi
ప్రపంచానికి సున్నా నేర్పింది మనమే!

‘‘ఒకాయన రైతుని రాజుని చేస్తానని చెబుతాడు. ఇంకొకాయన ఎకరాకి కోటి ఆదాయం తీస్తున్నానంటాడు. ఈ భూమ్మీద హైబ్రీడ్ గంజాయి పండించినా ఎకరాకి కోటి రాదు. ఛాలెంజ్’’ ఆ ఆసామి మాటలు తీవ్రంగా వినిపించాయి.
 
 ‘‘అనుకోడానికీ ఆచరణ కీ తేడా ఉంటుంది. ఊరిఖే మేనిఫెస్టోలను పట్టుకుని వేలాడకూడదు.’’ గుట్టల్లో కి వెళ్తున్న గొర్రెల్ని అదిలి స్తూ అన్నాడు ఆ ఆసామి. హైవే మీద నా బైకు ఆగిపోయింది. సెల్‌ఫోన్ చార్జ్ అయిపోయింది. నాకే దో దారి దొరికేదాకా ఈ ఆసామితోనే కాలక్షేపం చెయ్యాల్సి ఉంది. నేను సరిగ్గా బోర్డర్‌లో ఉన్నాను. ‘‘...నా చిన్నప్పుడు, నాకిప్పిడు డెబ్భై దాటా యండీ, పంచశీల పంచవర్ష ప్రణాళికలూ చదవలేక రాయలేక చచ్చేవాళ్లం. తర్వాత వాటి అడ్రస్ లేదు. ఎప్పుడైనా సినిమా పాటల్లో వినిపిస్తుంటాయి.’’ ఆయన మాటలకు అర్థం కానట్టు చూశాను. మేత దొరికినప్పుడు పశువులు ఆబగా మేసేస్తాయి. తర్వా త రికామీగా నమిలి మింగుతాయి. వీళ్లేంటండీ, హాయిగా నెమర్లేసుకోక ఊరికే పిచ్చికేకలు. నాట కంలో మనకి పోర్షన్ లేనప్పుడు సెలైంట్‌గా ఓ మూల కూచోవాల. సైడువింగ్‌లోంచి మొహాలు బయటకు పెట్టి మైకు అందుకోవాలని తహతహ లాడ కూడదు. ప్రజారాజ్యంలో అందరికీ చాన్స్ ఇవ్వాల. మొన్నటిదాకా మనం పిండుకున్నాం కదా, ఓసారి వాళ్లకి వదులుదామనే మంచి బుద్ధి ఉండాల. ఆసామి మాటల్లో ఏమాత్రం వ్యంగ్యం ధ్వనించ లేదు.
 
 ‘‘ఒకాయన రైతుని రాజుని చేస్తానని చెబు తాడు. ఇంకొకాయన ఇప్పటికీ ఎకరాకి కోటి ఆదా యం తీస్తున్నానంటాడు. అసాధ్యం. ఈ భూమ్మీద హైబ్రీడ్ గంజాయి పండించినా ఎకరాకి కోటి రాదు. ఛాలెంజ్’’ ఆసామి మాటలు కొంచెం తీవ్రంగా విని పించాయి. ఏదో కోపం దాగి ఉన్నట్టు అనిపించింది. నా హయాంలో నా రెక్కల కష్టంతో బాటు నాలుగు జతల దుక్కిటెడ్ల రక్తమాంసాలతో బాటు అరవై ఎకరాల మాగాణి, నలభై మెట్ట పోగొట్టుకున్నవాణ్ణి. విలాసాలు ఎరుగను, వ్యసనాలు లేవు. కంటి నిండా నిద్ర ఎరుగను....’’ ఆయన స్వరం మారింది. నేను సూటిగా తన వంక చూడలేకపోయాను.
 
 ‘‘.... అంటే ఏదీ లాభసాటి కాదంటారు!’’ టాపిక్ మార్చే ప్రయత్నంలో అన్నాను. ‘‘కొన్ని చెప్పడానికి బావుంటాయండీ! ఒక పక్క వ్యవసాయం, ఇంకోపక్క పాడిపశువులు, గొర్రెలు, పందులు, కోళ్లు, బాతులు, కుందేళ్లు, ఉష్ట్ర పక్షులు, ఇంగో పక్క చేపలు, జెల్లలు, రొయ్యలు, మంచిముత్యాలు మరింగో పక్క కొబ్బరి, పామ్, కోక్... ఇట్లా చెబుతావుంటే ఘంటసాల పాట విం టున్నట్టుంటది.’’ ఒకసారి నిష్టురంగా నవ్వి, ‘‘మనం పవర్లో ఉంటే మన బర్రెల దొడ్లో ఆవులు రోజుకు అయిదు పూటల పాలిస్తాయి- పూటకి పదిలీటర్లు తగ్గకుండా. పవర్లో ఉంటే పంట సెంటుకి క్వింటా దిగుద్ది. మనోళ్లుత్త సన్నాసులండీ- వ్యవ సాయం అంటే ఏమిటో ప్రపంచానికి మనం నేర్పాం. మన సన్నాసులు చేపలకు ఈదడం, పక్షులకు ఎగ రడం నేర్పిస్తామని వాటికోసం కాలేజీలు పెట్టేం దుక్కూడా వెనకాడరండీ!’’అన్నాడు.
 
 ‘‘అయితే జపాన్ టెక్నాలజీ లాభం లేదం టారు!’’
 ‘‘నేనెందుకంటానండీ, అనుభవం చెబుతుం దండీ! కుప్పం క్షేత్రాలు, ఇజ్రాయల్ ఎగసాయాలు ఏమైనాయి? యాభై ఏళ్లనాడు బాపట్ల వ్యవసాయ కాలేజీ కింద ఒక జపాన్ ముఠా పనిచేసింది. అక్కడ మకాం వేసి నాలుగైదేళ్లు సందడి చేశారు. చివరికి, ‘రండి నూర్పిడి చేసి ఫలితాలు చూపిస్తామ’న్నారు. అప్పట్లో మన వ్యవసాయ మంత్రి తిమ్మారెడ్డి... ఆయన స్వయంగా వచ్చారండీ!’’
 
‘‘ఇంతకూ దిగుబడి....’ ఆత్రంగా అడిగాను.  మా దేశంలో ఒక ఎకరాకి వేసే ఎరువు ఒక కోటు జేబులో సరిపోతుందన్నాడు మొదట్లో, ఆ జపానాయన. దిగుబడి రెండు కోటు జేబుల్లో సరిపో తుందండీ అని హాయిగా నవ్వాడు. ఎట్టకేలకు ఒక లారీని ఆపి నాగోడు వినిపించాను. బండితో సహా లిఫ్ట్ ఇవ్వడానికి బేరం కుదిరింది. ‘‘మీ కబుర్లతో నాకు పొద్దే తెలియలేదు. ఈ పాలనలేవీ మీకు అంతగా నచ్చినట్టు లేదు’’ అన్నాను. ‘‘అయ్యో! ఎంతమాట. హెలికాప్టర్లు గద్దలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఇప్పుడు పరిపాల నంతా గాల్లోంచే....’’ ఆయన మాటల్లోంచి లారీ బయలుదేరింది.
 
(వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)

 - శ్రీరమణ

మరిన్ని వార్తలు