మన పోరాట చేవకు ఐసిస్ సర్టిఫికెట్ అవసరమా?

29 Nov, 2015 08:02 IST|Sakshi
మన పోరాట చేవకు ఐసిస్ సర్టిఫికెట్ అవసరమా?

అవలోకనం
ఐసిస్‌లో చేరిన భారతీయులకు పోరాట చేవ తక్కువ అనే భావంతో ఉగ్రవాద సంస్థ కించపరుస్తోందనే వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. కానీ చరిత్రకేసి చూస్తే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే భారతీయ సైనికుల నైపుణ్యం, చేవ ప్రపంచానికంతటికీ తెలుసు. పైగా చరిత్రలో అత్యంత తీవ్రస్థాయిలో జరిగిన కొన్ని యుద్ధాల్లో భారతీయ సైనికులు తమ రక్తం చిందించారు. అరబ్ ఉగ్రవాదుల లక్ష్యం తప్పు కాబట్టి భారతీయ పోరాట చేవను వారు ఉపయోగించుకోకపోవడం ఒకందుకు మంచిదే.
 
నేను ఈ వార్తను కొద్ది రోజుల క్రితం చూసి ఆశ్చర్యపడ్డాను. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర వాదసంస్థ (దీన్నే ఐసిస్, డాయేష్ అని కూడా పిలుస్తున్నారు) ‘భారతీయులతో పాటు దక్షిణాసియా ముస్లింలను ఇరాక్, సిరియా ఘర్షణ పాంతాల్లో పోరా డేందుకు తగనివారుగా పరిగణిస్తోందని, అరబ్ యోధులతో సమానంగా చూడ కుండా వీరిని చిన్నచూపు చూస్తున్నార’ని ఆ వార్త పేర్కొంది.
 దీనికి అనుగుణంగానే ‘దక్షిణాసియా నుంచి వచ్చి చేరిన యోధులను చిన్న చిన్న బ్యారక్‌లలో బృందాలుగా కుక్కి ఉంచుతున్నారని, వారికి అరబ్బుల కంటే తక్కువ వేతనాలు చెల్లించడమే కాకుండా, నాసిరకం ఆయుధాలను కట్టబెడుతు న్నార’ని ఆ వార్త తెలిపింది. ఈ సమాచారం విదేశీ నిఘా సంస్థలు రూపొందించిన ఉగ్రవాద వ్యతిరేక నిఘా నివేదిక నుంచి వచ్చింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తోపాటు నైజీరియా, సూడాన్ వంటి కొన్ని దేశాల వారిని అరబ్బుల కంటే తక్కువస్థాయి కలిగిన వారుగా ఐసిస్ భావిస్తున్నట్లు ఈ నివేదిక బయటపెట్టింది.

నైజీరియా, సూడాన్‌లోని యుద్ధతంత్ర చరిత్ర గురించి నాకు పెద్దగా తెలి యదు. కానీ, అరబ్బుల కంటే భారత ఉపఖండానికి చెందిన వారు మరింత ఉన్నతమైన పోరాట చేవకు సంబంధించిన రికార్డును కలిగి ఉన్నారని నేను అరబ్బులకు హామీ ఇవ్వగలను. ఒకవైపున అరబ్ ఉగ్రవాదుల లక్ష్యం తప్పు కాబట్టి భారత ఉపఖండానికి సంబంధించిన ఈ సంపదను వారు ఉపయో గించుకోకపోవడం ఒకందుకు మంచిదే. కానీ మరోవైపున పాఠకులు కాస్త చరిత్ర తెలుసుకోవడం ఆసక్తిదాయకంగా ఉంటుంది.

చరిత్రలోకి వెళితే నిపుణులైన భారతీయ యోధుల గురించిన వివరాలను గ్రీస్ దేశంలో క్రీ.పూ.479లోనే మనం చూడవచ్చు. గ్రీక్ నగర రాజ్యాలకు, ఇరానీ లకు మధ్య జరిగిన ప్లేషియా యుద్ధంలోనే దీన్ని మనం గమనించవచ్చు. నాటి చరిత్రకారుడు హెరోడోటస్ ఇరుపక్షాలలోని వివిధ సైనిక నిర్మాణాల గురించి చెబుతూ పర్షియా రాజు గ్జెరెక్సెస్ నియమించుకున్న భారతీయ ఉపఖండ కిరాయి సైనికుల గురించి వర్ణించాడు. ఆ యుద్ధంలో పర్షియన్లు ఓడిపోయినప్పటికీ భార తీయ ఉపఖండ సైనికులు మాత్రం తమకంటూ మంచి చరిత్రనే నమోదు చేసుకున్నారు.

తర్వాత వందేళ్లకు జగ జ్జేత అలెగ్జాండర్ పంజాబ్ పై దాడి చేసినప్పటి ఘట నలను నాటి చరిత్రకారుడు అరియన్ రాశాడు. మాసిడోనియా సైనికుల దాడికి వ్యతిరేకంగా తమ నివాస ప్రాంతాలను కాపాడుకోవడానికి గ్రామీణులు నియ మించుకున్న కిరాయి సైనిక బలగాల నుంచే గ్రీకు చక్రవర్తికి నిజమైన ప్రతిఘటన ఎదురయిందని అరియన్ రాశాడు. భారతీయ సైనికులు చక్కటి పోరాట సామ ర్థ్యాన్ని కలిగి ఉండేవారు. అందుకే అలెగ్జాండర్ వారితో సంధి చేసుకున్నాడని మనకు తెలుసు. కానీ తర్వాత అతడు వారికి ద్రోహం చేసి ఊచకోత కోశాడు కూడా. అలెగ్జాండర్ పట్ల విధేయత ప్రకటించిన జీవిత చరిత్రకారులు అరియన్, క్వింటస్ వంటి వారు పంజాబ్‌లో అతడు వ్యవహరించిన తీరు నీతి బాహ్య మైనదని పేర్కొన్నారు కాబట్టే పంజాబ్ గురించిన ఘటన మనకు తెలుస్తోంది.
 పైగా చరిత్రలో అత్యంత తీవ్రస్థాయిలో జరిగిన కొన్ని యుద్ధాల్లో భారతీయ సైనికులు తమ రక్తం చిందించారు. మొదటి ప్రంచంచ యుద్ధ కాలంలో, 1915లో టర్కీ నేత ముస్తాఫా కమాల్ అటాటుర్క్‌ను సుప్రసిద్ధుడిని చేసిన గల్లిపోలి యుద్ధంలో భారతీయ సైనికులు పాల్గొన్న విషయం చాలామందికి తెలుసు.

అయితే, యుద్ధగతిని నిర్ణయించే కందక యుద్ధ తంత్రం అనేది భారతీయ ఆవిష్కరణే అనే విషయం చాలామందికి తెలీకపోవచ్చు. ది ఫస్ట్ వరల్డ్ వార్ అనే పేరిట రాసిన పుస్తకంలో యుద్ధ చరిత్రకారుడు జాన్ కీగన్ ఇలా రాశారు. ‘భారతీయ సైన్యంలోని 39వ గడ్వాల్ రైఫిల్స్ ఐపర్ సమీపంలో 1914 నవంబర్ 9/10 రాత్రి వేళ తొలి కందక తరహా దాడిని ప్రారంభించింది. చిమ్మచీకటిని ఆసరాగా చేసుకుని శత్రు స్థానాలపైకి పదే పదే దాడులు చేయడం అనే ది భారతీయ సరిహద్దు పోరాటంలో సాంప్రదాయకంగా అవలంబించే యుద్ధ వ్యూహం. ఆ రాత్రి గడ్వాల్ రైఫిల్స్ చేపట్టిన ఈ తొలి హంతక దాడితో, పాశ్చాత్య సైన్యాల నాగరిక యుద్ధతంత్రంలోకి గిరిజన సైనిక చర్యలను తొలిసారిగా ప్రవేశ పెట్టినట్లయింది’ అని కీగన్ రాశారు.

ధైర్యసాహసాలను, సైనిక నిపుణతలను ప్రదర్శించడంలో భారతీయ యోధులు ఎవరికీ తీసిపోయేవారు కారు. బ్రిటిష్ చరిత్రకారుడు మాక్స్ హేస్టింగ్స్ తన ‘కెటాస్ట్రోప్: యూరప్ గోస్ టు వార్ 1914’ అనే పేరిట రాసిన గ్రంథంలో ఇలా చెప్పారు. భారతీయ సైనికదళాలు బ్రిటిష్ సైన్యాలకు గస్తీ తిరిగే కళను నేర్పాయన్నారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ కందకాల్లో పలువురు భారతీయ సైనికులు ఉండేవారు. భారతీయ సైనికుల సాంప్రదాయిక ఆహార అవ సరాలను తీర్చేందుకోసం జీవంతో ఉన్న 10 వేల మేకలను సరఫరా చేయాలని బ్రిటిష్ విదేశీ కార్యాలయాన్ని ఫ్రాన్స్ కోరింది.

ఇక మొఘల్ సామ్రాజ్య పతనంపై నాలుగు సంపుటాలతో కూడిన బృహత్ రచన చేసిన చరిత్రకారుడు సర్ జాదూనాధ్ సర్కార్ భారత్‌లో మూడు రాజపుత్ర వంశాల (సిసోదియా, కచ్‌వాహ, రాథోడ్) పోరాట తీరుతెన్నులను వర్ణించారు. యుద్ధంలో ఒకవేళ తాము ఓడిపోతున్న క్షణాల్లో కూడా, రాథోడ్‌లు తమ గుర్రా లను శత్రు సైన్యం చుట్టూ పరుగెత్తించేవారు. యుద్ధరంగం నుంచి సగౌరవంగా తప్పుకునేందుకు అవసరమైనన్ని బలిదానాలు తమవైపు నుంచి జరగలేదన్న భావనతోనే వారు శత్రు తుపాకులకు ఎదురుగా నిలిచి ప్రాణాలు పోగొట్టుకునే వారని జాధూనాథ్ సర్కార్  పేర్కొన్నారు.

అయితే రాజపుత్రులతో సమస్య అల్లా ఏమిటంటే, వారు ప్రధానంగా తమలో తాము యుద్ధాలు చేస్తూనే గడిపేవారు. నేను చదివిన ఒక పుస్తకం ప్రకారం, కొద్ది డజన్ల సంఖ్యలోని రాథోడ్‌లు శత్రుపక్షంలోని దాదాపు లక్షమంది రాథోడ్ సైనికులను ఊచకోత కోశారని తెలుస్తోంది.

అరబ్బుల కంటే తక్కువ చేవ కలిగినట్లు ఐసిస్ భావిస్తున్న  యోధులకు సంబంధించిన దేశం వారసత్వం అలా ఎప్పుడూ లేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం నేనొక వార్త చదివాను. రెండు బ్రిటిష్ సైనిక విభాగాలు ఒక బార్‌లో పరస్పరం తలపడిన ఘటనకు సంబంధించిన వార్త అది. ఈ రెండింటిలో ఒక సైనిక యూనిట్ ఫుల్లుగా తాగి దూకుడుగా మరొక యూనిట్‌పై దాడి కి తలపడిందట. వారి దురదృష్టమేమిటంటే ఆ మరొక గ్రూపు గూర్ఖాల విభాగం. తమతో తలపడిన శ్వేతజాతి సైనిక విభాగం కంటే వీరు సంఖ్యలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ, వీరత్వంలో ఆధిక్యత కలిగిన గూర్ఖా సైనికులు తమ మీద దాడి చేసిన ఆ బ్రిటిష్ సైనిక విభాగాన్ని తుక్కుతుక్కుగా కొట్టి కింద పడేసిందని నాటి వార్త పేర్కొంది. అయితే భారతీయ సైనికులకు ఎల్లవేళలా అవసరమైనది మంచి నాయకత్వమే. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కి చెందిన అరబ్బులు అలాంటి నాయక త్వాన్ని తమలో చేరిన భారతీయులకు అందిస్తారంటే నాకు సందేహమే. అందుకు నేను దేవుడి కి కృతజ్ఞతలు చెబుతాను.

ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com)

>
మరిన్ని వార్తలు