సమాచారం అడగకుండా లంచం ఇస్తారా?

27 Nov, 2015 01:38 IST|Sakshi
సమాచారం అడగకుండా లంచం ఇస్తారా?

విశ్లేషణ
ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం నేరం, అతను తీసుకోవడం నేరం. కాని ప్రభుత్వాధికారి ప్రజలలో ఒకరికి లంచం ఇవ్వజూపడం అనేది ఇదివరకెన్నడూ చరిత్ర ఎరుగని సంఘటన.
 
లంచం లేని సమాజాన్ని ఇప్పుడు సామాన్యుడు ఊహించలేడు. ప్రభుత్వ అధికారాలు చలాయించే వ్యక్తి, ఆ అధికారాన్ని వినియోగించేం దుకు తన జీతం కన్న మించి ఏదీ అడగకూడదు. అడిగితే చట్టవ్యతిరేక ప్రతిఫలం అవుతుంది. దాన్నే లంచం అని మనం సామాన్య పరి భాషలో అంటున్నాం.  లంచం అడగడం నేరం. అడిగే ప్రయత్నం చేయడం కూడా నేరమే. లంచం ఇవ్వ జూపడం లేదా ఇవ్వడం కూడా నేరాలే.  అధికారాన్ని విచక్షణను దుర్వినియోగం చేయడం అందుకు ప్రతిఫలం ఆశించడం కూడా ఈ నేరం కిందికి వస్తాయి.
 
ప్రభుత్వ అధికారం చేతిలో ఉన్న వ్యక్తి దాన్ని తన స్వార్థం కోసం వినియోగించాలనుకునే ప్రైవేటు వ్యక్తి అవినీతి నేరం కింద నిందితులవుతారు. ఇందులో ఒక వివాదం కూడా ఉంది. విధిలేక లంచం ఇవ్వవలసిన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేరస్తుడనడం న్యాయం కాదు. కావాలని లంచం ఇవ్వడం వేరు. లంచం ఇస్తేనే పని చేస్తానన్నప్పుడు, ఆ పని తప్పనిసరి అవసరం అయి నప్పుడు లంచం ఇస్తే నేరం కాకూడదు. కొంత లంచం ఇచ్చిన తరువాత పనిచేస్తానన్న ప్రభుత్వ అధికారి మరికొంత లంచం అడిగినపుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం, వారు ప్రచ్ఛన్నంగా దాడిచేసి  రంగు పూసిన నోట్లను లంచంగా ప్రవేశ పెట్టడం, తీసు కుంటున్న దశలో పట్టుకోవడం మనం చూస్తున్నాం. అటువంటి కేసుల్లో ఫిర్యాదు చేసిన వ్యక్తిని లంచం ఇవ్వ జూపిన నిందితుడుగా పరిగణించబోరు. తానే చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని క్రిమినల్ ప్రాసిక్యూష న్‌కు గురి చేయడం ప్రాథమిక హక్కులకు విరుద్ధం.

ఆర్టికల్20(1) కింద ఫిర్యాది దరఖాస్తు ద్వారా అతడినే నేరస్తుడిని చేయడానికి వీల్లేదు. బలవంతపు లంచం నేరం లేదా ఒత్తిడికిలోనై లంచం ఇవ్వడం నేరం కావ డానికి వీల్లేదు. ఇచ్చేవాడు తీసుకునే వాడు కలిసి చేసే లంచగొండితనం నేరమవుతుంది. ఇవి ప్రస్తుతం సూత్రాల రూపంలో ఉన్నాయి. కాని స్పష్టమైన నియ మాల రూపంలో లేవు. అవినీతి నిరోధక చట్టాన్ని సవ రించి ప్రజలకు తెలిసే రీతిలో బలవంతపు లంచం నేరం కాదని, ఇద్దరు కలిసి అంగీకారంతో చేసే లంచగొండి తనం నేరమని వివరించాలని పరిపాలనా సంస్కరణల సంఘం 2007లో సిఫార్సు చేసింది.  కాని ఈ సిఫా ర్సును అమలు చేసే తీరిక కేంద్ర ప్రభుత్వానికి ఇంత వరకూ లేకపోయింది.
 
ప్రైవేటీకరణ ఆరంభమైన తరువాత ప్రయివేటు కార్పొరేషన్లు, వ్యక్తులు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న టువంటి అధికారాలే నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కార్పొ రేట్‌లలో కూడా లంచం గొండితనం విచ్చలవిడిగా ఉన్న మాట తెలిసిందే. కాని ప్రైవేటు అవినీతిని అరికట్టే చట్టాలే ఇంతవరకూ లేవు. కార్పొరేట్ అవినీతిని శిక్షించే శాసనాలు చేయవలసిన అవసరం ఉంది.
 కాని మరొక కొత్త సమస్య వచ్చి పడింది. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన పౌరుడికి ఒక ప్రభుత్వాధికారి రూ.10 వేలు లంచం ఇవ్వజూపడం నేరమా కాదా అనే సవాల్ కేంద్ర సమాచార కమిషనర్ ముందుకు వచ్చింది. న్యూఢిల్లీలో పాలం శాసనసభ నియోజక వర్గంలో ప్రభుత్వం వారు 32 స్వాగత ద్వారాల వంటివి లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించారు. ఏ అవసరాలకు ఉపయోగపడకుండా వీటిని కట్టారని, ఇవన్నీ దురుపయోగమవుతున్నాయని ఎస్ కె సక్సేనా ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు.

ఒక్కో గేట్‌కు 8 నుంచి పది లక్షల రూపాయల దాకా వెచ్చించారని, రోడ్డుకు అడ్డంగా ట్రాఫిక్‌ను నిరోధిస్తూ ఈ గేట్లు పోస్టర్లు  అంటిం చుకోవడానికి మాత్రమే వినియోగపడుతున్నాయని విమర్శించారు. కనీసం ముందు నిర్ణయించిన ప్లాన్‌కు అనుగుణంగా కూడా వీటిని కట్టలేదని ఆయన విమర్శిం చారు. అసలు ఈ అంశం మీద  సమాచారం అడగకూ డదని, అందుకు పదివేల రూపాయల లంచం ఇస్తామని ఒక అధికారి తనకు ప్రతిపాదించాడని సక్సేనా కమిష న్‌కు ఫిర్యాదు చేశారు. అతని మాటలను రికార్డు చేసిన సీడీని కూడా కమిషన్‌కు సమర్పించారు. లంచం ఇవ్వ జూపిన అధికారిపైన విచారణ జరిపి చర్య తీసుకోవా లని కూడా డిమాండ్ చేశారు.  

ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం నేరం, అతను తీసుకోవడం నేరం. కాని ప్రభుత్వాధికారి ప్రజలలో ఒకరికి లంచం ఇవ్వజూపడం అనేది ఇదివరకెన్నడూ చరిత్ర ఎరుగని సంఘటన. కేవలం సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అయితే ఒక అధి కారి ఇవ్వజూపినది లంచమైనా కాకపోయినా నేర అయినా కాకపోయినా, అది ఖచ్చితంగా సమాచారం ఇవ్వకుండా నిరోధించే ప్రయత్నమే.  సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద అందుకు జరిమానా విధించే వీలుంది.
 
సమాచారం కోరుతూ అభ్యర్థి చేసుకున్న రెండు ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఆర్టీఐ కింద ప్రశ్నలడగకుండా ఉండేందుకు లంచం ఇవ్వజూపడం ద్వారా సమాచారం అందకుండా అడ్డుకోవడం సెక్షన్ 20 కింద చట్టఉల్లంఘన అవుతుందని, అందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం వివరించాలని నోటీసు జారీ చేశారు. సమాచారం ఇవ్వకుండా వేధించి నందుకు రూ.10 వేలు పరిహారం కూడా చెల్లించాలని నజఫ్ గర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు.

మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com       

 

మరిన్ని వార్తలు