జనస్వామ్యంలో వారసత్వమా?

2 Jun, 2017 01:12 IST|Sakshi
జనస్వామ్యంలో వారసత్వమా?

రాజకీయ అర్హతలు లేకుండా పాలనలో యువ వారసులను ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం రాచరిక వ్యవస్థకు సంకేతమే కానీ ప్రజాస్వామ్యం కాదు. అర్హత, అనుభవం లేని వారసులను ప్రజలు తిరస్కరిస్తారు.

నేటి ప్రజాస్వామ్యంలో రాజ కీయ వారసులుగా యువ నాయకులు ఎంతోమంది ఆవిర్భవిం చడం చూస్తున్నాం. అలా పాలనా పగ్గాలు చేతపట్టిన వారిలో విజే తలూ ఉన్నారు, పరాజితులూ ఉన్నారు. వారసులు పరిపాలనా పగ్గాలు చేపట్టకూడదన్నది ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు. కానీ, అందుకు కావలసిన అనుభవం, తగిన కసరత్తు అవసరం. వారసులకు సమానంగా ఆస్తుల పంపకం వంటిది కాదు రాజకీయ వారసత్వం. ఎవరికైనా సరే.. రాజకీయ అర్హత అంటే మంచి వ్యక్తిత్వం, ప్రజా సంబంధాలు, నాయకత్వ లక్షణాలు ముఖ్యం.

రాజకీయాల్లో, పరిపాలనలో యువ నాయకుడుగా రాణించాలంటే.. ప్రధానంగా ప్రాంతీయ, జాతీయ భాషా పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించాలి. మంచి ఉపన్యాసకుడుగా ప్రజల్ని ఆకర్షించాలి. ప్రజా సంబంధాల్లో చురుగ్గా వ్యవహరించే మంచి నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందాలి. రాజకీయాల్లో నాయకుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత ముఖ్యమో... అందులో అక్షర దోషం లేకుండా మాట్లాడటం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. అలాగే తెర వెనుక రాజకీయాలు చేయడం ఎంత అవసరమో... ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా రాజకీయాల్లో అంతే అవసరంగా భావించాలి. పార్టీ కార్యకర్తలను భావనాత్మకంగా ప్రభావితం చేయగల్గే వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు, సామాజిక స్పృహ వంటి గుణాలు అవసరం. అంతేకాదు, పాలనలో సీనియర్లను అనుసరిస్తూ రాజకీయ అనుభవజ్ఞులు, మేధావుల వద్ద శిష్యరికం అవసరం. పుట్టుకతో ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా నాయకుడవటం చరిత్రలో ఎక్కడా లేదు. ప్రజల హృదయాల్ని గెల్చిన ఏ నాయకుడి జీవిత చరిత్రను పరిశీలించినా ఇవి స్పష్టంగా గోచరిస్తాయి.

స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ కూడా తను అనుకున్నంత వేగంగా ఒకేసారి నాయకుడు కాలేక పోయాడు. బ్రిటీష్‌ చెరనుండి దేశాన్ని విడిపించాలన్న తపనతో అందరితోపాటు తను కూడా ఆనాడు ఎక్కడ తెల్లదొరలపై వ్యతిరేక ఉద్యమాలు, సభలు జరిగినా హాజరయ్యేవాడు. ఆ సభలు, ఉద్యమాలలో ఆయనకు ఎక్కడా తగిన గుర్తింపు రాలేదు. అయినా, నిరుత్సాహపడకుండా నిత్యం తన లక్ష్యాలవైపు గురిపెడుతూనే ఉండేవాడు. లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో.. తనకు తప్పకుండా ఒక రాజకీయ గురువు అవసరంగా భావించి, క్రీ.శ. 1912 ప్రాంతంలో ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలేని తన గురువుగా ఎంపిక చేసుకున్నాడు. గురుబోధనలో భాగంగా ఆనాడు దేశ జనాభాలో దాదాపు 95 శాతం ఉన్న గ్రామీణ భారతీయుల సంస్కృతి– సంప్రదాయాలకు అనుగుణంగా తన వేష–భాషలతోపాటు జీవనశైలిలో మార్పు ను తెచ్చుకొని, దేశం నలుమూలలా పర్యటించి, ప్రజల సమస్యలపై వారికి అండగా ఉంటూ.. ఆ విధంగా జాతి ఐక్యతకు బాటవేసి స్వాతంత్య్రోద్యమ నేత అయ్యాడు.

ఉమ్మడి రాష్ట్రంలో మేధావి, అక్షర జ్ఞాని, మృదు స్వభావి, బహు భాషా కోవిదులు దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దక్షిణాది నుంచి ఒక తెలుగువాడుగా, నెహ్రూ–గాంధీల వారసత్వంలో ఉన్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశానికి 10వ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ తన రాజకీయ అనుభవాన్ని మేళవించి పరిపాలనకు కావలసిన పూర్తి మెజార్టీని సంపాదించుకొని ఐదేళ్లు దేశాన్ని ఏకధాటిగా పరిపాలించారు. స్వాతంత్య్రం సాధిం చిన తొలినాళ్లలో బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ వంటి రాజకీయ గురువులను ఆశ్రయించడంవల్లనే ఆయన అందర్నీ మెప్పించగల నాయకుడయ్యాడు.ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పార్టీలు వైఎస్సార్‌సీపీ, జనసేన, తెలుగుదేశంలలో.. టీడీపీ వారసుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇక వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లు తమ పార్టీల వ్యవస్థాపక అధ్యక్షులే కానీ వారసులు కారు. వారే ఆ
పార్టీలను స్థాపించుకున్నారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు లోకేశ్‌ను తన వారసుడుగా  ప్రకటించాడు. లోకేశ్‌ను ఇదివరకే టీడీపీలోకి చేర్చుకొని, ఆయన్ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించటం తెలిసిందే. ఆయనలో నాయకత్వ లక్షణాల లేమిని పసిగట్టిన చంద్రబాబు, ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గడం కష్టమని, పెద్దల సభే సురక్షితంగా భావించి తన వారసుడిగా లోకేశ్‌ను పెద్దల సభకు పంపి, మంత్రిగా పట్టాభిషిక్తుడిని చేసాడు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుటుంబంలో వారసులు ఉన్నా... ఆయన మరణం తర్వాత కుటుంబ వారసత్వ తగాదాలు వంటి కారణాల వలన టీడీపీ వారసత్వాన్ని అనూహ్యంగా, అడ్డగోలుగా ఎన్టీఆర్‌ చిన్న అల్లుడు చంద్రబాబు చేజిక్కించుకుని.. నందమూరి వంశ స్థులను తెరమరుగు చేశారు.

చిన్న వయసులోనే కాంగ్రెస్‌ రాజకీయాలు వంట బట్టిన చంద్రబాబుకు తన రాజకీయ భవిష్యత్తుని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ జీవించి ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి వారసత్వం కోసం పోరాడటం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్‌ పెద్ద కూతురు, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరిని, అలాగే హరి కృష్ణ తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రజలు ఆ పార్టీ వారసులుగా గుర్తించే అవకాశం నేటికీ ఉంది. అందుకే ముందుచూపున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని కోడలుగా చేసుకొని టీడీపీని తన కుటుంబంలో సుస్థిరం చేసుకున్నారు. ఏ తండ్రి అయినా తనయుడి నాయకత్వ లక్షణాలు ముందుగా పసిగట్టలేరా? ఆ విధంగా భవిష్యత్తును ముందుగా తెలుసుకోగల్గే రాజకీయ మేధావిగా చంద్ర బాబు 2019లో తాను అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు అన్న అనుమానంతో ‘అన్నప్రాసన రోజునే ఆవకాయ వడ్డించినట్టు’ ఈ రెండేళ్లలోనే రాజకీయ అక్షరాభ్యాసం కోసం తనయుడ్ని చిన్న వయస్సులోనే పెద్దల సభతోపాటు, అధికారంలో రెండు శాఖలకు యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. ఈత రాకపోయినా నీటితో నిండి ఉన్న ఈతకొలనులోకి ఒకేసారి నెట్టితే.. ఈత దానంతట అదే వస్తుందన్నది చంద్రబాబు తత్వం. కానీ ఆ వారసుడిని భరాయించవలసింది ప్రజలే కదా?

రాజకీయ అర్హతలు లేకుండా పాలనలో యువవారసులను ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం రాచరిక వ్యవస్థకు సంకేతమే కానీ ప్రజాస్వామ్యం కాదు. అంతిమంగా... ప్రజాస్వామ్యంలో కుటుంబ వారసులకు పార్టీ పగ్గాలు అప్పగించే నేపథ్యంలో వారి నాయకత్వ అర్హతను సరిగా పరిశీలించకపోతే అలాంటి నాయకులను, పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు.
     

యాతం వీరాస్వామి

వ్యాసకర్త రచయిత, విశ్లేషకుడు ‘ 95816 76918   
 

మరిన్ని వార్తలు