‘ఆమ్ ఆద్మీ’ కథ ముగిసిందా ?

22 May, 2014 03:58 IST|Sakshi
‘ఆమ్ ఆద్మీ’ కథ ముగిసిందా ?

గెలుపు, ఓటముల లెక్కలకు ఆప్ ఒదగదు. ఆ పార్టీ పుట్టింది వీధుల్లోని ఆందోళనల నుంచి. ఆ పార్టీ నేతలంతా ఆందోళనకారులే. అధికారంలో కంటే వీధుల్లోనే వాళ్లు సౌఖ్యంగా ఉండగలరు. ప్రభుత్వంగా కంటే ప్రతిపక్షంగానే వాళ్లు నేర్వాల్సింది చాలా ఉంది.
 
 రాజకీయాల్లో ఆత్మహత్యలే  తప్ప హత్యలుండవనేది సార్వత్రిక సత్యమేమీ కాదు. ‘ఆమ్ ఆద్మీ’ నేత కేజ్రీవాల్ ‘ఆత్మహత్య’ను మీడియా ధన్వంతరులం తా నిర్ధారించారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చేయడమే తరువాయి అనుకుంటుండగా ఆవిష్కృతమవుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రహనంపై అడగాల్సిన అస లు ప్రశ్న తప్ప అన్నీ చర్చకు వస్తున్నాయి. 49 రోజుల పాలన తదుపరి ఫిబ్రవరి 14న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ అర్ధంతరంగా రాజీనామా చేశారు. ఎన్నడూ అధికారాన్ని తమంతట తాము వదిలిపోని కాంగ్రెస్, బీజేపీల చేత ‘భాగోరా’ (పారిపోయినవాడు) ముద్ర వేయించుకున్నారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలకు ఒక్క దాన్నీ దక్కించుకోలేక మూల్యం చెల్లించుకున్నారు.
 
 తమ ప్రభుత్వ రాజీనామాతో  ఏర్పడ్డ ప్రతిష్టంభనకు పరిష్కారం తిరిగి శాసన సభకు ఎన్నికలు జరపడమేనని ఆప్ వాదిస్తూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతో పాటూ శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని డిమాండు చేసింది. అలా చేస్తే భారీ వ్యయ ప్రయాసలు తప్పుతాయని వాదించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు ససేమిరా వల్లకాదన్నాయి. వెంట వెంటనే ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్క రం కాదని హితవు చెప్పాయి. హఠాత్తుగా ఇప్పుడు వారికి ఎన్నిక లు జరిపేయడమే ఉత్తమమని అనిపిస్తోంది. ఆప్ గెలుస్తుందనుకుంటే ఎన్నికలు జరపడం చేటు, ఓడిపోతుందనుకుంటే శ్రేయస్కరం! రెండు ప్రధాన జాతీయ పార్టీల ఢిల్లీ యూనిట్లు ఇలా శీర్షాసనం వేయడాన్ని ప్రధాన జాతీయ మీడియా ప్రశ్నించకపోగా గమనించనట్టు నటిస్తోంది. డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా లేక ఎన్నికలకు సిద్ధం కావడమా? అనేది తేల్చుకోలేక కేజ్రీవాల్ వేస్తున్న పిల్లిమొగ్గలను మాత్రం భూతద్దాల్లోంచి చూస్తోంది.
 
 ‘సున్నా’లో దాగిన వాస్తవాలు
 మోడీ సుడి గాలి వడిలోనే శాసనసభ ఎన్నికలను జరిపేస్తే తిరిగి కోలుకోనివ్వకుండా ఆప్‌ను చావు దెబ్బ తీసేయొచ్చనే బీజేపీ ఎత్తుగడ తేలిగ్గానే అర్థం అవుతుంది. కాకపోతే ఢిల్లీ శాసనసభలో 8 స్థానాలున్న (మొత్తం 70) కాంగ్రెస్... లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఆధిక్యతను సాధించలేదు. ఇప్పుడు ఎన్నికలకు దిగితే ఆ సీట్లు కూడా దక్కవు. హర్యానా, మహారాష్ట్రల్లో ఈ ఏడాదే జరగనున్న శాసనసభ ఎన్నికల పీడకలలతో ఆ పార్టీ ఇప్పటికే సతమతమవుతోంది.
 
 కేజ్రీవాల్ కాళ్లా వేళ్లాపడైనా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి పరువు దక్కించుకోవాల్సింది పోయి మూడో పరాభవం కోసం అది ఎందుకు ఆరాటపడుతున్నట్టు? ప్రత్యర్థులైన రెండు జాతీ య పార్టీలకు ‘వెంటవెంటనే ఎన్నికల నిర్వహణ’ వల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందనే జ్ఞానోదయం ఇప్పుడే ఎందుకు కలిగినట్టు? లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ చుట్టిన గుండు సున్నా వెనుక దాగిన ‘మింగుడు పడని’ వాస్తవాలే సమాధానాలు చెబుతాయి. ఢిల్లీలో 28 అసెంబ్లీ స్థానాలున్న ఆప్... 10 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచింది. మిగతా 60 సెగ్మెంట్లలోనూ అదే ద్వితీయ స్థానంలో ఉంది. మధ్యతరగతి విద్యావంతులు ఆప్‌కు మొహం చాటు చేసినా, మోడీ దుమారం రేగుతున్నా బీజేపీ ఢిల్లీలో సాధించిన ఓట్లు 46 శాతం. శాసనసభ ఎన్నికల నాటి 33 శాతంతో పోలిస్తే అది 13 శాతం ఎక్కువే. కానీ, 2009లో కాంగ్రెస్‌కు పోలైన 57 శాతం ఓట్లతో పోలిస్తే...? మరింత ‘ఆందోళనకరమైన’ వాస్తవం మరొకటుంది. ఆప్ ఓట్లు 28 నుంచి 33 శాతానికి... 5 శాతం మేర పెరిగాయి! ‘భాగోరా’ పార్టీకి మధ్య తరగతి ఓట్లలో పడ్డ గండిని పూడ్చడమే గాక మొత్తం ఓట్లు పెరిగేలా చేసింది ఎవరు? ముస్లిం ఓటర్లు. ఆప్‌ను అధికారానికి దూరంగా ఉంచకపోతే. చేసిన తప్పులు సరిచేసుకొని, ఇల్లు చక్కదిద్దుకొనే అవకాశాన్ని ఇస్తే... రాజధాని నుంచి కాంగ్రెస్ అంతర్ధానమయ్యే ప్రమాదం ఉంది. ఇక బీజేపీకి మరోసారి ఆశాభంగం కలిగినా ఆశ్చర్యపోలేం. ‘ఆత్మహత్య చేసుకున్న’ ఆప్ అంటే కాంగ్రెస్, బీజేపీలకు అందుకే భయం.
 
 ముస్లింల చూపు ఆప్‌పైనే...
 ఇదిలా ఉండగా ఎన్నికలు జరిగితే ఆప్‌కు 11 అసెంబ్లీ స్థానాలకు మించి దక్కవనే మీడియా పండితుల బెదిరింపులకు కేజ్రీవాల్ ఎందుకు దడుస్తున్నట్టు? ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నట్టు? ఎన్ని తప్పులు చేసినా చాలా సెక్షన్ల ప్రజ ల్లో కేజ్రీవాల్ నిజాయితీపై విశ్వాసం ఉంది. ఆప్‌లాంటి ప్రత్యామ్నాయం ఉంటే ముస్లింలే కాదు విద్యావంతులైన మధ్యతరగతి యువత కూడా అటే మొగ్గు చూపుతుంది. ఈ వాస్తవాలు సాంప్రదాయకమైన ఎన్నికల లెక్కలకు ఒదిగేవి కావు. గెలుపు, ఓటముల లెక్కలకు ఆప్ ఒదగదు. ఆ పార్టీ పుట్టింది వీధుల్లోని ఆందోళనల నుంచి. ఆ పార్టీ నేతలంతా ఆందోళనకారులే. అధికారంలో కంటే వీధుల్లోనే వాళ్లు సౌఖ్యంగా ఉండగలరు. ప్రభుత్వంగా కంటే ప్రతిపక్షంగానే వాళ్లు నేర్వాల్సింది చాలా ఉంది.
 
 ముస్లింలు కాంగ్రెస్, ఎస్పీల వంటి పార్టీలకు ఓటు బ్యాంకులనే సాంప్రదాయకమైన ఎన్నికల లెక్కల డొల్ల తనాన్ని ఎన్నికల ఫలితాలు బయటపెట్టాయి. దేశవ్యాప్తంగా ముస్లింలు ఎక్కువగా కేంద్రీకరించి ఉన్న దాదాపు 87 లోక్‌సభ నియోజక వర్గాలను సీఎస్‌డీఎస్ గుర్తించింది. వాటిలో 45 స్థానాలను బీజేపీ గెలుచుకుంది! వారణాసిలో కేజ్రీవాల్‌కు ఓటు చేయని ముస్లింలు ఢిల్లీలో ఆప్‌కు ఓటు చేశారు. ముస్లింలు ఎవరి ముల్లెగానో ఉండరనేది ఈ ఎన్నికల్లో స్పష్టమైంది. ఆప్ కార్యాలయాల్లో ముస్లిం యువత ఎక్కువ చురుగ్గా  కనిపిస్తోంది. వారణాసి, ఆమేథీల ప్రజలు ఆప్‌ని అందలమెక్కించక పోయినా ‘వాళ్లు వేరే రకం మనుషులు’ అని గుర్తించగలిగారు. విమర్శకులు గుర్తించ నిరాకరిస్తున్నది అదే. ఢిల్లీ ప్రభుత్వాన్ని అర్ధంతరంగా వీడటం సరికాదని కేజ్రీవాల్ బహిరంగంగానే గుర్తించారు.
 
 కాంగ్రెస్ (414), బీజేపీ (415) స్థానాల్లో పోటీ చేస్తే వాటిని మించి ఒకేసారి 424 సీట్లలో పోటీకి దిగడం, తాను స్వయంగా వారణాసికి బందీ కావడం వంటి తీవ్రమైన తప్పిదాలను ఆయన గుర్తించలేరని ఎందుకనుకోవాలి? తీరా ఎన్నికల సమరం మొదలయ్యాక తప్పు ‘సరిదిద్దుకోవాలని’ పలాయనం చిత్తగిస్తే అది నిజంగానే ఆత్మహత్య అయ్యేది. పంజాబ్‌లో మొట్టమొదటిసారి బరిలోకి దిగి 25 శాతం ఓట్లను, 4 లోక్‌సభ స్థానాలను  (మొత్తం 13) సాధించగలిగేవారే కాదు. చిన్న రాష్ట్రాలపై మొత్తంగానూ, పెద్ద రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని స్థానాలపైనా దృష్టిని కేంద్రీకరించి, గట్టి, మంచి అభ్యర్థులుంటేనే బరిలోకి దిగాలనే గుణపాఠాన్ని పంజాబ్ ఆప్‌కి నేర్పింది. ఆప్ లాంటి మధ్యతరగతి విద్యావంతుల సాంప్రదాయేతర పార్టీలు భర్తీ చేయగల రాజకీయ శూన్యం దేశంలో ఉన్నదనే సందేశాన్ని పంపింది.
 
 ప్రతిపక్ష స్థానమే మేలు
 ఆప్ నేతలు తమను విశ్వసిస్తున్న పేద, మురికి వాడల ప్రజల పైనా, మధ్యతరగతి దిగువ అంతస్తులపైనా, ముస్లింలపైనా నమ్మకముంచి ప్రతిపక్షంలో కూచోవడానికి సిద్ధం కావడం మంచిది. ప్రతిపక్షంగా దొరికే సమయాన్ని భావజాలపరమైన ఐక్యతకు, అంతర్గత విభేదాల పరిష్కారానికి, నిర్మాణ పటిష్టతకు ఉపయోగించుకోవడం ఉత్తమం. అరాచకవాదాన్ని తన రాజకీయ తాత్వికతగా పేర్కొన్న కేజ్రీవాల్ ఆప్‌ను దేశవ్యాప్తమైన ఒకే పార్టీగా నిర్మించాలని తాపత్రయపడటం విడ్డూరం.
 
 అంతకంటే వైవిధ్యభరితమైన తమలాంటి పార్టీలు ఎక్కడికక్కడ ఏర్పడటానికి తోడ్పడం ఉత్తమం. దేనికైనా నిలకడగా ఒక సంఘటిత ఐక్య నిర్మాణంగా ఆప్ మనగలగడం ముఖ్యం. అప్పుడే అది ఓటమిని గెలుపుగా మార్చుకోగలుగుతుంది. కేజ్రీవాల్‌ను, ఆప్‌ను రాజకీయంగా హత్య చేయాలనే ప్రయత్నాలు వ్యర్థం. ఆప్ తప్పులను దిద్దుకుని ప్రణాళికాబద్ధమైన ఐక్య కార్యాచరణకు దిగగలిగితే సజీవంగా ఉంటుంది. లేకపోతే మెల్లమెల్లగా ఆదే మరణిస్తుంది. తప్ప హత్యకు గురి కాదు, ఆత్మహత్య చేసుకోదు. సజీవంగానూ, సమరోత్సాహంతోనూ ఓటమిని లెక్కచేయకుండా పోరాడే వారిని ఎవరు ఓడించగలరు?
 - పిళ్లా వెంకటేశ్వరరావు

>
మరిన్ని వార్తలు