సెప్టెంబర్‌ 17ను పండుగలా జరిపే రోజొస్తుంది!

17 Sep, 2017 01:53 IST|Sakshi
సెప్టెంబర్‌ 17ను పండుగలా జరిపే రోజొస్తుంది!

సందర్భం
తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి.

హైదరాబాద్‌ సంస్థాన విమోచన పోరు అంతగా పట్టించుకోదగినది కాదా? ఆ ఘట్టాన్ని ఒక రాజ్యవిలీనంగా, అధికార మార్పిడిలా మాత్రమే చూడాలా? ప్రాణాలు విడిచిన వేలాది మంది యోధుల త్యాగం గురించి మాట్లాడుకోవద్దా? రజాకార్‌ మూకలు చెరిచిన అసంఖ్యాక ఆడబిడ్డలకు జరిగిన అవమానం కూడా తేలికగా తీసుకోదగినదేనా? అధికారం కోసం ఏదైనా మాట్లాడొచ్చు, నాలుకను ఎన్నిసార్లు మడతవేసినా తప్పులేదనుకునే తెలంగాణ నయా నిజాం కేసీఆర్‌ చెబుతున్నదిదే. ఆయన పార్టీ నేతలు, మంత్రులు, సామంతులు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరును చిన్నదిగా చేసి చూపడాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. ముందుతరం గోస గుర్తు చేసుకోదగిన చరిత్రే కాదంటున్న కేసీఆర్‌ ఎందుకలా అంటున్నారో తెలుసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు.

భారతదేశం బ్రిటిష్‌ పాలననుంచి స్వాతంత్య్రం పొందిన ఏడాదిదాకా ఇక్కడి భూభాగం ఎవరి పాలనలో ఉంది? సెప్టెంబర్‌ 17న విముక్తి పొందే దాక 13 నెలల పాటు తెలంగాణలో జరిగిన నరమేధం తేలికగా మర్చిపోగలిగేదేనా? మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (MఐM) మత సంస్థ పేరుతో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల సేన సాగించిన ఊచకోతల గాథలను తెలంగాణ లోని ప్రతి పల్లె జ్ఞాపకం పెట్టుకుంది. నాడు రజ్వీని ఉసిగొల్పిన నిజాంకు, నేడు ఒవైసీ కోసం తెలంగాణ చరిత్రనే మర్చిపోమంటున్న కేసీఆర్‌కు మధ్య ఎంత సారూప్యం ఉందో చూస్తున్నాం. అందుకే ఆయనను నయా నిజాం అనాల్సి వస్తోంది.

‘భారత్‌కు స్వాతంత్య్రం వస్తే ఏమిటి...నేను పాకిస్తాన్‌లో భాగంగా ఉంటా...లేదా హైదరాబాద్‌ దక్కన్‌ స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు...వాళ్లు భారత్‌లో కలవాలంటే నేను విలీనం చేయాలా? తిరుగుబాటు చేసే వారిని మా మిలటరీ, రజాకార్లు చూసుకుంటారు’, ఆగస్టు 15, 1947న యావద్దేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ తన సంస్థానంలోని ప్రముఖ్‌లతో అన్న పొగరుబోతు మాట లివి. మువ్వన్నెల జెండా ఎగరేసిన వారిని రజాకార్లు పిట్టల్లా కాల్చి చంపారు. లూటీలు, ఇళ్లు, ఆస్తుల దహనాలు, ఆడవాళ్లను చెరచడం, వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిపించడం... సంస్థానమంతా ఒక అగ్నిగుండమైంది. తూర్పు పాకిస్తాన్‌ లాగా, దక్షిణ పాకిస్తాన్‌గా హైదరాబాద్‌ దక్కన్‌ను గుర్తించాలంటూ ఆఖరి గవర్నర్‌ జనరల్‌తో రాయబారాలు నడుపుతూనే, ఐక్య రాజ్య సమితికి వినతి పత్రాలు పంపించిన నక్క జిత్తుల నిజాం, ఆనాడు పన్నని కుయుక్తులు లేవు.

కనీసం ప్రజా తిరుగుబాటు రాకుండా చూసుకుంటే భారత రిపబ్లిక్‌ నుంచి తనకు తక్షణ ముప్పు ఉండదని మిలటరీ, రజాకార్లను వదిలి పెట్టాడు. కోటి యాభైæ లక్షల మందిలో 13 శాతం మంది తన వాళ్లు తప్ప స్వాతంత్య్ర కాంక్షతో రగిలిన ప్రజలు నిజాం వదిలిన ముష్కరులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యారు. 1947 ఆగస్టు 15 తర్వాత విలీనమైన సంస్థానాల్లో ఎక్కడా ఇంత హింస, తిరుగుబాట్లు లేవు. పాలకులు ప్రజల ఆకాంక్షను మన్నించి రిపబ్లిక్‌లో కలపడానికి సిద్ధపడ్డారు. మరి నైజాం రాజు నేటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు వీరందరికి మించిన గొప్ప మానవతావాది ఎలా అయ్యోడో అర్థంకాదు. అధికారంలోకి రాకముందు విమోచన దినం జరపాలని డిమాండ్‌ చేసి, ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు?

నిజాం వార్షికాదాయం రూ. రెండున్నర కోట్లు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం నిల్వలు, అరుదైన వస్తువుల లెక్క ఎవరికీ తెలియదు. 50 లక్షల ఎకరాల భూమి ఆయన సొంతం. ఇది మొత్తం సంస్థానం భూమిలో పది శాతం. నిజాంకు ఏజెంట్లుగా ఉన్న దేశ్‌ముఖ్‌లు, ఆయన తాబేదారులు 1,100 మంది చేతిలో 30 శాతం సేద్యపు భూమి ఉంది. సంస్థానంలో 40 లక్షల మంది కౌలుదారులే. వారికి గుంట భూమి కూడా లేదు. నిజాం సంస్థానంలో అక్షరాస్యత 9 శాతమే. అది కూడా మెజారిటీ హిందువుల మాతృభాష తెలుగులో చదువుకునే వీలే లేదు. నిజాంసాగర్, డిండీ, మూసీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిర్మించడం వెనుక ప్రజా సంక్షేమం కన్నా నిజాం స్వార్థమే ఎక్కువ.

కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులు హైదరాబాద్‌ సంస్థానంలో నుంచే ప్రవహించినా వాటిపై పెద్ద డ్యాములు, బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం జరగలేదు. వీటిని కట్టాలంటే సిమెంటు, ఉక్కు అవసరం. ఖజానాలోని పైకం ఖర్చవుతుంది. అందుకే అణా, కాణీ ఇచ్చి బలవంతపు కూలితో పూర్తి చేయగలిగే మట్టికట్టలనే నిర్మించారు. సంవత్సరంలో నెలకు పైగా రాజు నిర్మించే రోడ్లు, చెరువు కట్టల నిర్మాణాలకు ‘బేగార్‌’పేరుతో ఉచితంగా కూలీ చేయాలి. మొత్తం మీద నిజాం పాలనలో ప్రజలు తమ ఇళ్లు, గ్రామాలు అనే బహిరంగ జైలులో ఉన్నట్టే ఉండేది. పండగలు చేసుకోవాలన్నా, పెళ్లి, మరే శుభ కార్యం చేసుకోవాలన్నా రుసుం చెల్లించాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.

రెండొందల ఏళ్ల అసఫ్‌ జాహి, నిజాం పాలకుల పీడనలో హైదరాబాద్‌ సంస్థానం ప్రజల జన్యుపటమే మారిపోయింది. సర్కారు కొలువు దొరికితే తప్ప గౌరవంగా బతకలేని స్థితి. వ్యవసాయం చేసేవారు, కూలీ పనులతో బతుకీడ్చే వారు దుర్భర దారిద్య్రంలో కొట్టు మిట్టాడుతూ దినదిన గండంగా బతికేవారు. బానిసత్వంలో మగ్గేవారు దేని గురించి ఆలోచించలేని శూన్య స్థితిలో ఉంటారు. ఇది భౌతిక హింస కంటే దారుణమైనది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, వ్యాపార గుణాలను ఇంకొకరి నుంచి నేర్చు కోవాల్సిన అవశ్యకతను కల్పించింది. వజ్రాలు, బొగ్గు ఖనిజాలు అపారంగా దొరికే చోట ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి గోస కనిపించదు. మూడు పూటలా తిండి దొరకని, ఒంటి నిండా గుడ్డలు కప్పుకోలేని దయనీయ స్థితి. 86శాతం మంది హిందువులు మైనారిటీలుగా మనుగడ సాగించిన ఘోరం. 13 శాతం మంది ముస్లిములదే ఆధిపత్యం.

తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. మీరు బతుకమ్మను జరుపుకోవడానికి ప్రభుత్వ నిధులు కేటాయించనపుడు, అధికారిక ఉత్సవంగా ప్రకటించకపోయినా ఆ పండుగను ప్రజలు జరుపుకోలేదా? ఇది ఐదేళ్లు పాలించడానికి ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయిస్తే తప్ప జరగాల్సిన పర్వదినమేమీ కాదు. కాకపోతే ఆరోజు అన్న మాటలు ఇప్పుడెందుకు మర్చిపోయారని మాత్రమే అడుగుతున్నాం. ముందు తరాల వాళ్లు సెప్టెంబర్‌ 17 విముక్తి దినాన్ని ఒక దసరాలా, దీపావళిలా జరుపుకుంటారు.
వ్యాసకర్త బీజేపీ శాసనసభాపక్ష నేత
జి.కిషన్‌ రెడ్డి
మొబైల్‌ : 99490 99997

మరిన్ని వార్తలు