జాతక కథలు

8 Jul, 2013 16:21 IST|Sakshi
జాతక కథలు

 జాతకం అంటే జన్మకు సంబంధించినది అని అర్థం. బౌద్ధంలో జాతక కథలు అంటే బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథలు అని అర్థం. మానవుడు సంపూర్ణ జ్ఞానవంతుడుగా, సమ్యక్ సంబుద్ధుడుగా పరిణతి చెందటానికి ఒక జన్మ చాలదు. ఎన్నో జన్మలు ఎత్త వలసి ఉంటుంది. ఎంతో సాధన చేయవలసి వస్తుంది. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినాడు. కొన్ని జన్మల్లో అతడు రాజు, తపస్వి, బ్రాహ్మణుడు, చండాలుడు. మరికొన్ని జన్మల్లో సింహం, ఏనుగు, కుక్క, నక్క, కుందేలు, గుర్రం. ఏ జన్మ ఎత్తినా, ఆ జన్మలో అతడు క్షమ, త్యాగం, దానం, పరోపకారంలాంటి ఏదో ఒక అత్యుత్తమ శీలాన్ని ఆచరించి చూపేవాడు.
 
 బుద్ధుడు నిర్యాణం చెందిన మూడు నెలలకు, బుద్ధుని శిష్యులైన ఐదువందల మంది భిక్షువులు ఒకచోట సమావేశం అయి బుద్ధ వచనాలను మూడు గ్రంథాల్లో పొందుపరచినారు. అలా పొందుపరచినవాటిని ప్రాకృతభాషలో త్రిపిటకాలు అన్నారు. పిటకం అంటే పెట్టె. బౌద్ధంలో పిటకం అంటే ధార్మిక వాజ్ఞ్మయం అనే అర్థం కూడా ఉన్నది.
 
 బుద్ధుని బోధనలు వున్న పిటకాలను వినయ పిటకం, సుత్త పిటకం,
 అభిదమ్మ పిటకం అని పిలిచినారు. ఇవి చాలా పెద్ద పెద్ద గ్రంథాలు. జాతక కథలు ఉన్నది సుత్త పిటకంలో. ఈ కథలు మొత్తం ఐదు వందల నలభై ఏడు. బుద్ధుని పూర్వ జన్మకు ఒకటి చొప్పున వున్నవన్నమాట. సింహళ భాషలో ఉన్న జాతక కథల్ని క్రీ.శ ఐదవ శతాబ్దంలో బుద్ధఘోషుడు అనే బౌద్ధ ఆచార్యుడు పాళీ భాషలోకి అనువదించాడు. విసుద్ధిమగ్గ అనే ప్రామాణిక గ్రంథం రాసిందీ, ధమ్మపదం కథలు చెప్పిందీ ఈయనే. బౌద్ధ ప్రపంచం యావత్తు ఈ మహానుభావుణ్ణి నేటికీ నెత్తిన పెట్టుకొని పూజిస్తుంది. ముఖ్యవిషయం ఏమంటే ఈయన తెలుగువాడు. నాగార్జున కొండకు యాభై కిలోమీటర్ల దూరంలో వున్న కోట నెమలిపురి ఈయన పుట్టినవూరు. ఈయన ఒక్కడే కాదు. బౌద్ధంలో మహామహులైన నాగార్జునుడు, అనురుద్ధుడు, దిఞ్నగుడు తెలుగువారే.
 
 జాతకకథను కొందరు నాలుగు భాగాలుగా, మరికొందరు ఐదు భాగాలుగా విభజించి చూపుతారు. కాని వాటిల్లో ముఖ్యమైన భాగాలు రెండు. అవి ఒకటి వర్తమాన కథ, రెండు అతీత కథ. వర్తమాన కథ అంటే బుద్ధుడు వుండగా జరిగిన ఏదో సంఘటన గురించి చెప్పినది. అతీత కథ అంటే ఆ సంఘటనను పురస్కరించుకొని బుద్ధుడు చెప్పిన తన పూర్వజన్మకథ. ఉదాహరణకు అపణ్ణక జాతకం.
 
 ఒకనాడు అనాథ పిండక శ్రేష్టి జేతవనంలో ఉన్న బుద్ధుని వద్దకు వచ్చి తన మిత్రులు కొందరు బుద్ధుడు బోధించిన మార్గం విడిచి వేరే మార్గంలోకి వెళ్లారన్న విషయం చెప్పినాడు. ఇది వర్తమాన కథ. ఈ వర్తమాన కథను పురస్కరించుకొని బుద్ధుడు తన ఒక పూర్వజన్మలో జరిగిన సంఘటన గురించి చెబుతాడు. ఇది అతీత కథ. ఆ జన్మలో తాను వర్తకుడు. తన కంటే ముందు బయలుదేరి వెళ్లిన మరో వర్తకుడు దార్లో కనిపించిన యక్షుడి మాయమాటలు నమ్మి ఉన్న నీరు పారబోయించుతాడు. ఫలితంగా అనుచరులతో సహా యక్షుడికి ఆహారమవుతాడు. వెనుక వచ్చిన మరో వర్తకుడు తెలివిగా వ్యవహరించి, యక్షుల మాటలు నమ్మకుండా బతికి బయట పడతాడు. ఇది చెప్పి ధర్మోపదేశం చేసి బుద్ధుడు అంటాడు ‘అప్పటి తెలివిగల వర్తకుడు నేనే. మూర్ఖవర్తకుడు దేవదత్తుడు’. ఇలాంటి కథానిర్మాణం అన్ని జాతక కథలకూ వర్తిస్తుంది.
 
 చాలా జాతక కథలు ప్రపంచంలోని వివిధ భాషల కథా సాహిత్యంలో చొచ్చుకొని పోయినవి. సిహచమ్మ జాతకం, కచ్ఛప జాతకం ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఒకడు తన గాడిద మీద సింహం తోలు కప్పి పంట పొలాల్లో విడిచి పెట్టేవాడు. మొదట్లో వూరి వాళ్లు భయపడ్డా, అది ఓండ్ర పెట్టడం చూసి, వెంటపడి దాన్ని కర్రలతో కొట్టి చంపుతారు.
 
 ఈ కథ కొద్ది మార్పులతో అనేక భాషల్లోకి పరివర్తన చెందింది. ఇంకో ఉదాహరణకు కచ్ఛపజాతకం ఉంది. రెండు కొంగలు కర్రపుల్లను నోట కరచుకొని, దాన్ని పట్టుకొని వున్న తాబేలుతో సహా పైకి లేచి ఆకాశంలో ఎగురుకొంటూ పోతుంటవి. కింద నుండి ఇది చూసిన కొంటె పిల్లలు హేళన చేస్తూ తాబేలును ఆటపట్టిస్తారు. కొంగలు ఎంత వారించినా వినకుండా తాబేలు, పిల్లలతో వాదించటానికి నోరు తెరిచి కింద పడి మరణిస్తుంది. ఇలాంటి కథ పంచతంత్రంలోనూ ఒకటి ఉంది. ఈసప్ కథల్లోనూఉంది.
 
 జాతక కథలు అన్నీ క్రీ.పూ. ఐదవ శతాబ్దం నుంచి క్రీ.శ. రెండవ శతాబ్దం వరకు రచించబడినవి అని అంటారు. ఇవే బౌద్ధధర్మంలోని థేరవాద సంప్రదాయం ఆమోదించిన జాతక కథలు. తరువాత కాలంలో కూడా ఆ కథల స్ఫూర్తితో చాలా జాతక కథలు వచ్చినవి కాని అవి త్రిపిటకాల్లో అంతర్భాగం కాలేదు. ఉదాహరణకు సంస్కృతంలో ఆర్యశూరకవి రచించిన జాతకమాల కథలు. వాటిని వీటితో కలపకుండా విడిగా చదువుకుంటారు.
 
 అసలైన జాతక కథలు చాలామటుకు గుహల్లో చిత్రించబడటమో దేవాలయాల గోడల మీద చెక్కబడటమో జరిగింది. కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్ దేవాలయం గోడల మీద అనేక జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. సాంచి స్తూపం మీద, అజంతా గుహల్లో వీటి చిత్రాలు ఉన్నాయి. కొన్ని జాతక కథల్ని కంబోడియా, థాయ్‌లాండ్, లావోస్ మొదలైన దేశాల్లో నృత్యగీతాలుగా మలిచి ఉత్సవ సమయాల్లో ప్రదర్శిస్తుంటారు. వెస్సంతర జాతకంలాంటి పెద్ద జాతక కథల్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
 
 జాతక కథల భాష పాళి. పాళి అనేది మొదట్లో ఏ భాషకూ పేరు కాదు. ఆ భాష పేరు మాగధి. ప్రాకృతంలోని పద్దెనిమిది భేదాల్లో ఒకటిగా చెప్పబడింది. రాను రాను బుద్ధుని వచనాలు వున్న త్రిపిటకాల్లో ఉన్న భాషను పాళి అని వ్యవహరించడం మొదలుపెట్టారు. పండితులు పరిశోధించి తెలుగు పదాలు ఎన్నింటినో జాతక కథల భాషలో కనిపెట్టారు. బొంద, అక్క, అప్ప, సామి మొదలైనవి. బుద్ధఘోషుడు తెలుగువాడు కాబట్టి, సందర్భానుసారం తెలుగుపదాలు వాడి ఉండటంలో ఆశ్చర్యం లేదు.
 
 ఇంకో విషయం ఏమంటే తెలుగువాళ్లు మామూలుగా కథను అనగా అనగా ఒకరాజు అంటూ మొదలుపెడతారు. జాతక కథల్లో చాలా ‘వారణాసి బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా’ అంటూ మొదలవుతవి.  ఇవన్నీ చూస్తుంటే బౌద్ధానికి తెలుగువారు ఎంత దగ్గరో కదా అనిపిస్తుంది.

 

మరిన్ని వార్తలు