దేన్ని చూసుకుని రాయాలి?

18 Apr, 2016 01:39 IST|Sakshi
దేన్ని చూసుకుని రాయాలి?

ఏప్రిల్ 24న జయకాంతన్ జయంతి
ప్రారంభంలో జయకాంతన్ బతకటానికి ఎన్నో రకాలైన పనులను చేశారు. వాటిలో -అ) వెచ్చాల కొట్లో పొట్లాలు కట్టే పని, ఆ) డాక్టర్ దగ్గర మెడిసిన్ కిట్ మోసే పని, ఇ) పిండిమిల్లులో పని, ఈ) అచ్చు యంత్రాల దగ్గర అక్షరాలు పేర్చే పని, ఉ) ట్రెడిల్‌మేన్‌గా, ఊ) వార్తాపత్రికలు అమ్మే పని, ఋ) పిండిమిషన్ విడి భాగాలు తయారుచేసే ఫౌండ్రీలో ఇంజన్లకు బొగ్గు వేసే పని, ౠ) సోపుల ఫ్యాక్టరీలో పని, ఎ) జట్కావాలాకు సహాయకుడిగా, ఏ) ప్రూఫ్ రీడర్‌గా, ఐ) పేకాట క్లబ్బులో పనివాడుగా, ఒ) సంపాదకుడుగా, ఓ) అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్‌గా, ఔ) కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో పని... మొదలైనవి ఆయన ఎన్ని ఇబ్బందులెదుర్కొని జీవితంలో పైకొచ్చారో తెలియజేస్తాయి.
 
 ‘‘ఆ కాలంలో ‘హిట్లర్’ ప్రపంచంలోనే పేరు పొందిన వ్యక్తి . అయినప్పటికీ నేను హిట్లర్‌కు ఎనిమీని. అప్పుడు నాకు హిట్లర్ అంటే ఇష్టం లేకపోవటానికి కారణం - అతని మీసం. మా నాన్నా అదేలాగా మీసం పెట్టుకునేవారు. నాకు ఆయనంటే కూడా ఇష్టం లేదు. హిట్లర్ మీసాన్ని నాన్న పెట్టుకోవటం వల్ల నాన్నంటే ఇష్టంలేదా? లేక నాన్న మీసం హిట్లర్ పెట్టుకున్నందువల్ల హిట్లర్ అంటే ఇష్టంలేదా? అని స్పష్టంగా నాకు తెలియదు. ఆ కాలంలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్న ఒకే ఒక  వీర పురుషుడు స్టాలిన్. స్టాలిన్ మీసం ముందు ఈ హిట్లర్ మీసం ఓడిపోతుందని నేను పందెం కాసేవాణ్ణి’’ అనేవారు జయకాంతన్. (కాగా తమిళనాట సాహిత్య రంగంలో పెద్ద పెద్ద  మీసాలు పెట్టుకున్న రచయిత జయకాంతన్ ఒక్కరే!)
 
 ‘‘నాకు రాసేందుకు కుతూహలమూ, దానికి తగ్గ కారణాలూ ఉన్నాయి. నా రాతలకు ఒక లక్ష్యమూ ఉంది. నేను రాసేది పూర్తిగా జీవితం నుండి నేను పొందే జ్ఞాన ప్రభావమూ, నా ప్రత్యేక శ్రద్ధానూ! రాయటం వల్ల నేను సాధువుగా మారుతున్నాను. అందుకోసమూ రాస్తున్నాను. రాయటం వల్ల భాష వృద్ధి చెందుతుంది. అందుకోసమూ రాస్తున్నాను. రాయటం వల్ల నావాళ్లు సుఖమూ, లాభమూ పొందుతున్నారు. వాటి కోసమూ రాస్తున్నాను. భవిష్యత్కాల సమాజాన్ని ఎంతో గొప్ప స్థితికి తీసుకెళ్లటానికి సాహిత్యం అంటూ ఒకటి అవసరం కనుక రాస్తున్నాను. కలం ఎంతో బలమైనది. నా జీవన పోరాటంలో నేను ఎంచుకున్న ఆయుధం కలం. అందుకే రాస్తున్నాను. కలం నా దైవం’’ అంటారు జయకాంతన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో.
 
 1990లో గోర్బచేవ్ పరాజయం చెంది, సోవియెట్ యూనియన్ ముక్కలైనపుడు, జయకాంతన్ ఎంతో కదిలిపోయారు. నిజమైన ఎందరో కమ్యూనిస్టుల్లాగే, సోవియెట్ స్నేహితుల్లా బాధపడ్డారు. 1993లో ఒక సభలో ఆయన మాట్లాడుతూ... ‘‘నేను రాయటం లేదు, ఎందుకు రాయటం లేదని అడుగుతున్నారు. నేనిక దేన్ని చూసుకుని రాయాలి? జీవితంలో దేన్ని కలగా కంటూ వచ్చామో, ఆశలు పెంపొందించుకుంటూ వచ్చామో, నమ్మామో ఆ విశాల సమాజమే, సోవియెట్ యూనియనే నాశనమై పోయిందే. ఇక నేను దేన్ని నమ్మాలి. దేన్ని ఉదహరించాలి. ఉండనీ... అదొక ఉన్నతమైన అబద్ధం. నాకది చాలు. ఇక తక్కినవాళ్లు రాయనీ...’’ అంటూ ముగించారు.
  జిల్లేళ్ళ బాలాజీ
 9866628639
 (సౌజన్యం: sirukadhai mannan J.K.100 ariya thagavalgal by Sabitha Joseph)
 

మరిన్ని వార్తలు