ప్రకృతిని పాడే వాగ్గేయరాజు

21 Jun, 2014 00:32 IST|Sakshi
ప్రకృతిని పాడే వాగ్గేయరాజు

ప్రశ్న: మీకు ప్రకృతి మీద ప్రేమ ఎలా ఏర్పడింది?
 జవాబు: ఏమో తెల్వదు సార్. అలా ఏర్పడిపోయిందంతే.

 జయరాజు ప్రకృతికి పర్యాయపదం. లేదా జయరాజుకు ప్రకృతి పర్యాయపదం. మనిషి, ప్రకృతి కలగలసి పోవడమే అతడి పాట. జయరాజు ప్రకృతినే తన తత్త్వంగా చేసుకున్నాడు. ప్రకృతి కోసమే గొంతెత్తి పాడతాడు. ‘వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా’... అని వాన గురించి రాసినా ‘రూపమన్నది లేనివాడికి రూపమిచ్చిన జాతి నాది... ఏడుకొండల వేంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది’... అని రాళ్ల గురించి రాసినా, ‘ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నను గన్న తల్లి’ అని నేల తల్లి గురించి రాసినా, ‘పంట చేనులారా మీకు పాద పాదాన వందనాలు చేను చెలకలారా మీకు చెమట చుక్కల వందనాలు’ అంటూ పంట చేల గురించి రాసినా అవన్నీ ప్రయత్నం మీద పుట్టిన పాటలు కావు. జయరాజులో నుంచి సహజంగా ఉద్భవించినవి. ఎవరు గింజలు చల్లారని అడవి మొలిచింది? ఎవరు అడిగారని జయరాజు పాట పాడేది? అది అతడికి సహజాతం.
 
 తెలంగాణ కవిగాయకుడిగా జయరాజు ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. అతడి జీవితం ముళ్లబాట. ఉద్యమంలో ఎదుర్కొన్నది రాళ్లబాట. నిర్బంధం కానుక గాయాల వేడుక అతడి జీవితంలో భాగమయ్యాయి. వీటి నడుమ జయరాజు పాటతో నేస్తు కట్టాడు. కిటికీలో నుంచి చందమామ కనిపిస్తే ఒక పాట. దాపున సీతాకోక చిలుక వాలితే ఒక పాట. చెట్టు చిగురిస్తే ఒక పాట.
 పచ్చాని చెట్టు నేనురా... పాలుగారె మనసు నాదిరా...
 కొమ్మను నే రెమ్మను... నీకు తోడుగ ఉండే అమ్మను...
 మీ పొలమున దున్ని నాగలై... పంటను మోసిన బండినై...
 అమ్మమ్మ చేతిలో కవ్వమై... తాతయ్య చేతిలో కర్రనై...
 అమ్మపాటతో ఊగిన ఊయలై.... ఆ పాడేటి పిల్లన గ్రోవినై...
 
 అంటూ జయరాజు చెట్టు గురించి పాడితే కన్నీరు ఉబుకుతుంది. కనిపించిన ప్రతి చెట్టునూ గట్టిగా కావలించుకోబుద్ధవుతుంది. అవసరమైనప్పుడు ప్రజల పక్షం అనుక్షణం ప్రకృతి పక్షం వహిస్తూ ప్రజావాహినికి చైతన్య గీతమై గాన ప్రబోధమై సాగుతున్న జయరాజు పాటకు మరో వెయ్యేళ్ల ఆయుష్షుంటుంది. ప్రకృతి దానిని ఆశీర్వదిస్తుంటుంది.
 - సాక్షి సాహిత్యం
 (జూన్ 29న వరంగల్ జిల్లా పాలకుర్తిలో సోమనాథ కళాపీఠం వారు జయరాజుకు ‘వాగ్గేయరాజు’ బిరుదు అంకితం చేయనున్న సందర్భంగా)

మరిన్ని వార్తలు