అభినవ పాదుకాపట్టాభిషేకం

22 Jan, 2015 09:26 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

 జీవన కాలమ్
 ముంతదార్ ఆల్-జైదీ బుష్ మీద బాగ్దాద్‌లో బూటు విసిరి ‘ఇది ఇరాకీ ప్రజలు నీకిచ్చే వీడ్కోలు ముద్దురా, కుక్కా!’ అని అరిచాడు. ఆ తర్వాత ముద్దునీ, బూటునీ నెత్తిన పెట్టుకుని అరబ్ దేశాలు పండుగ చేసుకున్నాయి.
 అరాచకం అంటువ్యాధి. తిరుగుబాటు దొమ్మీ సంస్కా రం. వ్యక్తిగత విచక్షణకీ, గుం పు ఆవేశానికీ పొంతన ఉం డదు. అలాగే వ్యక్తి సంస్కారం ఉన్నతంగా ఉన్నా గుంపు ఉద్రేకమే నిలదొక్కుకుంటుం ది. ఇది ఒక సమూహానికి సం బంధించిన మనస్థితి.
 ఒకాయన 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. ఆయన పేరు మహాత్మాగాంధీ. అది దావానలంలాగ ప్రపంచమంతా వ్యాపించింది- గొప్ప ఆయుధంగా. అది ఉద్యమం.

 ఒకాయన ఆరేళ్ల క్రితం సామ్రాజ్యశక్తుల మీద తన అసహనాన్ని ప్రకటించాడు-బాగ్దాద్‌లో, అమెరికా అధ్య క్షుడు బుష్ మీద బూటు విసిరి. తర్వాత- ప్రపంచమం తా-50 సందర్భాలలో తమ బూట్లను వేర్వేరు కారణా లకి నాయకుల మీద విసిరి తమ అసంతృప్తినీ నిరసననీ ప్రకటించారు. యూరోపు, ఉత్తర అమెరికా, ఇండియా, చైనా, హాంకాంగ్, ఇరాక్, టర్కీ, ఆస్ట్రేలియాలలో ఈ విన్యాసాలు సాగాయి.
 వ్యవస్థలో అక్రమాన్ని ఎదిరించలేని సామాన్య మానవుడు- ఒక వ్యక్తి తెగించి, ఆవేశంతో చేసిన పనిని ఆనందంగా, అంతే ఆవేశంతో సమర్ధించడం - ఈ చర్య లకు మూలసూత్రం. సినీమాల లో మెలోడ్రామాకీ, గుడు లలో దేవుడికి చేసే మన ప్రార్థనలకీ మూలసూత్రం ఇదే. ‘భగవంతుడా! వెంకయ్య నా ఆస్తి దోచేశాడు. వాడికి బుద్ధి చెప్పు!’- ఇది సామాన్య మానవుడి తిరుగుబాటు ఆయుధం.

 రిక్షా వాడిని పోలీసు కాల్చుకు తింటున్నాడు. అతని అవినీతిని హీరో రోడ్డు మీద ఎదిరించి నిలదీశాడు. గొప్ప రాణింపు కథకి.
 ఒక పాత్రికేయుడు- ముంత దార్ ఆల్-జైదీ బుష్ మీద బాగ్దా ద్‌లో బూటు విసిరి ‘ఇది ఇరాకీ ప్రజలు నీకిచ్చే వీడ్కోలు ముద్దురా, కుక్కా!’ అని అరిచాడు. ఆ తర్వాత ముద్దునీ, బూటునీ నెత్తిన పెట్టు కుని అరబ్ దేశాలు పండుగ చేసు కున్నాయి.

 2009లో ప్రపంచంలో ఉన్న అరబ్బులలో జైదీని మూడో స్థానం లో నిలిపింది ఈ చర్య. తిక్రిత్ అనే చోట ఈ బూటుకు మూడు మీటర్ల విగ్రహాన్ని స్థాపించారు. జైదీ విసి రిన బూటు పేరు డ్యూకాట్ 271. దాన్ని తయారు చేసిన కంపెనీ ఇస్తాంబుల్‌లో బేడాన్ షూ కంపెనీ. ఆ క్షణం నుంచీ ఆ బూటుకి కొత్త పేరు వచ్చింది- ‘బుష్ షూ’. తర్వాత కంపెనీ ‘బైబై బుష్ షూ’గా మార్చింది. అయితే జైదీ సోదరుడు కాస్త దేశభక్తిని ఈ సంఘటనకు జత చేసి ఈ షూ బాగ్దాద్‌లోనే తయారయిందన్నాడు. ఏతావాతా ఈ సంఘటన తర్వాత ఈ షూ ఒక్కవారంలోనే మూడు లక్షల జతలు అమ్ముడుపోయాయట. లండన్ ఆర్టిస్ట్ పావెల్ వానెన్‌స్కీ 21 కేజీల కంచు బూటును తయారు చేసి, దానికి 24 క్యారెట్ల బంగారం పూతను పూయించాడు.

 జైదీకి ఆరు తలుపులున్న మెర్జిడిస్‌ని ఒక అభిమాని బహూకరించాడు. ఆఫ్ఘాన్ రచయితలు ఆయన పాటలు రాసి పాడుకున్నారు. ఒక సౌదీ వ్యాపారి జైదీ విసిరిన బూటుని 10 మిలియన్ అమెరికన్ డాలర్లకి కొనడానికి ముందుకొచ్చాడు.
 ఒక జాతి నిరసనని తెలపడానికి కొత్త ఆయుధాన్నీ, కొత్త పద్ధతినీ ఆవిష్కరించిన వైతాళికుడు జైదీ. దరిమి లాను ఢిల్లీలో (2009) మన ఆర్థికమంత్రి చిదంబరం మీద ఒక సిక్కు పాత్రికేయుడు జర్నాయిల్ సింగ్ 1984 సిక్కుల మారణహోమం పట్ల ప్రభుత్వం అలసత్వానికి నిరసనగా బూటు విసిరాడు. 2010లో షమీద్ ఖాన్ పాకి స్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మీద బూటు విసిరాడు.

 ఇప్పుడు మరొక బూటు కథ. రియో డి జనిరో (బ్రెజిల్)లో జరిగిన ప్రపంచ బంతి ఆట పోటీలలో అర్జెంటీనాతో ఫైనల్లో ఆడి ఒకే ఒక గోల్‌తో కప్పును గెలిపించిన ఆట గాడు మారియో గోడ్జీ. ఈ విజయంతో 24 సంవత్సరాల తర్వాత జర్మనీ కప్పును గెలుచుకుం ది. అది ఒక చరిత్ర. గోడ్జీ ఆ గోల్ కొట్టిన బూట్లని ఆనాడు గ్రౌండ్‌లో వాటికంటుకున్న గడ్డిపోచలతో సహా భద్రంగా 22 సంవత్సరాలు దాచాడు. మొన్న పసిపిల్లల సంక్షేమ నిధికి ఒక్క ఎడమకాలి బూటుని మాత్రం వేలం వేశారు. 2.38 మిలి యన్ల అమెరికన్ డాలర్లకి ఆ బూటు అమ్ముడయింది.
 పాదుకలను శిరస్సున ధరిం చి- సింహాసనం మీద ఉంచి అన్న శ్రీరామచంద్రుడికి ప్రతినిధిగా పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేసిన భరతుడి కథ మనకు పురాణం. ఈ కాలంలో పాదుకల విలువ- రెండు మిలియన్లు, మెర్సిడెస్ కారు, లక్షల వ్యాపారం, ప్రపంచ ప్రఖ్యాతి- అన్నిటికీ మించి ఓ జాతి ఆత్మ గౌర వానికి అభిజ్ఞ. కాదు- ఓ జాతి తనకు జరిగిన అవమా నానికి చేసిన తిరుగుబాటుకి గుర్తు.
 మరొక్కసారి - అరాచకం అంటువ్యాధి. అరాచకా నికి జాతి ఉదాసీనత తోడయితే అది మళ్లీ ఉద్యమమ వుతుంది. ఒక సందేశమవుతుంది. ఉద్యమ లక్ష్యం ఉదాత్తమయితే అది భరతుడి ‘పాదుక’ అవుతుంది.
 ఒకటి నిరసన, మరొకటి నివేదన, ఇంకొకటి ఆరాధన.

>
మరిన్ని వార్తలు