మరో భూబాగోతం కారాదు

13 Sep, 2013 23:51 IST|Sakshi
మరో భూబాగోతం కారాదు

విశ్లేషణ: భూసంస్కరణల బిల్లు 1972లో మన రాష్ట్రంలో ఆమోదం పొందింది. దానికి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే తూట్లు పొడిచి ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి కారణమైంది. తెల్లకాగితాలపై భూమి మార్పిడి జరిగినా, దానికి చట్టబద్ధత లేదని కోర్టు చెప్పినా లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అయితే ఆ కుట్రలు ఎన్నాళ్లో సాగలేదు. మంత్రతంత్రాలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తున్న వారు కూడా భూసంస్కరణల నుంచి భూమిని కాపాడుకోవడానికి బరితెగించారు.
 
‘ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే, గాడిద రాగాన్ని విని ఒంటె మూర్ఛపోయిందట’.. సెప్టెంబర్ 8న సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తరువాత ఈ సామెతే గుర్తుకు వచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశ చర్చనీయాంశం - కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న భూసంస్కరణల బిల్లు ముసాయిదాపై చర్చ. ప్రభుత్వం తెచ్చే భూసం స్కరణల స్వరూపం ఎలా ఉంటుందో మనకి గతాను భవాలు చాలా ఉన్నాయి. వాటిని గమనించడం అవసరం. అడపాదడపా జరిగే భూపంపిణీ వ్యవహారం కూడా ప్రహసనాన్ని మరిపిస్తూనే ఉంటుందన్న సంగతి కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. కొత్త బిల్లు నేపథ్యంలో వీటి సమీక్ష అవసరం.
 
కేంద్రం ఆశయం సరే...
ముసాయిదాలో ఒకటి, రెండు ప్రధాన అంశాలు ఆసక్తి కలిగించాయి. నీటి పారుదల సౌకర్యం గల భూమి 5-10 ఎకరాలకు, మెట్ట ప్రాంతంలో 10-15 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదన ఇందులో ఒకటి. దీనిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హర్షించాల్సిన సందర్భమే అయినా, ఇది రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా చేసుకున్న ముసాయిదా అని చెప్పక తప్పదు. భూసమస్య తీసుకుంటే, దేశంలో 50 శాతం ప్రజలు భూమిలేని పేదలే. అందులో దళితులు, పేద వర్గాలు దాదాపు 60 శాతం ఉంటారు. 55 శాతం భూమి మీద 10 శాతం కుటుంబాలే ఆధిపత్యం కలిగి ఉన్నాయని ముసాయిదాలోనే తెలియజేశారు. అయితే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా, మన రాష్ట్ర నాయకత్వం నీటి సౌకర్యమున్న భూమి 5-10 ఎకరాలకు, మెట్ట 10-15 ఎకరాలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనతిరస్కరించి, ఆ సంగతిని బహిరంగంగానే ప్రకటిం చటం ఆశ్చర్యకరం. ఇవన్నీ జరిగాకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భూసమస్యపై స్పష్టతతో, అంకితభావంతో ఉన్న వామపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రతిపాదనను ఆమోదించాయి. మిగిలిన బూర్జువా పార్టీలు వ్యతిరేకించాయి.
 
గత అనుభవాలు
భూ సంస్కరణల బిల్లు 1972లో మన రాష్ట్రంలో ఆమోదం పొందింది. దానికి మళ్లీ కాంగ్రెస్‌పార్టీయే తూట్లు పొడిచి ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి కారణమైంది. తెల్లకాగితాలపై భూమి మార్పిడి జరిగినా, దానికి చట్టబద్ధత లేదని కోర్టు చెప్పినా లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అయితే ఆ కుట్రలు ఎన్నాళ్లో సాగలేదు. మంత్రతంత్రాలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తున్న వారు కూడా భూసంస్కరణల నుంచి భూమిని కాపాడుకోవడానికి బరితెగిం చారు. ఆ సందర్భంగానే ఆనాటి కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు మందపాటి నాగిరెడ్డి అసెంబ్లీలోనే ‘అధ్యక్షా నాకు హోం పోర్టు ఫోలియో ఒక్క రోజు ఇవ్వం డి, కొన్ని వందల వ్యభిచార కేసులు నమోదు చేయిస్తా’నని ప్రకటించారు. అంటే బూటకపు విడాకుల ద్వారా భూమిని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
 
నేను చిత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేసినప్పటి అనుభవాలను ఇక్కడ ఉదహరించాలి. రెవెన్యూ శాఖ మాజీ అధికారులు, భూకబ్జాదారులు కలిపి పాత స్టాంపు పేపర్లు సంపాదించేవారు. వాటిని కుండలో వేసి వేడిచేసి పురాతన కాలపు పత్రాల రూపు తెచ్చేవారు. ఇలా వేలాది ఎకరాలు మీద సంపన్నులు బినామీ పట్టాలు సృష్టిస్తూ ఉంటే అలాంటి ఘటనలు వెలుగులోకి తెచ్చాం. ఫలితంగా ఆనాటి కలెక్టర్ నాగార్జున కె.వి.బి.పురం ఎమ్మార్వోను సస్పెండ్ చేశారు. వెంటనే నాగార్జున గుంటూరు జిల్లాకు బదిలీ కావడం ఇక్కడ కొసమెరుపు. నాగార్జున వెళ్లినా ఆ ప్రక్రియ కొనసాగించడానికి ప్రయత్నించిన ఆనాటి జాయింట్ కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
 
గత అనుభవాలను బట్టి ఇప్పుడు మన ముందున్న ముసా యిదా సంగతి చూస్తే, ఒక పక్క రాష్ర్ట నాయకత్వం వ్యతిరేకిస్తున్నది. మరోపక్క సాంకేతికంగా అమలయ్యేలా చేసి ప్రచారం చేసుకొని ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం కూడా జరగవచ్చు. భూవైశాల్యం పెరగదు. జనాభా పెరుగుతుంది. కాబట్టి ఉన్న భూమిని ప్రజానీకానికి అందుబాటులో ఉంచకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ భూమి, వక్ఫ్‌బోర్డు ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి. ఆ భూమిని లీజుకిస్తే ఎంత ఆదాయం దేవాలయాలకు వస్తున్నది? భూమిలేని పేద ప్రజలకు ఆ భూమిని కేటాయిస్తే పేదలకు, నైవేద్యానికి కూడా ఉపయోగపడుతుంది.
 
భూమికి రక్షణ కరవు
ఆనాటి కమ్యూనిస్టులు భూపోరాటాలు సాగించారు. వినోబా వంటి వారు పోరాటం లేకుండానే భూములు వస్తాయని భ్రమపెట్టారు. దీనికే భూస్వా ములు పనికిరాని భూమి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కీసరలో ఉన్న ఇలాంటి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకోవడానికి పూనుకున్నారు. దానిని సీపీఐ వెలుగులోకి తెచ్చింది. ఆ భూమికి ఒక చివరన ఎమ్మార్వో కార్యాలయం మరో చివరన పోలీస్ స్టేషన్ ఉంటాయి. కానీ భూదానంతో వచ్చిన భూమికి రక్షణ కరువైంది. అలాగే రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో 60 ఎకరాల భూదాన భూమిలో ప్రైవేట్ ఎస్‌ఎల్‌సీ ఇంజనీరింగ్ కాలేజీ వెలసి బాగా విద్యావ్యాపారం చేసుకుంటున్నది. కుంట్లూరు గ్రామ సర్వే నెంబర్ 215 నుంచి 224 వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలాంటి సంబంధంలేని సంప న్నులు రెండు పార్టీలుగా చీలి కోర్టుకు వెళ్లారు. కోర్టులో కేసు జరుగుతుండగానే రాజీపడ్డారు. రాజీపడిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ 41 ఎకరాల బినా మీలకు ఓఆర్‌సీ మంజూరు చేశారు. అలాగే మణికొండలో ప్లాట్లు వేసి అమ్ము కుంటున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధమే.
 
అటవీ + రెవెన్యూ ఆటలు
ఇవి మరింత ఆశ్చర్యకరం. విజయనగరం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు వేలాది ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఆ భూమిపై అటవీ శాఖ కంచె వేసి అర్హులను రాకుండా ఆటంక పరుస్తున్నది. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో, శ్రీకాకుళం జిల్లాలో కొత్తవలస, చిత్తూరు జిల్లాల్లో శ్రీకాళహస్తి ప్రాంతాలలో నేనే స్వయంగా ఆందోళనలో పాల్గొన్నాను. శ్రీకాళహస్తి వద్ద గొల్లపల్లిలో రెండు వేల ఎకరాలకు పట్టాలిచ్చినా అటవీశాఖ వారు అనుమతివ్వకపోగా, అక్కడి గిరిజనులతో కలిసి ఆ భూమిలో వ్యవసాయం చేయించడానికి ప్రయత్నిస్తే ఎస్పీ నాయకత్వాన పోలీసులు, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు మూకుమ్మడిగా వచ్చారు. ఒకవైపు రెవెన్యూ, మేమే పట్టాలిచ్చామని చెబుతున్నా, ఫారెస్టు అధికారులు అంగీకరిం చకపోవడంతో పోలీసు అధికారులు నిమిత్తమాత్రులయ్యారు. వీటి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. ఇక గ్రామాల నుంచి పట్టణాలకు వలసల మాట నిజమే అయినా 79 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. భవిష్యత్తు వ్యవసాయ రంగానిదే.
 
ప్రభుత్వ పాత్ర
భూమి హక్కును ఇవ్వడమేకాదు, దాని పరిరక్షణలో కూడా ప్రభుత్వ బాధ్యత చాలా ఉంటుంది. పారిశ్రామిక రంగంపై చూపే శ్రద్ధ వ్యవసాయ రంగంపైనా చూపించాలి. సహకార రంగాన్ని సమర్థంగా పనిచేయించాలి. పంటల మార్కె టింగ్‌కు సాయపడాలి. ఉత్పత్తికి, రవాణాకు, ధాన్యం ప్రాసెసింగ్‌కు చర్యలు తీసుకోవాలి. కూరగాయలు పండించేందుకు, అమ్మకాలకు తోడ్పడాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ‘‘వ్యవసాయ రంగం నష్టం కాదు. దేశానికి లాభం’’ అనే విధానం ప్రభుత్వం అవలంబిస్తే అంతా సక్రమంగా జరుగు తుంది.
 
 పారిశ్రామికవేత్తలు విలాసాల కోసం వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగనామం పెడితే, ఆ ప్రజాధనాన్ని ప్రభుత్వం ‘నిరర్ధక ఆస్తులుగా’ ప్రకటించి మోసం చేస్తున్నది. కానీ సబ్సిడీ ద్వారా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రభుత్వ దివాళాకోరు తనం వలన వ్యవసాయరంగం దెబ్బతిన్నది. మార్క్స్ చెప్పినట్లు ‘ఒక వ్యక్తి కేవలం తన జానెడు పొట్ట నింపుకోవడానికే ఉత్పత్తి చేయడు, కొన్ని పదుల, వందల, వేల పొట్టలు నింపడానికి తన శ్రమ శక్తిని వినియోగిస్తాడు’. ఇంతకీ ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయమని తెలిసినా వామపక్షాలు ఎందుకు బలపరుస్తున్నాయి? ‘వారు ఒకందుకు బిల్లు పెట్టారు. మనం ఒక విధంగా సమర్థిస్తున్నాం’. ఈ ప్రయత్నం కేంద్రం ఎన్నికల జిమ్మిక్కని కొట్టిపారేయడం కన్నా, సమర్థించి భవిష్యత్తు ఉద్యమానికి బలం చేకూర్చడం ఉత్తమం.    

>
మరిన్ని వార్తలు