దర్శన దర్శనం

16 May, 2016 01:26 IST|Sakshi
దర్శన దర్శనం

అనువాద సాహిత్యం
 
1940-42 ప్రాంతాలలో కమ్యూనిస్టు రాజకీయ ఖైదీగా దేవలీ, హజారీబాగ్ జైళ్ళలో రాహుల్‌జీ వున్నప్పుడు సైన్స్, సమాజ శాస్త్రము, దర్శనాలకు సంబంధించిన విషయాలను ఒకే గ్రంథంగా పాఠకులకు ఇవ్వాలనుకున్నారు. కానీ రాసే క్రమంలో ఏ విషయానికి ఆ విషయాన్ని వేరు వేరుగా రాయటమే సరైనదనుకున్నారు. విశ్వకీ రూప్ రేఖా (సైన్‌‌స), మానవ సమాజ్ (సమాజ శాస్త్రం), దర్శన్-దిగ్దర్శన్ (దర్శనం), వైజ్ఞానిక భౌతికవాదం (గతితార్కిక భౌతికవాదం), ఇలా నాలుగు గ్రంథాలుగా వ్రాసారు.

అయితే మిగతా గ్రంథాలతో పోలిస్తే, దర్శన్-దిగ్దర్శన్‌కు కొంత ప్రత్యేకత ఉంది. ఆయన దేవలీ జైలులో వున్నప్పుడు తోటి కామ్రేడ్‌‌సకు దర్శన శాస్త్రం (ఫిలాసఫీ) పట్ల అవగాహన కల్గించటానికి ఒక నెల రోజులపాటు మధ్యాహ్నం పూట క్లాసులు తీసుకునేవారు. ఆ విషయాలనే దర్శన్-దిగ్దర్శన్‌గా రచించారు. ప్రపంచ తాత్విక జ్ఞానాన్ని ఈ గ్రంథంలో రాహుల్‌జీ పాఠకులకు అందించారు. మా నాన్నగారు ఆలూరి భుజంగరావు మూలంలో దాదాపు 1000 పేజీలున్న ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలుగు పాఠకుల సౌలభ్యంకోసం భారతీయ దర్శనం, ప్రాక్పశ్చిమ దర్శనాలు అనే రెండు భాగాలుగా ప్రచురించిన విషయం తెలుగు పాఠకులకు విదితమే. ఇక వైజ్ఞానిక భౌతికవాదం (గతి తార్కిక భౌతికవాదం) గ్రంథాన్ని నాన్నగారు 60 పేజీల దాకా అనువాదం చేసి, మెదడుకు సంబంధించిన సమస్య వలన మిగతాది చేయలేకపోయారు. మిగిలిన 120 పేజీలను ఆయన సలహాలు తీసుకుంటూ నేను తెలుగులోకి తేవటం జరిగింది.

భారతీయ దర్శనం గ్రంథంలో- వేదాలలో దార్శనిక భావాల నుండి మొదలుపెట్టి, ఉపనిషత్ దార్శనికులతోపాటు స్వతంత్ర దార్శనికులైన నాగార్జునుడి శూన్యవాదం, చార్వాకుడి భౌతికవాద దర్శనం, అలాగే గౌతమ బుద్ధుని క్షణిక, అనాత్మావాదం, కణాదుడి పరమాణువాదం, జైనదర్శనం, పతంజలి యోగదర్శనం, ధర్మకీర్తి దర్శనం, ఇలా దార్శనికుల దర్శనాలే కాకుండా ఆనాటి సామాజిక స్థితిగతులను చెప్తూ భారతీయ దర్శన చరమవికాసమైన తాత్విక జ్ఞానాన్ని పాఠకులకు అందించారు రాహుల్‌జీ.

ప్రాచీన సింధూ నాగరికతా కాలానికి భారతదేశంలో దర్శనమన్నది లేదు. దాదాపుగా క్రీస్తు పూర్వం 600 నుండే దార్శనిక చింతన మొదలైందని చెప్పవచ్చు. అయితే క్రీ.పూ. 1500 నుండి 1000 వరకు రచించిన వేదాలలో దార్శనిక చింతన తాలూకు ఛాయలు కనపడతాయి. క్రీస్తు శకం 350 తరువాతనే భారతీయ దర్శన పరిపూర్ణ వికాసం జరిగింది. వేదాలలో ఆనాటి ఆర్యుల భావాలు, వారి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, సుస్పష్టంగా ఉంటాయి. ఆర్యులు- ఇంద్ర, సోమ, వరుణులను స్తుతించారు. యజ్ఞాలవల్ల, దాన దక్షిణలవల్ల ఈ లోకంలో సుఖపడటం, మరణించాక స్వర్గంలో సుఖపడటం- ఇవే వైదిక రుషుల లక్ష్యంగా ఉండేది.

చార్వాకులు- భగవంతుడు లేడు, ఆత్మ లేదు, పునర్జన్మ, పరలోకం లేదు, జీవిత భోగాల్ని వదులుకోవలసిన పనిలేదు, సర్వభోగాలను అనుభవించవచ్చును, సత్యాన్వేషణకు అనుభవాన్ని, బుద్ధిని మార్గదర్శనం చేసుకోవాలని అంటారు. అన్నీ క్షణికమైనవి, ఆత్మవాదం అసత్యమైనది, చెడు పనులు చేయకుండా ఉండటం, మంచి పనులు చేయటం, చిత్తవృత్తుల్ని అదుపులో ఉంచుకోవడం- ఇదే బుద్ధుడి ఉపదేశాల సారం. బుద్ధుడు పొందిన జ్ఞానమే బౌద్ధ దర్శనం అయ్యింది. వేదగ్రంథాన్ని ప్రామాణికంగా భావించడం, సృష్టికర్త ఒకడు ఉన్నాడనుకోవడం, స్నానం ద్వారా ధర్మాన్ని సంపాదించామనుకోవడం, జాతివాదాన్ని పాటించడం, ఉపవాసాల ద్వారా ఇతర విధాలా శరీరాన్ని బాధపెట్టుకోవడం, ఇవన్నీ బుద్ధి హీనులు, వజ్ర మూర్ఖులు చేసే పనులుగా బౌద్ధ దార్శనికుడైన ధర్మకీర్తి భావించారు. సమాజంలోని అన్ని రకాల అసమానతలను, దోపిడీలను, అత్యాచారాలను అనంతంగా ఉంచటానికి అత్యంతంగా దోహదపడేదే శంకరాచార్యుని మాయావాదం. జీవునిమీద, ముక్తిమీద, ముక్తి ఫలితంమీద నమ్మకంలేని శంకరాచార్యున్ని ప్రచ్ఛన్న బౌద్ధుడంటారు. శంకరాచార్యుని దార్శనికతతో భారతీయ దర్శన గ్రంథం ముగుస్తుంది.

ప్రాక్పశ్చిమ దర్శనాలలో- సోక్రెటీస్ యథార్థవాదం, ప్లేటో కాల్పనికవాదం, అరిస్టాటిల్ వస్తువాదం, ఎపికురియన్ల భౌతికవాదం, యవన దార్శనికులు, ఇస్లాం దార్శనికులు, క్రైస్తవ దర్శనం, యూరప్ దర్శనాలు, న్యూటన్, బర్కలే, హ్యూమ్, మార్‌‌క్స గతితార్కిక భౌతికవాదం దాకా పాఠకుల ముందు ఉంచారు రాహుల్‌జీ.

వైజ్ఞానిక భౌతికవాదాన్ని సైన్‌‌స లేదా ప్రయోగశాస్త్రం అనవచ్చు. ప్రయోగాన్ని మార్గదర్శకంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది కనుకనే సైన్‌‌స యొక్క అధినాయకత్వాన్ని గతితార్కిక భౌతికవాదం శిరసావహిస్తుంది. ఈ గ్రంథంలో కార్యకారణ నియమం నుండి మొదలుకొని ప్రతిషేద ప్రతిషేదం వరకు అనేక అంశాలను తర్కించుకుంటేనే తర్కం బోధపడుతుంది అన్నట్లుగా ఇతర దర్శనాలకు, గతితార్కిక భౌతిక వాదానికి ఉన్న తేడాను విపులీకరించారు రాహుల్‌జీ.

అనువాదం గురించి:
ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నాన్నగారు చెప్తుండేవారు. ఏ గ్రంథాన్నైతే అనువాదం చేయాలని అనుకుంటామో ఆ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి; మక్కీకి మక్కీగా చేసే అనువాదం అనువాదమే కాదు; గ్రంథాన్ని అధ్యయనం చేసి మూల రచయిత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని అనువదించాలనేవారు. అనువదిస్తున్న భాషలోకి రచయిత మూలభావం దెబ్బతినకుండా పాఠకులకు అర్థమయ్యే రీతిలో అనువాదం చేయాలనేవారు. మూలభాషమీదా, అనువాదం చేసే భాషమీదా పట్టు వుండాలనేవారు. భాషలమీద పట్టుకోసం ప్రాచీన గ్రంథాలను తప్పక అధ్యయనం చేయాలనేవారు.

వైజ్ఞానిక భౌతికవాదం గ్రంథంలో- ‘దృష్టి కె  వికార్’ అన్న పదాన్ని ‘దృష్టి పరివర్తన’ అని తెలుగులో అనువదించారు నాన్నగారు. ఇందులో రాహుల్జీ ‘భూత్’ అన్న పదాన్ని భౌతిక తత్వము లేదా పదార్థము అని తెలపటానికి వాడారు. ‘బుద్ధ్ నె అపనే దర్శన్ కీ ఇతనీ నాకాబందీ కీ హై’ అన్న వాక్యాన్ని- ‘బుద్ధుడు తన తత్వాన్ని ఎంత బలవత్తరంగా ఎంత దృఢంగా, ఎంత కఠినంగా స్థిరీకరించాడంటే’- అని అనువదించారు. జబ్ తక్ జియె సుఖ్ సె జియె, ఋణ్ కర్ కె ఘీ (శరాబ్) పియె! దేహ్ కె భస్మీభూత్ హూ జానే పర్ ఫిర్ ఆనా కహా సె’... ఈ శ్లోకానికి అర్థం తెలుగులో ఇలా ఇచ్చారు: ‘బతికినంతకాలం సుఖంగా బతకండి, అప్పుచేసైనా పప్పుకూడు తినండి. ఈ దేహం భస్మీపటలం అయ్యాక ఇక మనం ఏమి చేయగలం, ఏమి అనుభవించగలం?’

ఇలా ఈ పుస్తకాలు అనువాదం కాదేమో, తెలుగులోనే రాసినవేమో, అనుకునేట్లుగా అనువదించారు నాన్నగారు.

కవిని ఆలూరి
9701605623

మరిన్ని వార్తలు