కేసీఆర్‌తో గగనయానం

25 Dec, 2015 11:53 IST|Sakshi
కేసీఆర్‌తో గగనయానం
పార్లమెంటులో ఏం జరిగింది -46
 
హైదరాబాద్ వదిలిపొమ్మని మేమెందుకంటాం... ఈ ఆలోచన తెలంగాణ వారికి లేదు. మీ ప్రాంతానికి చెందిన ‘కొందరు’ చేస్తున్న తప్పుడు ప్రచారమిది. ఆ ‘కొందరి’ మీద ద్వేషమే అందరి మీదా రాకుండా ఉండాలనే నా ప్రయత్నం.
 
గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకున్నాను. ‘బేగంపేట’ విమానాశ్రయానికి వెళ్లి, ఢిల్లీ విమానంలోకి ‘చెక్ ఇన్’ అయ్యాను. మొదటి రెండు సీట్లూ ఖాళీగా ఉన్నాయి. ‘ఎవరో మంత్రి వస్తున్నారన్న మాట!’ అనుకుని మూడో వరసలో నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నాను. సరిగ్గా విమానం బయలుదేరబోతుండగా ఇద్దరు మంత్రులు ముందు వరసలో ఆ రెండు సీట్లలో వచ్చి కూర్చున్నారు. ఒకరు కేబినెట్ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరొకరు సహాయ మంత్రి ఆలె నరేంద్ర. నేను అప్పుడే కొత్తగా ఎంపీని అయ్యాను. నా మొహం చూసి గుర్తు పట్టేంత చనువు ఆ ఇద్దరికీ లేదు. నరేంద్ర గారిని అంతకు ముందు కలిశాను. ఆయన పలకరింపుగా నవ్వారనిపించింది. అయితే అది నన్ను చూసో, మరెవ్వరినైనా చూసో అనుకున్నాను. 
 
విమానం బయలుదేరిన అరగంటకి నరేంద్రగారు నా సీటు దగ్గరకు వచ్చారు. ‘అరుణ్! కేసీఆర్ పిలుస్తున్నారు’ అంటూ నన్ను ముందు సీట్లోకి వెళ్లమని, తను నా సీట్లో కూర్చుండిపోయారు. నేను వెళ్లి కేసీఆర్ పక్క సీట్లో కూర్చున్నాను. ‘మీరు రాజమండ్రి ఎంపీ అని ఇప్పుడే నరేంద్రగారు చెప్పారు’ అంటూ పలకరించారు. నన్నెందుకు పిలిచారో, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకర్థం కాలేదు. అయితే ఆయన పలకరింపు మాత్రం చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. తర్వాత గంటంపావు మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మేం మాట్లాడుకున్నాం అనడం కన్నా, ఆయన మాట్లాడాడు, నేను వింటూ ఉన్నాను అనడమే కరెక్ట్. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయ్యే వరకూ ఆయన చెబుతూనే ఉన్నారు. ‘బ్రెయిన్‌వాష్’ అనే పదం ఎక్కువగానే విన్నాను గానీ, అది ఇలా ఉంటుందని ఆయనతో కూర్చుంటేనే తెలుస్తుంది. మామూలుగా పబ్లిక్ మీటింగుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంత నష్టపోయిందో ఆయన చెబుతుంటారు. ఆ రోజు మాత్రం ఉమ్మడి రాష్ట్రం వల్ల కోస్తా, రాయలసీమలు ఎంత నష్టపోతున్నాయో చెప్పటం మొదలుపెట్టారు. నేనాశ్చర్యపోయాను. గోదావరి, కృష్ణా నదుల నీరెంత, ఎవరెంత వాడుకుంటున్నారు, గోదావరి జిల్లాలకెంత అన్యాయం జరుగుతోంది... ఆయన స్కూల్ మాస్టారు లెక్కలు చెప్పినట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోతే ఆ అన్యాయం ఎలా ఆపుకోవచ్చునో కూడా చెప్పారు. పారిశ్రామికంగా సీమాంధ్ర ప్రాంతంలో చెప్పుకోదగ్గ పరిశ్రమేది అని ప్రశ్నించారు. సముద్రం వల్ల వచ్చే అడ్వాంటేజ్‌ను విశాఖపట్నం వాడుకోగలిగిందా? అని అడిగారు. 
 
‘మీ మాటలు వింటుంటే మీరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వదిలేసి, ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలుపెట్టేలా కనబడుతున్నారు’ అన్నాను. ‘నిజమే, మీ దగ్గర కూడా ప్రత్యేక రాష్ట్రం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ప్రచారం జరగాలి. 1972 ఉద్యమంలో మీరంతా యాక్టివ్‌గా పాల్గొన్నవారే కదా! ఇప్పుడెందుకు రెండు రాష్ట్రాల వాదనను వ్యతిరేకించాలి?’ అన్నారు. 
 
‘అయ్యా... ఆనాడు హైదరాబాద్ వేరు. ఈ నాటి హైదరాబాద్ వేరు. మూడు దశాబ్దాలుగా ప్రపంచానికి అమెరికా ఎలాగో, తెలుగువాళ్లకి హైదరాబాద్ అలాగయిపోయింది. శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉపాధి కోసం హైదరాబాదే చేరుకుంటున్నారు. మీరు కోరుకునేది ప్రత్యేక తెలంగాణ... మాకర్థమయింది మాత్రం మమ్మల్ని హైదరాబాద్ వదిలి పొమ్మంటున్నారని...’ అన్నాను. 
 
‘మద్రాస్ వదిలి వచ్చేశారు. ఎన్ని కుటుంబాలు మద్రాసు వదిలి వచ్చేశాయి. ఏమైనా తెలుగువారి పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చాయా? ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కన్నా తమిళరాష్ర్టంలోనే తెలుగు వారి వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా హైదరాబాద్ వదిలిపొమ్మని మేమెందుకంటాం... ఈ ఆలోచన తెలంగాణ వారికి లేదు. మీ ప్రాంతానికి చెందిన ‘కొందరు’ చేస్తున్న తప్పుడు ప్రచారమిది. ఆ ‘కొందరి’ మీద ద్వేషమే మొత్తం అందరి మీదా రాకుండా ఉండాలనే నా ప్రయత్నం (ఆ కొందరు ఎవరో కూడా ఆయన చెప్పారు). తెలంగాణ విడిపోతే బాగుపడతామని ఇక్కడి ప్రజల నమ్మకం. ఆ నమ్మకం 1956 నుంచీ అలాగే ఉంది. ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటుంది. లోపల మాత్రం ఆ నమ్మకం ఎప్పుడూ ఉంది. ఈసారి మాత్రం అన్ని ప్రాంతాలకు మంచి అవకాశం. పదేళ్ల తరువాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 1956 నుంచీ తెలంగాణ వాదం కాంగ్రెస్ వాళ్లు మొదలుపెట్టిందే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనే ఆ విభజన జరిగిపోతే ఇరుప్రాంతాలకీ మంచిది కూడా!’
 
కేసీఆర్ చెప్పింది మొత్తం.. గంటసేపు.. ప్రతి అక్షరమూ నాకు జ్ఞాపకముంది. అలా చెప్పగల నేర్పు కేసీఆర్‌కి ఉంది. ‘నాకు చెప్పినట్లే మా వాళ్లందరినీ మీటింగ్‌కు పిలిచి చెప్పవచ్చు కదా! మీరు కేంద్రమంత్రి. మీ ఆఫీసుకి అందర్నీ పిలిచి చెప్పండి. నాకిచ్చిన  ‘ప్రైవేటు క్లాస్’ కాకుండా అందరికి కలిపి క్లాసు ఇవ్వండి’ అన్నాను. 
‘మీ రాజశేఖరరెడ్డి రానివ్వడు. ఎవ్వరినీ మీటింగ్‌కి రానివ్వడు.’అంటూ అసలు విషయంలోకి వచ్చారు కేసీఆర్.
 
ఉండవల్లి అరుణ్ కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com
 
 
మరిన్ని వార్తలు