తెలుగుతేజానికి చంద్రగ్రహణం

28 May, 2016 00:19 IST|Sakshi
తెలుగుతేజానికి చంద్రగ్రహణం

సందర్భం
నేడు ఎన్టీఆర్ జయంతి
 
‘అందరూ పుడతారు ఎందుకో తెలియదు. కొందరే పుడతారు అందరికీ తెలిసేలా’ అని ఒక మహాకవి చెప్పిన మాట ప్రకారం కోటికి కూడా దొరకని అపూర్వమైన జననం ఒక సాధారణ గ్రామంలో జరిగిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. 1923 మే నెల 28వ తేదీ కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు ప్రథమ సంతానంగా పుట్టి, ఇంతై వటుడింతై అన్నట్లు పుట్టిన నేలకే కాక దేశం గర్వించతగిన నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వ శిఖరం నందమూరి తారక రామారావు.
 
చిన్నప్పటినుంచి స్వయంకృషితో తనకు తానుగా ఎదిగి, ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న కుటుంబాన్ని రక్షించుకోవటానికి బి.ఎ. డిగ్రీ తీసుకుని సబ్ రిజి స్ట్రార్ ఉద్యోగంలో చేరారు. కొద్దికాలంలోనే అక్కడి అవినీతిని భరించలేక మిత్రుల ప్రోద్బలంతో 1947లో చెన్నై రైలు ఎక్కిన ఆయన జీవితం రైలు గమనంలా ముందుకే సాగిపోయింది. 1947 మే 21 ఎల్.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో శోభనాచల స్టూడియో వేదికగా మొదటి స్క్రీన్‌టెస్ట్ జరిగింది. ‘మన దేశం’ చిత్రంలో చిన్న ఎస్సై పాత్ర ద్వారా పరిచయమై, డి. సుబ్బారావు ‘పల్లెటూరి పిల్ల’లో ఏయన్నార్‌తో పాటు మరో కథానాయకుడిగా ఎదిగి, తరువాత మూడేళ్లు ఏ సినిమాలు లేక కొన్నిరోజులు పస్తులుండి కూడా పట్టు దలతో అవకాశాలు సాధించుకున్నారు.
 
జీవితంలో ముందుకు వెళ్లటమేతప్ప పిరికిగా పారిపోకూడదనే ఆయన సిద్ధాంతానికి చిత్రసీమ తలవంచి అక్కున చేర్చుకుంది. నాగిరెడ్డి- చక్రపాణి గారి రూపంలో అదృష్టం వరించింది. విజయా సంస్థతో చేసుకున్న నాలుగు చిత్రాల ఒప్పందం తర్వాత ఆయనంతట ఆయన విడిచిపెట్టే వరకు సినిమా రంగం ఎన్టీఆర్‌ను విడిచిపెట్టలేదు. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, ఎల్వీ ప్రసాద్, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’, ‘పెళ్లిచేసి చూడు’, ‘చంద్రహారం’ చిత్రాలు వీరిని సినీ వినీలా కాశంలో ఒక ధ్రువతారగా నిలబెట్టాయి.
 
1951 నుంచి వీరి వలన సినీ రంగ పరిస్థితే మారిపోయింది. ఎన్టీఆర్ నటించిన ప్రతి ఐదు చిత్రాలకు మూడు చిత్రాలు బాక్సాఫీసు రికార్డు సాధించాయి. పురాణ పాత్రలయితే చెప్పనక్కర లేదు. తెలుగునాట పురాణ దేవతలను కొత్తతేజంతో ప్రతిష్టించిన ఘనత వీరిదే. 1982 వరకు దాదాపు 300 సినిమాల్లో నటించి అనేక విజయాలు సాధించారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు శత దినోత్సవాలు, రజతో త్సవాలు ఘనంగా జరుపుకున్నాయి. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ - పురాణ పురుష - కళాప్రపూర్ణ - డాక్టర్ - నటరత్న - కలియుగ రామకృష్ణ వంటి ఎన్నో బిరుదులు పోటీపడి ఆయనను ఆశ్రయించాయి.
 
నటించిన పాత్రల స్ఫూర్తితో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాటివరకు ఆంధ్రప్రదేశ్‌ను అప్రతిహతంగా పాలిస్తున్న కాంగ్రెసు పార్టీ కంచు ఢక్కాను కేవలం 9 నెలల కాలంలో ముక్కలుకొట్టి ప్రభుత్వాన్ని స్థాపించేసరికి దేశమంతా నివ్వెరపోయి చూచింది. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్.. ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగారు. ఆ విజయం దేశ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేసి ‘నేషనల్ ఫ్రంట్’ స్థాపనకు కారణమయ్యింది.

ఎన్టీఆర్ చైర్మన్‌గా నేషనల్ ఫ్రంట్ రాజీవ్‌గాంధీని ఓడించి కేంద్రంలో అధికారంలోకి రావటంతో ఆయన పేరు మార్మోగింది. సినీ రంగంలోలాగే, రాజకీయంలో కూడా తన సొంత విధానంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాలకే ఒక నూతన పంథా సృష్టించారు. తాను పోషించిన పాత్రలే ప్రేరణగా, తన గుండెలో నిండిన ఆశయాలే స్ఫూర్తిగా పాలన సాగించారు తప్ప ఏ నాయకుడిని ఆదర్శంగా తీసుకోలేదు. సినీ రంగంలో చేసిన ప్రయోగాలకు మల్ల్లే రాజకీయాల్లో కూడా ఆయన పథకాలన్నీ ఫలవంతమయ్యాయి.
 
 అక్కడ నటన కావచ్చు. ఇక్కడ రాజకీయం కావచ్చు. కానీ ఎన్నుకునే విధానం వెనుక సంస్కార పూరితమైన, నిస్వార్థమైన ఆలోచనా సరళి ఆయ నను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఆయన ప్రజల్నే నమ్ముకున్నారు తప్ప విలువల్ని అమ్ముకోలేదు. చివరి క్షణం వరకు పేద మధ్య తరగతి వర్గాల శ్రేయస్సు కోసమే తపించారు. పోరాటాలన్నీ ఆకలినుంచే పుట్టాయన్న ‘మార్క్స్’ సిద్ధాంతాన్ని అనుభవంతో ఆకళింపు చేసుకుని 1 కోటి 25 లక్షల కుటుంబాలకు కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రారంభించారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది మొదటి పేదల పథకంగా ప్రసిద్ధికెక్కింది. కూడు- గూడు-గుడ్డ అనే సామాన్యుడి ఎజెండాతో పుట్టిన తెలుగుదేశం అచిర కాలం లోనే సమాజంలోని అన్నివర్గాలకు దగ్గర కాగలిగింది. రాజకీయాల్లోని కుళ్లు కడిగేయటానికి ఆయన విద్యావంతులైన కొత్తవారికి ఎందరికో అవకాశం కల్పించారు. పార్లమెంటు చరిత్రలో 103 మంది సభ్యులచేత రాజీనామా చేయించిన పవర్ ఆయనది.
 
 మొదటిసారి 1984 ఆగస్టులో వెన్నుపోటుకు గురైనప్పుడు గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలుపెరగ కుండా రాష్ట్రమంతా పర్యటించి తిరిగి అధికారాన్ని పునస్థాపించుకున్న మహా యోధ. మండల వ్యవస్థ - పటేల్-పట్వారీ రద్దు లాంటి సాహస నిర్ణయాలు చేసి కింది వర్గాల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు.


తన ఏడున్నర సంవత్సరాల పరిపాలనా కాలంలో కుల మతాతీత వ్యవస్థకు పెద్ద పీట వెయ్యటమేకాదు. కిందివర్గాల వారికి రాజకీయంగా కూడా ఉన్నత స్థానం కల్పించి తెలుగుదేశం పార్టీకి శాశ్వత చిరునామా ఏర్పరచిన ఆ మహానుభావుని జీవిత చరమాంకం అత్యంత దయనీయంగా ముగియటం దురదృష్టం. అల్లుడి అధికార కాంక్ష అనే విష నాగు కాటుకు అంతటి మహావృక్షం ఒరిగిపోయిన తీరు రాజకీయ చరిత్రనే ప్రశ్నిస్తుంది.
 
 దాదాపు 70 ఏళ్ల వయస్సులో తన అనారోగ్య స్థితిలో తోడు కోసం ద్వితీయ వివాహం చేసుకుని పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ భార్యతో కలసి 1994 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి పట్టుదలగా పార్టీని గెలిపించుకుని కూడా పొంచివున్న తోడేళ్ల చేతిలో హతమైపోయారు. 55 శాతం ఓట్లు, మిత్ర పక్షాలతో కలిపి 257 సీట్లు గెలిచి రాజకీయంలో అరుదైన రికార్డు సాధించి కూడా అధికార వ్యామోహి అయిన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుకు బలవటం దురదృష్టం కాక మరేమిటి? ప్రజలకిచ్చిన హామీల మేరకు రూ. 3,121 కోట్ల భారం ప్రభుత్వంపైన పడ్డా వెనుదీయక తిరిగి 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, సంపూర్ణ మద్యనిషేధాన్ని, రైతులకు హార్స్‌పవర్‌కి రూ.50లతో విద్యుత్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేసి కూడా, ముష్కరుల కుటిల రాజకీయాలకు అకాల మరణం చెందటమేమిటి? ఇది నీచ రాజకీ యానికి పరాకాష్ట కాదా? ప్రజాస్వామ్యాన్ని గేలిచేస్తూ అధికారానికి అర్రులు చాచే గబ్బిలాలు, విషం చిమ్మిన సమాచార సర్పాలు, డబ్బుకు అమ్ముడు బోయిన నిర్లజ్జ శాసనసభ్యులు, తలరాతలను మార్చిన నల్లకోటుల శాస నాలు.. ఒకటేమిటి, ఆ యోధుడ్ని కూల్చటానికి గవర్నరు వ్యవస్థ కూడా గులాంగా మారిందంటే రాజకీయాన్ని అది ఎంత పతనావస్థకు దిగజార్చిందో ఆ కాలాన్ని చరిత్ర ఎలా మర్చిపోతుంది?
 
 1995 ఆగస్ట్ 27న ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తొలగించి, చంద్రబాబు తననుతాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇదేం న్యాయ మని అడగటానికి వెళ్లిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించారు. ప్రత్యేక విమానంలో స్పీకరు యనమలను రప్పించి ఫోర్జరీ సంతకాలతో బలపరీక్ష చేయించి గవర్నరుకు పంపారు. ఆ రోజే ఎన్టీఆర్ కంటతడి పెట్టి ‘నేను ఈ రోజే మరణించాను’ అని ఆవేదనతో చెప్పిన మాటలు స్మరించుకోవాలి.
 
పదవి పోగొట్టుకుని అనారోగ్యంతోపాటు, అవమానంతో రగిలిపోతూ ఎన్టీఆర్.. చంద్రబాబుమీద యుద్ధం ప్రకటించారు. అతని దుర్మార్గాలను, అవినీతిని ‘జామాతా దశమగ్రహం - జెమినీ టీవీలో ధర్మపీఠం’ కార్యక్రమం ద్వారా ఎలుగెత్తి చాటారు. చివరకు ప్రజల్లోకెళ్లి ఇతని ఆకృత్యాలను చెప్ప టానికి విజయవాడలో దేవినేని నెహ్రూ ద్వారా బహిరంగ సభకు సిద్ధమ య్యారు. అది తెలిసి చంద్రబాబు జనవరి 17, 1996న ఎన్టీఆర్ ఖాతా ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ మీద స్టే ఆర్డరు తెచ్చి ఖాతాను స్తంభింప చేయటంతో ఆ తెల్లవారు జామున గుండెపోటుకు గురై ఎన్టీఆర్ మరణిస్తే, బాబు పత్రికలు అదంతా ఆయన భార్యవల్లనే అని చాటింపు చేశాయి.
 
ఎన్టీఆర్‌ను మోసంచేసి, ఆయన ఆశయాలను నిలువునా పాతిపెట్టి, అవి నీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలుచేస్తూ నీచ రాజ కీయ వ్యవస్థకు తెర తీసిన ఈ పెద్ద మనిషిని భావి చరిత్ర క్షమించదు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద వర్గాలది. ఇతడు నడిపే తెలుగుదేశం పెద్దవాళ్లది. నిష్కళంక చరిత్ర ఆయనది. అవకాశవాద పొత్తులతో ప్రజల్ని ఏమార్చి అధికారాన్ని పొందే నయవంచన చంద్రబాబుది. నమ్మి అల్లుడిగా చేసుకున్నం దుకు పార్టీని, అధికారాన్ని చివరకు ప్రాణాల్నే హరించిన నీచ రాజకీయ వేత్తకు శిక్ష పడేవరకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంటుందన్న సత్యం మర్చిపో కూడదు.
 
నీతిబాహ్య విధానాలతో ఎమ్మెల్యేల్ని కొనుక్కునే దుష్ట సాంప్రదా యానికి తెరతీసి తెలుగుదేశం మూల విధానాల్నే దెబ్బతీసిన ఇతడు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించటానికి కూడా అనర్హుడే. ఇతడి రాజకీయ చరిత్రంతా అబద్ధా లతో, అవినీతితో మకిలీ పట్టి దుర్గంధాన్ని వెదజల్లుతూ నిజమైన రాజకీయ విలువలు దగ్గరకు పోలేనంత అసహ్యాన్ని కలిగిస్తున్నది. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి, స్వార్థ రాజకీయాలకు అడ్డాగా మారిన ఇతడి జీవితం ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. ఆ రోజే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి.        
 


 నందమూరి లక్ష్మీ పార్వతి      
 వ్యాసకర్త సాహితీవేత్త, ఎన్టీఆర్ సతీమణి

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు