స్త్రీ విముక్తి కోసం పోరుబాట

7 Mar, 2014 05:18 IST|Sakshi
స్త్రీ విముక్తి కోసం పోరుబాట

మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడాలని గత ఏడాదిలో ఐరాస పిలుపునిచ్చింది. కాని కాశ్మీర్ ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం ద్వారా సైనికాధికారులే అత్యాచారాలకు పాల్పడితే ఇక నిర్భయ, గృహహింస నిరోధక చట్టాల గురించి మాట్లాడుకోవడం వృధా ప్రయాసే.
 
 స్త్రీ శ్రమశక్తికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. పురుషులతోపాటు తమ శ్రమశక్తిని సమానంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ అమెరికా, రష్యాలతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సార్వత్రిక సమ్మెలలో పాల్గొని పోరాటాలు చేశారు. వీటిని గమనంలో ఉంచుకుని మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్  నగరంలో జరిగిన అంతర్జాతీయ మహిళా సోషలిస్టు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆ విధంగా గత 104 సంవత్సరాలుగా మార్చి 8న స్త్రీ-పురుష సమాన హక్కుల పోరాటానికి సంకేతంగా, మహిళా విముక్తి సంకల్ప దినంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు జరుపుకుంటున్నారు. మన ఇరుగుపొరుగు దేశాలు ఈ రోజును సెలవు దినంగా ప్రకటించి అమలుపరుస్తున్నప్పటికీ భారతదేశంలోని రాజకీయపార్టీల నేతలకు మహిళల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు ఇటీవలే 15వ లోక్‌సభ పదవీ కాలం ముగిసినప్పటికీ మహిళలకు 33వ శాతం రిజర్వేషన్ బిల్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
 
 మార్క్స్ నేతృత్వం
 కార్ల్ మార్క్స్ నాయకత్వాన 1864లో ప్రారంభించిన మొదటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ స్త్రీ శ్రమశక్తి సామాజిక గుర్తింపు పొందడానికి, పారిశ్రామిక ఉత్పత్తిలో వారి భాగస్వామ్యం పెంచడానికి తీవ్రంగా ప్రయత్నించారు. 1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో తొలి అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన శ్రామిక మహిళలతో సమన్వయ సంఘం ఏర్పరచి మహిళలందరికీ ఓటు హక్కు డిమాండ్ చేసింది. తర్వాత లెనిన్ చొరవతో రెండవ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ మహిళా సోషలిస్టు కాంగ్రెస్ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా ప్రకటించింది. అనంతరం 1911 మార్చి 8న మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పలు దేశాలలో జరుపుకున్నారు.
 
 అన్నింటా అణచివేతే
 ప్రపంచీకరణ యుగంలో మహిళా శ్రమశక్తిని అనేకమంది పారిశ్రామికవేత్తలు కొల్లగొడుతున్నారు. కాంట్రాక్ట్ లేబర్ విధానం ద్వారా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కాంట్రాక్ట్ లేబర్ పద్ధతిలో మహిళలను, పిల్లలను తీసుకుని వారికి శ్రమకు తగినవిధంగా వేతనం చెల్లించని పరిస్థితులు ఉన్నాయి. బీడీ రంగంతోపాటు నిర్మాణ పనులు, సేవా రంగం, అసంఘటిత రంగాలలో అధిక సంఖ్యలో మహిళా శ్రామికులను వినియోగిస్తున్నారు. చదువులు, కుటుంబ నిర్వహణ, సామాజిక ఉత్పత్తి రంగాల్లో ఎంతో ప్రావీణ్యత కలిగినా మహిళలను అన్ని కీలక రంగాల నుంచి తప్పిస్తున్నారు. కొన్ని రంగాలలో పురుషాధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో కూడా ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు తమ మేధస్సుతో, పట్టుదలతో దూసుకుపోతున్నారు. పితృస్వామ్య భావజాలానికి ఎదురీది స్వతంత్ర ధోరణితో ఎదిగి రాజకీయ రంగంలో స్థిరపడిన వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్ పార్లమెంట్‌లో మహిళా ఎంపీల సంఖ్య 11 శాతానికి మించదు. ఈ విషయంలో మనం పొరుగున ఉన్న పాకిస్థాన్ కన్నా వెనుకబడి ఉన్నామని చెపితే విస్మయం కలుగుతుంది.
 
 1975-85 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దిగా ప్రకటించింది. స్త్రీలపై అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పోరుకు కంకణబద్ధులు కావాలంటూ గత ఏడాదిలో పిలుపునిచ్చింది. కాని జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం ద్వారా పోలీసు, సైనికాధికారులే అత్యాచారాలకు పాల్పడితే ఇక నిర్భయ, గృహహింస నిరోధక చట్టాల గురించి మాట్లాడుకోవడం వృథా ప్రయాసే అవుతుంది. ఈచట్టాలను ఎత్తివేయాలని స్త్రీలు నగ్నంగా నిరసన తెలుపుతున్నా, మణిపూర్‌లో గత 14 ఏళ్లుగా షర్మిల చాను అనే మహిళ ఉక్కు సంకల్పంతో  ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ  పాలకులకు చీమ కుట్టిన ట్లయినా లేదు. అందువల్ల వ్యవస్థీకృతమైన అణచివేత, దోపిడీ, వివక్షలను రూపుమాపడానికి మహిళలు ఇతర పీడిత వర్గాలతో భుజం, భుజం కలిపి పోరాడవలసి ఉంది. సంక్షేమ పథకాల తాయిలాలతో సంతృప్తిపడకుండా అన్ని రంగాల్లో సగభాగం వాటా చెందాలన్న సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ సమసమాజ స్థాపన దిశగా సాగాలి. ఆకాశంలో మేము సగమంటున్న మహిళల నినాదం నిజం కావడానికి సంఘర్షిద్దాం.
 (రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
 అమర్ (జనశక్తి)

మరిన్ని వార్తలు