భూమి రికార్డులు ప్రాణాధారం

21 Jul, 2017 02:35 IST|Sakshi
భూమి రికార్డులు ప్రాణాధారం

విశ్లేషణ
భూ దస్తావేజుల డిజిటలైజేషన్‌ గురించి పదే పదే వింటున్నాం. ఇప్పుడున్న తప్పుల తడక పత్రాలను యథాతథంగా స్కాన్‌ చేసి కంప్యూటర్‌లోకి ఎక్కించడమే డిజిట  లైజేషన్‌ అయితే, అల్మరాలో రికార్డులను కంప్యూటర్లోకి పంపడమే అవుతుంది.


తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రెవెన్యూ అధి కారులతో ‘‘ఒక్క ఊరి భూమి రికార్డయినా బాగుందా, నిరూపించండి, నాకు చూపించండి’’ అని సవాలు విసిరారు. ఆంధ్ర  ప్రదేశ్‌లో రెవెన్యూ అధికారి డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర రెడ్డి సమాచార దినం నిర్వహించి కలెక్టరేట్, 3 రెవెన్యూ డివిజన్లు, 56 తహసీల్దార్‌ కార్యా లయాలలో అడిగిన వారికి అక్కడిక్కడే సమాచారం ఇచ్చి ఆశ్చర్యపరిచారు. కొందరికి వెంటనే ఇవ్వలేకపో యినా వందలాది మందికి  భూమి రికార్డుల సమా చారం ఇవ్వడం ఒక అద్భుతం. కాపీ చార్జీలు ఇస్తేనే కాగి తాలు ఇస్తామనకుండా, పాలనలో సమాచారం చెప్పడం ఒక బాధ్యత అని నిరూపించారు. పదిరూపాయలు ఇచ్చి నెలరోజులపాటు ఎదురుచూసినా ఇవ్వకపోతే అప్పీలు చేయాలని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తు న్నది. ప్రభాకరరెడ్డిలాగా సమాచారం ఇస్తే సమాచార చట్టంతో పనే లేదు. భూమి రికార్డులు మూడో వ్యక్తి సమాచారమనీ, వ్యక్తిగత సమాచారమనీ నిరాకరించే రోజులివి.

భూమి రికార్డులు గ్రామీణ వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలు. మానవ జీవన పరిణామానికి సాక్ష్యాలు. ఎవరు యజమాని ఎంత భూమి అనే వివ రాలే కాకుండా సమాజం ఏవిధంగా జీవించిందో వివ రిస్తాయి. వ్యవసాయంలో వచ్చిన మార్పులు, రాజకీ యాల పరిణామాలు ప్రతిఫలించే భూమి రికార్డులపైనే ఆదాయవనరులు, సంక్షేమ పథకాలు లాభోక్తల ఎంపిక ఆధారపడి ఉంటాయి. సార్వభౌమాధికారం కూడా భూమిపైనే. రికార్డులు యజమానికి చట్టబద్ధమైన అధి కారాన్నిస్తాయి. తన భూమిలో తన  స్వాధీనంలోనే, పట్టా చేతిలో, రెవెన్యూ రికార్డులో ఆ యజమాని పేరే ఉండడం అత్యవసరం. ఈ మూడింటిలో ఏదో ఒకటి లేకుండా 50 నుంచి 80 శాతం వ్యవసాయ భూముల సొంతదార్లు తెలంగాణలో బాధపడుతున్నారు. విచిత్ర మేమిటంటే తమ రికార్డులో లోపాలున్నాయని, తమకు సమస్య ఉందని కూడా చాలామందికి తెలియదు. చెప్పే వారు లేరు, తెలుసుకునే మార్గమూ లేదు. భూమి సొంతమే కానీ దానిపైన చట్టపరమైన హక్కులు లేవని తేలితే భూములూ దక్కవు, జీవనోపాధీ మిగలదు.

భూమి రికార్డులలో లోపాలు వాటంతట అవేరావు. ప్రజలకు తెలియని, వారికి అందుబాటులో లేని కాగి తాల్లో తప్పులుంటే బాధ్యులెవరు? వారసుల పేర్లను రికార్డులకెక్కించడానికి లంచాలు అడుగుతారు. ఇవ్వక పోతే పాత వారసులే రికార్డులలో కొనసాగుతారు. దశా బ్దాల కింద మరణించిన వారి పేర్లే రికార్డుల్లో ఉంటాయి. వారి అన్నదమ్ములు, వారి పిల్లలు తగాదాల్లో తలము నకలైతే అధికారులు అటూ ఇటూ కానుకలు పొందుతూ ఉంటారు. రెవెన్యూ కోర్టుల్లో న్యాయస్థానాల్లో లక్షలాది కేసులు: లంచాలు లాయర్ల ఫీజులకోసం పేదలు కూడా అప్పులు చేసి ఖర్చుచేస్తారు. కోర్టుల్లో కేసులు తెమలవని సెటిల్మెంట్‌ ముఠాలను ఆశ్రయిస్తారు, ఉన్న డబ్బు కూడా కోల్పోతారు.

దక్‌‡్ష అనే ఎన్జీవో ఇటీవల కోర్టు కేసుల భారం పైన ఒక సర్వే జరిపారు. వారి అంచనా ప్రకారం భూమి తగా దాల్లో జనం ఏటా 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదివరకు ఈ ఖర్చు 12 వేల కోట్ల రూపా యలనుకున్నారు. దీని పైన ప్రభుత్వాలు చేసే వ్యయం కొన్ని వేల కోట్ల రూపాయలు వేరే. కోర్టుల్లో ఈనాడు మూలుగుతున్న 3 కోట్ల కేసులలో 66 శాతం భూమి తగాదాలకు సంబంధించినవే. దేశ ఆర్థిక ప్రగతి కూడా ఈ తగాదాలవల్ల దెబ్బతింటున్నది. దీనంతటికీ కార ణం, రికార్డుల్లో యజమానులు వేరు, భూమ్మీద యజ మానులు వేరు. స్వాధీనం ఉన్న రైతులు ఒకరయితే రికార్డులో మరొకరి పేరు ఉంటుంది. హద్దులు నేలమీద ఒకటైతే దస్తావేజుల్లో మరేవో ఉంటాయి. ఉత్తరం దక్షి ణం పశ్చిమం తూర్పు తేడా లేకుండా ప్రతిదిశలోనూ భూమి విస్తారం మీద అంకెలు మారుతూ ఉంటాయి. కొట్టుకునే జనాలే అధికారులకు లంచాల నజరానాలు ఇచ్చే బాధితులు.

ఈ కష్టాలకూ సమస్యలకన్నింటికీ ఒకే పరిష్కార మార్గం.. దస్తావేజుల్లో లోపాలు సరిదిద్దడం. తప్పులు దిద్దడం సామాన్యమైన విషయం కాదు. ముందు తప్పు లేమిటో తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి. ఉన్న రికార్డులను జనంలోకి తేవాలి. పంచాయతీ ఆఫీసు గోడమీద రాయాలి. తప్పులు ఎత్తిచూపే అవకాశం ఇవ్వాలి. ప్రతి గ్రామంలో జనం సూచనల మేరకు సర్వే చేసి ఇరుగుపొరుగు అభ్యంతరాలు విని సర్వే, దర్యాప్తు చేయాలి. ఆ తరువాత దస్తావేజులు నవీకరించి జనులకు అందుబాటులోకి తేవాలి. అప్పుడు గానీ భూమి రికా ర్డుల పని పూర్తి కాదు.  పనివేళలు, జీతాలు, ఉత్పాదకత అన్నీ జనం ఈ కోర్టు వివాదాల్లో కోల్పోతారు. ఈ నష్టాల అంచనా రూ. 30 వేల కోట్లు. కేవలం రికార్డు లను సంస్కరిస్తే మూడింట రెండొంతుల కోర్టు కేసులను నివారించవచ్చు. పెండింగ్‌ భారాలకు వేరే పథకాలే అవ సరం లేదు. ప్రతి ప్రభుత్వం భూసంస్కరణలు చేస్తామ నడం మనం వింటూనే ఉన్నాం. కానీ రికార్డులు సంస్క రించకుండా భూసంస్కరణలపై మాట్లాడడం వృథా.
డిజిటలైజేషన్‌: భూ దస్తావేజుల డిజిటలైజేషన్‌ గురించి పదే పదే వింటున్నాం. ఇప్పుడున్న తప్పుల తడక పత్రాలను యథాతథంగా స్కాన్‌ చేసి కంప్యూ టర్‌లోకి ఎక్కించడమే డిజిటలైజేషన్‌ అయితే సమస్యలు తీరవు. అది ఆల్మరాలో రికార్డులను కంప్యూటర్లోకి పంప డం మాత్రమే. మార్పు ఏమంటే రెవెన్యూ ఉద్యోగుల బదులు కంప్యూటర్‌ ఆపరేటర్లు రైతులను వేధిస్తుం టారు. తప్పులూ తగాదాలూ లేని రికార్డులను రూపొం దించడమే కావలసిన పని. నవీకరించిన తరువాత ఎవరూ మార్చకుండా తగిన రక్షణ ఉండాలి. భూమి రికార్డుల సవరణ సంస్కరణ పేరుతో ఎన్నో పథకాలు వచ్చాయి. రెండు దశాబ్దాలనుంచి నవీకరిస్తున్నారు. ఈ పథకాన్ని సమీక్షించి, పేరు మార్చారు. ప్రతి రాష్ట్రానికి నూరు శాతం నిధులు ఇవ్వాలని రికార్డులన్నీ సంస్క రించాలని కేంద్రం కేటాయించిన 11 వేల కోట్లు సక్ర మంగా ఖర్చు చేస్తే ఏటేటా వేల కోట్ల రూపాయల ఆదా సాధ్యమే.

కంప్యూటర్‌ తెలియని పల్లెజనం డిజిటల్‌ రికార్డు లేంచేసుకుంటారు? విద్యుచ్ఛక్తిలేక, అంతర్జాలం తెర వలేక చేయగలిగేదేమిటి? శూన్యనినాదాలు శుష్క ప్రియాలు. గందరగోళంగా ఉన్న మన రికార్డులే మన సుపాలన. తప్పుడు రికార్డులతో దాయాదులను కోర్టుల కీడ్చే వ్యవస్థ మన నిర్వహణా సమర్థత. రికార్డులు మార్చకుండా భూసంస్కరణలని నినాదాలిస్తే  మన నిబ ద్ధత. రికార్డులు అందుబాటులో తేకుండా సాధికారికత గురించి ప్రసంగించడం మన నాగరికత. (కేంద్ర రాష్ట్ర సమాచార కమిషనర్ల సమావేశంలో భూరికార్డులు– సమాచార హక్కు అంశంపై జూలై 15న సమర్పించిన పత్రం ఆధారంగా).

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌

మరిన్ని వార్తలు