బరువైన బహుమానం

21 Nov, 2013 00:23 IST|Sakshi
బరువైన బహుమానం
పాత పద్ధతిలో ఆలోచించడం మన వ్యవస్థని వ్యసనంలా పట్టుకుందా? ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌకాదళంలో భాగం కావడం చరిత్రాత్మకమని రక్షణ మంత్రి ఏకే ఆంటోని పరవశంతో చెప్పారు. అప్పుడే ఒక పాకిస్థానీ పత్రిక తన సంపాదకీయంలో, ‘ఈ నౌకను రక్షణ దళంలో చేర్చుకోవడం చూస్తే  పురాతన పద్ధతులలో ఆలోచించడం అక్కడి వ్యవస్థకి వ్యవసనంలా మారిందనిపిస్తోంది’ అని  రాసింది. పేదరికంతో మగ్గిపోతున్న భారత్ ఇంత పెద్ద నౌకను తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకో? అంటూ అనవసరమైన విసుర్లు కూడా ఆ పత్రిక వదరింది. ఒకటి నిజం- ఇందులో మొదటి అంశం గురించి ఆ పాక్ పత్రిక బాహాటంగా చెప్పిన అభిప్రాయమే, చాలామంది భారతీయుల మనోగతం అంటే సత్యదూరం కాదు. 
 
 రక్షణ వ్యవహారాలలో జాగరూకత ఆహ్వానించదగినదే. కానీ అణా కోడిపిల్లకి పావలా ఖరీదైన పందిపిల్లని దిష్టి తీసిన చందంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా స్వీయరక్షణలో పడక తప్పదు. నవంబర్ 16న నౌకాదళంలో భాగమైన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య విషయంలో రక్షణ రంగం ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నది. ఈ యుద్ధ విమాన వాహక నౌక  హిందూ మహాసముద్రంలో బలాబలాల సమతుల్యతలో మార్పులు తెచ్చేదేనని అభిప్రాయపడుతూనే భారత నౌకాదళ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్, ఆ నౌకను సొంతం చేసుకోవడానికి 250 శాతం అదనంగా ఖర్చు చేసిన సంగతిని కూడా ఉదహరించవలసి వచ్చింది. ఇదంతా పదమూడేళ్ల గాథ. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య  సోవి యెట్ రష్యా కాలం నాటిది. అసలు పేరు అడ్మిరల్ గోర్ష్‌కొవ్ (అంతకుముందు పేరు బకు). యుఎస్‌ఎస్‌ఆర్ పత నం తరువాత 2000 సంవత్సరంలో భారత్-రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మనకు ‘బహుమానం’గా ఇచ్చేశారు. భారత నౌకాదళంలో భాగమయ్యే ముందే ఆధునీకరించాలని 2004లో నిర్ణయించారు. యుద్ధ విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేయడం అందులో ఒకటి. 974 మిలి యన్ డాలర్ల ఖర్చుతో ముస్తాబు చేసి రష్యా 2008 సంవత్సరానికి భారత్‌కు అప్పగించాలి. కానీ రష్యా ‘అనుకోని వ్యయాల’ పేరుతో  భారత్‌కు చాలా చేతి చమురు వదిలిం చిందని ‘కాగ్’ విమర్శ. 250 శాతం ఖర్చు అలా పెరిగిందే. అన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే పశ్చిమ తీరంలోని కార్వార్ (కర్ణాటక) నౌకాశ్రయానికి చేరుతుంది. 44,500 టన్నుల బరువైన ఈ నౌక మీద 88 మిగ్ 29కె యుద్ధ విమానాలు నిలబడవచ్చు. 
 
 విక్రమాదిత్య రాక చరిత్రాత్మకమని ఆంటోనీ వ్యాఖ్యానించగానే చాలామందికి మన రక్షణ వ్యవహారాల చరిత్ర లో మరో కోణం స్ఫురించింది. ముంబై నౌకా కేంద్రంలో ఉండగా ఐఎన్‌ఎస్ సింధురక్షక్ అనే జలాంతర్గామిలో జరిగిన పేలుళ్లు గుర్తుకు వచ్చాయి. 113 మిలియన్ డాలర్లు వెచ్చించి డిసెంబర్ 27, 1997లో భారత నౌకాదళంలోకి తీసుకువచ్చిన సింధురక్షక్ ఓ వైఫల్యం. ఇది రష్యా ఇచ్చిన కిలో-క్లాస్ 877 ఇకేఎం జాలాంతర్గామి. 2010లో ప్రమాదానికి గురైతే మళ్లీ  రష్యా పంపారు. 80 మిలియన్ల డాలర్ల ఖర్చుతో మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం జూన్ ప్రాంతంలో తిరిగి వచ్చింది. సింధురక్షక్ ప్రమాదం రష్యా ప్రమాణాలనూ, మరమ్మతు సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేసిందని నేవీ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్ పేర్కొనడం విశేషం. 
 
 రష్యా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలు సదా ఉత్తమమైనవి కావు, అవి విఫలం కావడానికి అవకాశాలూ ఎక్కువేనని ఆయన అభిప్రాయం. కిలో-క్లాస్ రష్యా అమ్మిన తొమ్మిదో జలాంతర్గామి మరి! రష్యాతో ఉన్న రక్షణ బాంధవ్యాన్ని సమీక్షించుకుంటే భారత్‌తో ఆ దేశం ఆడిన ప్రమాదకరమైన ఆట బయటపడుతుందని వాదిం చేవారూ ఉన్నారు. రష్యావే, మిగ్-21 యుద్ధ విమానాల వల్ల ఎందరు పైలట్లను కోల్పోయామో చాలా మంది గుర్తు చేస్తున్నారు. 900 మిగ్ -21 విమానాలకుగాను, సగానికిపైగా కూలిపోయాయి. అయితే భారతదేశం ఇంతవరకు తేలికపాటి యుద్ధవిమానాల తయారీ చేపట్టకపోవడంవల్ల మన వైమానిక దళం ఇప్పటికీ ఈ ‘రెక్కల శవపేటిక’లనే ఉపయోగిస్తూండటం మరో విషాదం. కూడంకుళం అణు విద్యుత్కేంద్రం కోసం తీసుకున్న రష్యా సాంకేతిక పరిజ్ఞానం మీద కూడా విమర్శలు ఉన్నాయి. 
 
 ఇంతకీ విక్రమాదిత్యకు తనని తను రక్షించుకునే వ్యవస్థ ఏర్పడడానికి మరో నాలుగేళ్లు కావాలి. బాయిలర్ వ్యవస్థ పేలడంతో 1994లో ఇదే ఏడాది పాటు మూలప డింది. ఇన్ని లోపాలున్న రక్షణ దిగుమతులు అవసరమా?  రష్యాది సాయమా? అక్కడ చెల్లని వాటిని అంటగట్టే తత్వ మా? రష్యాను మెప్పించడమే ప్రధానం అనుకుంటే, రక్షణ సంగతేమిటి? పాక్ పత్రిక వేసిన ప్రశ్న నిజానికి మన నేతలు వేసుకోవలసినది కాదా? 
 కల్హణ
మరిన్ని వార్తలు