భయ బీభత్సాల కాలం

29 Jun, 2015 00:40 IST|Sakshi
భయ బీభత్సాల కాలం

ఎమర్జెన్సీలో న్యాయ వ్యవస్థ, మీడియా ఇప్పుడు కొందరు అతిగా ప్రచారం చేస్తున్నదానికంటే తక్కువ ఆదర్శప్రాయంగానే పనిచేశాయి. ఎమర్జెన్సీ విధింపును అత్యున్నత ధర్మాసనం నిస్సిగ్గుగా ఆమోదించింది. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను సవాలు చేసింది కూడా కొందరు పాత్రికేయులు, కొన్ని పత్రికలు మాత్రమే. నలభై ఏళ్ల క్రితం సరిగ్గా ఈ వారంలోనే ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. అది వేయి కోరల విషపు నాగు. దానికి ఇరుసు నియంతృత్వం. ఆ రక్కసి యంత్రపు చక్రాల్లోని కీలకమైన చువ్వల్లాంటి క్రూరులైన పోలీ సు అధికారులు ప్రజాస్వామ్య సౌధపు ప్రతి మూలస్తంభంపైనా పాశవిక రాజ్య ఉగ్ర వాద దాడులు సాగించారు. రాజ్య అతిక్రమణాధికారా లను, వ్యవస్థలను దాటి అనామక ప్రజల జీవితాల్లోకి సైతం విస్తరింపజేశారు.
 
 అంత విచక్షణారహితంగా స్వేచ్ఛను ఛిన్నాభిన్నం చేయడం సాధ్యమేనని 1975లో దేశం విశ్వసించలేకపో యింది. అంతకంటే విచిత్రంగా, 1975లో పుట్టని ఈ 2015 నాటి తరం స్వేచ్ఛకు వ్యతిరేకంగా అలాంటి కుట్ర ఒకటి జరిగిందని సైతం విశ్వసించలేకపోతోంది.
 ఆ వాస్తవం ఆహ్లాదకరంగా కంటే చేదుగా ఉండేది కావడమే అందుకు కారణం కావచ్చు. ఆత్మగౌరవంతో ఉండాలంటే బహుశా కొంత మతిమరుపు, పాత విష యాన్నే తిరిగి కనిపెట్టడం అవసరమేమో. ధీరోదాత్త తకు, లొంగుబాటుకు మధ్య నిష్పత్తి రెండో దాని వైపే బాగా ఎక్కువగా మొగ్గి ఉన్నప్పుడు, జ్ఞాపకశక్తి సక్రమం గా లేకపోవడం జాతీయ ఆరోగ్యానికి బహుశా మంచిది కామోసు.
 
 జూన్ 1975 నుండి మార్చి 1977 వరకు ఆ 20 మాసాలు అసాధారణమైనవి. ఆ తదుపరి దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల ఓటర్లు విముక్తి కోసం ఇచ్చిన తీర్పు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, భావి సవాళ్లకు అతీతంగా దాన్ని పునఃస్థాపించింది. ఆ కాలం గురించి రాసిన వ్యాఖ్యల్లో కొన్ని ఏమంత లోతులేని వాస్తవాన్ని గొప్ప ఐతిహాసికంగా చేసి, అతిగా ప్రచారం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ, మీడియా అనే రెండు గొప్ప వ్యవస్థలూ ప్రభుత్వానికి సమీపంగా ఉండేవే అయినా సాంకేతికంగా దాని నియంత్రణకు బయటివే. అవి, వాటి సమర్థకులు నేడు చె బుతున్నదాని కంటే తక్కువ ఆదర్శప్రాయంగానే పనిచేశాయి.
 
 కార్యనిర్వాహక వ్యవస్థ అత్యవసర పరిస్థితి విధిస్తూ జారీ చేసిన అనైతిక ఆదేశా లను అత్యున్నత ధర్మాసనం నాలుగు-ఒకటి ఆధిక్యతతో నిస్సిగ్గుగా ఆమోదించి, అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో విషాదకరంగా సుప్రీం కోర్టే పిరికితనానికి మారు పేరుగా మారింది. అంటే అంతరార్థాన్ని ఉన్నది ఉన్నట్టు గా విడమరచాలంటే ఎలాంటి జవాబుదారీతనం వహిం చకుండానే ఎవరినైనా చంపే హక్కు సైతం ప్రభుత్వానికి ఉందనే. కేవలం కొద్ది మంది పాత్రికేయులు, కొన్ని పత్రికలు మాత్రమే ప్రభుత్వాన్ని, సెన్సార్‌షిప్‌ను సవాలు చేశాయి. నిజానికి సెన్సార్‌షిప్ జర్నలిజాన్నే అర్థరహితం చేసేసిందనుకోండి . ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంపాదకుడు కులదీప్‌నయ్యర్ జైలుపాలైన పాత్రికేయుల్లో అత్యంత సుప్రసిద్ధులు. కానీ మిగతావారు అంత ప్రముఖులు కాకపోవడం వల్లనే ఎక్కువగా బాధలను అనుభవిం చారు. అలాంటి వారిలో వీరేంద్ర కపూర్ ఒకరు. ఆయన భార్య కూమీ కపూర్ అప్పట్లో ఎక్స్‌ప్రెస్‌లో రిపోర్టర్‌గా పనిచేసేవారు. ఆ కాలానికి సంబంధించిన చరిత్రపై తాజాగా ఆమె ఓ పుస్తకాన్ని రచించారు. తన స్వీయాను భవాలతో రాసిన ఆ పుస్తకానికి ఆమె సాదాసీదాగా ’ది ఎమర్జెన్సీ’ అని పేరుపెట్టారు.  నేనింకా చదవలేదు. కానీ చదివిన వారు అది సర్వోతృష్టమైన రచన అంటున్నారు.
 
 గత 30, 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ దేశాన్ని ప్రత్యక్షం గానో లేక కూటమి రూపంలోనో పాలిస్తోంది. ఆ అధ్యా యాన్ని ప్రజా జ్ఞాపకం నుంచి చెరిపేయడానికి అది అధికారాన్ని ప్రయోగించింది. అదా ప్రయత్నంలో కొంత వరకు విజయవంతం అయ్యింది కూడా. అది చరిత్రను సెన్సార్‌షిప్‌కు గురిచేయడమే. అందుకే కూమీ పుస్తకాన్ని మన చరిత్ర సిలబస్‌లో చేర్చాలి. మొదట హఠాత్తుగా విరుచుకుపడి, ఆ మీదట విస్తరించే విషాదపు వలయా లుగా వ్యాపించిన ఆనాటి అణచివేత భీతి బరువును, ఆందోళనను అనుభవంలోకి తెచ్చేలా వర్ణించడం చాలా కష్టం. అపరిమితంగా, ఇష్టానుసారంగా సాగిన ఆరెస్టు లూ, వాటితోపాటు తప్పనిసరి చిత్రహింసలూ దీనికి ఒక కారణం మాత్రమే.
 
 అదీ నా దృష్టిలో అత్యంత ముఖ్య కారణం కాదు. కొద్ది నెలలకే, ప్రత్యేకించి ఇందిరా గాంధీ దర్బారు నిరంకుశ పాలనకు సంజయ్‌గాంధీ కేంద్రంగా మారాక... మాకిక భవిష్యత్తు లేదనీ, చాలా వలసానం తర దేశాల బాటలోనే రాజకీయంగా ప్రతిష్టను కోల్పో యిన నిరంకుశ పాలకుని నియంతృత్వానికి శాశ్వతం గానే మన దేశం కూడా లొంగిపోతుందని అనిపించ సాగింది. అత్యవసర పరిస్థితి విధింపునకు బహిరంగ సమర్థనలన్నీ కపటంతో కూడినవి, స్వీయ ప్రయోజ నాలను ఈడేర్చుకోడానికి ఉద్దేశించినవే. అలా అని అవి వారినేమీ తక్కువ శక్తివంతులను చేయలేదు. అభివృద్ధికి ఆటంకమంటూ ప్రజాస్వామ్యాన్ని కొట్టిపారేశారు. ప్రజా స్వామ్యాన్ని ప్రజలకు శత్రువని, వారి ఆర్థిక ఉన్నతికి అడ్డంకని నమ్మశక్యంకాని రీతిలో దూషించారు. ఆనాటి దర్బారులోని కొందరు సభ్యులు నేడు రూఢి చేస్తున్నట్టు సంజయ్‌గాంధీ కనీసం 20 ఏళ్లపాటైనా ఆ అత్యవసర పరిస్థితి కొనసాగాలని భావించారు.
 
 ఇలా ఫాసిజాన్ని రుద్దడాన్ని మన దేశం సహిం చేదేనా? ‘‘కాదు’’ అనేదే సమాధానమని విశ్వసిం చాలనే మనమంతా కోరుకుంటాం. కానీ పూర్తి నిజాయితీగా చెప్పాలంటే అలా అని కచ్చితంగా చెప్పలేం. రాజకీయ వేత్తలలోనూ, ప్రజలలోనూ కూడా నేడు స్పష్టత ఏర్ప డింది. అలాంటి మూర్ఖత్వాన్ని సూచించడం సైతం మాల్టోవ్ కాక్‌టెయిల్స్ (పెట్రోలు బాంబులు) అవసరం పడటానికి చాలా ముందే అపహాస్యానికి గురై నామ రూపాల్లేకుండా పోతుంది. మన స్వాతంత్య్రం నేడు ప్రచండమైన ఆత్మసంకల్పంతోనూ, సాంకేతికతతో నూ సురక్షితంగా ఉంది. కంప్యూటర్లులేని 1975లో ప్రజా స్వామ్య పరిరక్షకులుగా నిలిచిన వారు నేడు మనం ఎగతాళి చేయడానికి ఇష్టపడే రాజకీయవేత్తలలోని వారే కావడం విశేషం. జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలానీ, మొరార్జీ దేశాయ్ వంటి స్వాతంత్య్ర పోరాట కాలపు సీనియర్లు, వారికి కొద్దిగా వెనుక అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, నానాజీ దేశ్‌ముఖ్, జార్జి ఫెర్నాండెజ్‌లతరం, అగ్రశ్రేణిలో నిలిచి సాగడానికి సిద్ధం గా ఉన్న అనుచర సేన నాటి ప్రతిఘటనలో ప్రముఖులు. అత్యవసర పరిస్థితి కాలపు జైలు ఖైదీలోని నేటి ప్రముఖు లలో ఒకరు మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.
 
 ‘ఇందిరే ఇండియా’ అని ప్రకటించిన ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా, అత్యవసర పరిస్థితి ఆదేశాలపై ఆలోచించడానికిగానీ లేదా న్యాయ పరిశీలనకు గానీ ఆగకుండా వెంటనే సంతకం పెట్టేసిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వంటి భజనపరులు సైతం ఉండేవారు నిజమే. అద్భుతమైన వ్యంగ్యచిత్ర కారుడు, రచయిత అబూ అబ్రహ ం... అహ్మద్‌కు సరిగ్గా సరిపోయే కార్టూన్ గీశారు. ఫక్రుద్దీన్ స్నానపు తొట్టె లోంచే అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేస్తున్న ట్టు చూపుతూ సంక్షిప్త మరణసందేశాన్ని లిఖించారు. దేశ రాష్ట్రపతి నైతికంగా నగ్నంగా నిలిచిన సమయమది.
 
 అయితే నేను అలాంటి భజనపరులను గట్టిగా శభాష్ అని మెచ్చుకుంటూ దీన్ని ముగిస్తాను. వారేగనుక లేకపోతే, మనం బహుశా ఎప్పటికీ స్వేచ్ఛను పొంది ఉండేవారమే 1977లోని అంతుబట్టని పెద్ద రహస్యం ఇదే. చట్టపరమైన నిర్బంధమేదీ లేకున్నా ఇందిరాగాంధీ సార్వత్రిక ఎన్నికలకు ఎందుకు పిలుపునిచ్చినట్టు? ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తారని నమ్మారు కాబట్టి. అలా ఆమెకు నమ్మిక కలిగించిందెవరు? ఇంటెలిజెన్స్ బ్యూరోలోని అత్యంత విధేయులైన పోలీసు అధికా రులు. లోక్‌సభలో ఆమె 250కి పైగా స్థానాలను సాధించి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారని వారు చెప్పారు. ఇందిర వారి మాటలు నమ్మింది. బతికించావురా భగవంతుడా!     
 - ఎం.జె. అక్బర్
 సీనియర్ సంపాదకులు
 

మరిన్ని వార్తలు