మళ్లీ కూలిన బెర్లిన్ గోడ

12 Jun, 2015 00:38 IST|Sakshi
మళ్లీ కూలిన బెర్లిన్ గోడ

భారత్, బంగ్లా ఇరుదేశాల ఎన్‌క్లేవ్‌లలో ఉన్న  పిల్లలంతా భావి అవిద్యావంతులు. అటు వంటి  వీరికి మీరు ఏ దేశ పౌరసత్వాన్ని కావాలంటే ఆ దేశ పౌరసత్వాన్ని ఎంచుకోవచ్చు అని ప్రకటించడం ఎంత గొప్ప వరమో బయటి వారికి బహుశా చెప్పినా అర్థం కాదు.
 
 బంగ్లాదేశ్‌తో చేసుకున్న సరిహద్దు మారకం గురించి ప్రధా ని మోదీ ఒక మాట అన్నారు ‘‘ఇది బెర్లిన్ గోడ కూలగొట్ట డం లాంటిది’’ అని. ఎన్నో ఏళ్ల నుండి రాజ్య రాహిత్యంతో బాధపడుతూ కష్టాల కడలికి ఎదురీదుతున్న ఇరు ఎన్‌క్లేవ్ (పరదేశ పరివేష్టిత భూభా గం) లలోని ప్రజలకే కాదు.. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసి వచ్చిన నా లాంటి వాళ్లకూ నరేంద్ర మోదీ వాడిన ఆ పోలిక అచ్చుగుద్దినట్లు సరిపోయిందనిపిస్తుంది. మోదీ ఆ పోలిక తీసుకురావడం వెనుక ఉన్నది మమతా బెనర్జీ ప్రజాపక్షపాత మనస్తత్వం.
 
 2012లో 76 ఏళ్ల స్త్రీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేను కూచ్ బిహార్ జైలుకి వెళ్లాను. ఆమె ఇండియాకి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్ నుండి వైద్యపరీక్షల కోసమని అక్రమంగా ఇండియాలోకి ప్రవేశిస్తూ జైలు పాలయింది. ఏళ్లు గడిచినా బయటపడే ఉపాయం లేక విరక్తితో ఆ వయసులో ఆత్మహత్య చేసుకుంది. నేను వెళ్లిన ఆ జైలు మొత్తం అలాంటి వాళ్లతో నిండి ఉంది. వాళ్లలో పిల్లలు కూడా ఉన్నారు.
 
 ఆ పిల్లలలో కొంత మంది, వాళ్ల తల్లులు కాన్పుకి భారతదేశ హాస్పిటల్‌లో చేరే నిమిత్తం అక్రమంగా సరిహద్దు దాటుతూ ఉంటే పట్టుబడి జైలు పాలయ్యాక జైలులో పుట్టిన వారు. కుప్ప లు తెప్పలుగా ఉన్న వారందరూ అయిన వారితో ఒక్క మాట మాట్లాడటం కోసం నా ఫోన్‌ని యాచించి వరు సలో నిలబడ్డప్పుడు వారి ఆ దయనీయత నాకు ‘‘భార త్ బంగ్లాదేశ్ చిట్ మహల్ వినిమయ్ కమిటీ’’ని తెలు సుకునేలా చేసింది. కమిటీ సెక్రటరీ దీప్తిమాన్ సేన్ గుప్తో నన్ను చిట్ మహల్‌లని పిలువబడే బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్‌లకి తీసుకెళ్లారు.
 
 ఎప్పుడో రంగ్‌పూర్ రాజు, కూచ్ బిహార్ రాజు చీట్లాట ఆడుకుని గెలిచి, ఓడిన గ్రామాలివి అన్నారు స్థానికులు. చరిత్ర కూచ్ బిహార్, మొఘల్ రాజుల మధ్య అపరిష్కృత ఒడంబడిక అంటుంది. కారణాలేవయినా వారిప్పుడు రాజ్యమనే పెద్ద దిక్కులేని దీనులు. ఈ 21వ శతాబ్దంలో కరెంటు, బడి, హాస్పిటల్, రవాణా, ఫోను వంటి ప్రాథమిక సౌకర్యాలేవీ వారికి అందుబాటులో లేవు. ఎన్‌క్లేవ్ అంటే అచ్చంగా జంతువుల బదులు మనుషులు నివసిస్త్తున్న ఒక చిట్టడవి అంతే.
 
 నేను వెళ్లిన పువాతుర్ కుటి తదితర ఎన్‌క్లేవ్‌లు పెద్దవి. ఇవికాక కౌంటర్ ఎన్‌క్లేవ్‌లు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు మొదటి అడుగు ఇండియాలోనూ రెండో అడుగు బంగ్లాదేశ్‌లోనూ మూడో అడుగు మళ్లీ ఇండి యాలోనూ వేసి ఒక సంక్లిష్ట సరిహద్దు చిత్రాన్ని అనుభ వించవచ్చు. అందరమూ మనుషులమే అయినప్పటికీ మనకు మనమే ఏర్పరచుకున్న ఆ గందరగోళం దిగు లును కలిగిస్తుంది. మాటలలో అక్కడి స్త్రీలు స్త్రీగా నాతో ఒక విషయం పంచుకున్నారు. ‘‘కాన్పుకి ఎలాగో అక్ర మంగా ఇండియాకి వెళ్తాం కానీ హాస్పిటల్లలో ఏమని చెప్తాం. అందుకని ముందే ఫలానా ఇండియా వ్యక్తి ఈమె నా భార్య అని చెప్పేటట్లు మాట్లాడుకుంటాం. నువ్వు చెప్పు ఒక ఆడదానికి  భర్త బతికి ఉండగా ఇంకొక మగవాడిని భర్తగా చెప్పుకోవడమెంత అసహ్యం’’ అని.
 
 రాజ్య పెత్తనం లేదు కనుక ఇక్కడ గంజాయి సాగు విరివిగా సాగుతుంది. కొనుగోలుదారులు ఢిల్లీ నుండి వస్తారు. అరాచకశక్తులు అవసరమొచ్చినప్పుడు ఇక్కడే తలదాచుకుంటాయ్. ఈ గందరగోళంలో ఎలా తలదూ ర్చాలో అర్థం కాక ఎన్జీవోలు మిన్నకుండిపోయాయ్. ఆశావహులు కొందరు అక్రమంగా తమ పిల్లల్ని బడు లకి పంపించడం అడపాదడపా కనిపిస్తుంది కానీ అక్క డి పిల్లలంతా భావి అవిద్యావంతులు. అటువంటి వీరికి మీరు ఏ దేశ పౌరసత్వాన్ని కావాలంటే ఆ దేశ పౌరస త్వాన్ని ఎంచుకోవచ్చు అని ప్రకటించడం ఎంత గొప్ప వరమో బయటి వారికి బహుశా చెప్పినా అర్థం కాదు. శరీరం లేకుండా అవయవానికి ఎలా మనుగడ లేదో రాజ్యం లేకుండా మనిషికి అలా మనుగడలేదు అంటా డు ప్లేటో. ఆ విషయాన్ని ఎన్‌క్లేవ్ ప్రజలు రుజువు పరచారు.
 
 మనం ఈ ఎన్‌క్లేవ్‌లని ఇవి ఇండియావి ఇవి బంగ్లా దేశ్‌వి అని పేరు పెట్టుకున్నాం. అలా పిలిచిన తరువాత సంక్షేమ భాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన రాజ్యాలుగా ఈ సమస్య పరిష్కారానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు తీసుకున్నాం? 1958లో నెహ్రూ నూన్ ఒప్పందం సమయంలో చట్టసభల అనుమతి అవ సరమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు 9వ సవ రణ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి 9వ సవరణ నుండి మనం ఈ సమస్య పరిష్కారానికి 100వ సవరణ వరకూ ఎందుకు ప్రయాణించా ల్సివచ్చింది?
 
మిగిలిన సరిహద్దు మారకాలు బంగ్లాదేశ్‌తో చేసు కున్నంత సులభమైనవి కావు. బంగ్లాదేశ్‌తో మనకు మొదటి నుండీ స్నేహ సంబంధాలే ఉన్నాయి . చైనా తోనూ, పాకిస్తాన్‌తోనూ అలా కాదు. ప్రజల ఉద్వేగాలే కాదు, అనేక విషయాలతో కూడిన సంక్లిష్ట చిక్కుము డుల కూడిక అవి. కానీ అంతిమంగా చూస్తే ఈ దేశాలు, సరిహద్దులు ప్రజల రక్షణ, సంక్షేమం కోసం చేసుకున్న ఒడంబడికలు అవి భస్మాసురుడి లాగా మన నెత్తినే చెయ్యి పెట్టే పరిస్థితి రాకుండా చూసుకోవడం మన బాధ్యతే. ఆయా ప్రాంతాల ప్రజలని, మిలటరీ నుండీ, అర్థం కాని అయోమయ అస్తిత్వ చిక్కు ప్రశ్నల నుండి రక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. మరిన్ని బెర్లిన్ గోడలు వెంట వెంటనే కూలాలి.

 (వ్యాసకర్త రచయిత్రి) మొబైల్: 80196 00900
 - సామాన్య

 

మరిన్ని వార్తలు