ప్యారిస్ గుణపాఠాలు

15 Nov, 2015 00:09 IST|Sakshi
ప్యారిస్ గుణపాఠాలు

 త్రికాలమ్

 

అగ్రవాదంతో మమేకం కావడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. పొరుగున పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి ఆదరణ ప్రబలుతున్నప్పటికీ భారత ముస్లింలు అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం.  ఇదే భావన చెక్కుచెదరకుండా ఇంకా బలపడాలంటే ముస్లింలలో భద్రతాభావం పెరగాలి. వారి అభివృద్ధికి బాటలు పడాలి. ఈ భూమిపైన అయిదు వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిన ఉదార సంస్కృతి కారణంగానే అక్బర్ అయినా నెహ్రూ అయినా లౌకికవాదాన్ని పాటించగలిగారనే వాదన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో మత ప్రాతిపదికపైన చీలికలు రాకుండా, ఘర్షణలు చెలరేగకుండా, మతాల మధ్య దూరాలు పెరగకుండా, ద్వేషాలు రగలకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి.

 

ఉగ్రవాదాన్ని నిర్మూలించవలసిన అవసరాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ లండన్ వెంబ్లీ స్టేడియం మహాసభలో నొక్కివక్కాణించిన తర్వాత కొన్ని గంటలకే ప్యారిస్ నగరంపైన ఉగ్రవాదం పంజా విసిరింది. శుక్రవారం రాత్రి ప్యారిస్‌లో ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య  ఫుట్‌బాల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న ప్రేక్షకులపైనా, నృత్యసంగీత ప్రదర్శనలు జరుగుతున్న ఒక థియేటర్‌పైనా, మరి కొన్ని చోట్లా ఎనిమిది మంది ఐఎస్‌ఐఎస్ జిహాదీలు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 127 మందిని చంపివేశారు, రెండు వందలమందికి పైగా గాయపరిచారు. 

 

ఇది దిగ్భ్రాంతి కలిగించిన ఘోరకలే అయినప్పటికీ అనూహ్యమైనది కాదు. అగ్రవాదానికీ, ఉగ్రవాదానికీ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న నెత్తుటి క్రీడలో ఇది తాజా పరిణామం. ప్యారిస్‌కి లండన్ ఎంతో దూరం లేదు. అరవై వేలమందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్న సభలో రెండు దేశాల ప్రధానులూ ఉన్నారు. వెంబ్లీ స్టేడియంలో సైతం  చొరబడి విధ్వంసం సృష్టించే శక్తిసామర్థ్యాలు ఉగ్ర వాదులకు పుష్కలంగా ఉన్నాయి. ఈ సారి ఫ్రాన్స్‌ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకోవడం వల్ల ఇండియా, బ్రిటన్ ప్రధానులకూ, ప్రవాస భారతీయులకూ అపకారం జరగలేదు. ఉగ్ర వాదుల దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హోలెండ్ ఫుట్‌బాల్ స్టేడియంలో ఉన్నారు. భద్రతా సిబ్బంది అధ్యక్షుడిని సురక్షితంగా బయటికి తీసుకొని వెళ్ళగలిగారు. అంత వరకూ అదృష్టం.

 

ఇది మానవాళిపైన యుద్ధమని హోలెండ్ అభివర్ణిస్తూ ఉగ్రవాదు లకు తగిన గుణపాఠం చెబుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, జర్మనీ అధినేత మార్కెల్, బ్రిటన్, ఇండియా ప్రధానులూ, ఇతర ప్రపంచ దేశాల నాయకులూ ఉగ్రవాదుల ఘాతుకాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. నిర్ఘాంతపోయిన అంతర్జాతీయ సమాజం అగ్రవాదం ప్రతిక్రియ ఎట్లా ఉండబోతున్నదోనని భయపడుతున్నది. ఎందుకు? 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వాణిజ్య కేంద్రాలైన జంట ఆకాశ హర్మ్యాలపైన అల్‌కాయిదా ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్‌ల ప్రతీకార చర్యల పరంపర ఐఎస్‌ఐఎస్ పుట్టుకకు దారి తీసింది. అఫ్ఘానిస్తాన్‌పైన దాడిని సమర్థించుకోవచ్చు-అక్కడ అల్‌కాయిదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ స్థావరం ఉన్నది కనుక.

 

కానీ ఉగ్రవాదంతో సంబంధం లేని ఇరాక్‌పైన దాడి చేయడం, అందుకు సాకుగా ఆ దేశాధినేత సద్దాం హుస్సేన్ రసాయనిక ఆయుధాలను తయారు చేసి సౌదీ అరేబియాపైనా, ఇతర అమెరికా మిత్ర దేశాలపైనా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ ఒక నివేదికను సృష్టించడం ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. సద్దాం హుస్సేన్‌తో పాటు వేలమంది అమాయక ఇరాకీలను అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సైనికులు చంపివేశారు. అనంతరం లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలోనూ అమెరికా పాత్ర ఉన్నది.

 

గడాఫీకీ ఉగ్రవాదానికీ సంబంధం లేదు. అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ యూనియన్ ప్రారంభించిన ఆధిపత్య పోరు అమెరికా, పాకిస్తాన్‌లు కలసి తాలిబాన్‌ను తయారు చేయడానికీ, అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ నిష్ర్కమణకూ, ఆ దేశంలో తాలిబాన్ పాలనకూ దారి తీసింది. ఇరాక్‌లో అత్యధిక భాగం ఇస్లామీయ రాజ్య వ్యవస్థాపన కోసం పోరాడుతున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్నది. చమురు నిక్షేపాలపైన ఉగ్రవాద సంస్థ ఆధిపత్యం వల్ల నిధులకు కానీ ఆయుధాలకు కానీ కొరత లేదు. ఇస్లామీయ రాజ్య విస్తరణలో భాగంగా సిరియాలో ఉగ్రవాదులు భీకర సమరం చేస్తున్నారు.

 

అటు రష్యా, ఇటు అమెరికా

సిరియాపై యుద్ధవిమానాలు ప్రయోగించడం పట్ల నిరసనగానే ప్యారిస్ దాడులు చేసినట్టు  ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అస్సద్ సైతం ఇదే కారణం ఎత్తి చూపించాడు. అస్సద్‌ను గద్దె దించేందుకు ఐఎస్‌ఐఎస్ సిరియాలో నరమేధం సాగిస్తోంది. అస్సద్ సైన్యంలో చీలిక వచ్చింది. అస్సద్‌ను రష్యా, ఇరాన్‌లు బలపర్చుతున్నాయి. అమెరికా, నేటో కూటమి ఒకేసారి  అస్సద్‌నూ, ఐఎస్‌ఐఎస్‌నూ ఓడించే లక్ష్యంతో దాడులు జరుపుతున్నాయి. సిరియాలో అస్సద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లకు అమెరికా, దాని మిత్రదేశాలు సకల విధ సహాయసహకారాలూ అందిస్తున్నాయి.

 

రష్యా విమానాలు ఈ మిలిటెంట్లపైనే దాడులను కేంద్రీకరించాయి. ప్యారిస్‌లో ఉగ్రవాదులు దాడులు జరిపిన సమయంలో వియన్నాలో 20 దేశాల ప్రతినిధులు సమావేశమై సిరియాలో శాంతిసుస్థిరతలు సాధించడానికి ఏమి చేయాలో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో సిరియా ప్రభుత్వ ప్రతినిధి లేరు. ఇరాన్, రష్యా ఒక వైపూ, అమెరికా, నేటో, అరబ్ దేశాలూ మరోవైపూ చేరి వాదులాడుకుంటున్నాయి. ప్యారిస్‌లో ఉగ్రవాదుల దాడి వల్ల సిరియాలో ఫ్రాన్స్ సైనిక చర్య నిలిచిపోయే ప్రసక్తి లేదంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫేబియన్ ఉద్ఘాటించారు. ఎవరి ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి వారు ప్రయత్నించినంత కాలం సమష్టి కార్యాచరణ కల్ల.

 

అమెరికా, నేటో కూటమి, రష్యా, చైనా, ఇరాన్‌లు కలసి ఏదైనా వ్యూహం రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తేనే ఐఎస్‌ఐఎస్ ఆటకట్టించడం సాధ్యం. శక్తిమంతమైన దేశాలు ఆధిక్య భావాన్ని తగ్గించుకొని సర్దుబాటు ధోరణి ప్రదర్శించవలసిన సమయం ఇది. ఇరాక్‌పైన యుద్ధం చేయడం ఘోరతప్పిదమనీ, రసాయనిక ఆయుధాల ఉనికి గురించిన నివేదిక తమను తప్పుదారి పట్టించిందనీ టోనీ బ్లెయిర్ ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన జరిగిన నష్టం తగ్గిపోదు. బుష్ అటువంటి పశ్చాత్తాపం సైతం వెలిబుచ్చలేదు. వారిద్దరి దుందుడుకు నిర్ణయాల కారణంగానే ఈ రోజు ఇస్లామీయ రాజ్య ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్నది. ఐఎస్‌ఐఎస్‌కు ఇప్పుడు ఒక రాజ్యం, ఆదాయ వనరు, ఒక సైన్యం, మధ్య ఆసియాలో, ఐరోపాలో, భారత ఉపఖండంలో ఉగ్రవాద సానుభూతిపరులూ, మతోన్మాదాన్ని యువత మస్తిష్కంలోకి ఎక్కించే తీవ్రవాదభావజాలం ఉన్నాయి. ఇందుకు ఎవరిని నిందించాలి? తాలిబాన్‌నూ, బిన్ లాదెన్‌నూ సృష్టించింది ఎవరు? ఏ ప్రయోజనాలను ఆశించి అరబ్ దేశాలలో తిరుగుబాట్లను ప్రోత్సహించారు? అగ్రదేశాల ఆధిపత్యవాదమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది.

 

సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత ఉగ్రవాద భావజాల వ్యాప్తి వేగంగా, శక్తిమంతంగా సాగుతోంది. ఇటీవల జంషడ్‌పూర్‌లో కాన్వెంట్‌లో చదువుకుంటున్న ఒక ముస్లిం యువతి పేరుమోసిన జిహాదీ సిద్ధాంతకర్త అన్వర్ అల్ అవ్లాకీ ఉపన్యాసాలను యూట్యూబ్‌లో వింటున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పు అందింది. వారు వెళ్ళి ఆ విద్యార్థిని ప్రశ్నిస్తే అతని ఉపన్యాసాలు తనకు బాగా హృదయానికి హత్తుకుంటాయనీ, తనకు నచ్చిన ఉపన్యాసాలు వినడం నేరం ఎట్లా అవుతుందనీ ఎదురు ప్రశ్నించింది. అవ్లానీ అమెరికా పౌరుడు. మంచి పేరున్న విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.

 

జిహాదీగా మారి ఉత్తేజపూరితంగా ప్రసంగాలు చేసే ప్రావీణ్యం సంపాదించాడు. అమెరికా డ్రోన్ విమానాలు 2011 సెప్టెంబర్‌లో జరిపిన దాడిలో ఈ జిహాదీ గురువు మరణించాడు. కానీ అతని ఉద్బోధలు ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ తెలిసిన ముస్లిం యువతీయువకులను జిహాదీ వైపు ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఉత్తర సిరియాలో మొన్న అమెరికా నిర్వహించిన విమాన దాడులలో  బ్రిటిష్ ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ‘జిహాదీ జాన్’ (మహమ్మద్ ఎమ్వాజీ) మృత్యువాత పడ్డాడు. ఇందుకు ప్రతీకారం ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగే మారణహోమం కాదు.

 

కింకర్తవ్యం?

నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ పర్యటనలలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలలో ఉగ్రవాదం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, తదితర దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని మట్టుపెడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అగ్రవాదంతో చేతులు కలిపినందుకే ఫ్రాన్స్ ఇప్పుడు మూల్యం చెల్లించిందని గమనించాలి. ఫ్రాన్స్ సైతం బహుళత్వానికి పెద్ద పీట వేసే దేశం. అన్ని దేశాలవారినీ, అన్ని మతాలవారినీ ఆదరించే సంస్కృతి ఆ దేశంలో ఉన్నది. ఐరోపా సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీకగా ఫ్రాన్స్‌ను పరిగణిస్తారు.

 

అమెరికా సంపదకూ, ఆధిక్య భావానికి ప్రతీకలైన న్యూయార్క్ జంట శిఖరాల కూల్చివేత, భారత వాణిజ్య కేంద్రమైన ముంబైలో మారణహోమం, ఇప్పుడు ముంబై తరహాలోనే ప్యారిస్‌లో రక్తపాతం- ఈ మూడూ  అగ్రవాదంపైన ఉగ్రవాదం  చేసిన సంకేత ప్రాయమైన దాడులుగానే పరిగణించాలి. ఉగ్రవాదులు ఎక్కడ  కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడులు చేయగల స్థితిలో ఉన్నారు. ఉగ్రవాద భావజాలాన్ని మనసంతా నింపుకొని ఆత్మాహుతికి సిద్ధమైనవారు తాము కూలిపోయే ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపివేయడమే లక్ష్యంగా విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ప్యారిస్‌లో దాడికీ, ముంబయ్‌లో (2008 నవంబర్ 26న)దాడికీ పోలికలు ఉన్నాయని ఉగ్రవాదాన్ని అధ్యయనం చేస్తున్న జార్జిటౌన్ యూనివర్సిటీ (యూఎస్) ప్రొఫెసర్ బ్రూస్‌హాఫ్‌మన్ అన్నారు.

 

ముంబై తరహాలో యూరప్ అంతటా దాడులు నిర్వహించాలని అయిదేళ్ళ కిందటే బిన్ లాదెన్ ఉగ్రవాద తండాలను ఆదేశించారని అమెరికా ప్రవీణుల సమాచారం. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి విదేశీ వ్యవహారాలలో ఎటువంటి నీతిని పాటించాలో,  ఉగ్రవాదం వేళ్ళూనకుండా నివారించడానికి దేశంలో ఎటువంటి విధానాలు అనుసరించాలో నరేంద్రమోదీ సర్కార్ ఆలోచించాలి. ముంబై మారణకాండకు సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్‌ని కానీ ముంబై అల్లర్లకు బాధ్యుడైన దావూద్ ఇబ్రహీంని కానీ ఇండియాకు అప్పగించమని అమెరికా  కానీ బ్రిటన్ కానీ పాకిస్తాన్‌పైన ఒత్తిడి తీసుకొని రాలేదు.

 

పైగా పాకిస్తాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం చేస్తూనే ఉన్నది. న్యూయార్క్‌లో దాడికి లేదా ప్యారిస్‌లో దాడికి స్పందించినంత తీవ్రంగా ముంబైలో దాడికి స్పందించలేదు. విదేశాంగ నీతిని నిర్ణయించుకునే క్రమంలో ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకోవాలి. బహుళ మతాలూ, భాషలూ, సంస్కృతుల సమాహారమైన ఇండియా ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అగ్రవాదంతో మమేకం కావడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. పొరుగున పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి ఆదరణ ప్రబలుతున్నప్పటికీ భారత ముస్లింలు అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం.  ఇదే భావన చెక్కుచెదరకుండా ఇంకా బలపడాలంటే ముస్లింలలో భద్రతాభావం పెరగాలి. వారి అభివృద్ధికి బాటలు పడాలి.

 

ఈ భూమిపైన అయిదు వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిన ఉదార సంస్కృతి కారణంగానే అక్బర్ అయినా నెహ్రూ అయినా లౌకికవాదాన్ని పాటించగలిగారనే వాదన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో మత ప్రాతిపదికపైన చీలికలు రాకుండా, ఘర్షణలు చెలరేగకుండా, మతాల మధ్య దూరాలు పెరగకుండా, ద్వేషాలు రగలకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. మతసామరస్యానికి భంగం  కలిగించే ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఖండించాలి. అందుకు బాధ్యులైనవారిని శిక్షించాలి. ప్యారిస్ ఘోరం చూసిన తర్వాతనైనా ఈ సంకల్పం చెప్పుకోకపోతే, బాధ్యతారహితంగా మాట్లాడేవారినీ, ద్వేషభావంతో వ్యవహరించేవారినీ అదుపులో పెట్టకపోతే నిప్పుతో చెలగాటం ఆడినట్టే,  ఉగ్రవాదానికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. అదే జరిగితే ఈ దేశ సమైక్యతనూ, సమగ్రతనూ ఎవ్వరూ కాపాడలేరు. శాంతిసుస్థిరతలకు ఎవ్వరూ హామీ ఇవ్వలేరు.

- కె.రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు