తాజా పుస్తకం: ఊరికి పెట్టిన మేలిమి నమస్కారం....

22 Feb, 2014 00:53 IST|Sakshi
తాజా పుస్తకం: ఊరికి పెట్టిన మేలిమి నమస్కారం....

కొన్ని శీర్షికల పుట్టుకలోనే విజయం ఉంటుంది. ‘మా ఊరు’ అలాంటి శీర్షిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, బతుకునిచ్చిన సొంత ఊరునూ తలుచుకోవడానికి ఎవరు ఇష్టపడరు గనక? వారు చెప్పే ఊరి జ్ఞాపకాలలో తమ ఊరి జ్ఞాపకాలను పోల్చుకోవడానికి ఎందరు ప్రయత్నించరు గనక? అందుకే జర్నలిస్టు భువనేశ్వరి ఈ శీర్షిక కోసం అక్కినేని దగ్గరి నుంచి కంచె ఐలయ్య వరకూ అందరినీ కలిసి వారి ఊరి జ్ఞాపకాలను సేకరించి ప్రచురించినప్పుడు విశేష స్పందన వచ్చింది. చిన్నప్పటి ఆటలు గర్తు చేసుకునేవారూ, పండగలను గుర్తు చేసుకునేవారూ, ఈతలనీ వాతలనీ, తీపి చేదూ జ్ఞాపకాలనీ... ఐతే మంచి విషయం ఏమిటంటే దాదాపు అందరూ తమ ఊరికి అంతో ఇంతో సాయం చేయడానికి ప్రయత్నించేవారే. ఆ ప్రేమ చెప్తే వచ్చేది కాదు. చెరిపేస్తే పోయేదీ కాదు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ ఊరి జ్ఞాపకాలను ఈ పుస్తకంలో చెప్పుకున్నారు.
 
  కారంచేడు, చేటపర్రు, పెద్ద కాకుట్ల, తుక్కుగూడ, నీలకంఠాపురం, నిమ్మాడ... వింటుంటేనే పల్లెగాలి తాకడం లేదూ? ఊరంటే పల్లెటూరే. అలాంటి పల్లెటూళ్లలో పుట్టి పెరిగిన యాభై మంది పెద్దలు తమ ఊళ్ల గురించి చెప్పిన అపురూప జ్ఞాపకాల పుస్తకం ఇది. తప్పక చదవదగ్గ పుస్తకం. అన్ని కులాల, వర్గాల, అంతరాలవారు ఉన్న పుస్తకం. అయితే ఒకటి. ముస్లింలకు ఎలాగూ ఈ దేశం గురించి చెప్పుకునే హక్కు లేదు. కనీసం తమ ఊరి గురించి చెప్పుకునే హక్కు కూడా లేదా? ఈ యాభై మందిలో ఒక్కరు కూడా ముస్లిం లేకపోవడం చూస్తుంటే ప్రజాస్వామిక హక్కుల గురించి కొంత తెలిసినవారెవరైనా తగిన సలహా సూచనలు ఇవ్వలేదేమో అనిపిస్తోంది. ఆ ఒక్క లోటు తప్ప తక్కినదంతా శభాష్.
 మా ఊరు: భువనేశ్వరి; వెల: రూ.351; ప్రతులకు: 9618954174
 
 సున్నితమైన కథాసంపుటి - కాశీబుగ్గ
 అడవికి వెళ్లిన పిల్లలు తప్పిపోతారు. అంతా గగ్గోలైపోతుంది. కాని తెల్లారే సరికి ఆ పిల్లలు క్షేమంగా అడవిలోనే ఆడుకుంటూ ఉంటారు. అదే నగరంలో అయితే? రచయిత అంటాడు- కాశీబుగ్గ కథలో- పిల్లలపై అడవి దాడి చేయలేదు. ఆ పని చేయగలిగేది నాగరికుడైన మనిషే. మంచి కథ. రచయిత ఈతకోట సుబ్బారావు రాసిన కథాసంపుటి ఇది. మానవ విలువలను తట్టిలేపే సున్నితమైన అంశాలున్న కథలు ఇవి.
 కాశీబుగ్గ- ఈతకోట సుబ్బారావు కథలు-
 వెల: రూ.80; ప్రతులకు: 9440529785
 
 డైరీ
 ఆవిష్కరణ: హక్కుల నేత, సాహితీ విమర్శకుడు బి.చంద్రశేఖర్ స్మృతిలో మార్చి 1 శనివారం సాయంత్రం గుంటూరులో జరగనున్న సభలో ఆచార్య ఆషిష్ నంది స్మారకోపన్యాసం చేయనున్నారు. అలాగే చంద్ర జ్ఞాపకాలను ‘చంద్రస్మృతి’గా, చంద్ర రచనలను ‘చంద్రయానం’గా రెండు పుస్తకాలను డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరిస్తారు. ఆచార్య ఎ.సుబ్రహ్మణ్యం సభను నిర్వహిస్తారు.  వేదిక: గుంటూరు మెడికల్ అసోసియేషన్ హాల్.

మరిన్ని వార్తలు