భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఇది అర్థమౌతుందా?

19 Aug, 2016 12:44 IST|Sakshi
భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఇది అర్థమౌతుందా?

ఇదేం ప్రేమ కాదు. పెళ్లీ కాదు. టెన్నిస్! టెన్నిస్ నా ప్రాణం. గెలిచి తీరాలి. కోర్టుకి అసలు నేను గెలవడానికే వెళ్తాను. లేకుంటే కోర్టుతో నాకేం పని?! నా దేశం స్విట్జర్లాండ్‌తో ఏం పని? వెళ్లిపోయేదాన్ని ఎప్పుడో, స్వేచ్ఛగా.. ఆల్ప్స్ పర్వతాల మీదుగా, తెల్లని ధూళినై.. గమ్యమే లేకుండా.. గాలిలో తేలుకుంటూ!
 
ప్రేమల్ని నిలుపుకోడానికి లైఫ్‌లో నేను ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదు. పెళ్లి కూడా అంతే. నా భర్త హ్యుటిన్ ఏడ్చేవాడు.. ‘షి ఈజ్  అన్‌ఫెయిత్‌పుల్’ అని. ‘ఆ బిచ్‌కి ఒక్కడు కాదు’ అని వీధుల్లో పొర్లాడి పొర్లాడి ఏడ్చేవాడు. అతని ఏడుపు అతనిది. నేనెందుకు అతనితో కలిసి ఏడవాలి? డబుల్స్ ఆడుతున్నామా! ఇంకో ఏడుపుగొట్టు జట్టుపై ఏడ్చి విజయం సాధించడానికి?! ‘లీవ్ మీ ఎలోన్’ అన్నాను ఒకరోజు. ‘మరైతే.. ఎవడితో ఎలోన్‌గా ఉండబోతున్నావ్?’ అన్నాడు. విడిపోడానికి ఒక్కమాట చాలు. వంద వాదులాటలు అక్కర్లేదు.

నా బెస్ట్ ఫ్రెండ్ టెన్నిస్. నా లవర్, నా లైఫ్ పార్ట్‌నర్ టెన్నిస్. ‘ఒక్కడితోనైనా సఖ్యతగా ఉన్నావా?’ అని అడిగి, అలిగి వెళ్లిపోయేవాడే నా ప్రతి బాయ్‌ఫ్రెండూ. ‘నాకన్నా టెన్నిస్సే ముఖ్యమా నీకు’ అని వాళ్ల ప్రశ్న. పెద్దగా అరుస్తారు.  ఫ్లవర్‌వాజ్ పగలగొట్టేస్తారు.

‘ఆట తప్ప నీకేదీ ముఖ్యం కాదా?’.. నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్న ఇది! ఒక మనిషికి జీవితంలో ఒకటేగా ముఖ్యమైనది ఉంటుంది. ముఖ్యమైనవి చాలా ఉన్నాయీ అంటే, ఆ మనిషికి ఏదీ ముఖ్యమైనది కాదని, ఆ మనిషి జీవితంలో ఏదీ ముఖ్యమైనది లేదని. నార్మన్, గార్షియా, రాడెక్, ఐవో, అలేన్సో... అంతా ఒకేలా మూతి బిగించి కూర్చున్న మగాళ్లే. ఒక్కరి మోకాళ్లలో కూడా ఫ్రెండ్‌గా నిలబడే సత్తువ లేదు! హ్యుటిన్ మాత్రం మూతి పగలగొట్టడానికి వచ్చేవాడు. భర్త కదా! ‘ఆట కోసం నువ్వు దేన్నైనా వదులుకుంటావ్.. సిగ్గులేని దానివి’ అనేవాడు ఉక్రోషంగా. ఆటతో నాకు దగ్గరై, తన కోసం అదే ఆటకు దూరంగా ఉండమని నన్ను ఆదేశిస్తున్నాడంటే.. షేమ్ ఆన్ మీ? షేమ్ ఆన్ హిమ్?

ఇష్టమైనదాని కోసం దేన్నయినా వదులు కోవాలి. అప్పుడే మన ఇష్టానికి మీనింగ్ ఉంటుంది. టెన్నిస్‌ను నేను ఇష్టపడుతున్నానంటే, టెన్నిస్‌ను నేను ప్రేమిస్తున్నానంటే, టెన్నిస్‌ను నేను నా ప్రాణంగా చేసుకున్నానంటే... టెన్నిస్‌ను నేను ఆడి తీరాలి. టెన్నిస్‌లో నేను గెలిచి తీరాలి. ప్రేమలో, పెళ్లిలో.. గెలిచానా ఓడానా నాకు పట్టింపు లేదు. టెన్నిస్ కోసం నేను ప్రేమ నుంచి, పెళ్లి నుంచి ఎన్నిసార్ల యినా బయటికి రావడం కూడా నాకు గెలుపే.
 
గెలవడం కోసమే సానియా, నేను కలసి ఆడాం. గెలుస్తున్నంత కాలం కలిసే ఆడాం. ఇప్పుడు విడిపోయాం. గెలవడం కోసమే విడిపోయాం. కలిసున్నామా, విడిపోయామా అని కాదు. ఎవరి దారిలో వాళ్లం గెలుస్తున్నామా లేదా? అదీ ముఖ్యం. భర్తలకీ, బాయ్‌ఫ్రెండ్స్‌కీ ఈ మాట ఎప్పటికైనా అర్థమౌతుందా? నో. నెవర్.

- మాధవ్ శింగరాజు

మార్టినా హింగిస్ (టెన్నిస్ స్టార్) రాయని డైరీ

మరిన్ని వార్తలు