మహా శివరాత్రి

17 Feb, 2015 02:11 IST|Sakshi
మహా శివరాత్రి

 ఈ రోజు ఆసేతు శీతాచలం ఆస్తికులు శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో పగలూ రాత్రీ పరవ శించే మహాశివరాత్రి పర్వదినం. అతి ప్రాచీన కాలం నుంచి శివుడు నెలకొని పావనం చేసిన ద్వాదశ జ్యోతి ర్లింగాల గురించిన సంక్షిప్త ప్రస్తావన నేడు సంద ర్భోచితం. ఈ క్షేత్రాలన్నింటినీ ఆది శంకరాచార్యులు దర్శించి స్తుతించారు. ప్రతి ఉదయం, సాయంత్రం, ఈ జ్యోతిర్లింగాలను స్మరిస్తే, సమస్త పాపాలు నశి స్తాయని ఒక నమ్మకం.

 మొదటిది గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం. దక్షుడి కుమార్తెలను 27 మందిని పెండ్లాడిన చంద్రుడు, వాళ్లలో రోహిణి పట్ల పక్షపాతం చూపిన పాపానికి దక్ష శాపానికి గురై, క్షయవ్యాధిగ్ర స్తుడయ్యాడు. దాన్ని పోగొట్టుకొనేం దుకు మహా మృత్యుంజయ మం త్రాన్ని దశ కోటి పర్యాయాలు జపిం చి సోమనాథుడిని సేవించాడట. ఈ ఆలయం పదకొండో శతాబ్దం తరవాత, పదహారుసార్లు దోపిడీకి, దండయాత్రల కూ గురైనా, పదహారుసార్లూ పునర్నిర్మించబడింది!
 రెండో జ్యోతిర్లింగం మన శ్రీశైల మల్లికార్జునుడు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదట. ఈ క్షేత్రం శక్తిపీఠం కూడా. ఇక, మూడవ జ్యోతిర్లింగం ఉజ్జ యిని (అవంతీ నగరం)లో సిప్రా నదీతీరంలో స్వయం భువుగా వెలసిన మహాకాలేశ్వరుడు. ఈ క్షేత్రం కాళి దాస కవి (క్రీ.పూ.1వ శతాబ్దం) నాటికి లోక ప్రసిద్ధం. మధ్యప్రదేశ్‌లోనే మరో జ్యోతిర్లింగం నర్మదా నదీ ద్వీపంలో మాంధాతృక్షేత్రం (ఓంకార్)లో కొలువైన ఓంకారేశ్వరుడు. చిన్న ఆలయమే కానీ అతి ప్రాచీనం.

 జార్ఖండ్ రాష్ట్రంలో దేవఘర్ జిల్లాలో వైద్య నాథు డి రూపమైన జ్యోతిర్లింగం ఉంది. రావణుడు తను లం కలో పూజించుకొనేందుకు కైలాసం నుంచి తెచ్చు కొన్న శివుడి ఆత్మ లింగం కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఈ పూర్వోత్తర దేశంలోనే స్థిరపడిపోయింది. అసలు వైద్యనాథుడి లింగం తాలూకు పీఠం కూడా ఒక శక్తి పీఠంగా పూజలందుకోవడం విశేషం.

 పన్నెండు జ్యోతిర్లింగాలలోనూ, మహారాష్ట్రలో నాలుగు జ్యోతిర్లింగాలున్నాయి. పుణె దగ్గరి సహ్యాద్రి కొండల మీద డాకినీ క్షేత్రంలో భీమశంకరుడున్నాడు. అలాగే హింగోలి జిల్లాలో హింగోలి నుంచి 25 కిలో మీటర్ల దూరంలో అవుండా క్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లిం గానికి స్వస్థానం. అదీకాక ఔరంగాబాద్ జిల్లాలో, ఎల్లోరా గుహలకు సమీపంలో ఘ్రుష్ణేశ్వర జ్యోతిర్లిం గం ఉంది. ఇదీకాక, సహ్యాద్రి కొండలలోనే నాసిక్ సమీపంలో, త్రయంబకేశ్వరం దగ్గర, గోదావరి తీరం లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది.

 దక్షిణాన రామనాథేశ్వర లింగం రామేశ్వర క్షేత్రంలో ఉంది. హిమాలయాల మంచుకొండల మధ్య కేదారేశ్వరుడు కొలువై ఉంటాడు. ఆఖరుగా చెప్పుకొ న్నా అగ్రస్థానంలోనే నిలిచేది వారణాసి.  ఆ ఆనంద వనంలో, ఆనంద కందం (మూలం)గా పరమానం దంతో నివసించే అనాథనాథుడైన విశ్వనాథుడికి నమస్కరించుకొందాం. ఓం నమశ్శివాయ!
 ఎం.మారుతిశాస్త్రి

మరిన్ని వార్తలు