పేదింటికి అవమానపు ముద్ర

27 Jun, 2017 01:18 IST|Sakshi
పేదింటికి అవమానపు ముద్ర

పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే.

వశ్యక ఆర్థిక వనరులు కొరవడితే ఎవరైనాగానీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది లేదా వచ్చే కొద్దిపాటి రాబడికి అల్పస్థాయి జీవన ప్రమాణాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.  మానవాభివృద్ధి సూచికను కొలిచే మూడు కొలబద్ధలలో ఒకటి, ఆదాయం. డబ్బు లేకపోయాక మిగతా రెండిటిని... ఆరోగ్యాన్ని, పాఠశాలల్లో నేర్చుకోగల జ్ఞానాన్ని పొందడం కష్టమౌతుంది. కాబట్టి పేదరికాన్ని అతి పెద్ద అసౌకర్యమని చెప్పుకోవచ్చు. కానీ అది దాన్ని తక్కువ చేసి చెప్పడం అవుతుంది. పేదలను ప్రభుత్వం కేవలం ఒక గణాంకంగా చూడటం ద్వారా వారికి సంబంధిం చిన మానవాంశను నిర్మూలించి, పుండుకు కారం రాసినట్టుగా అవమానిస్తుంటే.. అంతకంటే హీనమైనదిగా మారుతుంది. ‘పేద’ పేటెంటు కాదగిందే కావచ్చుగానీ, పేదలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది.

రాజస్థాన్‌ ప్రభుత్వం పేదలు తమ ఇంటి ముందు గోడలపై ప్రజా పంపిణీ వ్యవస్థ సహా వారు వేటికి అర్హులో సూచించే నోటీసులను రాయించుకునేలా చేసి అవమానించే చర్యలు చేపట్టింది. ఇది పూర్తిగా మతిలేని పని.  దీంతో పేదలను వేలెత్తి చూపి, ఆదాయాల రీత్యాగాక, వారికి ఇంకా సొంతంగా మిగిలిన వాటిని కూడా హరించి వేయడం జరుగుతుంది. అందులో వారి వల్ల సమాజానికి ఉన్న ఉపయోగం ఒకటి.

పేదలుగా గుర్తించేవారి ఆదాయ స్థాయి ఏమిటో గ్రామమంతటికీ తెలిసిందే. అయినా వారి ఇంటి గోడలపై దాన్ని రాయడం వెనుక ఉన్న ఉద్దేశం రికార్డులను నమోదు చేయడం కాదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీకి రేషన్‌ పొందేవారికి ఇప్పటికే రేషన్‌ కార్డులున్నాయి. వారి స్థానం ఏమిటో గుమాస్తాలు రిజిస్టర్లలో జాగ్రత్తగా నమోదు చేసి ఉంటారు. పరిపాలనాపరమైన  ఈ పూర్తి వెర్రిబాగులతనానికి రాజస్థాన్‌ ప్రభుత్వం ఇంతవరకు సమంజసమైన వివరణను ఇవ్వలేదు.

పేదలను సర్వే చేయడానికి వచ్చే ఇన్‌స్పెక్టర్ల దృష్టిని ఆకర్షించడం కోసం వారు తమ గోడలకు ఈ రంగు ముద్రలను వేయించుకోవాలనేట్టయితే.. అంతిమంగా అది అత్యాధునికమైన ఈ పంపిణీ వ్యవస్థలోని అధికారగణం నిజాయితీ గురించి చాలానే చెబుతుంది.ఇప్పటికే పీకల లోతు పేదరికంలో మునిగి ఉన్న పేదలు తమ ఇంటి గోడలకు ఈ రంగులు, రాతలు వేయించుకోగలరని ఆశించడం మరో మతిమాలిన పని. ఒకవేళ ప్రభుత్వమే అందుకు ఆర్థిక వనరులను సమకూరుస్తుండి ఉంటే, ఏదో ఒక స్థాయిలో డబ్బు చేసుకునే రాకెట్‌ ఏదో నడుస్తుండి ఉండాలి.

రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇంటి గోడలపై పచ్చ రంగు మాసికలను వేసే ఈ కార్యక్రమాన్ని... బహుశా పైలట్‌ ప్రాజెక్టుగా కామోసు భిల్వారా జిల్లాలోని పేదల ఇళ్లకు పరిమితం చేశారు. దీనికి ముందే, ప్రభుత్వాధికారులకు సర్వసాధారణంగా మారిన ఈ తోలు మందపుతనం మధ్యప్రదేశ్‌లో కనిపించింది. పేదరికం నేరమన్నట్టుగా పేదలు ముద్రలు వేసుకోవడం అవసరమైంది. ఇలాంటి మూర్థత్వానికి హేతువు ఏమిటో మాత్రం అంతుబట్టడం లేదు.

గొప్ప సంపన్నులను బహిరంగంగా వారి ఆదాయపు పన్ను రిటర్నులను బహిరంగపరచాలని కోరితే, అది వారి ప్రైవసీపై దాడి అంటూ తక్షణమే గగ్గోలు పుడుతుంది. బ్యాంకులకు భారీ మొత్తాల్లో ప్రజాధనాన్ని బకాయిపడ్డ వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం బ్యాంకు పరపతి క్రమాలను  దెబ్బ తీస్తుందని రిజర్వ్‌ బ్యాంకు, సుప్రీం కోర్టుకు చెప్పింది. మొండి బకాయిదార్లయిన కార్పొరేట్ల పేర్లను వెల్లడించి, వారిని అవమానించడానికి అది తిరస్కరించింది. కార్పొరేట్లు అంతరాత్మగలిగిన మానవులు కారు. అయినా అవి ఎగవేతదార్లుగా సుప్రీంకోర్టు ముందు గుర్తింపును పొందడాన్ని ప్రజా వ్యవహారాలకు సంబంధించిన సమస్యగా భావించి పట్టించుకున్నాయి. కానీ రాజస్థాన్‌లోగానీ, మరెక్కడైనాగానీ పేదలు మనుషులు కాబట్టి, వారికి మనసులు ఉంటాయి. ఈ అంశాన్నే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పేదలైన కారణంగానే పేదలను అంత మొరటు పద్ధతిలో చులకన చేయవచ్చు అన్నట్టుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ప్రతి బడ్జెట్లోనూ కేటాయింపులను చేస్తుండటమే గాక, క్రమం తప్పకుండా కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తున్నాయి. కాబట్టి పేదలు ఎన్నడో లేకుండా పోయి ఉండాల్సింది. కానీ అవేవీ పని చేయకపోవడం వల్లనే పేదలు ఇంకా పేదలుగా మిగిలారు. పేదరిక రేఖ స్థాయిగా సూచించిన ఆదాయానికి మించి ఒక్క రూపాయి సంపాదించినా గణాంక రీత్యా అలాంటి వారు పేదరికం నుంచి బయటపడిపోయినట్టే. కాబట్టే పేదల జనాభా కుచించుకుపోతోంది.

అందువలన పేదరిక నిర్మూలనా కార్యక్రమాల రూపకల్పన, అమలుతో ముడిపడి ఉన్న వారంతా...  కేంద్ర మంత్రుల నుంచి, గ్రామ పెద్దల వరకు తమ వైఫల్యాన్ని సూచించేలా తమ ఇళ్లకు ఆరెంజ్‌ రంగు  వేయిం చుకోవాల్సిన సమయం బహుశా ఇదే కాదా? పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే.
  మహేష్‌ విజాపృకర్‌
  వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
  ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు